INDvsAUS: అశ్విన్‌తో స్లెడ్జింగ్‌కు దిగిన టిమ్ పెయిన్‌‌, పంత్ గార్డ్ చెరిపేసిన స్టీవ్ స్మిత్ ... అసలు ఆస్ట్రేలియా జట్టు సంస్కృతి ఏమైనా మారిందా?

    • రచయిత, జాక్ స్కెల్టన్
    • హోదా, బీబీసీ స్పోర్ట్

‘‘బహుశా నా కెరీర్లో ఇంతకన్నా చెడ్డ రోజులు పెద్దగా లేవేమో!’’... ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరిగిన మూడో టెస్టు మ్యాచ్ ముగిసిన తర్వాత ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ టిమ్ పెయిన్ పలికిన మాట ఇది

సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌ను భారత జట్టు అద్భుతంగా పోరాడి డ్రా చేసుకుంది. సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది.

మ్యాచ్ చివరి రోజు భారత జట్టు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయింది. వెన్ను నొప్పితో ఉన్న అశ్విన్, తొడ కండర గాయంతో బాధపడుతున్న హనుమ విహారి కలిసి తుది సెషన్ మొత్తం ఆడి, భారత్‌కు ఓటమిని తప్పించారు.

ఈ మ్యాచ్‌లో టిమ్ పెయిన్ స్లెడ్జింగ్‌కు పాల్పడిన తీరుపై అంతటా విమర్శలు వస్తున్నాయి. దీనికి తోడు మూడు క్యాచ్‌లు చేజార్చి, అతడు చెత్త ప్రదర్శన చేశాడు.

ఆస్ట్రేలియా గెలుపు అవకాశాలు అడుగంటుతున్నకొద్దీ అతడిలో అసహనం ఎక్కువైంది. బ్యాటింగ్ చేస్తున్న అశ్విన్‌ను అతడు అన్న మాటలు స్టంప్స్‌కున్న మైక్రో ఫోన్ల ద్వారా రికార్డయ్యాయి.

పెయిన్: ‘‘గబ్బాకు నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’’ -

బ్రిస్బేన్‌లో జరిగే నాలుగో టెస్టు గురించి చెబుతూ ఈ మాట అన్నాడు. శుక్రవారం ఈ మ్యాచ్ మొదలుకానుంది.

అశ్విన్: ‘‘అలాగే మేం కూడా నువ్వు భారత్‌కు ఎప్పుడు వస్తావా అని చూస్తున్నాం. అదే నీకు ఆఖరి సిరీస్ అవుతుంది’’

పెయిన్: ‘‘కనీసం, నా జట్టు సభ్యులైనా నన్ను ఇష్టపడతారు’’

ఈ సంభాషణ జరిగేటప్పటికే పెయిన్ రెండు క్యాచ్‌లు జారవిడిచాడు.

టెస్టు కెరీర్లో 74 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్, బౌలర్ అయ్యుండి ఇప్పటివరకూ నాలుగు సెంచరీలు చేశాడు. 34 మ్యాచ్‌లు ఆడిన పెయిన్ (వికెట్ కీపింగ్ బ్యాట్స్‌మన్) ఖాతాలో ఒక్క సెంచరీ కూడా లేదు.

ఇక ఈ మాటలు అన్న మరుసటి ఓవర్‌లోనే హనుమ విహారి ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు పెయిన్.

అశ్విన్‌ను స్లెడ్జింగ్ చేయడం గురించి మ్యాచ్ తర్వాత అడిగిన ప్రశ్నకు బదులిస్తూ... తనను తాను మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉందని పెయిన్ అంగీకరించాడు.

ఇదే మ్యాచ్ మూడో రోజు అంపైర్ పట్ల అసహనం వ్యక్తం చేస్తూ, అరిచినందుకు పెయిన్‌కు మ్యాచ్ ఫీజులో 15 శాతం కోత పడింది.

స్లెడ్జింగ్ ‘మైదానం దాటనంతవరకూ’ తాము పెద్దగా పట్టించుకోమని భారత కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు.

పెయిన్ వ్యాఖ్యలు ‘అనుచితం, అనవసరం’ అని భారత మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ వ్యాఖ్యానించారు.

ఇక కీపర్‌గా తన ప్రదర్శన గురించి స్పందిస్తూ... ‘‘ఈ రోజు నా ఆటతీరుతో పూర్తిగా నిరాశ చెందా. మా ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లు ప్రాణం పెట్టి, ఆడారు. చేయగలిగిందంతా చేశారు. వాళ్లను నేను కచ్చితంగా నిరాశపరిచా. కానీ, నేను నిరూత్సాహపడను. వచ్చే వారం నాకు మరో అవకాశం వస్తుంది’’ అని పెయిన్ అన్నాడు.

స్మిత్ కావాలనే పంత్ గార్డ్‌ను చెరిపేశాడా?

ఈ మ్యాచ్‌లో పెయిన్ స్లెడ్జింగ్ మాత్రమే కాదు, ఆస్ట్రేలియా జట్టు చేసిన మరో విషయం కూడా చర్చనీయాంశమైంది.

సాధారణంగా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్టంప్స్ ముందు ఎక్కడ నిలబడాలనేదానికి గుర్తుగా బ్యాట్స్‌మెన్ కాలుతో గీత గీసుకుంటారు. దీన్ని గార్డ్ అంటారు.

అయితే, మధ్యాహ్నం సెషన్ డ్రింక్స్ బ్రేక్‌కు ముందు స్టీవ్ స్మీత్ స్టంప్స్ ముందుకు వచ్చి రిషబ్ పంత్ గీసుకున్న గార్డ్‌ను చెరిపేశాడు.

తిరిగి బ్యాటింగ్‌కు వచ్చిన పంత్ అంపైర్‌ను అడిగి మళ్లీ గార్డు గీసుకున్నాడు.

స్మిత్ ఉద్దేశపూర్వకంగా ఈ పని చేశాడా అన్న చర్చ జరిగింది.

స్మిత్ తీరును ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తప్పుపట్టారు. స్మిత్ ఇదివరకే బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఏడాది నిషేధానికి గురయ్యాడు.

ఇక ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో తమ ట్రిక్కులన్నింటినీ ప్రయోగించిందని భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అన్నారు.

ఇక ఆస్ట్రేలియా ఆటగాడు మాథ్యూ వేడ్ కూడా మ్యాచ్ సమయంలో అశ్విన్‌ను గాయం గురించి వెక్కిరిస్తూ కనిపించాడు.

2018లో బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా జట్టు ప్రతిష్ఠను మసకబార్చింది. ఇక తాము గీత దాటబోమని అప్పుడు ఆ జట్టు చెప్పుకుంది.

అయితే, ఈ సిరీస్‌లో ఆస్ట్రేలియా ఆటతీరు చూస్తున్న క్రికెట్ అభిమానులు మాత్రం ఆ జట్టు సంస్కృతిలో నిజంగా మార్పు ఏదైనా వచ్చిందా అని సందేహపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో ఒకే విషయమైతే సుస్పష్టమైంది. ఆస్ట్రేలియా జట్టుకు స్లెడ్జింగ్ బెడిసికొట్టింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)