You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'ఆనందయ్య మందు' కరోనాకు పని చేస్తుందా... ఎప్పటి నుంచి అందుబాటులోకి రావొచ్చు.. ఇప్పటి వరకు ఏం జరిగింది?
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ప్రస్తుతం ఆనందయ్య మందుపై స్తబ్దత నెలకొంది. ఆయుర్వేద విభాగం అధ్యయనం కొనసాగుతోంది.
ఇంతకీ ఆనందయ్య మందు పనిచేస్తుందా లేదా? కడుపులోకి తీసుకునే మందుతో పాటు చుక్కల మందుతో లాభం - ప్రమాదం ఎంతెంత?
చుక్కల మందు తీసుకున్న వారి పరిస్థితి ఏంటి?
ఒకవేళ మందు పనిచేస్తే సామాన్యులకు ఎప్పుడు అందుతుంది?
పనిచేయదు అని నివేదిక వస్తే చట్టపరమైన అంశాలంటే?
ఇదంతా తేలడానికి ఎంతకాలం పడుతుంది?
ఇలా ఎన్నో ప్రశ్నల మధ్య ఆ మందు పంపిణీ చిక్కుకుంది.
ఈ ప్రశ్నలతో సంబంధం లేకుండా నెల్లూరు కేంద్రంగా కొన్ని రోజుల పాటు ఆనందయ్య మందు తయారై ప్రముఖులకు చేరింది.
అటు కృష్ణపట్నం గ్రామంలో కూడా ఆనందయ్య తయారు చేయగా మిగిలిందో లేక ఊరి వారు తయారు చేశారో లేక ఆనందయ్య పర్యవేక్షణలో తయారైందో తెలియని చుక్కల మందు దాదాపు శుక్రవారం వరకు రహస్యంగా అందుబాటులో ఉంది.
దాదాపు వారం తరువాత ఆనందయ్యను పోలీసు భద్రతా వలయం నుంచి శుక్రవారం సాయంత్రం ఆయన ఇంటికి పంపారు.
కానీ అంతలోనే మళ్లీ గ్రామంలో చిన్న అలజడి రేగింది.
ఆనందయ్యను పూర్తిగా వదలిపెట్టాలని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
కానీ శనివారం ఆయన్ను తిరిగి పోలీసు భద్రతలోకి పంపేశారు.
ప్రస్తుతానికి ఈ మందు పనిచేస్తుందా లేదా అన్నది ఇంకా శాస్త్రీయంగా రుజువు కాలేదు.
ఎందుకంటే ఆనందయ్య మందు తీసుకున్న వారి సమాచారం ఎవరి దగ్గరా స్పష్టంగా లేదు.
శాస్త్రీయ రుజువులు కావాలంటే ''ఇంత మందికి మందు ఇచ్చాం. వారిలో ఇంత మందికి ఇన్ని రోజుల్లో నెగిటివ్ వచ్చింది'' అని స్పష్టంగా రిపోర్టులు ఉండాలి.
లేదా మందు తీసుకున్న తరువాత వారు పనిగట్టుకుని కరోనావైరస్ వ్యాప్తికి ప్రోన్ అయి, అప్పటికీ కరోనా సోకలేదు అని నిరూపించాలి.
లేదా చుక్కలు కంట్లో వేయక ముందు, వేసిన తరువాత ఆక్సిజన్ స్థాయి పల్స్ ఆక్సీమీటర్ ద్వారా రికార్డు చేయాలి.
కానీ ఆనందయ్య మందు విషయంలో ఈ మూడూ జరగలేదు.
ఆయుష్ వైపు నుంచి ఏం జరుగుతోంది?
ఆనందయ్య మందును ఆయుర్వేద మందుగా నమోదు చేయాలంటే కావాల్సిన ప్రక్రియ ప్రారంభం అయింది.
కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ ఆదేశాలతో తిరుపతి, విజయవాడ ఆయుర్వేద కాలేజీలు ఆ పని మొదలుపెట్టాయి.
కానీ వారికి సమాచారం అంత తేలికగా దొరకలేదు.
''మందు తీసుకున్న వారు మాకు సమాచారం ఇవ్వండి'' అని వారు బహిరంగ ప్రకటన ఇవ్వలేదు.
ప్రభుత్వ యంత్రాంగం ద్వారా కొన్ని నంబర్లు సేకరించి, అతి కష్టం మీద కావాల్సిన సమాచారం క్రోడీకరించారు.
కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ దీన్ని విశ్లేషించి ముందుకెళ్లమని చెబితే అప్పుడు అధ్యయనం, పరిశోధన ప్రారంభం అవుతాయి.
వాటిల్లో టాక్సిక్ స్టడీ (చెడు పరిణామాలు కలిగించేవి మందులో ఉన్నయా అని చేసే పరిశోధన), జంతువులపై ప్రయోగం, మనుషులపై ప్రయోగం - ఈ మూడూ జరగాలి.
ఆ తరువాతే అది ఆయుర్వేద మందుగా బయటకు వస్తుంది. కానీ ఇది రోజుల వ్యవధిలో అయితే జరగదు.
''ఇందుకు సాధారణంగా ఏడాది పడుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా వేగంగా చేస్తే రెండు నెలల్లోపు చేయవచ్చు'' అని గతంలో ఒక ఇంటర్వ్యూలో బీబీసీతో చెప్పారు తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కాలేజీ ప్రిన్సిపల్ డా. మురళీ కృష్ణ.
దీనికి సంబంధించిన కేంద్ర ఆయుర్వేద పరిశోధనా సంస్థ నుంచి మరో రెండు రోజుల్లో ఆదేశాలు రావచ్చని భావిస్తున్నారు.
అటు ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగం తుది నివేదిక ప్రభుత్వానికి ఇంకా అందలేదు.
ప్రాథమిక నివేదికలో ''దీనిని ఆయుర్వేద మందు అనలేమని'' చెప్పిన అధికారులు, దాన్ని ''తీసుకోవడం వల్ల ఎటువంటి నష్టం మాత్రం లేదని'' చెప్పారు. ప్రస్తుతానికి దాన్ని నాటు మందుగా గుర్తిస్తామన్నారు. వారి తుది నివేదికలో ఏఏ అంశాలంటాయన్నది తేలాల్సి ఉంది.
అల్లోపతీ వైద్యుల మాటేంటి?
''మందు వల్ల నష్టమా కాదా అన్నది కాదు తేలాల్సింది. అసలు మందు పనిచేస్తుందా లేదా అన్నది తేలాలి. ఎవరెవరో వీడియోల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్ల కంటే మంచి ప్రతిపాదన నా దగ్గర ఒకటి ఉంది. ఆనందయ్య మందుపై నమ్మకం ఉన్న, కరోనా తీవ్ర లక్షణాలతో ఆక్సిజన్ ఆధారం మీద ఉన్న కొందరిని ఎంపిక చేసి, వారి సమ్మతితో, కృష్ణపట్నంలో కానీ, నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కానీ ఆనందయ్య చుక్కల మందు వేయాలి. చుక్కల ముందుకు, ముందు, తరువాత పల్స్ ఆక్సీమీటర్‌తో పరీక్షించాలి. అప్పుడు విషయం తేలిపోతుంది. నిజంగా ఆక్సిజన్ పెరిగినట్టు నిరూపణ అయితే అంతకంటే కావల్సింది ఏంటి? మందంటూ పనిచేస్తే, అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆలోచించవచ్చు. సేఫ్టీ కంటే ఎఫికసీని ముందు ప్రూవ్ చేయాలి. కాబట్టి ఆ మందు వల్ల నష్టం జరుగుతుందా అన్న టాపిక్ పక్కన పెట్టి, ముందు అసలు ఆ మందు పనిచేస్తుందా లేదా అన్నది శాస్త్రీయంగా తేల్చాలి'' అని డిమాండ్ చేశారు కర్నూలుకు చెందిన వైద్యులు, జన విజ్ఞాన వేదిక సభ్యులు డా. బ్రహ్మా రెడ్డి.
మెజార్టీ అల్లోపతిక్ వైద్యులు ఆనందయ్య మందు పనిచేయదని కచ్చితంగా చెబుతున్నారు.
మరోవైపు చుక్కల మందు తీసుకున్న తరువాత కూడా వివిధ కారణాలతో తిరిగి ఆసుపత్రిలో కొందరు చేరారు.
దీన్ని నెల్లూరు కరోనా నోడల్ ఆఫీసర్ నిర్ధరించారు. వారికి చికిత్స అందిస్తోన్నట్టు చెప్పారు.
కానీ దానిపై ప్రభుత్వం తరపున ఎటువంటి ఎంక్వైరీ జరిగినట్టు తెలియడం లేదు. దీనిపై స్పష్టమైన విచారణ చేయాలని పలువురు అల్లోపతిక్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదే విషయమై బీబీసీ ఆనందయ్య అనుచరులను ప్రశ్నించగా, ఆ రోగులు మందు పూర్తి డోసులు (ఫుల్ కోర్సు) తీసుకోనందునే అలా జరిగిందని చెబుతున్నారు.
''ఈ చుక్కల మందు తీసుకున్న తరువాత కూడా మరో మూడు రోజుల పాటూ ఆనందయ్య ఇచ్చే వేరే మందులు వాడాలి. అలా వాడని వారే తిరిగి అనారోగ్యం పాలై ఉండొచ్చు'' అని బీబీసీతో అన్నారు పాండురంగయ్య అనే వ్యక్తి. కృష్ణపట్నానికి చెందిన ఆయన ఆనందయ్య దగ్గర వాలంటీరుగా పనిచేశారు.
ఈ మందు చెడు ప్రభావాన్ని కలుగ చేస్తుంది అనడానికి ఆ కేసులే ఉదాహరణ అని పలువురు అల్లోపతిక్ వైద్యులు విమర్శిస్తున్నారు.
మందు పంపిణీ ఎప్పుడు జరుగుతుంది?
ఆనందయ్య పాపులర్ అయినప్పటి నుంచి ఈ వ్యవహారంలో సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన రెడ్డి కీలక భాగస్వామి అయ్యారు.
ఆనందయ్య ఆయన నియోజకవర్గంలో ఆయన పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి కూడా కావడంతో వారి మధ్య బంధం బలంగా ఉంది.
మందు వివాదాస్పదం అయిన తరువాత ఆనందయ్య మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ గోవర్ధన రెడ్డితో కలిసే వచ్చారు.
దీంతో మందు పంపిణీ గురించి గోవర్ధన రెడ్డితో మాట్లాడింది బీబీసీ.
''ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ ఆగుతున్నాం. కరోనాపై ఈ మందు పనిచేస్తుంది. కానీ వేరే శరీర భాగాలపై ఏమైనా చెడు ప్రభావం ఉందా అనేది తెలుసుకోవాలి. అందుకే ఎదురు చూస్తున్నాం. కొందరు మందు తీసుకున్న వారు ఆసుపత్రిలో చేరిన వార్తలు విన్నాం. కానీ మా దృష్టికి మాత్రం అలాంటివి ఏమీ రాలేదు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే విస్తృతంగా మందు తయారు చేసి పంపిణీ చేసే ఏర్పాట్లు చేస్తాం'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
కానీ ప్రభుత్వ అనుమతి రాకపోతే ఏంటన్న ప్రశ్నకు ఆయనతో పాటూ ఎవరూ బహిరంగ సమాధానం చెప్పడం లేదు.
ప్రభుత్వ పాత్ర ఏంటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న చట్టాల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అల్లోపతిక్ మందులు లేదా ఆయుర్వేదం వంటి ఆయుష్ శాఖ పరిధిలోకి వచ్చే మందుల పంపిణీలో ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు.
కానీ ఈ పరిధిలోకి రాని మందులు అంటే నాటు మందులుగా పిలిచే వాటిలో ప్రభుత్వం ప్రత్యక్షంగా జోక్యం చేసుకుంటే ఎన్నో చట్టపరమైన ఇబ్బందులు ఉంటాయి.
ఒకవేళ ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ మందుకు ఆయుర్వేద మందుగా రాజముద్ర వేస్తే, ఆనందయ్యకు లైన్ క్లియర్ అవుతుంది. ఎవరి ద్వారా పంచినా, ఎలా పంచినా, అడ్డు చెప్పేవారుండరు. కానీ ఆ ప్రక్రియ ఇప్పట్లో పూర్తవదు.
అనువంశిక వైద్య సంప్రదాయంగా ఆనందయ్య ఈ మందును పంపిణీ చేసుకోవచ్చు. కానీ ఆ మందు ఫలానా వ్యాధిని నయం చేస్తుంది అన్న మాట మాత్రం చెప్పకూడదు. అప్పుడు అది నేరం అవుతుంది.
దీంతో కరోనాను నయం చేసే మందు, కరోనా రాకుండా నివారించే మందు అనే మాటలు ఉపయోగించకుండా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆనందయ్య మందు సరఫరా చేసుకునే వెసులుబాటు ఉంది.
ప్రస్తుతం నెల్లూరు కేంద్రంగా ఈ దిశగా చర్చలు సాగుతున్నాయి.
ఒకవేళ ఆయుష్ నివేదిక ఆలస్యం అయినా ''మందు వల్ల నష్టం లేదు'' అన్న మాట ఏదో ఒక పేరున్న సంస్థ నోటి నుంచి వస్తే, మందు పంపిణీ ప్రారంభించే యోచనలు నడుస్తున్నాయి.
ఇందుకోసం కృష్ణపట్నం సమీపంలోని ఒక కార్పొరేట్ సంస్థకు చెందిన పెద్ద ఖాళీ స్థలంలో ఏర్పాట్లు చేస్తారని, అందుకోసం మూలికల సేకరణ నడుస్తోందని స్థానికంగా రకరకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి.
అయితే ఇదే తరహాలో ఆయుష్ అనుమతి లేకుండా నాటు మందుగా పంపిణీ జరిగితే దానిపై కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నాయి ప్రజారోగ్యంపై పనిచేస్తోన్న కొన్ని సంస్థలు.
ఇమ్యూనిటీ బూస్టర్
ఆనందయ్య మందును ఇమ్యూనిటీ బూస్టర్‌గా పంచుతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
కానీ అది తేలిక కాదు.
ఇమ్యూనిటీ బూస్టర్ అని చెప్పాలన్నా కొన్ని పరిశోధనలు, అధ్యయనాలు జరగాలి.
కానీ అవేవీ ఈ మందు విషయంలో జరగలేదు.
తిరుమల దేవస్థానం పాత్ర
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒక ఆయుర్వేద కాలేజీ, ఆయుర్వేద ఫార్మసీ ఉన్నాయి.
ఇప్పటికే ఆనందయ్య మందుపై పరిశోధనల్లో కాలేజీ భాగస్వామి అయింది.
అయితే ఆయుర్వేద ఫార్మసీ ద్వారా ఆ మందును మరింత శుభ్రంగా, వేగంగా, పెద్ద ఎత్తున తయారు చేయగలమని ఆ ఫార్మసీ అధికారులు మీడియా ముందు ప్రకటించారు.
టీటీడీ బోర్డు సభ్యులు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డితో కలసి ఆయుర్వేద ఫార్మసీ అధికారులు కొందరు ఆనందయ్య బంధువులతో మాట్లాడారు, కృష్ణపట్నం సందర్శించారు.
ఒక దశలో తితిదే ఆ మందు తయారీ ప్రారంభించేసిందని, టాక్సిక్ స్టడీ కోసం తిరుపతిలో ఒక ప్రైవేటు ల్యాబ్‌తో మాట్లాడిందని వార్తలు వచ్చాయి.
ఆ దిశగా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి ఉత్సాహం చూపించారు. ఫార్మసీ అధికారులను వెంటబెట్టుకుని పలుచోట్లకు వెళ్లి పరిశీలించారు.
కానీ ఇదంతా చేయడానికి తితిదే ఆధ్వర్యంలోని ఆయుర్వేద సంస్థలకు అధికారికంగా అనుమతి లేదు.
అంతేకాదు శుక్రవారం నుంచి తితిదేలో ఆ హడావుడీ కనిపించలేదు.
దీంతో తితిదే ఏం చేస్తోంది అన్నది బయటకు రాలేదు. ఒకవేళ ఆయుర్వేద విభాగం అనుమతిస్తే ఆనందయ్య మందును పెద్ద ఎత్తున తయారు చేయడానికి తాము సిద్ధం అన్నంత వరకూ ఆ సంస్థ తమ సంసిద్ధత తెలియపరిచింది.
అయితే, ఆయుర్వేద విభాగం అనుమతి లేకపోయినా తితిదే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుందా అన్నది ప్రశ్న.
ఇదంతా ఒకవైపు జరుగుతుండగా ఫలానా రోజు నుంచి ఆనందయ్య మందు అందుబాటులోకి వస్తుంది అన్న వార్తలను ఖండిస్తూ ఆయన ఒక వీడియో విడుదల చేశారు.
మందుకు కావాల్సిన వస్తువులు అందుబాటులో లేవనీ, ప్రభుత్వ అనుమతి వచ్చే వరకూ తాను మందు తయారు చేయబోవడం లేదనీ ఆయన ఆ వీడియోలో చెప్పారు.
మూలికల కొరత
ఆనందయ్య మందుకు అనుమతుల కంటే పెద్ద సమస్య వేరే ఉంది. అదే ముడిసరుకు.
బెల్లం, మిరయాల వంటివి కొనవచ్చు. కానీ వివిధ రకాల ఆకులు, మొక్కలు, తీగలు కేజీల కొద్దీ దొరకడం అంత తేలిక కాదు. వాటిని గుర్తించే వారు కూడా చాలా తక్కువ మందే ఉంటారు.
''మా ఊరు నుంచి ఇందుకూరి పేట (నెల్లూరులో ఓ ప్రాంతం) వరకూ ఉన్న మొక్కలన్నీ తెచ్చేశాం. ఈ చుట్టుపక్కల అవి దొరకడం లేదు. ఇక బయట ఊళ్ల నుంచే తేవాలి'' అన్నారు కృష్ణపట్నం గ్రామస్తుడు సురేశ్.
ఇక ఈ మందు పంపిణీ కోరుతూ కోర్టులో దాఖలైన పిటిషన్‌పై సోమవారం విచారణ జరగనుంది.
ఇప్పుడు ఆనందయ్య మందు ముందున్న పెద్ద సమస్యలు
1. ఆ మందులు అసలు పనిచేస్తాయా లేదా అన్నది శాస్త్రీయంగా తేలడం. కానీ మెజార్టీ ప్రజలు దానిపై ఆసక్తిగా లేరు. శాస్త్రీయంగా తేలడం కంటే నలుగురూ చెబుతున్న మాటనే ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.
2. ఆ మందు వాడకం వల్ల నష్టం లేదని శాస్త్రీయంగా తేలడం. దీని విషయంలోనూ అంతే. ఇప్పటి వరకూ ఎవరికీ నష్టం జరగలేదు కదా అన్న ధోరణి ఆ మందును సమర్థించే వారిలో కనిపించింది.
3. ఆయుర్వేదం శాఖ వారు ఆలస్యం చేస్తే లేదా నాటు మందుగా మాత్రమే గుర్తిస్తే అప్పుడు పంపణీ చేస్తారా? అలా చేస్తే చట్టపరంగా ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతోంది? అక్కడకు నమ్మకంతో వచ్చే వారిని అదుపు చేసే పరిస్థితి ఉందా?
ఈ ప్రశ్నలకు సమాధానం తేలడానికి మరో నాలుగు రోజులు పట్టవచ్చు.
ఇవి కూడా చదవండి:
- బ్లాక్ ఫంగస్‌ను మహమ్మారిగా ప్రకటించాలని కేంద్రం రాష్ట్రాలకు ఎందుకు చెప్పింది
- ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం
- ప్రిన్సెస్ డయానా - మార్టిన్ బషీర్ ఇంటర్వ్యూ విషయంలో బీబీసీ తన తప్పులను కప్పిపుచ్చుకుందన్న లార్డ్ డైసన్ నివేదిక
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- కరోనావైరస్: గంగా నదిలో కుప్పలు తెప్పలుగా కొట్టుకొస్తున్న కోవిడ్ మృతదేహాలు
- కరోనావైరస్: గ్రామీణ ప్రాంతాలను కోవిడ్ కబళిస్తోందా.. సెకండ్ వేవ్ ఎందుకంత ప్రాణాంతకంగా మారింది
- ఇజ్రాయెల్-గాజా ఘర్షణలు: గూగుల్ మ్యాప్‌లో గాజా మసగ్గా ఎందుకు కనిపిస్తోంది? - BBC RealityCheck
- కోవిడ్: డిసెంబరు నాటికి భారత జనాభాకు సరిపడేలా వ్యాక్సీన్ తయారవుతుందా?
- భారత్‌కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్‌లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్‌వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)