సేఠ్ ఆబిద్: బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'

    • రచయిత, ఇలియాస్ అహ్మద్ చట్ఠా
    • హోదా, ప్రొఫెసర్, లిమ్జ్ యూనివర్సిటీ

1958 ఏప్రిల్లో లాహోర్ వెళ్తున్న ఒక ప్రయాణికుడిని కరాచీ విమానాశ్రయంలో ఆపేశారు. అతడి దగ్గర 3,100 తులాల(31 కిలోలు) బంగారం స్వాధీనం చేసుకున్నారు.

అతడి నుంచి 2 వేల తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని తర్వాత కరాచీ కస్టమ్స్ అధికారులు ఒక ప్రెస్ కాన్ఫరెన్సులో చెప్పినపుడు, పోలీసుల అదుపులో ఉన్న ఆ ప్రయాణికుడు అది 2 వేలు కాదు, 3,100 తులాలు అన్నాడు.

తర్వాత విడుదలైన అతడు ఐదు నెలల్లో మళ్లీ కసూర్ దగ్గర ఒక సరిహద్దు గ్రామంలో కనిపించాడు. అక్కడ అమృత్‌సర్ పోలీసుల నుంచి తప్పించుకుంటున్న సమయంలో 45 బంగారు ఇటుకలు వదిలేసి పారిపోయాడు.

ఆరేళ్ల తర్వాత అదే వ్యక్తి దిల్లీ పోలీసులకు మరోసారి కనిపించాడు. వారు అతడిని అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నపుడు చాందినీ చౌక్, మోతీ బజార్‌లో ఒక వ్యాపారితో బంగారం డీల్ కుదుర్చుకుంటున్నాడు.

అతడు పోలీసుల నుంచి తప్పించుకున్నప్పటికీ, తనతోపాటూ ఉన్న ఒక వ్యక్తి దొరికిపోయాడు. పోలీసులు అతడి దగ్గరున్న 44 బంగారం ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు.

1977లో లాహోర్‌ నుంచి ప్రచురితమయ్యే ఒక పత్రిక ఆ వ్యక్తి గురించి ఒక వార్త రాసింది. "ఈ బంగారం స్మగ్లర్, మామూలు వ్యక్తి కాడు, వేషం మార్చడంలో దిట్ట. నక్కలా జిత్తులమారి" అని చెప్పింది.

తరచూ దిల్లీ, దుబాయ్, లండన్ తిరుగుతూ ఉండే ఆ వ్యక్తి పేరు పాకిస్తాన్, ఇంటర్‌పోల్ జాబితాలో కూడా ఉంది. ఆయనే సేఠ్ ఆబిద్ హుస్సేన్.

ఆయన ఈ ఏడాది జనవరి 8న 85 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆయనను పాకిస్తాన్‌లో 'గోల్డ్ కింగ్' అనే పేరుతో పిలుచుకుంటారు. బంగారం స్మగ్లింగ్‌తో ఆస్తులు కూడబెట్టిన దేశంలోని అత్యంత సంపన్నుల్లో ఆయన కూడా ఒకరు.

బంగారం చక్రవర్తి

స్మగ్లింగ్ వ్యాపారంలో 'గోల్డ్ కింగ్' కావాలని అనుకున్నవారు సరిహద్దుకు అవతల కూడా తన నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. దేశంలోని పెద్ద పెద్దవారితో, ప్రభుత్వ అధికారులతో మంచి సంబంధాలు నెరపాల్సి ఉంటుంది. వాటితోపాటూ తాము చేసే పనులను కప్పిపుచ్చుకునేలా సమాజంలో మంచిపేరు తెచ్చుకోడానికి ఒక విస్తృత వ్యవస్థ కూడా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది.

భారత్, పాకిస్తాన్ సరిహద్దు ఏర్పడడం, సేఠ్ ఆబిద్ వ్యాపారంలో ఎదగడం ఒకేసారి జరిగింది. సేఠ్ సరిహద్దుకు దగ్గరే ఉన్న కసూర్‌లో పుట్టి, పెరిగారు. భారత్ విభజనకు ముందు ఆయన పూర్వీకులు కలకత్తా నుంచి చర్మం వ్యాపారం చేసేవారు.

1950లో తండ్రి కరాచీ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి వ్యాపారం ప్రారంభించడంతో సేఠ్ ఆబిద్ కూడా కరాచీ వెళ్లిపోయారు.

తర్వాత దుబాయ్ నుంచి కరాచీకి బంగారం స్మగ్లింగ్ చేసే కొంతమంది చేపలు పట్టేవాళ్లను కలిసిన సేఠ్ ఆబిద్ బంగారం స్మగ్లింగ్ ప్రపంచంలో అడుగుపెట్టారు.

1950వ దశకం చివర్లో ఆయన, కాసిమ్ భట్టీ అనే మత్స్యకారుడితోకలిసి పాకిస్తాన్‌లో బంగారం స్మగ్లింగ్‌లో గుత్తాధిపత్యం సాధించారు.

ఆయనకు కరాచీ రేవు నుంచి పంజాబ్ సరిహద్దుల్లో, ప్రభుత్వ యంత్రాంగం, రాజకీయ నేతల్లో వరకూ మంచి పలుకుబడి ఉండేది. సరిహద్దులకు అవతల చాలా దూరం వరకూ ఆయన చాలా పనులు చక్కబెట్టేవారు. లండన్, దిల్లీ, దుబాయిలో కాంటాక్ట్స్ ఉండేవి. అలా 1950 నుంచి 1980లో బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి ఆబిద్ తెరదించారు.

లండన్ వరకూ నెట్‌వర్క్

సేఠ్ ఆబిద్ 1950 దశకం చివరి నాటికి బంగారం స్మగ్లింగ్‌లో పాతుకుపోయారు. ఆయన స్మగ్లర్ల నెట్‌వర్క్ లండన్, దిల్లీ, కరాచీలో ఏజెంట్ల దృష్టిని ఆకర్షించింది. తర్వాత అది భారత్-పాకిస్తాన్ మధ్యలోని పంజాబ్ సరిహద్దుల వరకూ వ్యాపించింది.

మొదట్లో ఈ నెట్‌వర్క్‌లో ఆయన సమీప బంధువులే ఉండేవారు. సేఠ్ సోదరుడు హాజీ అష్రఫ్ అరబిక్ ధారాళంగా మాట్లాడేవారు. దుబాయిలో ఉండేవారు. ఆయన అల్లుడు గులామ్ సరవర్ తరచూ దిల్లీ వెళ్లేవారు. అక్కడ బంగారం స్మగ్లర్ హర్‌బంస్ లాల్‌తో లావాదేవీలు జరిపేవారు.

భారత పత్రికల్లో సేఠ్ ఆబిద్ పేరు మొదట 1963లో కనిపించింది. పాకిస్తాన్ గోల్డ్ కింగ్‌కు భారత్‌లో కనెక్షన్స్ ఉన్నాయని, ఆయన బావను దిల్లీలో 44 బంగారం ఇటుకలతో అరెస్ట్ చేశారని టైమ్స్ ఆఫ్ ఇండియా అప్పుడు రాసింది.

బ్రిటిష్ ఎయిర్ వేస్ కోసం పనిచేసే చార్ల్స్ మెలొనీకి బ్రిటన్‌లో సేఠ్ ఆబిద్ 'ఫెసిలిటేటర్' అనే పేరు పెట్టారు. సేఠ్ ఆబిద్ ప్రతి ఏటా హజ్ యాత్రకు కూడా వెళ్లేవారు. ఆ సమయంలోనే అరబ్ షేక్ ఆపరేటర్స్‌తో తన సంబంధాలను మెరుగుపరుచుకునేవారు.

సేఠ్ తన స్మగ్లింగ్ వ్యాపారాన్ని విస్తరించిన సమయంలో పంజాబ్ సరిహద్దు గ్రామాల్లోని కొంతమంది ఏజెంట్లకు స్మగ్లింగ్ ఫ్రాంచైజీ కూడా ఇచ్చారు. వారిలో ముఖ్యంగా ఘర్కి దయాల్, ఎవాన్ సమాజాల వారు ఉండేవారు.

సేఠ్ ఆబిద్‌కు ఎంతోమంది ప్రత్యర్థులు ఉండేవారు. కానీ, వారెవరికీ ఆయనంత నైపుణ్యం, సంబంధాలు, ఆర్థికస్థితి ఉండేది కాదు. ఆబిద్ సుదీర్ఘ స్మగ్లింగ్ కెరీర్‌లో ఆయనపై ఎప్పుడూ ఏ ఆరోపణలూ నిరూపితం కాలేదు. అయితే, ఆయనకు వ్యతిరేకంగా ఎన్నో ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి.

ఆబిద్‌కు ప్రభుత్వ భద్రత

1950, 1960వ దశకంలో సేఠ్ ఆబిద్ స్మగ్లింగ్ వ్యాపారం ప్రపంచమంతా విస్తరించింది. అప్పుడప్పుడూ ఆయనకు ప్రభుత్వమే భద్రత కల్పించేది. లాహోర్, కరాచీ, దుబాయ్, లండన్‌లో పెట్టుబడులు, ఆస్తులు ఉండడం వల్ల ఆబిద్‌ పాకిస్తాన్‌లోనే అత్యంత సంపన్నుల్లో ఒకరు అయ్యారు.

జుల్ఫికర్ అలీ భుట్టో ప్రభుత్వం ఉన్నప్పుడు 1970వ దశకంలో సేఠ్ ఆబిద్ స్మగ్లింగ్ కార్యకలాపాలకు కొన్ని అడ్డంకులు కూడా ఎదురయ్యాయి. ఆయన కొన్ని ఆస్తులను కూడా జప్తు చేశారు.

1974లో ఎవరూ ఊహించనిది జరిగింది. లాహోర్‌లోని సేఠ్ ఆబిద్ ఇళ్లలో పోలీసులు భారీ ఎత్తున తనిఖీలు చేశారు. ఆ దాడుల్లో దాదాపు కోటీ 25 లక్షల పాకిస్తాన్ కరెన్సీ దొరికింది. డబ్బుతోపాటూ 40 లక్షల విలువ చేసే బంగారం, 20 లక్షల విలువైన స్విస్ గడియారాలు కూడా దొరికాయి. అదే సమయంలో మూడు కార్లు, 12 గుర్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను తీసుకెళ్లడానికి వాటిని ఉపయోగించుకున్నారు.

ఆ ఘటనతో "పాకిస్తాన్ చరిత్రలో అతిపెద్ద స్మగ్లింగ్ కేస్", "పాకిస్తాన్ గోల్డ్ కింగ్" అని స్థానిక పత్రికలు హెడ్ లైన్లు పెట్టాయి. ప్రపంచ స్థాయి స్మగ్లింగ్ కార్యకలాపాల్లో సేఠ్ ఆబిద్ ప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు నమోదయ్యాయి.

సేఠ్ ఆబిద్ అంతర్జాతీయ స్మగ్లింగ్ కేసులపై ప్రధానమంత్రి భుట్టో ఒక ప్రత్యేక ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు. అది చాలామంది సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసింది. కానీ ప్రభుత్వం ఎన్నోసార్లు హెచ్చరించినా సేఠ్ ఆబిద్ ట్రైబ్యునల్ ఎదుట హాజరు కాలేదు.

సేఠ్ ఆబిద్‌ను అరెస్ట్ చేస్తారా అని పాకిస్తానీలు అప్పట్లో రోజూ చర్చించుకునేవారు.

పాకిస్తాన్‌లో మోస్ట్ వాంటెడ్

పాకిస్తాన్‌ మోస్ట్ వాంటెడ్ వ్యక్తిని వెతకడానికి దేశ చరిత్రలోనే అతిపెద్ద ఆపరేషన్ ప్రారంభించారు. దానికి పాకిస్తాన్ సైన్యం, పోలీసులు, రేంజర్స్, నావెల్ గార్డ్స్ సెర్చ్ పార్టీలను నియమించారు.

కరాచీలోని ఆయన ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి. అక్కడ కూడా భారీగా విదేశీ కరెన్సీ, బంగారం ఇటుకలు స్వాధీనం చేసుకున్నారు.

సేఠ్ ఆబిద్ ఉత్తర నాజిమాబాద్‌లో తన ప్రియురాలిని కలవడానికి వెళ్తున్నాడని 1977లో కరాచీ కోస్ట్ గార్డ్స్‌కు సమాచారం అందింది. దాంతో అక్కడ కూడా దాడులు చేశారు. కానీ ఆలోపే సేఠ్ అక్కడ నుంచి పరారయ్యారు.

1977 సెప్టెంబర్‌లో సేఠ్ ఆబిద్ తనకు తానుగా జియా సైనిక ప్రభుత్వానికి లొంగిపోయారు. జప్తు చేసిన తన ఆస్తులను తిరిగి తనకు అప్పగించడంపై చర్చించారు.

అదే ఏడాది డిసెంబర్‌లో సైనిక ప్రభుత్వం ఒక ప్రెస్‌నోట్ విడుదల చేసింది. జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్ ఆస్పత్రి(జేపీఎంసీ) నిర్మాణానికి, అబ్బాసీ షహీద్ ఆస్పత్రి బర్న్ వార్డు కోసం లెఫ్టినెంట్ జనరల్ జహాన్‌జేబ్ అర్బాబ్‌కు సేఠ్ ఆబిద్ లక్షా 51 వేల రూపాయల భారీ విరాళం అందించారని చెప్పింది.

సేఠ్ ఇప్పుడు ఒక స్మగ్లర్, నేరస్థుడు కాదు. ఆయన ఆ విరాళంతో పక్కా దేశభక్తుడు అయిపోయారు. దేశం కోసం, సమాజ సంక్షేమం కోసం ఉదారంగా దానాలు చేస్తున్నారు.

పాకిస్తాన్ అణు కార్యక్రమంలో కూడా సేఠ్ ఆబిద్ పేరు వెలుగులోకి రావడంతో ఆయన పాపులారిటీ మరింత పెరిగిపోయింది.

సేఠ్ ఆబిద్ మీద ఉన్న ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ కేసులపై 1985-86లో పాకిస్తాన్ పార్లమెంటులో చర్చ కూడా జరిగింది. ఆ తర్వాత చౌధరీ నిసార్ అలీ అధ్యక్షతన నేషనల్ అసెంబ్లీ ప్రత్యేక కమిటీ ఆ కేసు బాధ్యతలు స్వీకరించింది.

1958లో కరాచీ విమానాశ్రయంలో సేఠ్ ఆబిద్ నుంచి కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్న 3,100 తులాల బంగారాన్ని, తిరిగి అతడికి ఇచ్చేసేందుకు 1986లో పాకిస్తాన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ అనుమతించింది.

సమాజ సంక్షేమ కార్యాలు

ఎరిక్ హాబ్స్ బామ్ 'సామాజిక బందిపోటు' అనే పదాన్ని చరిత్రకారులు విమర్శించారు. ఆ మాటపై తన వాదన వినిపించిన ఎరిక్ నేర చరిత్రలో కొంతమంది నేరస్థుడి స్థితిని దాటిపోయి 'సివిల్ హీరో'గా మారవచ్చు అని చెప్పారు.

పాకిస్తాన్ విషయానికి వస్తే, దేశంలో అణు కార్యక్రమం అభివృద్ధికి సాయం చేయడం ద్వారా స్మగ్లర్ గుర్తింపును తుడిచేసుకున్న సేఠ్ ఆబిద్ ఒక లెజెండ్‌గా మారిపోయారని భావిస్తారు.

మూగ, చెవిటి పిల్లల కోసం పనిచేసే హమ్జా ఫౌండేషన్ లాంటి సంస్థలను స్థాపించడంతోపాటూ ఆయన లాహోర్ షౌకత్ ఖానమ్ క్యాన్సర్ ఆస్పత్రి, ఇంకా చాలా స్వచ్ఛంద సంస్థలకు ఆర్థిక సాయం చేశారు.

ఎన్ని చేసినా, తన జీవితాంతం ప్రచారానికి దూరంగా ఉన్న ఆయనకు చాలా మంచి పేరు దక్కింది. కానీ, సేఠ్ ఒక టీవీ షో వేలంలో జావేద్ మియాందాద్ షార్జా ఇన్నింగ్స్ బ్యాట్‌ను తన కొడుకు కోసం ఐదు లక్షల రూపాయలకు కొనుగోలు చేసినప్పుడు ఆయన పేరు జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యింది.

ఆ తర్వాత ఎప్పుడూ ఆయన నేర కార్యకలాపాల గురించి పత్రికల్లో పతాక శీర్షికలు కనిపించలేదు. లాహోర్‌లో సేఠ్ అబీద్‌కు చెందిన ఒక ఎయిర్ లైన్ హౌసింగ్ సొసైటీలో కొడుకు సేఠ్ హాఫిజ్ అయాజ్ అహ్మద్ హత్యకు గురవడంతో మరోసారి ఆయన పతాక శీర్షికలకు ఎక్కారు.

పాకిస్తాన్‌ దేశ చరిత్రలో ప్రారంభ దశలో సేఠ్ ఆబిద్‌లా ఎవరూ అక్రమంగా అంత డబ్బు కూడబెట్టలేదు. తన అక్రమ వ్యాపారాల సమయంలో ఆయన ఎన్నో పాత్రలు పోషించారు. స్మగ్లర్, బంగారం వ్యాపారి, స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజర్, పరోపకారి అన్నింటినీ మించి రియల్ ఎస్టేట్‌లో చాలా పేరు సంపాదించారు.

ఎన్నో ఆస్తులకు యజమాని

1990 దశకం వరకూ ఆయనకు లాహోర్‌లోని వివిధ ప్రాంతాల్లో చాలా ప్రాపర్టీలు ఉండడంతో సేఠ్ నగరంలో అత్యంత భారీగా ఆస్తులు ఉన్న ప్రాపర్టీ డెవలపర్‌గా అయిపోయారు.

కరాచీలో కూడా ఆయనకు చాలా ఆస్తులు ఉన్నాయి. పనామా లీక్స్‌లో తన పేరు రావడంతో ఆయన తన ఆస్తులను బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్‌కు ట్రాన్స్‌ఫర్ చేసేశారు.

స్మగ్లింగ్ ప్రపంచంలో ఆయనపై చాలా కథలు కూడా ఉన్నాయి. వార్తా పత్రికలు, సోషల్ మీడియా ఇప్పటికీ సేఠ్ ఆబిద్‌ చాలా రొమాంటిక్‌ అని వర్ణిస్తాయి. ఆయన తప్పించుకోవడం గురించి, గ్లామరస్ జీవితం గురించి చెబుతూనే ఉంటాయి.

వార్తా పత్రికలు ఆయన్ను 'పాకిస్తానీ గోల్డ్ కింగ్', 'స్మగ్లర్‌' అని చెప్పినపుడు సేఠ్ దానిని వ్యతిరేకించారు. బంగారాన్ని సామాన్యులకు అందుబాటులో ఉంచిన వ్యక్తిగా తనను తాను చెప్పుకున్నారు.

సేఠ్ ఆబిద్ ఒకసారి లాహోర్‌లో ఒక పత్రిక ఎడిటర్‌తో "నన్ను బంగారం స్మగ్లర్ అని ఎందుకు అంటున్నారు. మన చెల్లెళ్లు, కూతుళ్ల పెళ్లిళ్ల కోసం నేను బంగారాన్ని చౌకగా అందుబాటులో ఉంచుతున్నాను. మన సమాజానికి, దేశానికి మెరుగైన సేవలు అందిస్తున్నాను. ప్రశంసించడానికి బదులు నా పరువు తీస్తున్నారు" అన్నారు.

సేఠ్ ఆబిద్ చనిపోయినా, ఆయన వ్యక్తిత్వం మాత్రం ముందు ముందు, చాలా రూపాల్లో చాలా రోజులపాటు జీవించే ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)