You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Hyderabad: తన అవయవాలను దానం చేసి ఎనిమిది మంది ప్రాణాలు నిలిపిన కానిస్టేబుల్
హైదరాబాద్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కే.ఆంజనేయులు విధులకు వెళ్తుండగా యాక్సిడెంట్ అయ్యింది. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఆయనకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధరించారు. దీంతో కుటుంబ సభ్యులు జీవదానానికి ముందుకొచ్చారు. ఆంజనేయులు అవయవాల్ని సేకరించి అవసరమైన ఎనిమిది మందికి అమర్చి వారి ప్రాణాలు కాపాడారు.
''అవయవ దానం చేసి అందరికీ మంచి చేశాడు. గ్రేట్ అనిపించుకున్నాడు. కానీ మాకు లేదు.. అంతే..'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు భార్య శివలీల.
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తోన్న కోనేరు ఆంజనేయులు నవంబరు 18న రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. తన సొంతూరు నుంచి తిరిగి హైదరాబాద్ కి బైక్ పై వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో రెండు రోజుల చికిత్స తరువా 21వ తేదీ తెల్లవారుఝామున బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించారు వైద్యులు.
వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించిన తరువాత ఆ కుటుంబాన్ని అవయవ దానం కోసం ఒప్పించారు సైబరాబాద్ పోలీసులు. కుటుంబ సభ్యులతో పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడి, అవయవదానంపై అవగాహన కల్పించారు. దానికి వారు అంగీకరించారు. దీంతో ఆయన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కాలేయం, కళ్లు వంటి ఎనిమిది అవయవాలను ఇతరులకు దానంగా ఇచ్చారు.
2018 బ్యాచ్'కి చెందిన కోనేరు ఆంజనేయులు సొంతూరు రంగారెడ్డి జిల్లా పరిగి దగ్గర రూప్ ఖాన్ పేట. నాగమ్మ, ఆశన్న దంపతుల నలుగురు సంతానంలో ఒకరు. ఆయనకు శివలీలతో 2020 మే నెలలో పెళ్లి అయింది. భార్య శివలీల డీఈడీ పూర్తి చేసి ఇప్పుడు డిగ్రీ రెండో ఏడాది చదువుతున్నారు.
ఆంజనేయులు గ్రామంలో చురుగ్గా ఉండేవారని చెప్పారు స్థానికులు. సేవా దృక్పథంతో మెలిగే వారని గుర్తు చేసుకున్నారు.
పెళ్లైన ఆరు నెలలకే తమ కుమారుడు తమకు దూరమైపోయాడంటూ కన్నీరు పెట్టుకున్నారు తల్లితండ్రులు. ''ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టే వరకూ పెళ్లి చేసుకోనని చెప్పి ఈ ఇల్లు కట్టాడు. పెళ్లై ఆరు నెలలు అయింది అంతే. ఇంతలోనే ఇలా జరిగిపోయింది'' అని చెప్పారు ఆయన తండ్రి ఆశన్న.
''పెళ్లికి వెళ్లి, మరునాడు డ్యూటీ ఉందని తిరిగి హైదరాబాద్ వస్తున్నాడు. రాత్రి 9.46కి నేను కాల్ చేస్తే, ఆయన ఫ్రెండ్ ఫోన్ ఎత్తారు. ప్రమాదం జరిగింది. ఆసుపత్రికి తీసుకెళ్తున్నాం అని చెప్పారు. నేను ఇంట్లో వాళ్లకు విషయం చెప్పాను. హైదరాబాద్ ఆసుపత్రికి తీసుకెళ్లమని పరిగిలో చెప్పారు. దీంతో హైదరాబాద్ తీసుకువెళ్లాం. చికిత్స తరువాత ఇకలేరని చెప్పారు'' అంటూ ఆ రోజు జరిగింది చెప్పారు ఆయన భార్య శివలీల.
''ఆయన చనిపోయినా వేరే వారిలో బతికున్నారు''
''ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. అవయవదానం చేస్తే, మనం ఆయన్ను వేరే వాళ్లలో చూసుకోవచ్చు అంటూ పోలీసులు వివరించారు. మనిషి లేకపోవచ్చు. ఏదో రూపంలో బతుకుతారు కదా అని మేం కూడా సరే అన్నాం'' అన్నారు శివలీల.
తన భర్త ప్రమాద ఘటన నుంచి ఇంకో తేరుకోలేదు ఆమె.
''అవయవ దానం చేసి అందరికీ మంచి చేశాడు. గ్రేట్ అనిపించుకున్నాడు. కానీ మాకు లేదు.. అంతే..'' అంటూ కన్నీరు పెట్టుకున్నారు భార్య శివలీల.
''రెండు రోజుల చికిత్స తరువాత బ్రెయిన్ డెడ్ అన్నారు. దీంతో అవయవదానం కోసం కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాం. వారు ఒప్పుకున్నారు. డీసీపీ ట్రాఫిక్ విజయ్ కుమార్, మాణిక్ రాజు, మట్టయ్య ఇతర అధికారులు కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి చెబుతున్నాను. వారికి తెలంగాణ పోలీసులు అండగా ఉంటారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తాం. ఆర్థికంగా రావాల్సింది అందిస్తాం'' అని చెప్పారు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్.
సైబరాబాద్ పోలీసుల 'మరోజన్మ'
అవయవదానంపై అవగాహన పెంచి, అవయవ దానం వైపు ప్రోత్సహించేలా 'మరోజన్మ' పేరుతో ప్రచారం కార్యక్రమం చేపట్టారు సైబరాబాద్ పోలీసులు. 2018 నవంబరులో ఈ కార్యక్రమం ప్రారంభించారు.
''ఈ విషయంపై ప్రజల్లో అపోహలు, మూఢ నమ్మకాలూ ఉన్నాయి. జీవన్ దాన్ సంస్థ దీనిపై విశేష కృషి చేస్తోంది. మేం ఆసుపత్రులతో సమావేశాలు జరిపాం. బ్రెయిన్ డెడ్ అయిన కేసుల్లో వారి అవయవాలు ఇతరులకు దానం చేస్తే దాదాపు ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చిన వారు అవుతారు. ఇలాంటి కేసులు బంధు మిత్రులు ముందుకు రావాలి. ఇటీవలే ఎక్కువ వయసు ఉన్న కానిస్టేబుల్ ఒకాయన చనిపోతే కళ్లు దానం ఇచ్చాం. తెలంగాణలో జీవన్ దాన్ వ్యవస్థ డా. స్వర్ణలత సారథ్యంలో పక్కాగా నడుస్తోంది. అవయవాలు అవసరం ఉన్నవారికి సీరియల్ పద్ధతిలో ఇస్తారు'' అని చెప్పారు సజ్జనార్.
''పలు సామాజిక అంశాలపై పోలీసులు చేసే ప్రచారానికి విలువ ఉంటుంది. అందుకే మేం ఈ అంశంపై ప్రచారం చేస్తున్నాం. కోవిడ్ తరువాత ప్లాస్మా దానంపై కూడా మేం అవగాహన కల్పిస్తున్నాం. అవయవదానం అంటే కట్ చేస్తారు, శరీరం ముక్కలు అయిపోతుంది అనుకుంటారు. అది సరికాదు. పోస్టుమార్టం చేసినట్టే. బయటకు ఏమీ కనిపించదు. దీనిపట్ల అపోహలు వదులుకోవాలి'' అని ఆయన అన్నారు.
ఇవి కూడా చదవండి:
- GDP: ఆర్థిక సంక్షోభంలో భారతదేశం... 7.5 శాతం పడిపోయిన జీడీపీ
- GDP Meaning: జీడీపీ అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు? ఈ గణాంకాలు ఎందుకంత కీలకం?
- నివర్ తుపాను తాకిడితో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తీవ్ర నష్టం
- కరోనా వ్యాక్సిన్‌ను ప్రజలకు చేరవేసేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్లాన్ ఏమిటి?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? దాని ధర ఎంత?
- బ్రిటిష్ వారిని గడగడలాడించిన టిప్పు సుల్తాన్ కథ ఎలా ముగిసిందంటే...
- కరోనావైరస్: కేరళలో దాచి పెట్టిన కోవిడ్ మరణాల గుట్టు రట్టు చేసిన వలంటీర్లు
- ఆస్తుల గొప్పలు చెప్పుకోరు... సెక్స్ గురించి సహజంగా మాట్లాడుకుంటారు
- 2,000 ఏళ్ల కిందటి రోమ్ సామ్రాజ్యపు యజమాని, బానిస... బయటపడ్డ బూడిద శిలలు
- గంగా నదిలోకి ఘరియల్ మొసళ్లను వదులుతున్నారు.. ఎందుకంటే...
- ఆ రోజు ఈ ఫొటో తీసింది ఎవరు? కసబ్ గురించి ఆ ఫొటో జర్నలిస్టు ఏమంటున్నారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)