ఈ చిన్నారి పాపకు మూడు నెలల్లో.. 23 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఇవ్వాలి...

వీడియో క్యాప్షన్, ఈ చిన్నారి పాపకు మూడు నెలల్లో 23 కోట్ల రూపాయల ఇంజక్షన్ ఇవ్వాలి...

ఆంధ్రప్రదేశ్‌లోని ఒక ఆరు నెలల చిన్నారి ప్రాణం కాపాడాలంటే రూ. 23 కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ కావాలి. విదేశాలలో లభించే ఈ ఇంజెక్షన్ ధర రూ. 16 కోట్లు కాగా భారత్‌కు వచ్చేసరికి అన్ని పన్నులతో కలిపి రూ. 23 కోట్లు అవుతుంది.

విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన ఖ్యాతి అనే 6 నెలల చిన్నారి స్పైనల్ మస్కులర్ అట్రోఫి(SMA) అనే అరుదైన వ్యాధితో పోరాడుతోంది. ఈ వ్యాధికి 16 కోట్ల రూపాయలు ఖరీదు చేసే 'జోల్ జెన్ స్మా' (Zolgensma) అనే ఇంజెక్షన్ ఇవ్వడం ఒక్కటే చికిత్స.

కొన్ని రోజుల క్రితం ఇదే వ్యాధితో పోరాడిన ముంబయికి చెందిన చిన్నారి తీరా కామత్‌కు చివరికి 'జోల్ జెన్ స్మా' ఇంజెక్షన్ ఇవ్వగలగడంతో ప్రాణాలు నిలిచాయి. తీరాకి క్రౌడ్ ఫండింగ్ ద్వారా దాతలు సాయం చేయగా.. ఇంజెక్షన్‌పై విధించే దిగుమతి పన్నులను, జీఎస్టీని కేంద్రం మినహాయించింది.

ప్రస్తుతం అదే వ్యాధితో విశాఖ చిన్నారి ఖ్యాతితో పాటు హైదరాబాద్‌కు చెందిన జశ్విక్, ముంబయిలోని యువాన్ కూడా బాధపడుతున్నారు. గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

విశాఖ జిల్లా నక్కపల్లికి చెందిన నాగుమంత్రి రామన్‌ బెంగళూరులోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజినీర్‌. రామన్‌, జ్యోత్స్న దంపతులకు గత ఆగస్టులో ఒక పాప పుట్టింది. చిన్నారికి ఖ్యాతి అని పేరు పెట్టారు.

సాధారణంగా పుట్టిన మూడునాలుగు నెలలకు పిల్లల మెడ నిలబడుతుంది. కానీ ఖ్యాతికి అలా జరగలేదు. దీంతో, విశాఖలోని వైద్యులకు చూపించారు. ప్రాథమిక పరీక్షల తర్వాత, చిన్నారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, బెంగళూరుకి తీసుకెళ్లడం మంచిదని వైద్యులు చెప్పారు.

బెంగళూరులోనే పనిచేసే రామన్ పాపను అక్కడికి తీసుకెళ్లారు. బాప్టిస్ట్ హాస్పిటల్‌లో పరీక్షలు చేసిన డాక్టర్లు, పాపకి అరుదైన స్పైనల్ మస్క్కూలర్ అట్రోఫీ, లేదా వెన్నెముక కండరాల క్షీణత వ్యాధి ఉన్నట్టు నిర్థారించారు.

ఆ వ్యాధికి 'జోల్ జెన్ స్మా' అనే ఇంజెక్షన్ ఇవ్వాలని చెప్పారు. అయితే దాని ఖరీదు రూ. 16 కోట్లని. పన్నులతో కలిపి రూ. 23 కోట్లు వరకు అవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)