'రంగ్ దే' సినిమా రివ్యూ: నితిన్, కీర్తి సురేశ్‌ల కెమిస్ట్రీ వర్కవుట్ అయిందా?

    • రచయిత, శతపత్ర మంజరి
    • హోదా, బీబీసీ కోసం

జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుపోగల నటులలో ఒకరిగా గుర్తింపు పొందిన నితిన్ సంవత్సరారంభంలోనే 'చెక్'సినిమాతో తన సక్సెస్‌కి చెక్ పెట్టుకున్న సంగతి విదితమే.

ఇక ప్రయోగాలు పనికిరావని అర్థంచేసుకునో లేదా అచ్చొచ్చిన జోనర్ అనో తరువాతి సినిమా "రంగ్ దే"పేరుతో రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని ఎంచుకున్నాడు.

ఈ సినిమాకు నితిన్ లవర్ బాయ్ ఇమేజ్‌తో పాటు, మహానటి వంటి సినిమాతో విమర్శకులను మెప్పించిన కీర్తి సురేష్ ప్రధానమైన బలం.

నితిన్, కీర్తి సురేష్‌ల కెమిస్ట్రీ, బ్యూటిఫుల్ ఫ్రేమింగ్, ఆకట్టుకునే సంగీతం, కలర్‌ఫుల్ సినిమాటోగ్రఫీలతో రంగ్ దే ప్రేక్షకులను మెప్పించిందో లేదో తెలియాలంటే...

అనగనగా అర్జున్ (నితిన్) అనే ఐదేళ్ల కుర్రవాడుంటాడు.

అతడు ఉండే కాలనీలోకి అను (కీర్తి సురేష్)అనే నాలుగేళ్ల అమ్మాయి వస్తుంది..

అర్జున్ చదువులో బిలో యావరేజు, అను టాపర్.

అర్జున్‌కు అను తల్లి (రోహిణి)సపోర్టు.

అస్తమానం అనుని చూసి నేర్చుకో అనే ఊతపదంతో అర్జున్ తండ్రి (నరేష్) సమయం దొరికితే చాలు గిల్లికజ్జాలు ,చాడీలు, టామ్ అండ్ జెర్రీ పోట్లాటలు.

ఇదిలా సాగుతుండగా అనుకు ఏం నచ్చుతుందో ఎంత బుర్ర గొక్కున్నా అర్థం కాని విధంగా అర్జున్‌పై ప్రేమ చిగురిస్తుంది.

అర్జున్ మాత్రం తన కమర్షియల్ ఫ్లోలో అనుపై అయిష్టంగానే ఉంటాడు.

ఇంతలో ఇంటర్వెల్ మలుపులో భాగంగా అర్జున్, అనూల పెళ్లి జరుగుతుంది.

ఆ తరువాత ఆ దంపతులిద్దరు ఉన్నత చదువుల కోసం జీమాట్ రాసి దుబాయ్ వెళ్తారు. ఇక అక్కడి నుండి మెయిన్ కథలోకి వెళ్ళే ముందు...

కథ వింటుంటే ఓ నాలుగైదు సినిమాలు చప్పున గుర్తుకు వస్తున్నాయా?

అలా గుర్తుకు రావడంలో ప్రేక్షకుల తప్పు లేదు. సినిమా కథ అలాంటిది.

ఇరవై సంవత్సరాల క్రితం వచ్చిన నువ్వే కావాలి, ఆనందం, నువ్వు లేక నేను లేను మొదలు మొన్నామధ్య వచ్చిన నేను శైలజ వరకు వరసబెట్టి సీనుకు ఒక సినిమా గుర్తుకు వస్తుంటుంది.

మామూలుగా కొత్త సీసాలో పాత సరుకు అనేది నానుడి. కాకపోతే ఇక్కడ సీసా కూడా పాతదే అవ్వడం ట్రాజెడీ.

సింగిల్ పేరెంట్ గా ఎంతో పరిణతి చూపించే తల్లి రోహిణి పాత్ర, కూతురు మాత్రం తను చెప్పినట్లే వినాలని, జీమాట్ టాప్ స్కోరర్ అయిన కూతురుకి ఇష్టం లేని పెళ్లి చేయాలనుకోవడం అంతా కన్విన్జింగ్ గా అనిపించదు.

ఇక శోభనం గదిలో ఉన్న కోడలితో నువ్వు లీడ్ రోల్ తీసుకోమనే మామగారు ఎంత సరిపెట్టుకుందామన్నా మింగుడు పడడు.

అదీ కాక నితిన్ పెర్ఫార్మన్స్ చూసాక జీమాట్ ఎగ్జామ్ రాయడం ఇంత సులువైన విషయమా అనిపించకమానదు.

అయితే ఎంత వరస్ట్ క్యారెక్టర్ అయినా ఏదో ఒకదాంట్లో టాలెంట్ చూపిస్తాడు అనేది సినిమా మెయిన్ థీమ్

అయితే ఒకమ్మాయిని తల్లిని చేయడమే లక్ష్యంగా అర్జున్ పాత్ర... అలాగే అమ్మాయి ఎంత టాలెంటెడ్ అయినప్పటికీ ఒక అబ్బాయిని మెప్పించి, ఒప్పించి.. రెండు కుదరకపోతే బెదిరించి పెళ్లి చేసుకోవడమే అంతిమ లక్ష్యంగా అను పాత్రల ద్వారా నిరూపించుకున్నాడా దర్శకుడు అన్న అనుమానం రాకమానదు.

నితిన్, కీర్తి సురేష్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదినప్పటికీ, ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్, సినిమాటోగ్రాఫర్... కలిసి వచ్చినప్పటికీ ప్రేక్షకులను మెప్పించాలంటే ఇంకేదో కావాలని నిరూపిస్తున్నట్లుగా ఉంటుందీ సినిమా. అనివార్యంగా దాని పేరే కథ, ఆత్మ.

నితిన్ లుక్స్ పరంగా, నటన పరంగా పర్వాలేదనిపిస్తాడు.

ముఖ్యంగా సెకండాఫ్ లో అల్లరి కుర్రాడు పాత్రలో నుండి ఎమోషనల్ పార్ట్నర్ గా చూపించే ట్రాన్స్ఫార్మేషన్ బాగుంది.

నితిన్ డాన్స్ కూడా యువతను ఆకట్టుకునేలా ఉంది.

ఇక మహానటి ఆ తరువాత వచ్చిన సినిమాల తరువాత మరో అనుష్కలా మారనుందా కీర్తి సురేష్ అనుకుంటున్న తరుణంలో ఆమె తాను గ్లామర్ పాత్రలను సైతం బీట్ చేయగలను అనే కాన్ఫిడెన్స్‌తో కనపడుతుంది. కథ కథనాలతో సంబంధం లేని పరిణతితో కూడిన నటనతో సెకండాఫ్ ను తన భుజాలపై మోసిందని చెప్పవచ్చు.

ఇక నరేష్, రోహిణి, కౌసల్య, వినీత్ నటన రొటీన్ గా సాగుతుంది. సుహాస్, అభినవ్ గోమఠం, బ్రహ్మాజీలు ప్రథమార్థంలో, వెన్నెల కిషోర్ సెకండాఫ్ లో తమతమ పరిధిలో నవ్విస్తారు.

తొలిప్రేమ, మజ్ను తరువాత మూడో సినిమాగా రంగ్ దే ఎంచుకున్న వెంకీ అట్లూరి కాస్టింగ్, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కథ, కథనాల గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది.

దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ వినసొంపుగా ఉంది.

పి.సి శ్రీరాం సినిమాటోగ్రఫీ ఆకర్షణీయంగా ఉంది.

నవీన్ నూలి ఎడిటింగ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి ఉంటే ఉంటే బాగుండేది అనిపిస్తుంది.

ముఖ్యంగా కీర్తి సురేష్ ప్రెగ్నెన్సీ మెలో డ్రామను ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టేదిలా కాకుండా క్రిస్పినెస్ పెంచి ఉంటే ఇంకొంత మెరుగ్గా అనిపించేది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)