You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం: 'ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం రాజ్యాంగ విరుద్ధం'
తెలంగాణ సరిహద్దుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న కోవిడ్ పేషెంట్ల అంబులెన్స్‌లను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అంబులెన్స్‌లను అడ్డుకోవడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నేతృత్వంలోని ధర్మాసనం, దేశంలో ఎవరైనా ఎక్కడికైనా వెళ్లవచ్చనని, తమ ప్రాణాలు కాపాడుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని వ్యాఖ్యానించింది.
తెలంగాణ ప్రభుత్వ చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో దాఖలైన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి, తన వాదనలు వినిపించింది.
తమ రాష్ట్రానికి ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున కోవిడ్ పేషెంట్లు వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు.
అయితే, వేరే రాష్ట్రానికి చెందినవారన్న కారణంతో వారికోసం ప్రత్యేకంగా ఆంక్షలు,నియంత్రణలు విధించడం రాజ్యాంగ విరుద్ధమని, ఏ చట్టం కింద కూడా అలాంటి నియంత్రణలు విధించకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
వైద్యపరంగా మౌలిక సదుపాయాలు రాష్ట్రాలతో సంబంధం లేకుండా ఏర్పాటైనవని, ఇవి జాతి మొత్తానికి సంబంధించిన ఆస్తులని న్యాయస్థానం పేర్కొంది.
పేషెంట్లను అడ్డుకోవద్దంటూ తాము ఇంతకు ముందు ఆదేశాలు ఇచ్చామని, వాటికి విరుద్దంగా హాస్పిటల్ అడ్మిషన్ ఉంటేనే తెలంగాణలోని అనుమతిస్తామంటూ సర్క్యులర్ ఎలా జారీ చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది.
భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి సర్క్యులర్‌ను జారీ చేయలేదని వ్యాఖ్యానించింది.
విజయవాడ హైదరాబాద్ మార్గం నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందని, దీనిని వాడుకునే అధికారం అందరికీ ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అంబులెన్స్‌లను ఆపడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కులేదని తేల్చి చెప్పింది.
హాస్పిటల్ అడ్మిషన్ ఉంటేనే తెలంగాణలోకి అంబులెన్స్‌లను అనుమతిస్తామన్న ప్రభుత్వ సర్క్యులర్‌ను తాత్కాలికంగా పక్కనబెట్టిన తెలంగాణ హైకోర్టు, తదుపరి విచారణను ఈ జూన్ 17కు వాయిదా వేసింది.
అసలేం జరిగింది?
అంతకు ముందు, పొరుగు రాష్ట్రాల నుంచి అంబులెన్సులలో వస్తున్న కోవిడ్ రోగులను సరిహద్దుల్లో ఆపేయడం అమానుషమని, తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించినా ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతోందని రోగులు, వారి బంధువులు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దుల్లో పదుల సంఖ్యలో అంబులెన్సులను తెలంగాణ పోలీసులు అడ్డుకుని తిప్పి పంపిస్తున్నారని కొందరు బాధితులు చెప్పినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
హైదరాబాద్‌లోని ఆసుపత్రులలో బెడ్ కేటాయించినట్లు అనుమతి పత్రం, తెలంగాణ ఈ-పాస్ ఉంటేనే వెళ్లనిస్తున్నారని కొందరు బాధితులు ఆరోపించారు..
మహబూబ్‌నగర్ సరిహద్దుల్లోని పుల్లూరు చెక్‌పోస్ట్, సూర్యాపేట సరిహద్దుల్లోని రామాపురం క్రాస్ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో అంబులెన్సులు ఆగిపోయినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి.
తెలంగాణ సర్కారు మానవత దృక్పథంలో వ్యవహరించాలి-విపక్షాలు
తెలంగాణ ప్రభుత్వం మానవతా ధృక్పథంతో అత్యవసరంగా పరిగణించి కోవిడ్ పేషెంట్ల అంబులెన్సులను అనుమతించాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు.
ఆరోగ్య పరిస్థితి విషమించిన వారికి మెరుగైన వైద్యం కోసం మాత్రమే హైదరాబాద్ తరలిస్తారని, గోల్డెన్ అవర్స్‌లోగా వారు ఆస్పత్రికి చేరగలిగితే కొన ఊపిరితో ఉన్న ప్రాణాలు నిలబడతాయని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మంత్రులకు కోవిడ్ వస్తే ఆగమేఘాల మీద హైదరబాద్ తరలిస్తున్నారని, సామాన్యులకు తెలంగాణలో ప్రవేశించేందుకు వైసీపీ ప్రభుత్వం అనుమతులు కూడా సంపాదించ లేకపోతోందని లోకేశ్ విమర్శించారు.
విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ పై సంపూర్ణ హక్కులు ఉన్నాయని, కేసీఆర్ వైఖరి హైకోర్టు తీర్పు ధిక్కరణ కింద వస్తుందని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు స్పష్టం చేశారు.
అంబులెన్స్ నిలుపుదలతో రెండు నిండు ప్రాణాలు పోయాయని, దీనికి కేసీఆర్ నే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాస్తామని సోము వీర్రాజు తెలిపారు.
ఏపీ నుంచి వెళ్తున్న అంబులెన్సులను ఆపడం అమానుషమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ వ్యాఖ్యానించారు. విభజన చట్టం ప్రకారం కూడా హైదరాబాద్‌పై ఆంధ్రప్రదేశ్‌కు హక్కులున్నాయని.. ఆ రకంగా కాకపోయినా చావు బతుకుల్లో ఉన్న రోగులను అడ్డుకోవడం సరికాదని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- భారత్ సాయం లేకుండా ప్రపంచ కోవిడ్ వ్యాక్సీన్ కల నెరవేరదు... ఎందుకంటే...
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)