You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'కట్నం కోసం' ఆమె 'అతడు'గా మారింది.. ఇద్దరమ్మాయిలను పెళ్లాడింది!
ఉత్తరాఖండ్‌కు చెందిన కృష్ణసేన్ అనే మహిళ మగాడి వేషం వేసుకుని ఇద్దరు అమ్మాయిలను మోసం చేసినట్లు పోలీసులు చెప్పారు.
కృష్ణసేన్ మగాడు కాదు, మహిళ అనే విషయం అనేక నాటకీయ పరిణామాల మధ్య బయటపడింది.
స్వీటీ అని పిలుచుకునే 26 ఏళ్ల కృష్ణసేన్ 2014 నుంచి మగ వేషంలో తిరుగుతోంది.
మొదట కృష్ణసేన్ చెబుతున్నది ఏమిటో తమకు అర్థం కాలేదని సీనియర్ పోలీసు అధికారి జనమిజయ్ కందూరి బీబీసీకి చెప్పారు.
వైద్య పరీక్షలు చేసిన తర్వాత కృష్ణసేన్ మగాడు కాదు.. మహిళ అన్న విషయం తమకు తెలిసిందని ఆయన అన్నారు.
కృష్ణసేన్ 2014లో మొదటి పెళ్లి చేసుకుంది. కానీ వెంటనే ఆ జంట విడిపోయింది. ఆ తర్వాత 2017 ఏప్రిల్‌లో మరో అమ్మాయిని కృష్ణసేన్ రెండో పెళ్లి చేసుకుంది.
కృష్ణసేన్ మోసం ఎలా బయటపడింది?
కృష్ణసేన్ ఆడుతున్న నాటకం విచిత్రంగా బయటపడింది. మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కృష్ణసేన్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు.
వ్యాపారం కోసం తమ వద్ద నుంచి తీసుకున్న రూ.8,50,000 తిరిగి ఇవ్వడం లేదని కూడా ఫిర్యాదు చేశారు.
దాంతో ఈ కేసులో కృష్ణసేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు.
ఈ క్రమంలో కృష్ణసేన్ పురుషుడు కాదు.. స్త్రీ అన్న విషయం బయటపడింది.
మగాడిలా ఉండాలని, అలాగే జీవితం గడపాలని కృష్ణసేన్ కోరుకుందని పోలీసులు చెప్పారు.
ఈ విషయం కృష్ణసేన్ తల్లిదండ్రులకు తెలుసా లేదా అన్నది తమకింకా తెలియదని పోలీసులు వివరించారు.
అనుమానం రాకుండా మేనేజ్ చేసింది
మగాడి వేషంలో ఉన్న స్వీటీ.. ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది.
భార్యల ముందు బట్టలు విప్పేది కాదని, వారితో శృంగారం జోలికే పోలేదని పోలీసులు చెబుతున్నారు.
ఆమెకు మగ స్నేహితులే ఎక్కువగా ఉండేవారు. మగవాళ్ల టాయిలెట్స్‌నే ఉపయోగించేది. గొంతు కూడా మార్చి మాట్లాడేదని పోలీసులు వివరించారు.
కృష్ణసేన్ స్మోకింగ్ కూడా చేసేదని, మద్యం కూడా తాగేదని, మగరాయుడిలా ఇతర పురుషులతో కలిసి బైక్ నడిపేదని పోలీసులు తెలిపారు.
ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జుట్టు కత్తిరించుకుని, అచ్చం మగాడిలాగే ప్రవర్తించేదని వారు చెప్పారు.
కట్నం కోసమే కృష్ణసేన్ మగాడి వేషంలో ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుందని పోలీసులు పేర్కొన్నారు.
కృష్ణసేన్ మీద ఎప్పుడూ ఎవరికీ అనుమానమే రాలేదని మరో సీనియర్ పోలీసు అధికారి వివరించారు. ప్రస్తుతం కృష్ణసేన్ పోలీసుల అదుపులో ఉంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)