భారత్ ‘‘తేజస్’’ వర్సెస్ పాక్ ‘‘జేఎఫ్-17’’: ఏ యుద్ధ విమానం శక్తిమంతమైనది?

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బాలాకోట్ లాంటి వైమానిక దాడులను పక్కాగా నిర్వహించేందుకు దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన తేజస్ యుద్ధ విమానాలు చక్కగా ఉపయోగపడతాయని భారత వైమానిక దళ అధిపతి ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా చెప్పారు.

పాక్, చైనా సంయుక్తంగా అభివృద్ధి చేసిన జేఎఫ్-17 యుద్ధ విమానాలు తేజస్‌తో పోటీకి రాలేవని ఆయన వివరించారు. నాణ్యత, సామర్థ్యం, కచ్చితత్వం.. ఇలా అన్నింటా తేజస్‌దే పైచేయి అని ఆయన అన్నారు.

తేలికపాటి తేజస్ యుద్ధ విమానాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించినట్లు భదౌరియా వివరించారు. ఈ విమానంతో అనుసంధానించే ఆయుధ వ్యవస్థలను కూడా భారత్ దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

అయితే, అమెరికా యుద్ధ విమానం ఎఫ్-16 ఫాల్కన్ స్థాయిలో బరువుండే, తేలికపాటి జేఎఫ్-17 కూడా కచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించగలదని, అన్ని వాతావరణాల్లోనూ పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇటు తేజస్, అటు జేఎఫ్-17.. ఈ రెండూ దీర్ఘ శ్రేణి క్షిపణులను ప్రయోగించగలవు.

తేజస్ తరహాలోనే జేఎఫ్-17 కూడా లక్ష్యాలపై కచ్చితత్వంతో విరుచుకుపడగలదు.

తేజస్ ప్రత్యేకతలివీ...

తేజస్ ప్రత్యేకతలపై భారత వైమానిక దళ విశ్రాంత వింగ్ కమాండర్, టెస్ట్ పైలట్ కేటీ సెబాస్టియన్ మాట్లాడారు.

‘‘ఇతర తేలికపాటి యుద్ధ విమానాల కంటే తేజస్ భిన్నమైనది. దీని ధర కూడా ఎక్కువే. ఎందుకంటే దీనిలో అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించారు’’అని ఆయన చెప్పారు.

‘‘ఇజ్రాయెల్ అభివృద్ధి చేసిన అధునాత రాడార్ లాంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానాలతో అనుసంధానించడం వల్లే తేజస్ ధర పెరిగింది. మరోవైపు దేశీయంగా అభివృద్ధి చేసిన రాడార్లు కూడా ఈ యుద్ధ విమానంలో అమర్చారు. ఇబ్బందికర పరిస్థితుల్లోనూ మెరుగైన ప్రదర్శన కనబరిచేలా తేజస్‌ను సిద్ధంచేశారు’’అని ఆయన వివరించారు.

భారత్‌కు చెందిన హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తేజస్‌ను అభివృద్ధి చేసింది. మరోవైపు జేఎఫ్-17ను ఇస్లామాబాద్‌కు చెందిన పాక్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ తయారుచేసింది. చైనా నేషనల్ టెక్నాలజీ ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కార్పొరేషన్ సాంకేతికతలను కూడా జేఎఫ్-17లో ఉపయోగించారు.

జేఎఫ్-17లో ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని చైనా, పాక్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయని పాక్ వైమానిక దళం ఒక ప్రకటన విడుదల చేసింది. 3,630 కేజీల బరువుండే ఆయుధాలను జేఎఫ్-17 తీసుకెళ్లగలదని, గంటకు 2,200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదని, 1,350 కి.మీ.ల దూరం నుంచే ఇది లక్ష్యాలపై దాడి చేయగలదని పేర్కొంది.

‘‘తేజస్ ఎనిమిది నుంచి తొమ్మిది టన్నుల బరువులను తీసుకెళ్లగలదు. 52 వేల అడుగుల ఎత్తుల్లోనూ మాక్ 1.6 నుంచి మాక్ 1.8 వరకు వేగంతో ఇది దూసుకెళ్లగలదు’’అని గూర్ఖా రెజిమెంట్‌లో పనిచేసిన విశ్రాంత కల్నల్ సంజయ్ శ్రీవాస్తవ చెప్పారు.

అధునాతన సాంకేతికత

దృగ్గోచర శ్రేణికి అవతల (బియాండ్ విజువల్ రేంజ్) పనిచేసే ఎలక్ట్రానిక్ స్కానింగ్ రాడార్లను తేజస్‌లో ఏర్పాటుచేశారు. విమానం ప్రయాణిస్తున్న సమయంలోనే దీనిలో ఇంధనాన్ని నింపొచ్చు.

‘‘శత్రు రాడార్ల కళ్లు గప్పుతూ దూరం నుంచే లక్ష్యాలపై తేజస్ దాడి చేయగలదు. సుఖోయ్ తీసుకెళ్ల గలిగినన్ని ఆయుధాలను తేజస్ కూడా తీసుకెళ్లగలదు’’అని భదౌరియా చెప్పారు.

బాలాకోట్ లాంటి వైమానిక దాడులను తేజస్ విమానాలు మరింత కచ్చితత్వంతో పక్కాగా చేపట్టగలవని ఆయన వివరించారు.

గతేడాది చివర్లో ఇస్లామాబాద్‌లో పాక్, చైనా వైమానిక దళాలు సంయుక్త కసరత్తులు చేపట్టాయి. ఆ సమయంలో పాక్, చైనా బలగాలు జేఎఫ్-17లో 200 సార్లు చక్కర్లు కొట్టాయని, ఈ కసరత్తులు 20 రోజులపాటు కొనసాగాయని చైనా ప్రభుత్వ పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.

ఈ సైనిక విన్యాసాల్లోనే జేఎఫ్-17 యుద్ధ విమానాలను పాక్ అధికారికంగా అమ్ముల పొదిలోకి చేర్చుకుంది. ఈ కార్యక్రమానికి పాక్‌లోని చైనా రాయబారి నాంగ్ రోంగ్ కూడా హాజరయ్యారు.

చైనాలో తయారుచేసిన 14 జేఎఫ్-17 యుద్ధ విమానాలు ఇప్పటికే పాక్ అమ్ముల పొదిలో ఉన్నాయి. అయితే ఇప్పుడు పాక్ దేశీయంగానూ వీటిని తయారుచేస్తోంది. వీటికి జేఎఫ్-17 బ్లాక్3గా పిలుస్తోంది.

జేఎఫ్-17 బ్లాక్3 ప్రత్యేకతలివీ..

కొత్త జేఎఫ్-17 మోడల్ యుద్ధ విమానాల్లో ఇద్దరు కూర్చోవడానికి చోటు ఉంటుందని బీబీసీ ఉర్దూతో పాక్ వైమానిక దళ అధికార ప్రతినిధి అహ్మార్ రజా చెప్పారు. వీటిని శిక్షణ కోసం ఉపయోగిస్తున్నామని, వీటి సామర్థ్యాలు ఇదివరకటి మోడల్స్ తరహాలోనే ఉంటాయని వివరించారు.

పాక్ వైమానిక దళం సమాచారం ప్రకారం.. క్షిపణులు, రాడార్లు ఇలా అన్ని అంశాల్లోనూ పాత జేఎఫ్-17 తరహాలోనే కొత్త మోడల్ ఉంటుంది. కానీ కొత్త మోడల్‌లో రెండో పైలట్ కూర్చోవడానికి చోటు ఉంటుంది. దీంతో శిక్షణ ఇచ్చేందుకు ఇది చాలా అనువుగా ఉంటుంది.

జేఎఫ్-17 బ్లాక్‌3ల రాకతో పాక్ వైమానిక దళ శక్తి మరింత పెరిగిందని బీబీసీ ఉర్దూతో పాక్ వైమానిక దళం తెలిపింది. శిక్షణ అవసరాలతోపాటు పోరాట చర్యలకూ ఇవి ఉపయోగడతాయని పేర్కొంది.

జేఎఫ్-17 బ్లాక్ 1, బ్లాక్ 2లను పాక్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ (పీఏసీ) అభివృద్ధి చేసింది. జేఎఫ్‌-17 మాత్రం నాలుగో జెనరేషన్ యుద్ధ విమానం. మరోవైపు తేజస్ మాత్రం నాలుగున్నరవ జెనరేషన్ తేలికపాటి పోరాట యుద్ధవిమానం.

పాక్‌తో పోలిస్తే భారత్ దగ్గర ఉన్న యుద్ధ విమానాలు చాలా ఎక్కువ. భారత్ దగ్గర 2,000కుపైనే పోరాట విమానాలు ఉంటే.. పాక్ దగ్గర ఉన్నవి 900 మాత్రమే.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)