You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
1991 సంస్కరణలు: అప్పట్లో ఫోన్లకు దహన సంస్కారాలంటూ ప్రకటనలు, కారుకు ఏడేళ్లు వెయిటింగ్
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
1981 వేసవిలో, ముంబయిలోని ఒక యువతి ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి తనని తాను ఓ కన్సల్టెంట్‌గా పరిచయం చేసుకున్నాడు.
ఆమె ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు. లంచం ఇస్తే కొత్త టెలిఫోన్ కనెక్షన్ పెట్టించడానికి ఆమెకు సాయం చేస్తానని అతడు చెప్పాడు.
అప్పట్లో ఫోన్ కనెక్షన్ ప్రభుత్వ నియంత్రణలో ఉండేది. కొత్త కనెక్షన్ ఇచ్చే ప్రక్రియ పూర్తి కావడానికి రెండు దశాబ్దాలకుపైగా వేచి చూసిన వారు కూడా ఉన్నారు.
1980ల మధ్య నాటికి 10 లక్షల మంది ప్రజలు కొత్త ఫోన్ కనెక్షన్ల కోసం ఎదురుచూసేవారు.
జులై 1991కి ముందు ఇలాంటి ‘కన్సల్టెంట్లు’.. కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫోన్ కనెక్షన్లు, డ్రైవింగ్ లైసెన్సులు, పాస్‌పోర్ట్‌లను ఇప్పిస్తామంటూ నమ్మబలికేవారు.
ఆ రోజుల్లో భారతీయులు అన్నింటికీ క్యూలైన్లలో నిల్చోవాల్సి వచ్చేది. స్కూటర్ కోసం 10 ఏళ్లు, కారు కోసం ఏడేళ్లు వేచి చూడాల్సి వచ్చేది.
తన మొదటి బిడ్డకు పాల పొడి కొనుగోలు చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందో ఒక కాలమిస్ట్ తన అనుభవాలను నాతో పంచుకున్నారు.
ఇక ముంబయి మహిళ విషయంలో ఫోన్ కనెక్షన్ ఇప్పిస్తానన్న కన్సల్టెంట్ ఫీజు 15 వేల రూపాయలు. అది ఆమె నెల వేతనం కంటే దాదాపు 15 రెట్లు ఎక్కువ.
ఈ డబ్బులో కొంత భాగం కేంద్ర మంత్రి కుటుంబానికి వెళుతుంది కాబట్టి అది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని కన్సల్టెంట్ ఆ మహిళతో అన్నారు.
"మీకు కనెక్షన్ ఇచ్చినందుకు వాళ్లు లంచం తీసుకుంటారు" అని కన్సల్టెంట్ ఆమెతో చెప్పాడు.
పేరు చెప్పడానికి ఇష్టపడని సదరు మహిళ తాను పోగు చేసుకున్న సొమ్ము నుంచి లంచం ఇచ్చారు. దీంతో రెండు వారాల్లో ఆమెకు కొత్త ఫోన్ కనెక్షన్ వచ్చింది.
1991లో చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ‘నాణ్యత లేని వస్తు-సేవలు, భరించలేని ధరలు, నిజాయితీగా లేని సంస్థల కార్యకలాపాలు’ నుంచి వినియోగదారులకు విముక్తి లభించిందని మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ రామా బీజాపూర్కర్ పేర్కొన్నారు.
అప్పటి సంక్షోభం భారీ మార్పులకు కారణమైంది. విదేశీ మారక నిల్వలు తరిగిపోయాయి. ప్రజా రుణం పెరిగింది. ద్రవ్యోల్బణం రెండంకెలకు చేరుకుంది. మరోమాటలో చెప్పాలంటే, భారతదేశం దాదాపుగా దివాలా తీసింది.
అలా, ప్రభుత్వం దశాబ్దాల సోషలిజాన్ని రాత్రికి రాత్రే పీకి పక్కన పెట్టింది. దీంతో సంక్లిష్టమైన లైసెన్సింగ్ విధానాల నుంచి విమోచనం లభించింది. ప్రైవేటు కంపెనీలు, విదేశీ పెట్టుబడిదారులను భారత్‌లో పెట్టుబడులకు ప్రభుత్వం అనుమతించింది. రూపాయి మారకపు విలువను, దిగుమతులపై సుంకాలను తగ్గించింది.
ఇప్పుడు భారతదేశ ఆర్థిక వ్యవస్థ విలువ 2.66 ట్రిలియన్ డాలర్లు. నాటి నుండి దాదాపు 10 రెట్లు పెరిగింది. సగటు తలసరి ఆదాయం దాదాపు ఏడు రెట్లకు పెరిగి ప్రస్తుతం 2097 డాలర్లకు చేరుకుంది.
ఐక్యరాజ్యసమితి డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ప్రకారం, 2005 నుంచి 2016 మధ్య 27 కోట్ల మంది భారతీయులు కటిక పేదరికం నుండి బయటపడ్డారు.
దూర ప్రాంతాలకు కాల్ చేయాలంటే.. ఓర్పుకు పరీక్షే
1991లో 84 కోట్ల మంది భారతీయులలో కేవలం 50 లక్షల మందికి మాత్రమే టెలిఫోన్ సౌకర్యం అందుబాటులో ఉంది.
చాలా వరకు టెలిఫోన్ ఎక్స్ఛేంజ్లు 50 ఏళ్ల కిందటివి. ఒకవేళ అదృష్టం కొద్దీ ఫోన్ కనెక్షన్ దొరికినా, ఫోన్లు తరచూ మొరాయిస్తుండేవి. దీంతో వినియోగదారులు పట్టలేని కోపంతో తమ ఫోన్లు డెడ్ అయ్యాయని, వాటికి దహన సంస్కారాలు నిర్వహిస్తున్నామని వార్తా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చేవారు.
ఇక కాల్ లైన్లు తారుమారైతే, గంటల కొద్దీ ఇతరుల సంభాషణలు వింటూ గడిపేవారు. దూర ప్రాంతాల్లో ఉన్న వారికి కాల్ చేయాలంటే ఇక మన సహనాన్ని పరీక్షించుకున్నట్టేనని కాలమిస్ట్ సంతోష్ దేశాయ్ వెల్లడించారు.
"ఉదయం కాల్‌కి బుక్‌చేసుకుంటే, కొన్నిసార్లు కనెక్ట్ కావడానికి సాయంత్రం వరకు వేచి చూడాల్సి వచ్చేది. ఒకవేళ కాల్ కలిసినా, అటు నుంచి ఏమీ వినలేం. అరుపులు, శబ్దాలతో సగం సంభాషణ అర్థం కాదు" అని దేశాయ్ చెప్పారు.
"ప్రతి రోజు ఉదయం మా పక్కింటి అతను దూర ప్రాంతంలో ఉన్న స్టాక్ బ్రోకర్‌తో కొనుగోలు, అమ్మకాలపై గట్టిగా అరుస్తూ మాట్లాడే విషయం నాకు ఇంకా గుర్తుంది" అన్నారు.
నేడు భారత దేశంలో వంద కోట్లకు పైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు.
ప్రస్తుతం ఉచిత ఇన్ కమింగ్ కాల్స్‌తోపాటూ లోకల్ కాల్స్, మెసేజ్‌లు, ప్రపంచంలోనే చౌకైన ఇంటర్నెట్ డేటా మనకు సులభంగా లభిస్తున్నాయి. 5వేల రూపాయలకే చౌకగా స్మార్ట్‌ఫోన్‌లు దొరుకుతున్నాయి.
‘బ్యాంకుకు వెళ్లాలంటే.. డెంటిస్ట్ దగ్గరికి వెళ్లినట్టే’
1990ల ప్రారంభంలో బ్యాంకింగ్ రంగం నిద్రావస్థలో ఉండేదని ఆర్థికవేత్త డా. ఓంకార్ గోస్వామి గుర్తు చేసుకున్నారు.
"నిక్కచ్చిగా కనిపించే క్లర్క్‌లు స్టీల్ గ్రిల్స్‌కు వెనక వైపు కూర్చొని భారీ లెడ్జర్లలో లావాదేవీలు జరుపుతూ కుస్తీ పట్టేవారు. మీరు చెక్కును జమ చేసినప్పుడు నెంబర్ ఉన్న ఒక ఇత్తడి టోకెన్ ఇచ్చేవారు. ఇక మీ వంతు ఎప్పుడొస్తుందా అని నిరీక్షించాలి. క్యాషియర్ బిగ్గరగా మన నెంబర్‌ను చెప్పగానే, పరుగున వెళ్లి డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయేవాడిని" అని డా. గోస్వామి గుర్తు చేసుకున్నారు.
అప్పట్లో, బ్యాంకుకి వెళ్లడమంటే ఒక దంత వైద్యుడి దగ్గరికి వెళ్లినట్టు ఉండేదని ఆయన అన్నారు.
ప్రస్తుతం భారతీయులు దేశవ్యాప్తంగా 2 లక్షలకి పైగా ఉన్న ఏటీఎంల నుండి నగదు ఉపసంహరణకు 82 కోట్లకు పైగా డెబిట్ కార్డులు, 5.7 కోట్ల క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.
నగదు రహిత చెల్లింపులు కూడా పెరిగాయి. 2019లో మొబైల్ చెల్లింపులు 163 శాతం పెరిగి 286 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.
30 సంవత్సరాల్లో బ్యాంక్ శాఖల సంఖ్య రెండు రెట్లు పెరిగాయి.
'విమానాలు ఆరోగ్యానికి ఎలా ప్రమాదకరం'
ఇది 1988లో భారతదేశంలో విమానయానంపై ఆగ్రహంతో ఓ పత్రిక పెట్టిన శీర్షిక.
ఆ సమయంలో ఉన్న ఏకైక దేశీయ సంస్థ ఇండియన్ ఎయిర్‌లైన్స్ ప్రభుత్వ యాజమాన్యంలోనే నడిచేది. అందులో సీటు దక్కడం అంత సులభం కాదు.
విమానాశ్రయాలు పాడైపోయి ఉండేవి. పొడవాటి క్యూలు కనిపించేవి. చెక్-ఇన్ స్టాఫ్ అరుస్తూ కనిపించేవారు.
సమ్మెల కారణంగా విమానాలు తరచూ రద్దు అవ్వడం లేదా ఆలస్యం అయ్యేవి. దీంతో ప్రయాణికులకు సిబ్బందికి మధ్య గొడవలు జరిగేవి.
ప్రయాణికులు కొన్నిసార్లు రన్‌వే వద్దకు వెళ్లి విమానం కిందే తమ నిరసనలు తెలిపేవారు.
సంస్కరణలతో ప్రైవేట్ పెట్టుబడిదారులకు గేట్లు తెరిచినట్టు అయింది.
2015 నాటికి, భారతదేశ దేశీయ విమానయాన మార్కెట్ 13 ప్రైవేట్ విమాన యాన సంస్థలతో పది రెట్లు పెరిగింది.
వార్తలా లేక పశు సంరక్షణా?
భారతదేశంలోకి టెలివిజన్ 1959లో వచ్చింది. అప్పడు వారానికి రెండు కార్యక్రమాలు ఒక గంటపాటు విద్యపై ప్రసారమయ్యేవి.
ఆరేళ్ల తరువాత రోజు వారీ ప్రసారాలు నాలుగు గంటల కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి. ఇవి ఎక్కువగా న్యూస్ బులిటిన్‌లతో నిండివుండేవి. ఇవన్నీ ప్రభుత్వ యాజమాన్యంలోని ఛానెల్స్‌లోనే ప్రసారం చేసేవారు.
మూడు దశాబ్దాలకు పైగా భారతీయులు దూరదర్శన్‌ను భరించారు. వార్తలు లేదా పశు సంరక్షణపై వచ్చే కార్యక్రమాల్లో ఆసక్తికరమైనది ఎంపిక చేసుకుని చూసేవాళ్లమని ఓ ప్రముఖ వ్యాపారవేత్త చెప్పారు.
‘‘1985లో లైవ్ ఎయిడ్ చారిటీ కచేరీని దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారం చేసినప్పుడు, మా నగరంలో సుదీర్ఘ విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. దీంతో దానిని మిస్సయ్యాను. వినోదం అందుబాటులో వచ్చాక కూడా వాటిని చూడలేకపోయాను’’అని ఆయన అన్నారు.
ఇప్పుడు భారతీయ టీవీ వినియోగదారులు 15 భాషల్లో 400కి పైగా న్యూస్ ఛానెళ్లతో సహా 926 ప్రైవేట్ ఛానెళ్లను వీక్షించగలుగుతున్నారు.
ముప్పై సంవత్సరాల సంస్కరణలపై వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ ఇటీవల స్పందించారు. "మన ఆర్థిక వ్యవస్థ కొరత నుంచి స్వయం సమృద్ధి వైపుకు అడుగులు వేసింది" అన్నారు.
భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కానీ, తీవ్రమైన సవాళ్లు మిగిలేవున్నాయి. గత కొన్నేళ్లుగా వృద్ధి బాగా మందగించింది. ఇప్పటికే కుదేలైన ఆర్థిక వ్యవస్థను కరోనా మహమ్మారి మరోసారి దెబ్బతీసింది. గ్లోబల్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్‌లో భారత్ ఇంకా అట్టడుగునే ఉంది.
వస్తూత్పత్తి రంగం వృద్ధి మందగించింది. భూమి, విద్యుత్, లేబర్‌కు సంబంధించి ముఖ్యమైన సంస్కరణలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు పన్ను చెల్లింపుదారుల డబ్బును వృథా చేస్తూనే ఉన్నాయి. బ్యాంక్ డిపాజిట్లు పెరిగాయి, కానీ బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి సుముఖంగా లేవు.
దీంతో ప్రైవేట్ పెట్టుబడులు తగ్గే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం విద్యను పూర్తి చేసుకుని వస్తున్న లక్షలాది యువ తరానికి కావాల్సినన్ని ఉద్యోగాలు లేవు.
1991 నుంచి వినియోగదారులు ఆనందంలో మునిగి తేలుతున్నారని బీజాపూర్కర్ అన్నారు.
‘‘ఆదాయం, వస్తు-సేవల కొనుగోళ్లకు కరోనా మహమ్మారి బ్రేకులు వేసింది. అయితే, ప్రజల్లో ఆకాంక్షలను మాత్రం తగ్గించలేదు. కాబట్టి, మళ్లీ మనం వెనక్కు వెళ్లబోం.’’
ఇవి కూడా చదవండి:
- కోవిడ్-19 ఎప్పటికీ అంతం కాకపోవచ్చు, దానితో కలిసి జీవించడం ఎలా?
- అందం కోసం సెక్స్ ఒప్పందాలు: ‘నాకు కాస్మోటిక్ సర్జరీ చేయిస్తే నా శరీరం ఆరు నెలలు నీదే’
- కోవిడ్-19ను మనం నోరోవైరస్లా ఎందుకు చూడాలి? అసలు నోరోవైరస్ అంటే ఏమిటి
- పెగాసస్ స్పైవేర్: ఇప్పటికీ సమాధానాలు దొరకని కీలక ప్రశ్నలు
- ఒకప్పటి భారతదేశానికి ఇప్పటి ఇండియాకు తేడా ఇదే
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)