You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
NEET EXAM: ఇద్దరు విద్యార్ధులకు సమానంగా మార్కులు వస్తే టాపర్‌ను ఎలా నిర్ణయిస్తారు?
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నీట్ పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాత ఆకాంక్షా సింగ్‌కు విశ్రాంతి దొరకడం లేదు. చాలామంది ఇంటికి వస్తున్నారు, వెళుతున్నారు.
పరీక్షలో ఆమెకు వచ్చిన ర్యాంకును చూసి అంతా అభినందిస్తున్నారు. ప్రిపరేషన్ సమయంలో కేవలం రెండు గంటలే నిద్రపోయేదట, చాలా గ్రేట్ అంటూ అందరూ మెచ్చుకుంటుంటే బాలిక తల్లి రుచీ సింగ్ కూడా ఎంతో ఉప్పొంగిపోయారు.
మెడికల్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించిన నీట్-2020లో ఆలిండియా రెండో ర్యాంక్ సాధించిన ఆకాంక్ష సింగ్ చాలా కష్టపడి చదివారు. ఢిల్లీలోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చదువుకోవాలన్న ఆకాంక్ష సింగ్ కల నెరవేరినందుకు కుటుంబ సభ్యులంతా చాలా సంతోషంగా ఉన్నారు.
న్యూరోసర్జన్ కావాలన్నది ఆకాంక్ష కోరిక. కానీ ఆమె కుటుంబానికి ఇప్పుడొక బాధ పట్టుకుంది. సోషల్ మీడియాలో నకిలీ ఐడీలతో తనకు అన్యాయం జరిగిదంటూ ఆకాంక్ష చెప్పినట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఏడాది నీట్ పరీక్షలో ఒడిశాకు చెందిన షోయబ్ ఆఫ్తాబ్, యూపీకి చెందిన ఆకాంక్ష సింగ్ ఇద్దరూ 720కి 720 మార్కులు సాధించారు. ఇద్దరికీ ఒకే ర్యాంక్ రావాలి. అయితే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ టై-బ్రేకింగ్ పాలసీ ప్రకారం, వయసులో పెద్ద వారికి మొదటి ర్యాంకు, చిన్నవారికి రెండో ర్యాంక్ ఇస్తారు. దీంతో ఆఫ్తాబ్‌కన్నా వయసులో చిన్నదైన ఆకాంక్ష రెండో ర్యాంక్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
నకిలీ సోషల్ మీడియా ఖాతాలు
తనకు అన్యాయం జరిగిందని, తనపై వివక్ష చూపుతూ రెండో ర్యాంకు ఇచ్చారని ఆకాంక్ష వాపోతున్నట్లుగా సోషల్ మీడియాలో మెసేజ్‌లు వైరల్ అవుతున్నాయి.
వాస్తవానికి ఆకాంక్షకు ఎలాంటి సోషల్ మీడియా ఎకౌంట్ లేదు. కానీ కొందరు ఆమె పేరు మీద నకిలీ ఖాతాలు తెరిచి, ఆమె చేసినట్లుగా ఆరోపణలు చేస్తున్నారు. ఈ సోషల్ మీడియా పోస్టుల పట్ల ఆమె కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.
“మొదట్లో నాకు బాధనిపించింది. కానీ ఎయిమ్స్‌లో సీటు ఇస్తారని తెలిసిన తర్వాత నేను సంతృప్తి చెందాను’’ అని ఆకాంక్ష సింగ్ వెల్లడించారు.
“మొదటి ర్యాంకు కాకుండా రెండో ర్యాంకు వచ్చినందుకు మా నాన్న రాజేంద్ర కుమార్ రావు కూడా బాధ పడలేదు. పెద్ద వాళ్లకు మొదటి ర్యాంకు ఇవ్వడం రూల్ ప్రకారం సరైనదే అని ఆయన చెప్పారు” అని ఆకాంక్ష వెల్లడించారు.
తన కూతురు పేరు మీద కొందరు నకిలీ సోషల్ మీడియా ఎకౌంట్లు తెరిచి ఆరోపణలు చేయడంపట్ల ఆకాంక్ష తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఖాతా కూడా లేని తమ కుమార్తె మీద దుష్ప్రచారం చేయడం తగదని ఆయన అన్నారు.
ఆకాంక్షకు రెండో ర్యాంకు రావడంపై తనకు ఎలాంటి అభ్యంతరంలేదని తేల్చి చెప్పిన ఆయన, ఇలా నకిలీ సోషల్ మీడియా ఐడీలు సృష్టిస్తున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించారు.
ఆకాంక్ష ఎంతో కష్టపడి చదివిందని, కేవలం రెండు, మూడు గంటలే నిద్రపోయేదని, సంగీతం వినుకుంటూ చదువుకోవడం ఆకాంక్షకు ఎంతో ఇష్టమని తండ్రి రాజేంద్రకుమార్ రావు తెలిపారు
ఎయిర్ ఫోర్స్‌లో పని చేసిన రాజేంద్రకుమార్ రావు రిటైర్మెంట్ తీసుకున్నారు. తల్లి రుచీ సింగ్ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయిని. తొమ్మిదో తరగతి వరకు ఆకాంక్షకు ఆమే క్లాసులు చెప్పేవారు.
చదువు కోసం అహర్నిశలు కృషి
ఆకాంక్ష బాగా చదువుతుందని, కుషీ నగర్‌లో సరైన కోచింగ్ సెంటర్లు లేనందున ఆమెను గోరఖ్‌పూర్ పంపించి కోచింగ్ ఇప్పించామని రుచీ సింగ్ అన్నారు.
గోరఖ్‌పూర్‌లో కోచింగ్‌కు వెళ్లడానికి ఆకాంక్ష స్కూల్‌లో రోజూ చివరి పీరియడ్‌ను వదులుకోవాల్సి వచ్చేదని, గోరఖ్‌పూర్ నుంచి ఆమె ఇంటికి రావడం ఆలస్యమైతే భయం వేసేదని తల్లి రుచీ సింగ్ తెలిపారు.
“నేను స్కూలుకు వెళ్లడానికి ముందే వంట చేసేదాన్ని. మధ్యాహ్నం గోరఖ్‌పూర్ బస్సు ఎక్కించేదాన్ని. ఆకాంక్ష కోచింగ్ సెంటర్‌కు చేరుకోగానే ఆమె చేరినట్లు టీచర్లు మెసేజ్ పంపేవారు. అక్కడ రెండు గంటల కోచింగ్ తర్వాత ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అయ్యేది. చాలాసార్లు ఆమెకు బస్సులో సీటు కూడా దొరికేది కాదు” అని తల్లి రుచీ సింగ్ గుర్తు చేసుకున్నారు.
“తను బస్టాండ్‌లో బస్సు దిగేదాకా మాకు దిగులుగానే ఉండేది. ఇప్పుడు ర్యాంకు రావడం మీకు ఎలా అనిపిస్తోందని చాలామంది అడుగుతున్నారు. ఇది చాలా కష్టమైన పని. కానీ ఆకాంక్ష కష్టపడి సాధించింది’’ అని రుచీ సింగ్ అన్నారు .
న్యూరోసర్జరీకి మంచి భవిష్యత్తు ఉందని, తాను కూడా అదే ఫీల్డ్‌లో పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆకాంక్ష సింగ్ తెలిపారు. తన ప్రాంతంలో అందరికీ వైద్యం అందించేందుకు కృషి చేస్తానని ఆకాంక్ష అన్నారు.
తన విజయానికి హార్డ్‌వర్క్, స్మార్ట్‌వర్క్ రెండూ కారణమేనంటారు ఆకాంక్ష. అంకిత భావంతో, సంయమనంతో ప్రణాళికలు వేసుకుని చదవాలని నీట్ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్ధులకు సూచించారామె.
ఇవి కూడా చదవండి:
- అంతరిక్షం నుంచి అందరికీ ఇంటర్నెట్.. కొత్త ఉద్యోగాలు వస్తాయ్
- విశాఖ: గుర్రం స్వారీ చేస్తూ బడికి వస్తున్న మాస్టారు
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- 11 ఏళ్ల హరిప్రియ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కన్నా ఎక్కువ.. అసలు ఐక్యూను ఎలా కొలుస్తారు?
- విక్రమ్ సారాభాయ్: ఈ శాస్త్రవేత్త అణుబాంబును వ్యతిరేకించారా
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- 1918లో 5 కోట్ల మందిని బలి తీసుకున్న స్పానిష్ ఫ్లూ కట్టడికి ఏం చేశారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)