You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘బాహుబలి కలెక్షన్లలో పెద్ద మొత్తం డిస్ట్రిబ్యూటర్లకు చేరలేదు, తొలి వారంలో థియేటర్లు ఖాళీగా ఉన్నట్లు చూపించారు’ - ప్రెస్‌రివ్యూ
బాహుబలి సినిమా విషయంలో పెద్దమొత్తంలో డబ్బు డిస్ట్రిబ్యూటర్లకు వెళ్లలేదని వైసీపీ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారని ఆంధ్రజ్యోతి ఓ కథనం ప్రచురించింది.
‘‘ప్రభుత్వం తీసుకువచ్చిన ఆన్‌లైన్ విధానంలో అక్కడికక్కడే ఎవరికెళ్లాల్సిన డబ్బులు వారికి వెంటనే వెళ్లిపోతాయన్నారు.
ప్రేక్షకుడికి సరసమైన ధరకు వినోదం లభిస్తుందంటే పవన్ ఎందుకు వద్దంటున్నారో చెప్పాలన్నారు. తెలుగు సీనీ పరిశ్రమకు పవన్ కల్యాణ్ పెద్ద గుదిబండగా మారారని సజ్జల విమర్శించారు.
సినిమా టికెట్ల వల్ల బహుశా రూ.200 కోట్లు వస్తాయేమోనని.. దాంతో ప్రభుత్వం ఎంత అప్పు తీసుకుంటుందని, ఈ విషయాన్ని కూడా పవన్ చెబితే.. బాగుంటుందని సజ్జల వ్యాఖ్యానించారు.
బాహుబలి సినిమా టికెట్ల కలెక్షన్ విషయంలో సినిమా విడుదలైన తొలివారంలో సగం డబ్బు ప్రభుత్వానికి.. డిస్ట్రిబ్యూటర్లకూ వెళ్లలేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
సినిమా విడుదలైన తొలి వారంలో థియేటర్లలో సగం సీట్లు ఖాళీగా ఉన్నట్లు చూపినట్టు పేర్కొన్నారు. ఈ లెక్కన ఎంత మొత్తంలో ప్రభుత్వ ఖజానాకు పన్ను రాలేదో తేల్చాల్సి ఉందన్నారు. ఈ వ్యవహారంపై నిజం నిగ్గుతేలేలా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఆయన వెల్లడించారు’’అని కథనంలో ఆంధ్రజ్యోతి పేర్కొంది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం... విశాఖ, తూ.గో.జిల్లాలపై ప్రభావం
వాయవ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడిందని సాక్షి ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ అల్పపీడనం ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ప్రధానంగా విశాఖ, తూ.గో.జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
గులాబ్ తుపాను ప్రభావంతో కోస్తాలో పలుచోట్ల మంగళవారం కూడా వర్షాలు కురిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మి.మీ. వర్షపాతం నమోదైంది’’అని సాక్షి తెలిపింది.
32 కెమెరాలున్నా రెండు కిలోల బంగారం దోచేశారు..
హనుమకొండ జిల్లా ఖాజీపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని వడ్డేపల్లి రిజర్వాయర్‌కు ఆనుకుని ఉన్న పీజీఆర్ అపార్ట్‌మెంట్‌లో ఆదివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారని ఈనాడు ఓ కథనం ప్రచురించింది.
‘‘ఇద్దరు కాపాలాదారులు, 32 సీసీ కెమెరాలున్నా కళ్లు గప్పి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు కిలోల బంగారం, రూ.మూడు లక్షల నగదు దోచుకెళ్లారు.
అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న నిట్ విశ్రాంత ఆచార్యుడు వెంకటచలం, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కుమార్, శ్రావణ్.. తమ ఫ్లాట్లకు తాళాలు వేసి ఎవరి ఊళ్లకు వారు వెళ్లిపోయారు. సోమవారం ఉదయం తాళాలు పగులగొట్టినట్లు ఉన్నట్లు గుర్తించిన మిగతా ఫ్లాట్లలో ఉంటున్నవారు వీరికి సమాచారమందించగా వచ్చి చూశారు.
కాజీపేట సీఐ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు పరిశీలించారు. వాటి ఆధారంగా నలుగురు వ్యక్తులు ఆదివారం రాత్రి వెంకటచలం ఇంట్లో రెండు కిలోల బంగారం, రూ.మూడు లక్షల నగదు, కుమార్ ఇంట్లో రెండు తులాల బంగారం దోచుకెళ్లినట్లు గుర్తించారు’’అని ఈనాడు తెలిపింది.
కోవిషీల్డ్‌కు బదులు యాంటీ రేబీస్ టీకా ఇచ్చిన నర్సు
మహారాష్ట్రలోని ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని హెల్త్ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కోసం వచ్చిన ఓ వ్యక్తికి సదరు హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న నర్స్ పొరపాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ (ఏఆర్వీ) ఇచ్చారని నమస్తే తెలంగాణ ఓ కథనం ప్రచురించింది.
‘‘ఈ ఘటనపై సదరు నర్స్ కీర్తి పోపరేను సస్పెండ్ చేస్తూ ఠాణె మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు.
సోమవారం కల్వాలోని అత్కోనేశ్వర్ హెల్త్ సెంటర్‌కు రాజ్‌కుమార్ యాదవ్ అనే వ్యక్తి కొవిషీల్డ్ వ్యాక్సిన్ కోసం వచ్చారు. అయితే, ఆయన ఏఆర్వీ వ్యాక్సినేషన్ చేస్తున్న క్యూలో నిలుచున్నాడు.
అక్కడ విధులు నిర్వర్తిస్తున్న నర్స్ కీర్తి పోపరే.. సదరు వ్యక్తి కేస్ పేపర్ చూడకుండానే వ్యాక్సీన్ ఇచ్చేశారు.
ఈ సమాచారం తెలియడంతో సదరు రాజ్‌కుమార్ యాదవ్‌ను దవాఖానలో అబ్జర్వేషన్‌లో ఉంచారు.
సంబంధిత పేషంట్ కేస్ పేపర్ చూడటం నర్స్ డ్యూటీ అని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెప్పారు. ఆమె నిర్లక్ష్యం వల్ల సదరు వ్యక్తికి ప్రాణాపాయం ఏర్పడిందన్న ఆరోపణను కార్పొరేషన్ అధికారులు నిరాకరించారు’’అని నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- పెట్రోల్ కోసం కిలోమీటర్ల దూరం వరకు క్యూ లైన్లు
- ఏపీ అసెంబ్లీలో ఈ టీడీపీ ఎమ్మెల్యేలకు నోరెత్తే అవకాశం లేనట్లేనా?
- పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా
- తాలిబాన్ల ప్రభుత్వాన్ని పాకిస్తాన్, చైనా, రష్యా ఎందుకు గుర్తించట్లేదు? 7 కీలక ప్రశ్నలు, సమాధానాలు..
- భారతదేశపు రాజులు నిజంగానే ‘ఆడంగి లక్షణాలు’ ఉన్న, మగతనం లేని అసమర్ధులా?
- అఫ్గానిస్తాన్ యుద్ధంతో వేల కోట్లు లాభం పొందిన 5 కంపెనీలు ఇవే..
- ‘కష్టపడి పనిచేస్తే పైకి ఎదుగుతావు’.. ఇది నిజమా, అబద్ధమా?
- అఫ్గానిస్తాన్: ఆకలి తీర్చుకోవడానికి అన్నీ అమ్మేస్తున్నారు
- భారత్‌లో గత 70 ఏళ్లలో ఏ మతస్థుల జనాభా ఎంత పెరిగింది?
- పోర్న్ చూడడం, షేర్ చేయడం నేరమా... చైల్డ్ పోర్న్ ఫోన్లో ఉంటే ఎలాంటి శిక్షలు విధిస్తారు?
- కోవిషీల్డ్ టీకాను గుర్తించిన బ్రిటన్, భారతీయులు ఇకపై క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)