You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈటల రాజేందర్: హుజూరాబాద్ ఎన్నిక తర్వాత తెలంగాణలో ఏం జరగబోతోంది
- రచయిత, జింకా నాగరాజు
- హోదా, బీబీసీ కోసం
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేసిందని ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ట్వీట్ చేశారు. "ధర్మం ఒకవైపు- ఆధర్మం ఒకవైపు, ఆత్మగౌరవం ఒకవైపు-అహంకారం ఒకవైపు, జనబలం ఒకవైపు-ధనబలం ఒకవైపు నిలబడి చేసిన ధర్మయుద్ధం"గా ఈ ఎన్నికని ఆయన వర్ణించారు.
దీనికి సమాధానమన్నట్లు, "గత 20 సంవత్సరాలలో టీఆర్‌ఎస్ అనేక ఒడిదుడుకులను చూసింది. ఈ ఒక్క ఎన్నికకు అంత ప్రాముఖ్యముండదు, పర్యవసానమూ ఉండదు" అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్వీట్ చేశారు.
ఈ ఎన్నికను జాగ్రత్తగా గమనించిన వాళ్లకు హుజూరాబాద్‌లో ఏరులై పారిన మద్యం, అక్కడ పంపిణీ చేసిన డబ్బే కనబడుతుంది తప్ప ధర్మాలు, అధర్మాలు, ఏడేళ్ల టీఆర్ఎస్ పాలన తీరు, కేసీఆర్ నాయకత్వం, తెలంగాణ ఉద్యమ వారసత్వం వంటివి ఏవీ కనిపించవు. హుజూరాబాద్ ఉపఎన్నిక.. పవర్ కోసం, పవర్‌ను కాపాడుకునేందుకు హోరాహోరీగా జరిగిన అసాధారణ ఎన్నిక. ఈ ఎన్నిక టిఆర్‌ఎస్ నాయకత్వం గురించి, పార్టీ గురించి, పథకాల గురించి, ఓటర్ల అవగాహన గురించి, బీజేపీ గురించి అనేక అబ్బురపరిచే విషయాలను వెల్లడించింది. ఒక కీలకమైన రాజకీయ మలుపుగానూ కనిపించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ నగదు పంపిణీ సంక్షేమ పథకాలకు పెట్టింది పేరు. ఆయన కానుకలు కనీవినీ ఎరుగనివి. ఎకరానికి సీజన్‌కు అయిదువేల రూపాయల పంట సాయం చేసే 'రైతు బంధు' పథకం భారతదేశంలో సాటిలేనిది. ఇపుడొచ్చిన 'దళిత బంధు' కూడా ఒక మహత్తర సంక్షేమ పథకం. అలాగే కల్యాణ లక్ష్మీ, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు... ఇలా ఒకటా రెండా, కనీసం 12 పథకాలు తెలంగాణలో అమలులో ఉన్నాయి.
తెలంగాణ ధనిక రాష్ట్రం కాబట్టి పథకాలు, కానుకలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ప్రజల డిమాండ్లు కూడా అదే రీతిలో ఉన్నాయని ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక చెప్పకనే చెబుతోంది. ఈ పథకాలతో తెలంగాణలో రోజూ పండగే. ఒక పథకాన్నో, ప్రాజెక్టునో ప్రారంభిస్తూనో, రెన్యూవల్ చేస్తూనో, చెక్కులు పంపిణీ చేసుకుంటూనో, ముఖ్యమంత్రి ప్రకటనకు కృతజ్ఞతలు చెబుతూనో రాష్ట్రంలో ఎప్పుడూ పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది.
దళిత బంధు పండగ మధ్య హుజూరాబాద్ ఎన్నిక వచ్చింది. లెక్క ప్రకారం, హుజూరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సునాయాసంగా గెలవగలగాలి. ప్రచారమేమీ లేకపోయినా గెలిచితీరాలి. ఆర్థిక మంత్రి హరీష్ రావు మూన్నెళ్లుగా హుజూరాబాద్‌లోనే మకాం వేసి, ప్రచారం చేసి, హామీలు గుప్పించి, రోజూ 'నేనున్నాను, ఇక్కడే ఉంటాను, నన్ను చూసి ఓటేయండి, కేసీఆర్‌ను చూసి ఓటేయండి' అని బతిమాలకపోయినా ప్రజలు ఓటేయాలి. కానీ, హుజూరాబాద్ ప్రజలు వినలేదు. ఒక పార్టీకే విధేయులాగా ఉండాల్సిన అగత్యం లేదని హుజూరాబాద్ ఓటర్లు చెప్పారా?
ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మలు, కానుకలు, పథకాలు ఇవేవీ హుజూరాబాద్ ఎన్నికల్లో పనిచేయలేదు. కౌంటింగ్ మొదలు పెట్టినప్పటి నుంచి చివరి దాకా ఈటల రాజేందర్ మెజారిటీ పెరుగుతూనే వచ్చిన విషయం దీనికి లోతైన సాక్ష్యం.
"దేశంలో ఎక్కడలేని విధంగా హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేశాయి. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా చెప్తున్నారు. జాతీయ స్థాయిలో కొట్లాడే బీజేపీ, కాంగ్రెస్‌లు రాష్ట్ర స్థాయిలో కుమ్మక్కు కావడాన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు" అని టీఆర్ఎస్ ప్రచారాన్నంతా ఒక్కడై మోసిన ఆర్థికమంత్రి హరీష్ రావు ఫలితాలు రాగానే అన్నారు.
ఇది హుజూరాబాద్ పొడుపు కథకు సమాధానం కాదు. నిజానికిది ఒక విధంగా టీఆర్ఎస్‌కు ప్రజల్లో విధేయత లేదని చెప్పే ప్రకటన. టీఆర్ఎస్ మీద, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ప్రజల్లో ఉన్న విధేయత అంత బలహీనమయినదా? బీజేపీ, కాంగ్రెస్ కలసి సైగ చేస్తే ప్రజలు కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారతారా?
టీఆర్ఎస్ పార్టీ బలం మునుపటిలా లేదని హుజూరాబాద్ ఎన్నిక బహిరంగం చేసింది. టీఆర్ఎస్ ప్రచారమేకాదు, ప్రతిపక్షాల ప్రచారం కూడా పదే పదే దీనిని రుజువుచేస్తూ వచ్చింది.
కేసీఆర్‌వన్నీ గెరిల్లా ఎత్తుగడలు అనేది ఒకప్పటి మాట. అప్పుడు అయనేది చేసినా అనూహ్యంగానే ఉంటూ వచ్చింది. ఆయన ఎత్తుగడలు ఎవరికీ అంతుబట్టేవి కాదు. ఈ సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది ఈ మధ్య కేసీఆర్ వ్యూహాల్లో మాయమయినట్లు కనిపిస్తోంది.
ముఖ్యంగా మంత్రి ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా పెట్టుకున్నప్పటి నుంచి ఆయన ఎత్తుగడలను ప్రజలు ఈజీగా పసిగడుతున్నారు. ఏది జరగనున్నదో మరుక్షణంలో సోషల్ మీడియాలో వైరలై పోతోంది. రాజేందర్‌ను ఎందుకు టార్గెట్ చేశారు? రాజేందర్ మీద దర్యాప్తులో ఏం రాబోతున్నది? 'దళిత బంధు' ఎందుకు ప్రకటించారు? హుజూరాబాద్‌నే పైలట్ ప్రాజక్టుకు ఎందుకు ఎంపిక చేశారు? కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిని ఎందుకు ఘనంగా చేశారు? హుజూరాబాద్‌లో ఉన్నట్లుండి ఎందుకు రోడ్లేస్తున్నారు? ప్రారంభోత్సవాలు చేస్తున్నారు? కుల భవన్‌లకు నిధులు ఎందుకు క్షణాల్లో మంజూరుచేస్తున్నారు? వేల కోట్ల నిధులు హుజూరాబాద్ స్కీమ్‌లకు ఎందుకు వస్తున్నాయి? ఇలా అన్నింటిని ప్రజలు పసిగట్టేస్తున్నారు.
అందుకే 'దళిత బంధు' ప్రథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించగానే, ప్రతిపక్షాలు సులభంగా అది ఎన్నికల పథకమని ప్రజలను నమ్మించగలిగాయి. 'బీసీ బంధు' కావాలని అన్ని కులాల చేత డిమాండ్ చేయించగలిగారు. అందరికి 'బంధు' ఇస్తాం అని కేసీఆర్ స్వయంగా చెప్పినా ఎవరూ విన్లేదు. ప్రతిపక్షాల దాడిని కౌంటర్ చేసే వ్యూహం ఈసారి టీఆర్ఎస్ దగ్గర లేదు. టీఆర్ఎస్‌లో భజన తప్ప సైద్ధాంతిక పటుత్వం లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందుకేనేమో ఆ పార్టీ ఈ అంశాన్నితమిళనాడు డీఎంకే నుంచి నేర్చుకోవాలనుకుంటున్నది.
'దళితబంధు'కు చిక్కుముడి పడటంతో, కేసీఆర్ మీద ఈటల దాడి పదునెక్కడంతో ఉన్నట్లుండి, ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు కేంద్రం వైపు మళ్లించారు. గ్యాస్ ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్ ధర పెరిగిందని, డీజిల్ ధర పెరిగిందని, దీనికి ఈటల సమాధానం చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రతి మీటింగ్‌లో, ర్యాలీలో నిలువెత్తు సిలిండర్లు నిలబెట్టి ప్రచారం చేశారు. ఈ ఉచ్చులో ఈటల చిక్కుకోలేదు. దీనిని కూడా ప్రజలు ఎన్నికల స్టంటుగానే గుర్తించి, హరీష్ ప్రచారాన్ని పట్టించుకోనేలేదని భావించాల్సి వస్తోంది.
"ఆ ధరలు కాదు, మా 'ధర' మాకు చెల్లించండి" అన్నట్లు ఓటుకు నోటు డిమాండ్ మరీ బాహాటంగా చేశారు.
అలాకాకుండా, తొలినుంచి, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ నిజాయితీగా ఉద్యమం చేస్తూ వచ్చి ఉంటే, హరీష్ రావు క్యాంపెయిన్ ప్రజలను ఆలోచింపచేసేది.
ఇలా హుజూరాబాద్ ఎన్నికల వ్యూహం మొత్తం 'అడ్ హాకిజం' అంటే కేవలం ఆ పూట గడిచేందుకు చేపట్టిన వ్యూహమయిపోయింది. టీఆర్ఎస్ చెప్పే విషయాలను సీరియస్ గా తీసుకోనవసరం లేదని ప్రజలు భావించినట్లు కనిపిస్తుంది. క్యాంపెయిన్ చివరికి వచ్చే సరికి, హరీష్ రావు ప్రచారం 'రాజేందర్ అనుకూల ప్రచారం'గా మారింది."ఈటల రాజేందర్ గెలవడమే లేదు, గెల్చి ఏం చేస్తాడు? ఆయన గెలిచినా మంత్రి అవుతాడా? అక్టోబర్ 30 తర్వాత కూడా ముఖ్యమంత్రి కేసీఆరే! నేను మంత్రి. ఇక్కడికే వచ్చి కూర్చుంటా, మీకు సేవచేస్తా...' ఇదీ వరస.
హుజూరాబాద్ మీద కాంగ్రెస్‌లో ఎప్పుడూ ఆశల్లేవు. రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా కాంగ్రెస్ ఓటర్ల వలసను ఆపలేకపోయింది. అయితే, పతనమవుతున్న కాంగ్రెస్ ఓట్లు సహజంగా రూలింగ్ పార్టీకి రావాలి. అలా కాకుండా ఈటల రాజేందర్‌కు పడ్డాయి. దీనికి బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కారణమని కొట్టిపడేయలేం. ఇవన్నీ టీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లని రాజేందర్ గెలుపు చెబుతోంది. ఈ ఓటర్లకు కాంగ్రెస్ పునరుజ్జీవంలో నమ్మకం పోయి టీఆర్ఎస్‌ను ఓడించేందుకు రాజేందర్‌ను బలపర్చాలనే అలోచన వచ్చి ఉండాలి. లేకపోతే, కాంగ్రెస్ ఓట్లు దాదాపు పూర్తిగా మాయం కావడం ఏమిటి? ఈటల వంటి మాటకారి వస్తే ఎక్కడైనా సీన్ మారుతుందని హుజూరాబాద్ తేల్చి చెప్పింది.
మారువేషంలో ప్రవేశిస్తున్న బీజేపీ
బీజేపీ చిరకాల వాంఛ తెలంగాణలో నెరవేరుతున్నది. బీజేపీ తన సహజ రూపంలో కాకుండా మారువేషంలో తెలంగాణలో ప్రవేశించేందుకు మార్గం వెదుక్కుంది. అది ఈటల రాజేందర్ రూపంలో దొరికింది. బీజేపీ చరిత్రలో ఎలెక్షన్ యోధులెవరూ లేరు. పార్టీలో గెలిచిన వాళ్లంతా ఒకటి రెండు సార్లు గెలిచిన వాళ్లే తప్ప యోధులు, వ్యూహకర్తలు కాదు.
ఇపుడు ఈటల రాజేందర్ రాటుదేలిన ఎలక్షన్ యోధుడు. ప్రజల్లో విస్తృత పునాది ఉన్న నాయకుడు. ఏడోసారి అసెంబ్లీకి గెలిచారు. అంతేకాదు, ఈటల రాజేందర్ పచ్చి కేసీఆర్ వ్యతిరేకి. మరొక ముఖ్యమయిన విషయం ఏంటంటే, పూర్వం హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఆయన చుట్టూర తిరుగుతూ వచ్చింది. ఆయనే టీఆర్‌ఎస్‌కు అడ్రస్‌గా ఉన్నారు. ఆయన బీజేపీలోకి వస్తూ ఈ బలగాన్నంతా తీసుకువచ్చారు. ఆయన ముస్లిం వ్యతిరేకి కాదు. దీని వల్ల బీజేపీ ముస్లిం వ్యతిరేక దూకుడు నచ్చని వాళ్లు కూడా ఈటల రాజేందర్‌కు మద్దతు ఇచ్చారు. బీజేపీకి సాధు స్వభావం తీసుకువచ్చేందుకు ఈటల రాజేందర్ బాగా పనికొచ్చారు. ఆ పార్టీ తెలంగాణలో ప్రవేశించేందుకు ఇది చక్కటి వేషం.
ఈ ఎన్నికల ప్రచారంలో ఎక్కడా హిందుత్వాంశం కనిపించకుండా బీజేపీ కూడా జాగ్రత్త పడింది. కేవలం స్థానికాంశాల మీద, కేసీఆర్‌ను అపకీర్తిపాలు చేయడం మీద, కేసీఆర్ కుటుంబ పాలన మీద దృష్టి పెట్టి ఈటల, బీజేపీ ప్రచారం చేశారు.
నిజానికి హుజూరాబాద్‌లో బీజేపీ ఎపుడూ శక్తి కాదు. అలాంటి చోట ఈటల రాజేందర్ కారణంగా బీజేపీ బలపడింది. అందువల్ల బీజేపీ ఈటల భుజాలనెక్కి ఇంకా ముందుకు పోవాలనుకుంటోంది. ఎన్నికల ఫలితం వెలువడీ వెలువడక ముందే, ఆ పార్టీ జాతీయనాయకుడు పేరాల శేఖర్ రావు విస్మయపరిచే ఒక ప్రకటన చేశారు. ఇందులో రెండు ముఖ్యాంశాలున్నాయి. ఒకటి, ఈటల రాజేందర్ వ్యక్తిత్వ ప్రశంస. రెండు, బీజేపీ నుంచి బీసీ ముఖ్యమంత్రి.
తెలంగాణలో 60 శాతం ఉన్న ఓబీసీ కులాల ప్రజలకు టీఆర్ఎస్-కేసీఆర్ మీద భ్రమలు తొలగిపోయాయి. బీసీలు బీజేపీని తమ ఆశాజ్యోతిగా చూస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ గెలుపు రాష్ట్రానికి మొదటి బీసీ ముఖ్యమంత్రి రావడానికి మార్గం సుగమం చేసింది" అని చెబుతూ " ఈటల ప్రతిభావంతమయిన వ్యక్తిత్వం, తెలంగాణ సాధనలో ఆయన క్రియాశీల పాత్ర, పరిణతితో కూడిన ప్రవర్తన, అన్ని రకాల ప్రజలతో ఆయనకు ఉన్న ఆత్మీయ సంబంధాలు హుజూరాబాద్‌లో బీజేపీకి బాగా సహకరించాయి' అని కూడా అన్నారు. దీనిని బట్టి ఆ పార్టీ తెలంగాణ వ్యూహమేదో అర్థమవుతుంది. ఈటల రాజేందర్ భుజాల మీద పెద్ద బాధ్యతేదో పెడుతున్నటు తెలుస్తోంది.
హుజూరాబాద్ పర్యవసానం
నిజానికి, ఇప్పటివరకూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎదిరించి టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన వాళ్లంతా ఆచూకీ లేకుండా పోయారు. ఇంతవరకు కేసీఆర్‌కు సమఉజ్జీలెవరూ ఎదురుపడలేదు. ఉన్నవాళ్లని ఆయన గుర్తించే స్థితిలో లేరు. అయితే, ఇప్పుడు తొలిసారి కేసీఆర్‌ను నిలదీసే వ్యక్తి అసెంబ్లీలో రోజూ తారసపడతారు. బయట సభలో కేసీఆర్‌ను విమర్శించేందుకు, బండి సంజయ్, ధర్మపురి అరవింద్, అనుముల రేవంత్ రెడ్డి ఉన్నారు. అసెంబ్లీలో ధీటైన గొంతులేదు. ప్రతిపక్షంగా కాంగ్రెస్ బాగా బలహీనపడటంతో ఆ పార్టీ నేతల్లో కేసీఆర్‌ని ఢీ కొనే స్థైర్యం తక్కువే.
బీజేపీలో ఉన్న రఘునందన్, రాజాసింగ్‌లతో పోల్చితే ఎక్కువ అనుభవంతో ఏడోసారి ఎమ్మెల్యేగా గెల్చిన వ్యక్తి, కేసీఆర్ గురించి సమగ్రం తెలిసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన వ్యక్తి అయిన ఈటల అసెంబ్లీలో కాలుమోపుతున్నారు. ఆయన వల్ల టీఆర్‌ఎస్‌కు రోజూ తలనొప్పే అవుతుంది. 'తెలంగాణ సాధన' ఇంతవరకు తన గుత్తసొత్తుగా టీఆర్ఎస్ చెప్పుకుంటూ వచ్చింది. కేసీఆర్‌దే నాయకత్వం అని ప్రచారం చేస్తూ వచ్చింది.
"ఇది కాదు, తెలంగాణ ఉద్యమం ప్రజా ఉద్యమం, సమిష్టి ఉద్యమం" అని చెప్పబోయిన ఒకనాటి జేఏసీ చైర్మన్, 2009 తర్వాత సాగిన తెలంగాణ ఉద్యమ సారథి ప్రొఫెసర్ కోదండ రామ్‌కు అన్నీ కష్టాలేవచ్చాయి.
అయితే, ఇపుడు ఈటల తెలంగాణ ఉద్యమం సమిష్టి నాయకత్వం అని, టీఆర్ఎస్‌కు కాపీరైట్ లేదని చెప్పే ప్రయత్నం చేయవచ్చు. ఉద్యమ నేపథ్యం, మాట బిగువు, ధన బలం, జనబలం, అన్నింటి కంటే ముఖ్యంగా బీజేపీ అండ ఉన్న ఈటల అసెంబ్లీ బయట కూడా కేసీఆర్ వ్యతిరేక శక్తుల సమీకరణ కేంద్రంగా పనిచేయవచ్చు. ఆ శక్తులను సమీకరించవచ్చు. అది బీజేపీకి ఎంత లాభిస్తుందో చూడాలి.
(అభిప్రాయాలు వ్యాసకర్త వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ మాస్ లీడర్లను ఎందుకు తయారు చేసుకోవట్లేదు?
- టీఆర్పీలు, ఆదాయం కోసం ఐసీసీ వేసిన ప్లాన్ భారత్ కొంపముంచిందా?
- వాతావరణ కాలుష్యానికి ధనవంతులే కారణమా
- చరిత్ర: దీపావళి టపాసులు భారత్‌లోకి ఎలా వచ్చాయి?
- డాక్టర్‌ను సంప్రదించకుండా ఇంటర్నెట్లో సెర్చ్ చేసి మందులు వాడటం మేలేనా?
- డాక్టర్ సుధ: బద్వేలులో భారీ విజయం సాధించిన వైసీపీ అభ్యర్థి
- COP26: 2070 నాటికి నెట్ జీరో లక్ష్యాన్ని సాధిస్తామని భారత్ వాగ్దానం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)