చోరీ చేసిన డబ్బును చూసి దొంగకు గుండెపోటు-ప్రెస్‌ రివ్యూ

దొంగిలించిన డబ్బును చూసి దొంగకు గుండెపోటు

ఊహించిన దానికంటే అధికంగా దోచుకున్నాననే సంతోషంలో ఓ దొంగకు ఏకంగా గుండెపోటు వచ్చి, ఆసుపత్రి పాలయ్యాడని సాక్షి పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని బిజ్నోర్‌కు చెందిన ఓ దొంగ మరొక వ్యక్తితో కలిసి గత నెల 16, 17 తేదీలలో ఓ పబ్లిక్‌ సర్వీస్‌ సెంటర్‌లో చోరి చేశాడు.

చోరీ చేసిన డబ్బును పంచుకుందామని భావించి ఇద్దరూ కలిసి ఆ డబ్బును లెక్కించారు. మొత్తం ఏడు లక్షల రూపాయలు తాము చోరీ చేసినట్లు గుర్తించారు.

అయితే అనకున్న దానికంటే ఎక్కువే చోరీ చేశామనే ఆనందంలో అందులోని ఒక దొంగకు గుండెపోటు వచ్చింది. దీంతో మరో దొంగ అతడిని ఆస్పత్రిలో చేర్చాడు.

ఈ దొంగతనం జరిగిన తర్వాత పబ్లిక్‌ సర్వీస్‌ సెంటర్‌ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వీరి కోసం గాలింపు మొదలుపెట్టిన పోలీసులు రెండు రోజుల క్రితం ఇద్దరినీ పట్టుకున్నారు.

దోచుకున్న సొమ్ము గురించి ఆరా తీయగా ఈ వ్యవహారమంతా బైటికి వచ్చినట్లు సాక్షి పత్రిక కథనం పేర్కొంది.

ఎంపీ కవిత ఇంట్లో లంచాలు తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తులు

తెలంగాణ రాష్ట్ర సమితి మహబూబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత దిల్లీ అధికార నివాసంలో ముడుపులు తీసుకుంటూ ముగ్గురు వ్యక్తులు సీబీఐకి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఆంధ్రజ్యోతి పత్రికలో ఒక కథనం ఇచ్చింది.

సీబీఐ అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం రాజీబ్ భట్టాచార్య, శుభాంగిగుప్తా, దుర్గేష్‌ కుమార్‌ అనే ముగ్గురు వ్యక్తులు దిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పైరవీల కోసం ఓ వ్యక్తి నుంచి ముడుపులు డిమాండ్‌ చేశారు.

సర్దార్‌ నగర్‌లోని ఓ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయకుండా అధికారుల నుంచి కాపాడతామని వారు యజమాని మన్మిత్‌ సింగ్‌ లాంబాను సంప్రదించారు. ఇందు కోసం రూ.5 లక్షలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేశారు. దీంతో లాంబా సీబీఐని ఆశ్రయించారు.

తనకు తొలుత రాజీవ్‌ భట్టాచార్య ఫోన్‌ చేసి ఎంపీ మాలోతు కవిత పీఏగా పరిచయం చేసుకున్నారని బాధితుడు సీబీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత శుభాంగీ గుప్తా అనే మహిళ రంగంలోకి దిగిందని చెప్పారు.

ఆ తర్వాత వీరంతా రూ.లక్షకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎంపీ కవిత డ్రైవర్‌ దుర్గేశ్‌కుమార్‌ కూడా వీరితో కలిసి ఉన్నాడని మన్మిత్‌సింగ్‌ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

బీడీ మార్గ్‌లోని సరస్వతి అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ నంబర్‌-401కు డబ్బు తీసుకురావాలని ఫిర్యాదుదారుడికి రాజీవ్‌ భట్టాచార్య సూచించారు. వలపన్నిన సీబీఐ అధికారులు, డబ్బులు తీసుకుంటుండగా రాజీవ్‌ భట్టాచార్య, శుభాంగి గుప్తాలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వారితో పాటు ఉన్న దుర్గేశ్‌ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. అరెస్టైన ఇద్దరూ తాము ఎంపీ కవిత పీఏలుగా చెప్పుకున్నారని, దర్యాప్తులో నిజాలు తెలుస్తాయని సీబీఐ అధికారులు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.

ఈ వ్యవహారంపై స్పందించిన ఎంపీ కవిత, తనకు దిల్లీలో వ్యక్తిగత కార్యదర్శులు ఎవరూ లేరని స్పష్టం చేసినట్లు ఆంధ్రజ్యోతి కథనం వెల్లడించింది.

తెలంగాణలో మాత్రమే ప్రభుత్వం కేటాయించిన పీఏలు, మహబూబాబాద్‌ క్యాంపు కార్యాలయంలో ఒక ప్రైవేటు పీఏ ఉన్నారని ఆమె చెప్పినట్లు ఈ కథనం తెలిపింది.

దిల్లీలోని తన అధికార నివాసాన్ని రెండు నెలల క్రితమే కేటాయించారని, దుర్గేశ్‌ అనే డ్రైవర్‌ను ఇటీవలే నియమించుకున్నానని, అతనికి సర్వెంట్‌ క్వార్టర్‌ కూడా ఇచ్చానని చెప్పిన ఆమె నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీబీఐని కోరినట్లు ఈ కథనం పేర్కొంది.

పరిషత్ ఎన్నిలకు టీడీపీ దూరం...నేటి పొలిట్‌ బ్యూరోలో కీలక నిర్ణయం!

ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు దూరంగా ఉండాలని పార్టీ అగ్రనాయకత్వం ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయని ఈనాడు పత్రిక ఒక కథనం ఇచ్చింది.

ఈ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేనందున బహిష్కరించాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు టీడీపీ వర్గాలు వెల్లడించినట్లు ఈ కథనం పేర్కొంది.

శుక్రవారం టీడీపీ పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారని, పరిషత్‌ ఎన్నికల్ని బహిష్కరించే అంశంపై సమావేశంలో చర్చించాక తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోందని ఈ కథనం వెల్లడించింది.

ఈ ఎన్నికలను మళ్లీ మొదటి నుంచీ నిర్వహించాలని, కొత్తగా నోటిఫికేషన్‌ ఇవ్వాలని కోరుతూ గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నికి టీడీపీ లేఖ అందజేసింది. 2014తో పోలిస్తే 2020లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అసాధారణంగా పెరిగిన విషయాన్ని లేఖలో ప్రస్తావించింది.

అయితే ఎస్‌ఈసీ తమ విజ్ఞప్తిని పట్టించుకోకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రక్రియ గతంలో ఎక్కడ నిలిచిపోయిందో అక్కడి నుంచే కొనసాగించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేశారని, దీనికి నిరసనగా ఎన్నికల్ని బహిష్కరించాలని యోచిస్తున్నట్లు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయని ఈ కథనం వెల్లడించింది.

"జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల సమయంలోనే అనేక అక్రమాలు జరిగాయి. మా అభ్యర్థుల్లో చాలా మందిని నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా జరగనప్పుడు వాటిలో పాల్గొని ప్రయోజనం లేదు. అందుకే ఎన్నికలకు దూరంగా ఉండాలని భావిస్తున్నాం" అని టీడీపీ సీనియర్‌ నేత ఒకరు తెలిపినట్లు ఈనాడు కథనం పేర్కొంది.

తెలంగాణలో లాక్‌డౌన్‌ విధించం-స్పష్టం చేసిన ప్రభుత్వం

రాష్ట్రంలో ఎలాంటి లాక్‌డౌన్‌ విధించడం లేదని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ పత్రిక ఒక కథనం ఇచ్చింది.

తెలంగాణలో ఈ నెల 30 వరకు సాయంత్రం ఆరు గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల వరకు అన్ని రకాల షాపులు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్టు గురువారం ప్రచారం జరిగింది.

ఇందుకు సంబంధించి ఒక ఫేక్‌ జీవో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీనిపై స్పందించిన సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, అది ఫేక్‌ జీవో అని స్పష్టం చేశారు. లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని తెలిపారు.

ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని ప్రజలను కోరిన ఆయన, రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధించే ఆలోచన ఏమీ లేదని మరోసారి స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ పత్రిక కథనం పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)