You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Brahmin Corporation: ఒక కులం గొప్పదని ప్రభుత్వ వెబ్‌సైట్‌లో ప్రకటించవచ్చా, బ్రాహ్మణ కార్పొరేషన్ పై విమర్శలు ఎందుకు?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ కరస్పాండెంట్
''బ్రాహ్మణులు తెలివైన వారు. మానవత్వం ఉన్నవారు. నిజాయితీ కలవారు. గొప్పవారు. నైతిక విలువలతో బతికేవారు. యాటిట్యూడ్ (పాజిటివ్) ఉన్నవారు. కొత్తగా ఆలోచించేవారు. విశాలంగా ఆలోచించేవారు. సృజనాత్మకంగా ఆలోచించేవారు. కష్టపడే గుణం ఉన్నవారు...''
ఇదేదో బ్రాహ్మణ సంఘం సమావేశంలోని ప్రసంగం అనుకుంటున్నారా.. కాదు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అధికారికంగా బ్రాహ్మణ కులం గురించి చెబుతోన్న మాటలివి.
అలాగని ప్రభుత్వ పెద్దలు ఏ సభలోనో మాట్లాడినవి కావు. స్వయంగా తమ తమ వెబ్ సైట్లలో బ్రాహ్మణులను ఆకాశానికెత్తేస్తూ చెప్పిన వాక్యాలివి.
రాజ్యాంగబద్ధంగా పాలించే ప్రభుత్వాలు ఏదో ఒక కులాన్ని ఆకాశానికి ఎత్తేయొచ్చా? కుల తత్త్వాన్ని ప్రోత్సహించవచ్చా? ఒక కులం ఎంతో గొప్పది అంటూ పొగడ్తల్లో ముంచెత్తొచ్చా? తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణ కార్పొరేషన్ సంస్థ ఏర్పాటు, వాటి పథకాలు, ఆ సంస్థల పరిభాష పరిశీలించిన ఎవరికైనా ఇదే అనుమానం వస్తుంది.
పేదలకు సాయం చేయడానికీ, అగ్రవర్ణాల అహాన్ని సంతృప్తి పరచడానికీ మధ్య ఉన్న తేడాను మిస్సవుతోందా సర్కార్?
ప్రస్తుతం కులాల వారీ కార్పొరేషన్ల ట్రెండ్ నడుస్తోంది. రాజ్యాంగం ప్రకారం మొదట్లో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. తరువాత బీసీ కులాలలు కూడా ప్రయోజనాలు పొందడం ప్రారంభించాయి.
అయితే, ఒక్కో కులానికీ ఒక్కో సంస్థగా కాకుండా, తెలుగు రాష్ట్రాల్లోని సుమారు 60 ఎస్సీ కులాలకు ఒక కార్పొరేషన్, సుమారు 90 బీసీ కులాలకూ ఒకటి, సుమారు 33 గిరిజన తెగలకు ఎస్టీ కార్పొరేషన్ ఉంటూ వచ్చింది ఇంత కాలం.
కానీ, గత ఐదారేళ్ళ కాలంలో సీన్ మారింది. రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఒక్కో కులానికీ ఒక్కో కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాయి ప్రభుత్వాలు.
అందులో భాగంగానే వాడుకలో అగ్ర కులాలుగా పరిగణించే జనరల్ కేటగరీ కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారికి సహాయం చేయడం కోసం కార్పొరేషన్లు ప్రారంభం అయ్యాయి. అలా ఆంధ్రలో కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లు ప్రారంభం కాగా, తరువాత రెడ్డి, కమ్మ, వెలమ, క్షత్రియ, వైశ్య కార్పొరేషన్లు చేరాయి.
తెలంగాణలో కూడా బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు.
గొప్పతనాల వేదికలుగా కార్పొరేషన్ సైట్లు
అయితే ఆయా కార్పొరేషన్ల వారు తమ కులం గురించి చెప్పుకునే విషయాలే విస్మయాన్ని కలిగిస్తున్నాయి.
ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్లు తమ వెబ్ సైట్లలో బ్రాహ్మణుల గుణగణాలు, గొప్పతనాల గురించి వర్ణించిన విధానం చూస్తే అది ప్రభుత్వం సాయం కోసం ఏర్పాటు చేసిన సైట్ లా కాకుండా, కుల సంఘం వారి సైట్ లా కనిపిస్తుంది.
ఆంధ్ర బ్రాహ్మణ కార్పొరేషన్ వెబ్ సైట్లో వాల్యూస్ అనే చోట ఇలా ఉంది.
''బ్రాహ్మణుడు అంటే గొప్పగా ఆలోచించడం, వనరులను సద్వినియోగం చేసుకోవడం, యాటిట్యూడ్ (పాజిటివ్) కలిగి ఉండడం, కష్టపడడం, గౌరవంగా ఉండడం, నిజాయితీతో ఉండడం, వినూత్నంగా ఆలోచించడం'' (BRAHMIN Stands for: Big Thinking, Resource Leveraging, Attitude (+ve), Hard Work, Modesty, Integrity and Neo Thinking.) అని రాసి ఉంది.
అంతేకాదు, ఆ సంస్థ విజన్ లో భాగంగా తమ కులం పట్ల సొంత భావాన్ని పెంచి, కులంలో ఐక్యత పెంచి, కులంలో నైతిక స్థైర్యం, ఆత్మగౌరవాన్ని పెంచడం కూడా లక్ష్యంగా రాసుకున్నారు. (and also inculcate a sense of belonging to the community for improving cohesiveness, morale and pride.)
ఇక తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏమీ తక్కువ తినలేదు. వీరు బ్రాహ్మణ కులానికి ఇంకా పెద్ద నిర్వచనం ఇచ్చారు.
''బ్రాహ్మిణ్ అంటే విస్తృతమైన, అద్భుతమైన ఆలోచన కలిగి ఉండడం, జీవితంలో ధార్మికంగా, నీతిగా బతకడం, తెలివిగా సాహసోపేతమైన వ్యక్తిత్వంతో ఉండడం, నిజాయితీ, మానవత్వం కలిగి ఉండడం, గౌరవంగా, నైతికత ఉన్న వ్యక్తిత్వం కలిగి ఉండడం, చేతల్లో సృజనాత్మకత, కష్టపడేతత్త్వం, పద్ధతిలో హుందాగా, ప్రత్యేకంగా ఉండడం..'' అంటూ పెద్ద నిర్వచనం ఇచ్చారు. ("BRAHMIN" stands for Broad and Brilliant in Thinking, Righteous and Religious in Livelihood, Adroit and Adventurous in Personality, Honesty and Humanity in Quality, Modesty and Morality in Character, Innovation and Industry in Performance and Nobility and Novelty in Approach.)
తెలంగాణ కార్పొరేషన్ కూడా కులంలో సొంత భావన పెంచి ఐక్యత పెంచడం తమ లక్ష్యంగా రాశారు. (To infuse the spirit of oneness and sense of belonging to the community to improve cohesiveness and to boost up the morale of Brahmins.)
పుట్టుక ఆధారంగా ఒక కులాన్ని గొప్పగా నిర్వచించడం ప్రభుత్వ బాధ్యతగా ఎప్పుడు మారిందో కుల ఐక్యత సాధించడం ప్రభుత్వ లక్ష్యంగా ఎప్పుడు తయారైందో అర్ధం కావడం లేదన్నది సెక్యులర్ వాదుల నుంచి వస్తున్న విమర్శ.
రాజ్యాంగంలో చెప్పుకున్న సెక్యులర్ విలువలు ఏ కృష్ణలో, ఏ మూసీలో కలిశాయి అనే ప్రశ్నలు ముందుకొస్తున్నాయి.
బ్రాహ్మణ కులంలో పుట్టి ఆదాయం సుమారు 2 లక్షల కంటే తక్కువ ఉన్న కుటుంబాలకు వివిధ పథకాల ద్వారా సాయం అందిస్తుంటాయి. పించన్లు, చదువులకు సహకారం, వ్యాపారాలకు చేయూత వంటి వాటితో పాటూ ఆ కులానికి ప్రత్యేకమైన అంశాలకు సంబంధించిన పథకాలు కూడా ఉన్నాయి.
వేద విద్యకు సహకారం, వైదిక వృత్తుల్లో ఉన్న వారిని పెళ్లి చేసుకునే అమ్మాయిలకు నగదు బహుమానం వంటివెన్నో పథకాలు ఈ సంస్థలు అమలు చేస్తున్నాయి.
అయితే ఈ సంస్థలు తమ కార్యక్రమాలు గురించి చెప్పుకునే క్రమంలో రాజ్యంగా స్ఫూర్తిని గంగలో కలిపేశాయన్నదే దీని మీద వస్తున్న ప్రధాన విమర్శ.
''అసలు బీసీ, ఎస్సీ ఇలా జాబితాల వారీగా కాకుండా విడివిడిగా కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడమే సరికాదు. పోనీ అలా ఏర్పాటు చేసిన కుల కార్పొరేషన్లలో ఆయా కులాలను పొగడడం వంటి వాటిని ప్రోత్సహించకూడదు. ప్రభుత్వం ఇలా ఒకర్ని పొగిడితే మిగతా వారిని తగ్గించినట్టే. అయితే ఒకవేళ వారి కులం అంత శ్రేష్టమైనదైతే, గొప్పదైతే వారే సంపాదించుకోవచ్చు కదా? ఇక ప్రభుత్వ డబ్బు ఎందుకు? మాకు ఆర్థిక వనరుల్లేవు. ఇబ్బంది ఉంది. అని చెప్పుకుంటే ఓకే, కానీ గొప్పవాళ్లం అని చెప్పుకుంటే ఎలా?'' అని ప్రశ్నించారు ప్రొఫెసర్ కంచె ఐలయ్య.
''మన సమాజం, రాజ్యంగ వ్యవస్థలు, పాలనా యంత్రాంగంలో హిందూ ఆధిపత్యం నిరంతరం కనిపిస్తుంది. స్టేట్ ఎంత సెక్యులర్ అయినా, అన్ని కార్యక్రమాలకూ పురోహితులను పిలుస్తారు. అలా ప్రభుత్వం నుంచి అందరి కంటే బ్రాహ్మణులకు ఎక్కువ విలువ వస్తోంది. కానీ ప్రభుత్వ సంస్ధలు ఒక కులాన్ని ఉద్దేశించి బ్రిలియంట్ వంటి పదాలు వాడడం తప్పు. అది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం, విరుద్ధం. చట్ట విరుద్ధం’’ అని హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ అన్నారు.
ఏదో ఒక కులాన్నో, లేదా పుట్టుక ఆధారంగానో ప్రభుత్వం ఎవర్నీ పొగడకూడదని, ఆ మాటకొస్తే ఎవరికీ కులం, మతం, పుట్టుక వల్ల నిజాయితీ రాదని ఆయన అన్నారు. హార్డ్ వర్క్ వల్ల బ్రిలియన్సీ, క్యారెక్టర్ వల్ల హానెస్టీ వస్తుందని, కులం వల్ల కాదని, ప్రభుత్వాల ఆధ్వర్యంలో నడిచే కార్పొరేషన్‌ల సైట్లలో ఇలా రాయడం తప్పని ప్రభాకర్ అభిప్రాయపడ్డారు.
బ్రాహ్మణ సంఘాలు ఏమంటున్నాయి?
అయితే ఈ వాదనను పూర్తిగా వ్యతరేకిస్తున్నాయి బ్రాహ్మణ సంఘాలు.
''వాస్తవానికి ప్రభుత్వాలు ఇతర కింది కులాలుగా చెప్పబడుతున్న వారిని పొగిడినట్టు, ముస్లింలను పొగిడినట్టు బ్రాహ్మణులను ఏనాడూ పొగడ లేదు. అసలు వారితో పోలిస్తే బ్రాహ్మణుల గురించి రాసింది శూన్యం. ఇప్పుడేదో ఒక రెండు ముక్కలు మాట్లాడితే అంత రాద్ధాంతం అవసరం లేదు’’ అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య తూర్పుగోదావరి అధ్యక్షులు మాదిరాజు శ్రీనివాస్ అన్నారు.
హిందూ ధర్మాన్నీ, భారతీయ సంస్కృతికనీ నిస్వార్థంగా బ్రాహ్మణులే రక్షించి నిలబెట్టారు కాబట్టి దానికి కృతజ్ఞతగా రెండు మాటలు రాసి ఉండొచ్చని శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.
‘‘వాస్తవానికి ఇలాంటి వాటిని వ్యతిరేకించే వారి అసలు లక్ష్యం హిందూ ధర్మం పై దాడి. హిందువులపై దాడి చేయాలంటే మొదట బ్రాహ్మణులపై దాడి చేస్తారు వారు'' అన్నారాయన.
ఆంధ్రా, తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ల అధ్యక్షులు కూడా వెబ్‌సైట్లలో రాసిన అంశాలను సమర్థించారు.
''పొగడడం తప్పేమీ కాదు. ఇతరులను తిట్టడం లేదు కదా? పొగడ్త చిన్న ప్రోత్సాహం లాంటిది. దీనికీ ప్రభుత్వానికీ సంబంధం లేదు. కార్పొరేషన్ల వెబ్ సైట్లను మేమే డిజైన్ చేసుకుంటాం. ఏ కార్పొరేషన్ వారు, ఆ కార్పొరేషన్ సంబంధిత వర్గాల్లో స్ఫూర్తి నింపడానికి ఇలా చేస్తారు.'' అన్నారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ అధ్యక్షులు సీతంరాజు సుధాకర్.
''అది కేవలం బ్రాహ్మణుల గురించి చెప్పడం మాత్రమే. బ్రాహ్మణులు ఇప్పటికీ భోజనానికి కూడా ఇబ్బంది పడుతూ దుర్భర జీవితం సాగిస్తున్నారు. అటువంటి వారికి అంతో ఇంతో సాయం చేయడానికి ఈ సంస్థ ఏర్పాటు అయింది. దీని లక్ష్యం అన్నం లేక తులసి తీర్థంతో కడుపు నింపుకునే నిరుపేద బ్రాహ్మణులకు సాయం చేయడం మాత్రమే.'' అని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ అధ్యక్షులు డా. కె.వి. రమణాచారి అభిప్రాయ పడ్డారు.
''వెబ్ సైట్లో ఏం రాశారన్నది నేనింకా గమనించలేదు. ఒకవేళ పొగడ్తలు ఉన్నా అందులో తప్పేమీ లేదు.'' అన్నారాయన.
అయితే అగ్రవర్ణాలకు కార్పొరేషన్లు ఏర్పటు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం కాదనీ, అదే సందర్భంలో వారు ఉపయోగించే భాష సాంకేతికంగా తప్పు కాదని ఉచితమా అనుచితమా అనేది వేరే సంగతి అని అన్నారు ప్రముఖ్య న్యాయ నిపుణులు మాడభూషి శ్రీధర్.
''కేంద్రం చేసిన రాజ్యాంగ సవరణతో అగ్రవర్ణాల్లోని పేదలకు ప్రభుత్వం ప్రత్యేకంగా సహాయం చేయవచ్చు. అందులో వివాదం లేదు. ఇక వాళ్లు ఏం రాశారు, ఏం పొగుడుకున్నారు అనేదానికి రాజ్యాంగ కొలమానం ఏమీ లేదు. వీటన్నింటినీ వారి అభిప్రాయాలు గానే చూడాలి. చట్టం ముందు ఏం పని చేస్తున్నారన్నదే పాయింట్’’ అని శ్రీధర్ వ్యాఖ్యానించారు.
‘‘బహుశా వాళ్ల గత కాల వైభవాన్ని చూపించి, ప్రస్తుత అవసరాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేసి ఉంటారు. అందులో రాజ్యాంగ ధిక్కరణ లేదు. చట్ట వ్యతిరేకం కాదు. కాకపోతే అది ఉచితమా, అనుచితమా అనేది చర్చ. ఆ ఉచితమా? అనుచితమా? ఎంత ఉచితం అనే చర్చకు కొలమానం ఏమీ ఉండదు.'' అన్నారాయన.
ఇక అందరికీ హక్కున్న కొన్ని విద్యలను బ్రాహ్మణులకే పరిమితం చేస్తున్నారన్న ఆరోపణలపై కూడా ఏపీ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ స్పందించారు. వేద విద్య బ్రాహ్మణులు నేర్చుకుంటారు కాబట్టి వారికి చెబుతున్నామనీ అందులో వివక్ష లేదనీ ఆయన వివరించారు.
''వేద విద్య చెబితే దాని ద్వారా ఉపాధి పొందుతారని మా ఉద్దేశం. మేం ఎవరికీ బలవంతంగా వేద విద్య చెప్పించడం లేదు. కాకపోతే బతుకు తెరువు కల్పించే మార్గాల్లో ఇదొకటి.'' అని అన్నారు సుధాకర్.
బ్రాహ్మణ కార్పొరేషన్ వర్సెస్ బీసీ వెల్ఫేర్
ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చుట్టూ మరో వివాదం రాజుకుంది. ఇప్పటి వరకూ దేవాదాయ శాఖ కింద ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ ను, బీసీ సంక్షేమ శాఖ కిందకు మార్చింది ఏపీ ప్రభుత్వం.
దీనిపై తెలుగుదేశానికి చెందిన బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు ఆనంద సూర్య తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం బ్రాహ్మణులను అవమాన పరచడమేనని ఆయన అన్నారు. దానిపై పోరాడతామని చెప్పారు.
సాయం కావాలి కానీ వెనుకబడిన వారితో కలిపేయ వద్దు. ఆ ముద్ర వేస్తే ఒప్పుకొనేది లేదని ఆయన వాదనలోని సారాంశం. అయితే ఈ నిర్ణయాన్ని సమర్థించుకుంటోంది ఏపీ కార్పొరేషన్.
''బీసీ సంక్షేమ శాఖ కింద ఉంచడం వల్లే ఎక్కువ లాభం జరుగుతుంది. అక్కడ అన్ని కులాల కార్పొరేషన్లతో పాటూ నిధులు వస్తాయి. ఎండోమెంట్స్ లో ఉండడానికి చట్టపరమైన సమస్యలు ఉన్నాయి. కోర్టులో కేసులు ఉన్నాయి. అందుకే బీసీ వెల్ఫేర్ కిందకు తేవాల్సి వచ్చింది. ఎండోమెంట్స్ కింద ఉండడం వల్ల బ్రాహ్మణ కార్పొరేషన్ ఏ కార్యక్రమం తలపెట్టినా కోర్టు నుంచి సమస్య వస్తోంది. ఇక్కడ ఏ సమస్యా ఉండదు. పైగా బీసీ కార్పొరేషన్ లో ఉంటూ, ఆయా కులాలకు అందే విద్యా దీవెన వంటి పథకాలను కోరే అవకాశం కూడా ఉంటుంది.'' అన్నారు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్.
కొందరు అహంకారంతో ఆలోచించి, బ్రాహ్మణులకు మేలు చేసే పథకాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన చెప్పారు.
''బీసీ వెల్ఫేర్ తో ఉంటే నష్టం లేదు, ఎండోమెంట్స్ తో ఉంటే లాభం లేదు. ఎక్కడైనా ప్రభుత్వమే నిధులు ఇవ్వాలి. బీసీ వెల్ఫేర్ కిందకు తేవడాన్ని వ్యతిరేకించాల్సిన పనిలేదు. వాస్తవానికి ఎండోమెంట్స్ కింద బ్రాహ్మణ కార్పొరేషన్ ఉంటే, హిందూ మతానికి అనుకూలం అని చెప్పుకునే వారే దానిపై కోర్టుల్లో కేసుల వేశారు. కాబట్టి ఈ మార్పును మేం సమర్థిస్తున్నాం'' అన్నారు ఏపీ బ్రాహ్మణ సంక్షేమ సంఘ సమాఖ్యకు చెందిన మాదిరాజు శ్రీనివాస్.
ఇవి కూడా చదవండి:
- మోదీని భారత మిలీనియల్స్ తరం ఎందుకు ఇష్టపడుతోంది? - అభిప్రాయం
- లఖీంపుర్ ఖీరీ: ‘జీపుతో రైతులను తొక్కించిన వారినెందుకు అరెస్ట్ చేయరు’- ప్రధాని మోదీకి ప్రియాంకా గాంధీ వాద్రా ప్రశ్న
- పాండోరా పేపర్స్: తాము ఏ తప్పూ చేయలేదంటున్న పలువురు దేశాధ్యక్షులు
- అమెరికాలో మాంసం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి
- వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలు పునరుద్ధరణ
- 'ప్రాణాలు కాపాడితే రూ.5 వేలు ఇస్తాం'
- వారానికి రెండు రోజులు ఉపవాసం ఉంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందా
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)