You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ: జూనియర్ డాక్టర్ల సమ్మెతో కోవిడ్ చికిత్సలు మరింత కష్టమవుతాయా
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
తెలంగాణలో కోవిడ్ చికిత్స విషయంలో ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత ఒత్తిడి పడనుంది. చాలా కాలంగా నెరవేరని డిమాండ్ల కోసం తెలంగాణ జూనియర్ డాక్టర్లు కొన్ని విధుల బహిష్కరణకు పిలుపునిచ్చారు.
దీనికి సంబంధించి మే 10న జూనియర్ డాక్టర్ల సంఘం నోటీసులు ఇచ్చింది. ఈ విధుల బహిష్కరణ పిలుపు 26వ తేదీ అంటే.. బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది.
ఇందులో భాగంగా కోవిడ్, ఎమెర్జెన్సీ యేతర సేవలన్నింటినీ వారు బహిష్కరిస్తున్నారు. అలాగే కోవిడ్ చికిత్సలో కూడా కేవలం ఐసీయూ, క్రిటికల్ కేర్ తప్ప మిగతా విధులు బహిష్కరించారు.
అంటే, కోవిడ్ ఐసీయూ, కోవిడ్ క్రిటికల్ కేర్, ఇతర ఎమెర్జెన్సీలకు మాత్రమే జూనియర్ డాక్టర్లు సేవలు అందిస్తారు. మిగతా విధులకు వారు హాజరుకారు.
జూనియర్ డాక్టర్లు అంటే ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్ వంటివి కోర్సులు చదువుతున్న విద్యార్థులు.
వీరు చదువుతూనే, ఆయా ఆసుపత్రుల్లో వైద్యం అందిస్తారు. వీరికి ప్రభుత్వం కొంత పారితోషికం కూడా ఇస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రద్దీ దృష్ట్యా వీరి సేవలు అవసరం.
ఇక తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం కూడా ఇదే బాటలో ప్రకటన విడుదల చేసింది. 27వ తేదీ వరకూ కూడా తమ సమస్యలు పరిష్కారం కాకపోతే.. అప్పటి నుంచి కోవిడ్ ఎమెర్జెన్సీలు, ఐసీయూలు కూడా బహిష్కరించాల్సి వస్తుందని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు నరేశ్ ప్రకటించారు.
డిమాండ్లు ఇవీ...
జనవరి 2020 నుంచి పెండింగులో ఉన్న 15 శాతం పారితోషికం పెంచడం: దీన్ని గతేడాది పెంచాల్సి ఉంది. కానీ పెరగలేదు. అప్పటి విద్యార్థులకు మరికొన్ని నెలల్లో వారి చదువు కూడా పూర్తవుతుంది. అయినా ఇంకా అందలేదు. అయితే ఇదే అంశంపై ఇటీవల ట్విట్టర్లో కేటీఆర్ స్పందించారు.
‘‘ఆయన ఆ పెరుగుదల జనవరి 2021 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. మాకు రావాల్సింది 2020 నుంచి’’ అని చెప్పారు జూనియర్ డాక్టర్ల సంఘం అధ్యక్షులు డాక్టర్ నవీన్.
వైద్యులకు 10 శాతం ఇన్సెంటివ్: మొదటి వేవ్ సమయంలోనే కేసీఆర్ ప్రతికా ముఖంగా ఈ హామీ ఇచ్చారు. కానీ అది ఇంకా అమలు చేయలేదు.
వైద్యులకు నిమ్స్‌లో చికిత్స: కోవిడ్ చికిత్స అందిస్తోన్న డాక్టర్లు, ఇతర హెల్త్ వర్కర్లకు, వారి కుటుంబ సభ్యులకు కోవిడ్ సోకితే నిమ్స్‌లో చికిత్స అందిస్తామంది ప్రభుత్వం.
కానీ దానికి ఉత్తర్వులు రాలేదు. నిమ్స్‌లో తమ వారికి బెడ్లు దొరకడం లేదని డాక్టర్లు వాపోతున్నారు. అంతే కాకుండా, వారికి 2005 నాటి జీవో నంబర్ 74 ప్రకారం ఇన్సూరెన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
కోవిడ్ మృతుల కుటుంబాలకు పరిహారం: కోవిడ్ విధులు నిర్వహిస్తూ మరణించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా పరిహారం ఇవ్వాలని జూ.డా.లు డిమాండ్ చేస్తున్నారు.
కానీ ఇప్పటి వరకూ దీనిపై ఉత్తర్వులు రాలేదు. డాక్టర్ల కుటుంబాలకు రూ.50 లక్షలు, నర్సుల కుటుంబాలకు రూ.25 లక్షలు పరిహారం ఇస్తామని అప్పట్లో కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వ వైద్య విద్య సంచాలకులు ఇప్పటికే కొన్ని ఉత్తర్వులు ఇచ్చారు. మెడికల్ కాలేజీ ఆసుపత్రులు, అనుబంధ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, డైరెక్టుర్లూ ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
పేషెంట్లకు ఇబ్బంది కలగకుండా డాక్టర్ల డ్యూటీ షెడ్యూల్ మార్చాలని సూచించారు. అలాగే డాక్టర్లెవ్వరికీ సెలవులు ఇవ్వవద్దనీ, జూనియర్ డాక్టర్లు అటెండెన్సును ఎప్పటికప్పుడు తమకు పంపాలనీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
- "నేను కరోనా వ్యాక్సీన్ రెండు డోసులూ వేసుకున్నాను. అయినా, కోవిడ్ వచ్చింది" - ఒక డాక్టర్ అనుభవం
- ప్రధాని మోదీ కోవిడ్ నియంత్రణ కన్నా విమర్శలను అణచివేయడం పైనే దృష్టి పెట్టారు -'లాన్సెట్' మెడికల్ జర్నల్ విమర్శ
- భారత్‌లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- అఫ్గానిస్తాన్ నుంచి ప్రాణభయంతో పారిపోవడం నుంచి ఒలింపిక్స్‌లో కరాటే పోటీల్లో పాల్గొనే దాకా...
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- కరోనా వైరస్: పిల్లల్లో సులభంగా, వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వేరియంట్
- మహిళలు మితిమీరి వ్యాయామం చేస్తే సంతానోత్పత్తి సమస్యలు తప్పవా?
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- కుంభమేళాను మీడియా ఎలా చూపిస్తోంది... తబ్లీగీ జమాత్ విషయంలో ఏం చేసింది?
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- అఫ్గానిస్తాన్‌లో 20 ఏళ్లుగా ఉన్న అమెరికా-బ్రిటన్ సేనలు ఏం సాధించాయి?
- కరోనా వైరస్ సర్వే: మన శరీరంలో యాంటీబాడీస్ ఉంటే వైరస్ మళ్లీ సోకదా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)