You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ISWOTY: ఒలింపిక్స్ పతకంపై ఆశలు చిగురింపజేస్తున్న ఈ యువ షూటర్ మీకు తెలుసా?
భారత యువ షూటర్ యశస్విని సింగ్ దేశ్వాల్ ఇప్పుడు తన గురిని టోక్యో ఒలింపిక్స్‌పై పెట్టారు.
2019లో బ్రెజిల్‌లోని రియోలో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో 10 మీటర్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె బంగారు పతకం సాధించి, అందరి దృష్టినీ ఆకర్షించారు.
ఈ ప్రదర్శనతోనే ఆమె టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు.
ఇదివరకు జూనియర్ స్థాయిలో యశస్విని ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచారు. భారత్‌తోపాటు వివిధ దేశాల్లో అనేక సార్లు ఆమె ప్రతిభ చాటుకున్నారు.
యశస్విని సింగ్ వయసు 23 ఏళ్లు. టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ పతకం కోసం ఆశలు పెట్టుకున్న క్రీడాకారుల్లో ఆమె కూడా ఒకరు.
చిన్నవయసులోనే...
యశస్విని చిన్న వయసులోనే షూటింగ్‌పై దృష్టి సారించారు. ఆమె తండ్రి ఎస్ఎస్ దేశ్వాల్ ఇంటో టిబెటన్ బార్డర్ పోలీస్ (ఐటీబీపీ)లో సీనియర్ అధికారి.
2010లో దిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగిన సందర్భంగా షూటింగ్ పోటీలు చూసేందుకు యశస్వినిని ఆయన తన వెంట తీసుకువెళ్లారు.
ఆ తర్వాత షూటింగ్‌పై యశస్విని మక్కువ పెంచుకున్నారు.
అంతర్జాతీయ షూటర్, రిటైర్డ్ పోలీసు అధికారి టీఎస్ ధిల్లాన్ పర్యవేక్షణలో కఠిన శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టారు.
యశస్విని షూటింగ్ ప్రాక్టీస్ చేసుకునేందుకు వీలుగా వారి కుటుంబం ఇంటి వద్దే ఓ షూటింగ్ రేంజ్‌ను ఏర్పాటు చేసింది.
2014లో పుణెలో జరిగిన 58వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో మూడు విభాగాల్లో యశస్విని బంగారు పతకాలు గెలిచారు. అక్కడి నుంచి ఇక ఆమె వెనుదిరిగిచూడలేదు. అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించారు. 2017లో ఆమె గెలుచుకున్న జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ కూడా వీటిలో ఒకటి.
సవాళ్లను అధిగమిస్తూ...
సరైన క్రీడా వసతులు, సామగ్రి లేకపోవడంతో భారత్‌లో షూటర్లు అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు.
యశస్వినికి శిక్షణపరంగా, వసతులపరంగా అవసరమైన ఏర్పాట్లను పూర్తిగా ఆమె కుటుంబమే చూసుకుంటోంది.
క్రీడల్లో రాణిస్తూనే, చదువును కూడా కొనసాగిస్తున్నారు యశస్విని. రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ఆమె ముందుకు సాగుతున్నారు.
క్రీడా పోటీలకు వెళ్లినప్పుడు కూడా కొన్ని సార్లు పాఠ్యపుస్తకాలు వెంట తీసుకువెళ్తుంటానని ఆమె చెప్పారు.
తనతోపాటు తన కుటుంబ సభ్యులు కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని... పోటీల కోసం దేశవిదేశాలు తిరుగుతున్నప్పుడు తన వెంట వారు ఉంటారని యశస్విని అన్నారు.
షూటింగ్‌లో యశస్విని స్థిరంగా రాణిస్తూ ఉన్నారు. అయితే, 2017లో ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ గెలవడంతో ఆమె గురించి అందరికీ తెలిసింది.
'ప్రోత్సాహం అందాలి'
సరైన ప్రోత్సాహం దొరికితే మహిళలు ఏం సాధించగలరో యశస్విని చేసి చూపిస్తున్నారు.
అడుగడుగునా తనకు అండగా ఉంటున్న కుటుంబం దొరకడం తన అదృష్టమని ఆమె అంటున్నారు.
భారత్‌లో చాలా మంది మహిళలకు కుటుంబం నుంచి అందాల్సినంత సహకారం అందడం లేదని, సమాజంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
దేశంలో క్రీడా వసతులు మరింత మెరుగపడాలని... మహిళా క్రీడాకారులకు, మరీ ముఖ్యంగా ఆరంభ దశలో మరిన్ని ప్రోత్సాహకాలు కల్పించాలని ఆమె అభిప్రాయపడ్డారు.
(యశస్విని ఈమెయిల్ ద్వారా బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ఈ కథనానికి ఆధారం)
ఇవి కూడా చదవండి:
- బంగారం స్మగ్లింగ్‌లో భారత్ గుత్తాధిపత్యానికి తెరదించిన పాకిస్తాన్ 'గోల్డ్ కింగ్'
- సింగపూర్: కోట్లు ఇస్తామన్నా ఈ రెండు ఇళ్ల యజమానులు కదలటం లేదు.. ఎందుకు?
- కోడి రామ్మూర్తి నాయుడు: ‘కలియుగ భీముడు’గా పేరు తెచ్చుకున్న ఈ తెలుగు వీరుడి కథేంటి?
- ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు
- దారా షికోహ్: ఈ మొఘల్ యువరాజు సమాధి కోసం మోదీ ప్రభుత్వం ఎందుకు వెతుకుతోంది
- నెల్లూరు పల్లెలో అంతరిక్ష పరిశోధన... ఒక సైన్స్ టీచర్ ప్రేరణతో విద్యార్థుల ప్రయోగాలు
- 127 ఏళ్ల కిందట ప్రపంచానికి భారత ఘనతను చాటిన వివేకానందుడి ప్రసంగం ఇదే..
- ‘ఎవరికీ ద్రోహం చేయలేను... అందుకే ఇద్దరినీ ఒకేసారి పెళ్లి చేసుకున్నా’
- మిల్లీమీటరు పురుగు ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడింది
- విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?
- భయపెడుతున్న బర్డ్ ఫ్లూ.. చికెన్ తింటే వస్తుందా.. లక్షణాలు ఏమిటి.. మరణం తప్పదా
- దేశ విభజన సమయంలో కరాచీలో హిందువులను, సిక్కులను ఎలా ఊచకోత కోశారు.. ఆస్తులను ఎలా లూటీ చేశారు
- అమెరికాలో ఒప్పంద వ్యవసాయం ఎలా సాగుతుంది?
- అయిదేళ్లుగా స్నానం చేయడం మానేసిన డాక్టర్.. అసలు రోజూ స్నానం అవసరమా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)