‘సెంట్రల్ విస్టా’ కేసును తక్షణం విచారించాలంటూ దిల్లీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు.. కోవిడ్ విజృంభిస్తున్నా పనులు ఎందుకు కొనసాగిస్తున్నారు

    • రచయిత, రాఘవేంద్ర రావ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న సమయంలోనూ మోదీ ప్రభుత్వం సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ నిర్మాణ పనులు కొనసాగిస్తుండడాన్ని సవాల్ చేస్తూ ఆన్య మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్‌ను దిల్లీ హైకోర్టు సత్వరమే విచారణకు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పనులను ఆపాలని ఆన్య మల్హోత్రా మే 4న దిల్లీ హైకోర్టులో పిటిషన్ వేయగా కోర్టు మే 17కి విచారణ వాయిదా వేసింది.

దీంతో.. ఈ అంశంపై సత్వర విచారణ జరగాలని ఆన్య మల్హోత్రా తరఫు లాయర్ సిద్దార్థ్ లూథ్రా సుప్రీంకోర్టును బుధవారం కోరారు. సుప్రీంకోర్టు శుక్రవారం ఈ కేసును విచారణకు స్వీకరించింది.

మనుషుల ప్రాణాలను కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉందని న్యాయవాది లూథ్రా ఈ సందర్భంగా అన్నారు.

"ఇది విచారించదగిన అంశం కాగా మనం కేవలం 3-4 కిలోమీటర్ల విస్తీర్ణం గురించి మాత్రమే పట్టించుకుంటున్నాం" అని లూథ్రా అన్నారు.

"ఒక వైపు దేశంలో వైద్య రంగ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండగా, మనం పరిమితమైన అంశంపై మాత్రమే దృష్టి పెట్టాం.

దేశంలో వైద్య అత్యవసర పరిస్థితి కొనసాగుతుండగా సెంట్రల్ విస్టా నిర్మాణ పనులు ఎలా కొనసాగుతాయని ప్రశ్నించారు. నిర్మాణ కార్మికులు హెల్త్ క్యాంపుల్లో ఉండటంతో పాటు పరిస్థితులు కూడా దారుణంగా ఉన్నాయి" అని అన్నారు.

"మనం ఒక విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. నా ప్రార్ధనలు వినకుండానే దిల్లీ హైకోర్టు కేసు విచారణను మే 17కు వాయిదా వేసింది.

మనం ప్రస్తుతం మానవ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. ఈ నిర్మాణ పనులను ఒక 3-4 వారాల పాటు వాయిదా వేస్తే ప్రయోజనం ఉంటుంది" అని లూథ్రా అన్నారు.

ప్రస్తుతం వైద్య అత్యవసర పరిస్థితి ఉండటంతో ఈ విషయాన్ని దిల్లీ హై కోర్టు మే 10న విచారించాలని జస్టిస్ వినీత్ శరణ్ , జస్టిస్ దినేష్ మహేశ్వరీతో కూడిన ధర్మాసనానికి లూథ్రా విన్నవించారు.

దీంతో... దిల్లీ హైకోర్టు ఈ అభ్యర్ధనను సత్వరమే విచారణలోకి తీసుకుని ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది.

నిర్విరామంగా సాగుతున్న పనులు

ఆక్సిజన్ లేదు, బెడ్స్ లేవు, దేశ రాజధానిలో ప్రజలు మరణిస్తున్నారనే వార్తల మధ్య దిల్లీలో బీజేపీ ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ పనులు మాత్రం నిర్విరామంగా కొనసాగుతున్నాయి.

నగరం నడి బొడ్డున రూ. 20 వేల కోట్లకు పైగా వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును "అత్యవసర సేవ"గా ప్రకటించారు. దిల్లీలో లాక్‌డౌన్ ఉన్నప్పటికీ ఈ ప్రాజెక్టులో కార్మికులు పని చేస్తూనే ఉన్నారు.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కింద కొత్త పార్లమెంట్ భవనం, కొత్త సచివాలయంతో రాజ్‌పథ్ మొత్తాన్ని పునరుద్ధరిస్తున్నారు.

దిల్లీలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ ప్రకటించినప్పటికీ ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగుతున్నాయి. దిల్లీ పోలీసులు ఇందుకు అనుమతించారు.

ఈ అంశంపై బీబీసీ దిల్లీ పోలీసులతో మాట్లాడడానికి ప్రయత్నించింది.

ఈ సమయంలో సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అత్యవసరం ఎలా అయిందో తెలుసుకునే ప్రయత్నాలు చేసింది.

ఇదే ప్రశ్న అడుగుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి, పట్టణాభివృద్ధి కార్యదర్శికి బీబీసీ ఈమెయిల్స్ పంపింది. వారి నుంచి ఇంతవరకూ ఏ జవాబూ రాలేదు. వచ్చిన తరువాత ఈ కథనాన్ని అప్డేట్ చేస్తాం.

పోలీసులు, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ వాదనలు

"జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఏ) ఉత్తర్వుల ప్రకారం ఆన్-సైట్ నిర్మాణ కార్యకలాపాలకు అనుమతి ఉంది. ఇందులో మేం చేయగలిగిందేం లేదు. డీడీఎంఏ అనుమతిస్తోంది. బయటి నుంచి వచ్చే కార్మికులకు మాత్రం ప్రవేశం లేదు" అని ఒక సీనియర్ పోలీసు అధికారి బీబీసీకి చెప్పారు.

ఆన్-సైట్ అయితే, కార్మికులు రావడానికి, పోవడానికి పోలీసుల అనుమతి ఎందుకు అడిగారు? అని మేము ఆయన్ని అడిగాం.

"మా అవగాహన ప్రకారం కార్మికులు అక్కడే ఉంటారు. సామాగ్రి వస్తూ పోతూ ఉంటుంది" అని ఆ అధికారి చెప్పారు.

సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ అదనపు డైరెక్టర్ జనరల్ పీఎస్ చౌహాన్ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

ఈ ప్రాజెక్ట్ "అత్యవసర సేవ" ఎలా అయిందని బీబీసీ వారిని ప్రశ్నించింది.

"సైట్‌లో కార్మికులు అందుబాటులో ఉంటే నిర్మాణ పనులు కొనసాగించవచ్చు. అక్కడ పరిమిత సంఖ్యలో కార్మికులు పని చేస్తున్నారు. బయట నుంచి కార్మికులకు అనుమతి లేదు. కాంక్రీట్‌లాంటి నిర్మాణ సామాగ్రిని తరలించేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నాం" అని చౌహాన్ వివరించారు.

ఎంతమంది ఆన్-సైట్‌లో పని చేస్తున్నారని అడిగితే, దీని గురించి తన వద్ద వివరాలు లేవని, ఈ విషయంపై తనకు మాట్లాడే అధికారం లేదని ఆయన అన్నారు.

ఇది అత్యవసర సేవా? లేక ఆడంబరమా?

సెంట్రల్ విస్టా ప్రాజెక్టును మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న ప్రముఖ ఆర్కిటెక్ట్ నారాయణ మూర్తితో బీబీసీ మాట్లాడింది.

"దీన్ని అత్యవసర సేవగా ఎవరు గుర్తించారో వారే దీనికి సమాధానం చెప్పాలి. ఇందులో అంత అత్యవసరం ఏమీ లేదు. ప్రస్తుతం ముఖ్యమైన, అత్యవసరమైన పనులు వేరే ఉన్నాయి"

కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా ఈ ప్రాజెక్ట్ పనులు కొనసాగిస్తున్నారు. దీన్లో పనిచేయడానికి వందలాది మంది కార్మికులను రద్దీగా ఉండే బస్సుల్లో తీసుకువస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రజా వ్యతిరేక విధానంలో మొదలైందో, అదే పద్ధతిలో ఇప్పటికీ నడుస్తోంది" అని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న విమర్శలపై కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురీ గతంలో అనేకమార్లు స్పందించారు.

ఈ ఏడాది ప్రారంభంలో ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, "ఈ కొత్త భవనం భారతదేశ ఆకాంక్షలను ప్రతిబించిస్తుంది. ప్రస్తుతం ఉన్నది 93 సంవత్సరాల పురాతన భవనం. దీన్ని భారతదేశంలో ఎన్నికైన ప్రభుత్వం నిర్మించలేదు. దీన్ని వలస పాలనలో నిర్మించారు" అని అన్నారు.

ఆర్కిటెక్ట్, అర్బల్ ప్లానర్, కంజర్వేషన్ కన్సల్టంట్ ఏజీ కృష్ణ మీనన్ కూడా ఇది అనవసరమైన ప్రాజెక్ట్ అని మొదటి నుంచీ చెబుతూ ఉన్నారు.

"రెండు సంవత్సరాల నుంచీ ఇది అనవసరమని మేము చెప్తూనే ఉన్నాం. ఇది కేవలం షో ఆఫ్ ప్రాజెక్ట్. ప్రజాస్వామ్యం పేరిట ఇలాంటివన్నీ జరుగుతున్నాయి.

కరోనా మహమ్మారి సమయంలో విదేశాల నుంచి ఎంత సహాయం అందుతోంది అనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. దేశంలో ఇంత డబ్బు ఉన్నప్పుడు విదేశాల నుంచి సహాయం తీసుకోవలసిన అవసరం ఏంటి?" అని మీనన్ ప్రశ్నిస్తున్నారు.

"ఈ సమయంలో ఈ ప్రాజెక్ట్‌ను అత్యవసర సేవగా గుర్తించడం సిగ్గుచేటు. ఓ పక్క ఆక్సిజన్ లేక ఆస్పత్రుల్లో జనం ప్రాణాలు పోగొట్టుకుంటుంటే, ఈ ఆడంబరమైన ప్రాజెక్ట్‌ను అత్యవసర సేవగా గుర్తిస్తున్నారు" అని ఆయన విమర్శించారు.

పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ మాజీ సెక్రటరీ మీనా గుప్తా కూడా ఈ ప్రాజెక్ట్ కొనసాగించడం సరి కాదని అంటున్నారు.

"దీన్ని అత్యవసర సేవగా గుర్తించాల్సిన అవసరం ఏముంది? కోవిడ్‌తో పోరాటానికి విదేశాల నుంచి సహాయం తీసుకుంటున్నారు. ఈ సమయంలో ఈ ప్రాజెక్ట్‌కు ఏం తొందరొచ్చింది? విదేశాల నుంచి, దేశీయంగా కూడా ప్రజలు డబ్బు పంపుతున్నారు. కానీ మీరు మాత్రం ఇలాంటి అనవసరమైన ప్రాజెక్ట్‌పై ఖర్చు ఆపలేకపోతున్నారు.

దేశంలో ప్రజలకు టీకా కొనుక్కోవాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? సెంట్రల్ విస్టా అభివృద్ధికి ప్రభుత్వం 20 వేల కోట్లకు పైగా ఎందుకు ఖర్చు చేయాలి?

మహమ్మారి వ్యాప్తి నియంత్రణలోకి వచ్చేవరకు, ఓ రెండు మూడేళ్లు ఈ ప్రాజెక్ట్‌ను వాయిదా వేసి, ఆ డబ్బును ప్రజారోగ్యం కోసం వినియోగించవచ్చు" అని ఆమె అన్నారు.

ఫిబ్రవరిలో హర్దీప్ సింగ్ ఈ ప్రాజెక్ట్‌పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ, "సెంట్రల్ విస్టా ఆధునిక భారతదేశానికి చిహ్నంగా నిలుస్తుంది. కొంతమందికి దాని ప్రాముఖ్యత అర్థం కావట్లేదు. వీళ్లంతా దేశం అభివృద్ధి చెందుతుంటే చూడలేరు" అని అన్నారు.

అసలు ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఏంటి?

దేశ రాజధాని దిల్లీలో ఇండియా గేట్ నుంచి రాష్ట్రపతి భవనం వరకూ ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం తలపెట్టిన ప్రాజెక్ట్ పేరే 'సెంట్రల్ విస్టా'. దీని వ్యయం దాదాపు రూ. 20,000 కోట్లుగా చెప్తున్నారు.

రైసినా హిల్ల్స్‌పై ఉన్న పాత భవనాలను మెరుగుపరచడం, పాత పార్లమెంట్ హౌస్‌ను పునరుద్ధరించడం, ఎంపీల అవసరాలకు అనుగుణంగా కొత్త స్థలాలను కేటాయించడం దీని లక్ష్యం.

సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ కోసం గుజరాత్‌కు చెందిన ఆర్కిటెక్చర్ సంస్థ హెచ్‌సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ ప్లాన్ అందించింది.

ఈ ప్లాన్‌లో ఒక కొత్త త్రిభుజాకారపు పార్లమెంట్ భవనం, ఒక కామన్ సెంట్రల్ సెక్రటేరియట్, రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకూ ఉండే మూడు కిలోమీటర్ల రాజ్‌పథ్‌ను పునరుద్ధరించడం ఉంది.

కొత్త పార్లమెంట్ భవనంలో భారత ప్రజాస్వామ్య సంస్కృతిని ప్రదర్శించేలా ఒక భారీ హాల్, ఎంపీల కోసం ఒక లాంజ్, ఒక లైబ్రరీ, కమిటీ గదులు, డైనింగ్ హాళ్లు, పార్కింగ్ ప్లేసులు ఉంటాయి.

సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా ప్రధాని నివాసం, కార్యాలయాన్ని కూడా సౌత్ బ్లాక్‌కు దగ్గరకు, ఉపరాష్ట్రపతి కొత్త నివాసాన్ని నార్త్ బ్లాక్ సమీపంలోకి తరలించే అవకాశం ఉంది.

ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు విదేశీయులు వస్తూ ఉంటారని, ప్రపంచ స్థాయి పర్యటక స్థలంగా మార్చేందుకు ఈ ప్రాంతాన్ని మరింత అందంగా రూపొందించాల్సిన అవసరం ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)