You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడానికి 25 ఏళ్లు ఎందుకు పట్టింది?
- రచయిత, భరణీ ధరన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రజనీకాంత్ తాను 2021 జనవరిలో రాజకీయ పార్టీని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వచ్చే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. ఆయన అభిమానులు రజనీకాంత్ పార్టీ అధికారిక ప్రకటన కోసం 1990లనుంచీ ఎదురుచూస్తున్నారు.
అయితే, సూపర్ స్టార్ రజనీకాంత్‌కు పార్టీ ప్రారంభించడానికి 25 సంవత్సరాలు ఎందుకు పట్టింది, రాజకీయాల్లో ఆయనకు ఆసక్తి ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా మారుతూ వచ్చిందనే అనే విషయాలను పరిశీలిద్దాం.
మొదటిసారిగా 1996లో రజనీకాంత్ రాజకీయాల పట్ల ఆసక్తి చూపిస్తున్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది.
అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత దత్త పుత్రుడు వీఎన్ సుధాకరన్ వివాహం విలాసవంతంగా, అంగరంగ వైభోగంగా జరగడం జాతీయ స్థాయిలో పలువురి దృష్టిని ఆకర్షించింది.
అప్పుడు రజనీకాంత్, ప్రభుత్వంలో చాలా అవినీతి పేరుకుపోయిందని, ఇలాంటి ప్రభుత్వం కొనసాగడానికి వీల్లేదని బహిరంగంగా విమర్శించారు.
రజనీకాంత్ తొలి రాజకీయ ప్రకటన
తొలిసారిగా రజనీకాంత్ రాజకీయ అంశాల గురించి 1995లో పెదవి విప్పారు. ఎంజీఆర్ కళగం పార్టీ అధ్యక్షులు ఆర్ఎం వీరప్పన్ హాజరైన ఒక సమావేశంలో రజనీకాంత్ మాట్లాడుతూ... తమిళనాడులో బాంబుల కల్చర్ పెరిగిపోయిందని, దీనికి తమిళనాడు ప్రభుత్వం బాధ్యత వహించాలని అన్నారు.
మూపనార్ 1996లో కాంగ్రెస్ పార్టీనుంచీ బయటకు వచ్చి, తమిళ మానిల కాంగ్రెస్ అనే పార్టీని స్థాపించారు. అప్పట్లో పీవీ నరసింహరావు భారత ప్రధానిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ఏడీఎంకే పొత్తు కోసం ప్రయత్నిస్తోంది. దీన్ని వ్యతిరేకిస్తూ మూపనార్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, తమిళ్ మానిల కాంగ్రెస్ స్థాపించి డీఎంకేతో పొత్తు పెట్టుకున్నారు.
రజనీకాంత్ డీఎంకే కూటమికి బహిరంగంగా తన మద్దతు ప్రకటించారు. ఆయన ఒక రాజకీయ పార్టీకి మద్దతు ప్రకటించడం అదే తొలిసారి.
అప్పటి ఏడీఎంకే ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడంతో ఆ అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘన విజయం సాధించింది. ఈ విజయంలో రజనీకాంత్ పాత్ర కూడా ఉందని, ఆయన బహిరంగంగా మద్దతు తెలపడం సానుకూల ఫలితాలనిచ్చిందని పలువురు భావించారు. ఎన్నికల సమయంలో రజనీకాంత్ అభిమానులు డీఎంకే కూటమికి మద్దతుగా నిలుస్తూ తమ సహాయ సహకారాలు అందించారు.
1998 పార్లమెంట్ ఎన్నికల్లో కూడా రజనీకాంత్ డీఎంకే కూటమికి మద్దతిచ్చారు. కానీ, ఆ ఎన్నికల్లో ఏడీఎంకే అధిక మెజారిటీతో విజయం సాధించింది. అప్పటినుంచి రజనీకాంత్, పాలక పక్షమైన ఏడీఎంకేపై విమర్శలు గుప్పించడం తగ్గించారు.
కావేరీ నదీజలాల గొడవలు 2002లో తారాస్థాయిలో ఉన్నప్పుడు, రజనీకాంత్ కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాబట్టే ఈ అంశంపై పెదవి విప్పట్లేదని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఆరోపణల తరువాత తమిళనాడు సినీ పరిశ్రమ నిర్వహించిన నిరాహారదీక్షలో రజనీకాంత్ పాల్గొంటూ, కావేరీ జలాల విషయంలో తానెప్పుడూ తమిళనాడు రాష్ట్ర ప్రజల పక్షమేనని ప్రకటించారు. ఆ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని కూడా ప్రకటించారు.
బాబా సినిమా 2004లో రిలీజైంది. ఇందులో రజనీకాంత్ మతపరమైన అభిప్రాయాలు, రాజకీయ రంగప్రవేశం గురించి ప్రస్తావించారు.
అయితే, ఈ సినిమాపట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ పీఎంకే పార్టీ నాయకుడు డా. రామదాస్ పలుచోట్ల ఈ సినిమా ప్రదర్శనను అడ్డుకున్నారు. అనేకచోట్ల పీఎంకే పార్టీ కార్యకర్తలకు, రజనీకాంత్ అభిమానులకు మధ్య ఘర్షణలు జరిగాయి.
దీనిని అనుసరించి, చెన్నైలో తాను కట్టించిన రాఘవేంద్ర మ్యారేజ్ హాల్‌లో తన అభిమానులను సమావేశపరచి పీఎంకే పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయమని రజనీకాంత్ పిలుపునిచ్చారు. కానీ, ఫలితం లేకపోయింది. ఆ ఎన్నికల్లో పీఎంకే పార్టీ అభ్యర్థి గెలుపొందారు.
అనంతరం, రజనీకాంత్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం తగ్గించేసారు. తన అభిప్రాయాలను కూడా అరుదుగా వినిపించారు.
2004, 2006, 2008 సంవత్సరాలలో రజనీకాంత్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా రాజకీయ రంగప్రవేశం గురించి విలేఖరులు ప్రశ్నలడుగుతూనే ఉన్నారు. వాటికి ఎప్పుడూ ఆయన సూటిగా జవాబు చెప్పకుండా "దేనికైనా సమయం రావాలి, కాలమే అన్నిటికీ సమాధానం చెబుతుంది" అని చెప్పి తప్పించుకునేవారు. అయితే, ఆయన ఎప్పటికైనా రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూనే ఉన్నారు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధామంత్రి పదవికి అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును ఎన్‌డీఏ ప్రతిపాదించింది. అనంతరం మోదీ, చెన్నైలోని రజనీకాంత్ స్వగృహానికి విచ్చేసారు.
ఆ సమావేశం తరువాత.. మోదీ గొప్ప నాయకుడని ప్రశంసిస్తూ, ఆయన ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా రజనీకాంత్ తెలిపారు. కానీ, రాజకీయాల గురించిగానీ, బీజేపీ గురించిగానీ ఆయన ప్రస్తావించలేదు.
2014లో అప్పటి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 14 రోజులు జైల్లో ఉన్నప్పుడు, రజనీకాంత్‌ను అభిప్రాయం అడగ్గా, "సంతోషకరమైన విషయం" అని బదులిచ్చారు.
జయలలిత, కరుణానిధి తరువాత...
2017లో అనారోగ్య కారణాలతో జయలలిత తుదిశ్వాస విడిచారు. ఆరోగ్య సమస్యల కారణంగా కరుణానిధి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండడం తగ్గించారు.
2017 డిసెంబర్ 31న రజనీకాంత్ కరుణానిధినితో సమావేశమయ్యారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ...తన రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడడానికే కరుణానిధిని కలిసానని, ఆయన ఆశీర్వచనాలు పొందడానికే వెళ్లానని తెలిపారు.
ఈ ప్రకటన ద్వారా ఆయన రాజకీయాలపై ఆసక్తిని కనబరచినప్పటికీ, అది ఎక్కువమంది దృష్టిని ఆకర్షించలేదు.
2019లో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, ఏ పార్టీకి మద్దతు తెలుపుతారని రజనీకాంత్‌ను అడుగగా... తాను ఏ రాజకీయ పార్టీకీ మద్దతు తెలుపడం లేదని, తన అభిమానులు ఎన్నికల్లో పోటీ చేయరని తెలిపారు.
అంతేకాకుండా, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 234 నియోజకవర్గాల్లోనూ తాను పోటీ చేయనున్నట్లు స్పష్టం చేసారు.
అయితే, ఈ ప్రకటనపై పలు రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పించాయి.
"ముందు ఆయన్ను ఒక పార్టీని పెట్టనివ్వండి. అప్పుడు చూద్దాం. పార్టీని ప్రారంభించే హక్కు అందరికీ ఉంటుంది" అంటూ అటు బీజేపీనేతలు, ఇటు డీఎంకే నేతలు, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి కూడా విమర్శించారు.
ఆలూ లేదు చూలూ లేదు అన్న సామెత మాదిరిగా రజనీకాంత్ ప్రకటన ఉన్నదని పలువురు మంత్రులు వ్యాఖ్యానించారు.
రజనీకాంత్ రాజకీయ ఆసక్తి 1991లో ప్రారంభమై, 1996లో ఎన్నికల రాజకీయాలపట్ల ఆసక్తిగా పరిణామం చెంది, పరిపక్వమైన అనుభవాన్ని కూడగట్టుకుని 2020లో అధికారిక ప్రకటనగా వ్యక్తమైంది.
ఇవి కూడా చదవండి:
- వ్యవసాయానికి సాయం చేస్తున్న మొదటి ప్రభుత్వం మోదీ ప్రభుత్వమేనా?
- భాగ్యలక్ష్మి ఆలయం: చార్మినార్ పక్కనే ఉన్న ఈ గుడిని ఎప్పుడు కట్టారు? చరిత్ర ఏం చెబుతోంది?
- ఆలయంలో ముద్దు సీన్, నెట్‌ఫ్లిక్స్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం
- రైతు ఆత్మహత్యలు: ‘మా అమ్మను వ్యవసాయం చేయనివ్వను’
- ఒక ఉల్కను అమ్మేసి, రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అవుదామనుకున్నాడు. కానీ...
- "పార్లమెంటుకు పట్టని అన్నదాతల వ్యథలు"
- జీరో బడ్జెట్ వ్యవసాయం అంటే ఏమిటి? కేంద్ర ఆర్ధికమంత్రి ఏపీని ఎందుకు ప్రస్తావించారు...
- స్మార్ట్ వ్యవసాయం: భూమి అక్కర్లేదు, కూలీలతో పనిలేదు... అత్యంత వేగంగా పంటలు పండించొచ్చు
- రైతన్న రిటైర్మెంట్: వ్యవసాయ విరమణ సన్మానం చేసిన కుమారులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)