యశ్వంత్‌ మనోహర్‌: సరస్వతి దేవి చిత్రం వేదికపై ఉందని అవార్డు తిరస్కరించిన కవి

విదర్భ సాహిత్య సంఘ్‌ ఇచ్చిన ‘జీవన్‌వ్రతి’ అవార్డును స్వీకరించడానికి ప్రముఖ కవి డాక్టర్‌ యశ్వంత్‌ మనోహర్‌ నిరాకరించారు.

అవార్డు వేదికపై సరస్వతీ దేవి చిత్రాన్ని ఏర్పాటు చేశారన్నది తిరస్కరణకు ఆయన చూపిన కారణం.

తాను లౌకికవాదినని, అందువల్ల సరస్వతీదేవి చిత్రం ఉన్న వేదిక నుంచి అవార్డును తీసుకోబోనని ఆయన స్పష్టం చేశారు.

“ఈ అవార్డు స్వీకరించడం ద్వారా నా విలువలను తగ్గించుకోను’’ అంటూ అవార్డు తీసుకోవడానికి యశ్వంత్ మనోహర్‌ నిరాకరించారు.

డాక్టర్‌ యశ్వంత్‌ మనోహర్‌ విలువలను తాము గౌరవిస్తామని, ఆయన కూడా కొన్ని సంప్రదాయాలను గౌరవించాలని విదర్భ సాహిత్య సంఘ్‌ అధ్యక్షుడు మనోహర్ మైసాల్కర్‌ అన్నారు.

ఈ అవార్డు కోసం నెల కిందటే యశ్వంత్‌ మనోహర్‌కు సాహిత్య సంఘ్‌ ఆహ్వానం పంపింది.

విలువలకు కట్టుబడి ఉంటాను: యశ్వంత్‌ మనోహర్‌

“నేను లౌకికవాదాన్ని అనుసరిస్తాను, రచయితగా నా స్థానమేంటో విదర్భ సాహిత్య సంఘ్‌కు తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను” అని యశ్వంత్ మనోహర్‌ మీడియాతో అన్నారు.

“వేదికపై ఏం జరుగుతుందని అడిగాను. సరస్వతీ దేవి చిత్రం ఉంటుందని చెప్పారు. అందుకే మర్యాదగా అవార్డును తిరస్కరించాను’’ అన్నారాయన. “ సరస్వతి దేవికి బదులు సావిత్రిబాయి ఫులే, అంబేడ్కర్‌ చిత్రాలను ఎందుకు పెట్టరు’’ అని ఆయన ప్రశ్నించారు.

"నేను మార్పు కోసం ఉద్యమిస్తున్నవాడిని. నేను మీ కోసం మారను, మీరే నా కోసం మారాలి.

ఈ విషయంపై నేను సంఘ్‌తో మాట్లాడాను. కానీ వారు దానిని సీరియస్‌గా తీసుకోలేదు. అందుకే అవార్డును తిరస్కరించాలని నిర్ణయించుకున్నా” అని యశ్వంత్‌ మనోహర్‌ బీబీసీతో అన్నారు.

ఒకరి కోసం సంప్రదాయాలను మార్చలేం: విదర్భ సాహిత్య సంఘ్‌

యశ్వంత్‌ మనోహర్‌కు ఇష్టం లేనంత మాత్రాన విదర్భ సాహిత్య సంఘ్‌ తన సంప్రదాయలను మార్చుకోదని సంఘ్‌ అధ్యక్షుడు మనోహర్ మైసాల్కర్ బీబీసీతో అన్నారు.

“ఒక సంస్థలో కొన్ని ఆచారాలు పాటిస్తారు. వేదికపై సరస్వతి దేవి చిత్రాన్ని పెట్టడం మా సంప్రదాయం. ప్రతిసారి ఈ సంప్రదాయాన్ని పాటించాం. అవార్డు ఫంక్షన్‌లో సరస్వతీదేవి చిత్రపటం పెట్టవద్దని ఇంత వరకు ఎవరూ డిమాండ్‌ చేయలేదు’’ అన్నారాయన.

“అవార్డు ప్రకటించినప్పుడే ఆయన తన వైఖరిని చెప్పి ఉండాల్సింది. ఆయన సంఘ్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డులో ఆరేళ్లు పని చేశారు. ఆయన సంఘ్‌కు జీవితకాల సభ్యుడు కూడా. ఇక్కడి సంప్రదాయాలన్నీ ఆయనకు తెలుసు’’ అని మైసాల్కర్‌ అన్నారు.

సాహితీవేత్తలు ఏమంటున్నారు ?

ఈ వ్యవహారంపై మరికొందరు మరాఠీ సాహితీవేత్తలతో బీబీసీ మాట్లాడింది.

“యశ్వంత్‌ మనోహర్‌ నిర్ణయాన్ని గౌరవిస్తాను. వ్యక్తిగా ఆయనకు ఆ స్వేచ్ఛ ఉంది. ఆయన నిర్ణయం వెనక రాజకీయాలు ఉన్నాయంటే ఒప్పుకోను’’ అన్నారు రచయిత్రి డాక్టర్‌ ప్రద్న్యా దయా పవార్‌.

“ సమాజంలో మార్పు కోరుకునే వారు ముందు శత్రువు ఎవరో తెలుసుకోవాలి. మన శత్రువు ఫాసిజం. దానితో పోరాడాలి. సరస్వతీ దేవితో కాదు’’ అన్నారామె.

ఉస్మానాబాద్‌లో జరుగుతున్న ఆల్‌ ఇండియా మరాఠీ లిటరరీ మీట్‌కు అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ఫాదర్‌ ఫ్రాన్సిస్ డెబ్రిటో ఈ అంశంపై మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు.

“ప్రతి వ్యక్తికి తన అభిప్రాయాలను వ్యక్తీకరించే స్వేచ్ఛ ఉంది. కాని ఆ వ్యక్తీకరణ రాజ్యాంగ పరిమితుల్లో ఉండాలి" అని మాత్రం అన్నారు.

ప్రముఖ మరాఠీ రచయిత అన్వర్‌ రాజన్‌ మాత్రం యశ్వంత్ మనోహర్‌ నిర్ణయాన్ని వ్యతిరేకించారు.

“అవార్డు ఇస్తామని చెప్పినప్పుడే అక్కడ ఎవరెవరి చిత్రాలు పెడతారు, ఆ సంస్థను ఎవరు నడుపుతున్నారు అనేది కనుక్కుని ఉండాల్సింది. అవార్డు తీసుకోవడానికి అంగీకరించి తర్వాత నిరాకరించడం సంస్థను అవమానించడమే’’ అన్నారాయన.

“గ్రహీతకు ముందుగా చెప్పకుండా అవార్డు ఇవ్వడం ఉండదు. ఆయన అంగీకరించకపోతే అసలు అవార్డు ప్రకటించరు’’ అన్నారు రాజన్‌.

సోషల్ మీడియా చర్చ

యశ్వంత్‌ మనోహర్‌ నిర్ణయానికి అనుకూలంగా, వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో కూడా విపరీతమైన చర్చ జరుగుతోంది.

“ఇది విదర్భ సాహిత్య సంఘానికి చిహ్నం. సరస్వతికి విదర్భ జన్మభూమి అని ఆ చిహ్నంలో రాసి ఉంది. 1923 నుంచి ఈ చిహ్నం కొనసాగుతోంది.

యశ్వంత్‌ మనోహర్‌ తన జీవితమంతా నాగ్‌పూర్‌లోనే ఉన్నారు. ఆయన వీటిని చదవలేదంటే నమ్మడం కష్టం.

అవార్డు ప్రకటించిన రోజు ఒప్పుకుని, ప్రదానం రోజు ఎందుకు తిరస్కరించారు? అని సీనియర్‌ జర్నలిస్ట్ గణేశ్‌ కనతే తన పోస్టులో ప్రశ్నించారు.

“చిహ్నాలను అంగీకరించడం, తిరస్కరించడం ఒక కీలకమైన పరిణామం. ఆయా చిహ్నాల తయారీ వెనుక స్పష్టమైన ప్రయోజనాలు ఉంటాయి.

కొన్ని చిహ్నాల తొలగింపు వెనక కూడా కొందరి ప్రయోజనాలుంటాయి. అలాంటివేవీ లేవని చెప్పడం అమాయకత్వం” అని ఫేస్‌బుక్‌ పోస్టులో ‘దో శాంతన్‌చన్య సంధ్యవర్చయ నోండి' అనే పుస్తక రచయిత బాలాజీ సుతార్‌ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)