You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ: నర్సులు మలయాళంలో మాట్లాడవద్దని ఓ గవర్నమెంట్ హాస్పిటల్ ఆదేశాలు... వివాదం చెలరేగడంతో సర్క్యులర్ వాపస్
దిల్లీలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో జారీ చేసిన సర్క్యులర్ వివాదాస్పదం కావడంతో, దాన్ని రద్దు చేశారు.
ఆస్పత్రిలో పని చేసే నర్సులు హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాత్రమే మాట్లాడాలని, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోవింద్ వల్లభ్ పంత్ ఆస్పత్రి నర్సింగ్ సూపరింటెండెంట్ కార్యాలయం శనివారం ఒక సర్క్యులర్ జారీ చేసింది.
అందులో ప్రత్యేకంగా మలయాళం భాషను ప్రస్తావించారు. దాంతో ఈ సర్క్యులర్‌పై విమర్శలు వెల్లువెత్తాయి.
భారతదేశంలో అనేక ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో నర్సులు కేరళ రాష్ట్రానికి చెందినవారు కావడం మనం గమనిస్తుంటాం.
పంత్ ఆస్పత్రిలో కూడా పలువురు మలయాళీ నర్సులు ఉద్యోగం చేస్తున్నారు.
"నర్సులు మాట్లాడే మలయాళం భాష ఇతర సిబ్బందికి, రోగులకు అర్థం కాదు. ఇది వారిని అసౌకర్యానికి గురి చేస్తోందంటూ" ఈ సర్క్యులర్‌కు కారణాలు చూపించారు.
అయితే, "తమకు తెలియకుండా ఈ సర్క్యులర్ జారీ చేశారని, అందుకే వెనక్కు తీసుకున్నామని" ఇప్పుడు ఆ ఆస్పత్రి చెబుతోంది.
తీవ్ర నిరసనలు తెలియజేసిన నర్సులు
దిల్లీలోని ఎయిమ్స్, లోక్ నాయక్ (ఎల్‌ఎన్‌జేపి), గురు తేగ్ బహదూర్ (జీటీబీ) లాంటి పెద్ద పెద్ద ఆస్పత్రుల్లోని నర్సుల సంఘాలు పంత్ ఆస్పత్రి నర్సులకు మద్దతుగా నిలిచాయి.
వీరంతా కలిసి బహిరంగంగా ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకించారు. ఇది "పక్షపాతమని, తప్పుడు నిర్ణయం" అని తీవ్రంగా విమర్శించారు.
దీనికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం నడిపేందుకు సిద్ధమయ్యారు.
కొంతమంది నర్సులు ఫేస్‌బుక్, ట్విట్టర్లలో ఈ సర్క్యులర్‌ను వ్యతిరేకిస్తూ గొంతెత్తారు.
"దిల్లీలో 60 శాతం నర్సులు కేరళకు చెందినవారు. వాళ్లల్లో వాళ్లు తమ మాతృభాషలో మాట్లాడుకుంటారు. అంతేగానీ, రోగులతో, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన తోటి నర్సులతో మలయాళంలో మాట్లాడడానికి ప్రయత్నిస్తారనడం సరి కాదు. అలా జరగదు" అంటూ సోషల్ మీడియాలో రాశారు.
కాగా, ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ఇతరులతో మలయాళంలో మాట్లాడితే అది తప్పు అని వారు కూడా అంగీకరించారు.
"పంజాబ్, మణిపూర్‌తో సహ ఇతర రాష్ట్రాల నర్సులు కూడా దిల్లీలో పని చేస్తున్నారు. వారు కలిసినప్పుడు ఒకరితో ఒకరు తమ మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. మరి వారిని ఎందుకు అడ్డుకోవట్లేదు? మలయాళం మాట్లాడేవారినే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు?" అని స్థానిక మీడియాతో మాట్లాడుతూ పలువురు నర్సులు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకించింది
కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం ఉదయం ఈ అంశంపై ట్విట్టర్‌లో స్పందించారు.
"మిగతా భాషల్లాగే మలయాళం కూడా భారతీయ భాషల్లో ఒకటి. భాషా ప్రాతిపదికన వివక్ష చూపడం ఆపండి" అంటూ ట్వీట్ చేశారు.
"ఇది చాలా వింతగా ఉంది. రాజ్యంగ విరుద్ధం కూడా" అంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.
ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్, కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్‌కు లేఖ రాశారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని, ఈ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
"ప్రజాస్వామ్య భారతదేశంలో ఒక ప్రభుత్వ సంస్థలో నర్సులను తమ రాష్ట్రానికి చెందిన తోటి నర్సులతో తమ మాతృభాషలో మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేయడం చూస్తుంటే నా తల తిరుగుతోంది. ఇది ఆమోదయోగ్యం కాదు. అనాగరికం, అభ్యంతరకరమే కాకుండా మానవుల ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కూడా. దీన్ని జారీ చేసినవారిపై చర్యలు తీసుకోవాలి" అంటూ కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ట్వీట్ చేశారు.
సోషల్ మీడియాలో చర్చ
బీజెపీ ప్రతినిధి అమిత్ మాలవీయ ట్వీట్ చేస్తూ "కేరళ నర్సులను లక్ష్యంగా చేసుకున్నందుకు కేజ్రీవాల్ సిగ్గుపడాలి. వారిని మలయాళంలో మాట్లాడుకోవద్దంటున్నారు! అంతకుముందు యూపీ, బిహార్ రాష్ట్రాలవారిని లక్ష్యాలుగా చేసుకున్నారు. ఇప్పుడు కేరళ" అని అన్నారు.
ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఈ అశంపై స్పందించారు.
"నేను చాలా ఆస్పత్రుల్లో మలయాళీ నర్సులను కలుసుకున్నాను. వాళ్లు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడతారు. కోల్‌కతాలాంటి రాష్ట్రాల్లో పని చేస్తున్నప్పుడు రోగులతో బెంగాలీలో సంభాషించడానికి ప్రయత్నిస్తారు. ఇటలీ ఆస్పత్రిలో వాళ్లు ఇటలీలో మాట్లాడడం చూశాను. అయితే, ఇతర మలయాళీ నర్సులతోనూ, కేరళ రాష్ట్రానికి చెందిన రోగులతోనూ మలయాళంలో మాట్లాడతారు" అని ఆమె అన్నారు.
"పీఎం మోదీ, అమిత్ షా తమ కార్యాలయంలో గుజరాతీలో మాట్లాడుకోగలిగినప్పుడు మలయాళీ నర్సులు ఎందుకు తమ మాతృభాషలో మాట్లాడుకోలేరు? దక్షిణ భారతీయ భాషలపై ఇంత చిన్న చూపెందుకు?" అని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా సెల్‌కు చెందిన గౌరవ్ పంధీ అన్నారు.
"దీన్ని అంగీకరించలేం. భారతదేశంలో ఏ భాషపై కూడా ఇలాంటి బ్యాన్ విధించలేరు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి" అని సీపీఐ(ఎం) నాయకుడు సీతారాం ఏచూరి అన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆనందయ్య కరోనా మందు వివాదంతో ఆయుర్వేద ఉత్పత్తులకు డిమాండ్ పెరిగిందా?
- వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి... ఎందుకిలా?
- జీ 7: రెవెన్యూ ఆర్జించే చోటే పన్నులు వసూలుచేసే ఒప్పందానికి పచ్చజెండా
- ది గ్రేట్ ఇండియన్ కిచెన్: ఇంట్లో మహిళల పట్ల చూపిస్తున్న వివక్షను కళ్లకు కట్టించిన చిత్రం
- భారీ కృత్రిమ దీవి నిర్మాణానికి డెన్మార్క్ పార్లమెంట్ ఆమోదం
- క్రికెట్ 2050: వాతావరణ మార్పులతో ఈ ఆట ఆడే తీరే మారిపోతుందా?
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- రేప్ కేసు రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించినందుకు జైల్లో పెట్టి 'హింసిస్తున్నారు'
- కరోనావైరస్: గర్భిణులు వ్యాక్సీన్ తీసుకోకూడదా... డాక్టర్లు ఏమంటున్నారు?
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- కరోనావైరస్ను జయించారు సరే, కానీ ఈ విషయాలను ఏమాత్రం మర్చిపోకండి
- మ్యూకోర్మైకోసిస్: భారత్‌లో కోవిడ్ రోగుల అవయవాలు దెబ్బతీస్తున్న 'బ్లాక్ ఫంగస్'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)