ఆంధ్రప్రదేశ్‌: వైయస్సార్ జగనన్న ఇళ్ల కాలనీలకు సీఎం జగన్ శంకుస్థాపన- Newsreel

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైయస్సార్‌ జగనన్న కాలనీల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ శంకుస్థాపన చేశారు. క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం నిర్వహించారు.

రాష్ట్రంలో పేదలందరికీ సొంతింటిని నిర్మించి ఇస్తామంటూ గతంలోనే ప్రభుత్వం ప్రకటించింది. పలు చోట్ల భూసేకరణ చేసి స్థలాలు అప్పగించింది. ప్రస్తుతం ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది.

రూ.50,944 కోట్లతో 28,30,227 పక్కా ఇళ్లను నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అందులో భాగంగా మొదటి దశలో రూ.28,084 కోట్లతో జూన్‌ 2022 నాటికి 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చెబుతోంది.

రెండో దశలో రూ.22,860 కోట్లతో జూన్‌ 2023 నాటికి మరో 12.70 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని ప్రకటించింది

రాష్ట్రవ్యాప్తంగా 30.76 లక్షల మంది మహిళల పేరుతో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల ఖర్చు తో కలిపి ఒక్కొక్కరికి ప్రాంతాన్ని బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల మేర లబ్ది చేకూరుస్తున్నామని ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి తెలిపారు.

అయితే, ఒకే పథకానికి పలుమార్లు శంకుస్థాపన చేయడం విడ్డూరమంటూ జగన్ ప్రభుత్వ తీరుని టీడీపీ తప్పుబట్టింది.

రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో పైలాన్లు కూడా వేసి శంకుస్థాపనలు ఆడంబరంగా చేసిన జగన్ ఇప్పుడు మళ్లీ శంకుస్థాపన అనడం ఆశ్చర్యంగా ఉందని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.

నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో గడువు ముగిసిన రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చారా?

నర్సీపట్నం ఏరియా హాస్పిటల్‌లో కోవిడ్ బాధితులకు గడువు ముగిసిన రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇచ్చారంటూ బాధితుల సంబంధీకులు ఆరోపించడంతో మిగతా రెమిడిసివిర్ తీసుకున్న మిగతా కోవిడ్ బాధితుల్లో అందోళన మొదలైంది.

గడువు తీరిన రెమ్‌డెసివిర్ కంటైనర్లపై మరో కొత్త లేబుల్ అతికించి ఉండటాన్ని బాధితుల కటుంబీకులు గుర్తించారు. ముందున్న లేబుల్ ప్రకారం మార్చి 2021తో ఆ రెమిడిసివిర్ కంటైనర్ గడువు తీరిపోయింది. కానీ ఆ లేబిల్ పై ఆగష్టు 2021 వరకు గడుపు ఉన్నట్లు మరో లేబుల్ అతికించి ఉంది.

అయితే, దీనిని గమనించిన భాధితులు డీఎంహెచ్వోకి ఫోన్ చేసి ప్రశ్నించారు. ఆ ఇంజక్షన్లను ప్రభుత్వమే తమకు పంపిందని జిల్లా వైద్యఆరోగ్య అధికారి డాక్టర్ సూర్యనారాయణ సమాధానం చెప్పారు. కావాలంటే ఆఫీసుకు వచ్చి ఫైల్స్ చూసుకోవచ్చునని అన్నారు.

ఇదే సమయంలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో కోవిడ్ బాధితులు ముగ్గురు మరణించారు. గడువు ముగిసిన రెమిడిసివిర్ ఇంజక్షన్లు ఇవ్వడం వలనే వారు మరణించారంటూ బాధితులు అందోళన చేపట్టారు. దీంతో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య ఏరియా ఆసుపత్రికి వచ్చి పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే రెమిడిసివిర్ ఇంజెక్షన్లు మరో ఆరు నెలల పాటు స్టోరేజ్ చేసుకుని వినియోగించుకోవచ్చునని ఆమె తెలిపారు. అందుకే ఆ విధంగా లేబుల్స్ అతికించి ఉన్నాయని అన్నారు. గడువు తీరినవి వాడుతున్నామనే వార్తలు అవాస్తమంటూ ఖండించారు.

దీనిపై జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారులు కూడా స్పందించి అధికారకంగా లేఖను విడుదల చేశారు. రెమిడిసివిర్ వైల్ పై ఉన్న గడుపు తేదీ తరువాత కూడా మరొక ఆరు నెలల పాటు షెల్ప్ లైఫ్ ఉంటుందని, దాని ప్రకారమే కొత్త లేబుల్స్ అతికించినట్లు జిల్లా డ్రగ్స్ కంట్రోల్ విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ కె. రజిత ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే, భారత డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టంలోని సెక్షన్ 104ఏ ప్రకారం, ఏ డ్రగ్ కు సంబంధించిన కంటైనర్ మీద అయినా తయారీ సంస్థ అంటించిన లేబుల్ తప్ప దానిపై మరో లేబుల్ ను అంటించకూడదు. కానీ ఇక్కడ చూస్తే ఈ ఇంజక్షన్ బాటిల్ పై మందు తయారు చేసిన మైలాన్ సంస్థ లేబుల్ పై మరో లేబుల్ అంటించి ఉంది. దీనిపై విచారణ జరిపించాలంటూ తెలుగుదేశంతో పాటు ఇతర పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి.

సుప్రీం కోర్టు: 'టీకా డోసుల కోసం రాష్ట్రాల మధ్య పోటీ పెడతారా?'

టీకా వేయించుకోడానికి యాప్‌లో నమోదు చేసుకోవడం ఎందుకు తప్పనిసరి చేశారో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇంటర్నెట్ సౌకర్యం లేని గ్రామీణ ప్రాంతాల్లో టీకా వేయడానికి ఈ నిబంధన ఆటంకంగా మారిందని కోర్టు చెప్పింది.

కరోనాను ఎదుర్కోడానికి ఇప్పటివరకూ పట్టణ, గ్రామీణ ప్రాతాల్లో ఒకటి లేదా రెండు డోసులు వేసుకున్న ప్రజల శాతం ఎంతోచెప్పాలని కోరింది.

కేంద్రం టీకా విధానం రాష్ట్రాలు వ్యాక్సీన్ డోసుల కోసం పోటీపడేలా చేస్తోందా? అని అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నించింది.

ఇప్పటివరకూ ఎన్ని టీకాలు కొనుగోలు చేశారో ఆ పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని కూడా కోర్టు కోరింది.

అఫిడవిట్ దాఖలు చేస్తున్నప్పుడు కేంద్రం టీకా విధానాన్ని స్పష్టం చేసేలా దానికి సంబంధించిన అన్ని పత్రాలు, ఫైళ్లు ఆన్ రికార్డ్ ఉంచాలని సుప్రీం కేంద్రానికి చెప్పింది.

మ్యూకోర్‌మైకోసిస్(బ్లాక్ ఫంగస్) మందులు అందుబాటులో ఉంచడానికి ఏమేం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పాలని అడిగింది.

18-44 ఏళ్ల మధ్య వారు టీకాకు డబ్బు చెల్లించాలని అడగడం ఏకపక్షమని, సరికాదని సుప్రీంకోర్టు చెప్పింది.

కేంద్రం తమ టీకా విధానాన్ని సమీక్షించాలని, డిసెంబర్ 31 లోపు అందుబాటులోకి తీసుకురాగలిగే టీకా డోసుల గురించి ఒక రోడ్‌మాప్ రూపొందించాలని కోరింది. ఆ తేదీ లోపు దేశంలో ఉన్న పెద్దవారందరికీ టీకా వేయడం పూర్తి చేస్తామని కేంద్రం చెబుతోంది.

టీకా డోసుల ఉత్పత్తి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆగస్టు- డిసెంబర్ మధ్యలో కనీసం 200 కోట్ల డోసులు ఉత్పత్తి చేయగలమని ప్రభుత్వం కోర్టుకు చెప్పింది.

సమాధానం ఇవ్వడానికి కేంద్రానికి రెండు వారాల సమయం ఇచ్చింది. ఈ కేసులో తర్వాత విచారణ జూన్ 30న జరగనుంది.

భారత్‌లో జనవరి మధ్యలో టీకా కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకూ 22 కోట్ల డోసులు వేశారు. కానీ ఇప్పటివరకూ 3 శాతం జనాభా మాత్రమే రెండు డోసుల టీకా వేయించుకున్నారు.

సెకండ్ వేవ్ తీవ్రం కావడం, థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందనే హెచ్చరికలు వస్తుండడంతో దేశంలో టీకా కొరత ఏర్పడింది.

భారత్‌లో రోజువారీ కరోనా కేసులు గత నెలలో 4 లక్షల నుంచి లక్షన్నర దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో ఈ సంఖ్య 1,32,788కి తగ్గింది.

జమ్ముూ కశ్మీర్: పుల్వామాలో బీజేపీ కౌన్సిలర్‌ను కాల్చి చంపిన మిలిటెంట్లు

జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ కౌన్సిలర్ రాకేష్ పండితాను మిలిటెంట్లు కాల్చి చంపారు. ఈ ఘటనపై రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సహా రాజకీయ పార్టీల నేతలందరూ ఖండించారు.

పుల్వామాలో బుధవారం రాత్రి బీజేపీ నేత రాకేష్ సోమనాథ్ పండితాను కాల్చి చంపినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.

పుల్వామాలోని త్రాల్ ప్రాంతంలో తన స్నేహితుడిని కలవడానికి వెళ్లినపుడు ఆయనపై కాల్పులు జరిగాయని పోలీసు ప్రతినిధి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది.

రాత్రి దాదాపు 10.15కు గుర్తుతెలియని ముగ్గురు సాయుధులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దాడిలో రాకేష్ పండితా తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్తున్న సమయంలో ఆయన దారిలోనే చనిపోయారు.

ఈ దాడిలో ఆయన స్నేహితుడి కూతురికి కూడా బుల్లెట్ తగిలింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

రాకేష్ పండితాకు పోలీసు సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. ఆయనతో ఎప్పుడూ ఇద్దరు వ్యక్తిగత భద్రతాధికారులు ఉండేవారు. దీనితోపాటూ శ్రీనగర్‌లో ఆయన ఉండడానికి ఒక సురక్షిత నివాసం కూడా ఏర్పాటుచేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు. ఆయనపై కాల్పులు జరుగుతున్నప్పుడు, వ్యక్తిగత సెక్యూరిటీ అధికారులు ఎందుకు లేరు అనేదానిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

ఏడాది కాలంలో జమ్మూ కశ్మీర్‌లో ఐదుగురు బీజేపీ నేతలు హత్యకు గురయ్యారు. రాకేష్ పండితా హత్య తర్వాత నేతలకు అందించే భద్రత గురించి మళ్లీ సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా మంది నేతలకు శ్రీనగర్‌లో సురక్షిత నివాసాలు కేటాయించే ఏర్పాట్లు కూడా చేశారు.

జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పీడీపీ నేత మహబూబా ముఫ్తీ, జమ్ము-కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజ్జాద్ లోన్ సహా చాలా పార్టీల నేతలు ఈ దాడిని ఖండించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)