ఎం.జే అక్బర్ పరువు నష్టం కేసులో జర్నలిస్ట్ ప్రియా రమానీని నిర్దోషిగా ప్రకటించిన కోర్టు

కేంద్ర మాజీ మంత్రి ఎం.జె. అక్బర్ వేసిన పరువు నష్టం కేసులో జర్నలిస్టు ప్రియా రమానీని నిర్దోషిగా ప్రకటిస్తూ దిల్లీ హైకోర్టు తీర్పు వెల్లడించింది.

అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ రవీంద్ర కుమార్ పాండే ఇరువర్గాల సమక్షంలో ఈ తీర్పు ఇచ్చారు.

లైంగిక వేధింపులు ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయని కోర్టు వ్యాఖ్యానించింది. దశాబ్దాల తరువాత కూడా ఫిర్యాదులు చేసే హక్కు మహిళలకు ఉందని న్యాయస్థానం పేర్కొంది.

ఏమిటీ కేసు?

#MeToo ఉద్యమంలో భాగంగా 2018 అక్టోబర్‌లో దాదాపు 20 మంది మహిళా పాత్రికేయులు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.

ఆయన 'ఏషియన్ ఏజ్‌'తో పాటు ఇతర పత్రికల్లో సంపాదకుడిగా పనిచేసే సమయంలో తమను లైంగికంగా వేధించినట్లు వారు ఆరోపించారు.

వీళ్లందరిలో మొదట ఆయన పేరు ప్రస్తావించిన వ్యక్తి ... సీనియర్ జర్నలిస్టు ప్రియా రమానీ. 2017లో వోగ్ పత్రికకు 'టు ది హర్వే వైన్‌స్టీన్స్ ఆఫ్ ది వరల్డ్' శీర్షికతో రాసిన కథనంలో పని చేసే చోట వేధింపులు ఎలా ఉంటాయో వివరించారు. ఆ కథనాన్ని రమణి 2018 అక్టోబర్ 8న రీట్వీట్ చేస్తూ, అందులో వేధింపులకు పాల్పడుతున్నట్లుగా ప్రస్తావించిన వ్యక్తి ఎంజే అక్బర్ అని వెల్లడించారు.

న్యూస్ రూం బయట, లోపల కూడా ఆయన తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె చెప్పారు.

1993లో ఒక ఉద్యోగ ఇంటర్వ్యూ కోసం ముంబయిలోని ఒబెరాయ్ హోటల్‌కు వెళ్లినప్పుడు అక్బర్ తనను తొలిసారి వేధించారని ప్రియా రమానీ పేర్కొన్నారు. అయితే, ఆ హోటల్‌లో ప్రియా రమానీని తాను కలవలేదని అక్బర్ చెప్పారు.

ఈ ఆరోపణల నేపథ్యంలో ఎంజే అక్బర్‌ 2018 అక్టోబర్ 17న కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై వ్యక్తిగతంగా పోరాడతానన్న ఆయన, రమానీపై పరువునష్టం కేసు పెట్టారు.

ఇప్పుడు కోర్టు ఏం చెప్పింది?

అక్బర్ వేసిన పరువు నష్టం కేసులో ప్రియా రమానీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ''లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తిన వారిని మేం శిక్షించలేం. మహిళలు తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి దశాబ్దాల తరవాతైనా బయటకు చెప్పొచ్చు. లైంగిక వేధింపుల వల్ల మహిళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. వారి ఆత్మగౌరవాన్ని ఫణంగా పెట్టి ''పరువు ప్రతిష్ఠ''లను కాపాడలేం'' అని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)