బతికుండగానే ఫ్రీజర్‌లో పెట్టారు.. అయినా బతికాడు.. కానీ..

పొరపాటున చనిపోయాడని అనుకొని మార్చురీలోని ఫ్రీజర్‌లో పెట్టిన 74ఏళ్ల తమిళనాడు వృద్ధుడు నిజంగానే మరణించాడు.

సోమవారం బాలసుబ్రహ్మణ్యాన్ని అతడి బంధువులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అతడు చనిపోయాడని వైద్యులు ధ్రువీకరించారు. ఆయనకు ఏమైందో ఎవరికీ తెలియలేదు.

మరుసటి రోజు వరకు ఆయన్ను ఫ్రీజర్‌లోనే పెట్టారు. అయితే, ఆయన మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించడానికి వచ్చినవారిలో ఒకరు అతడి శరీరం వణుకుతుండటాన్ని గమనించారు. దీంతో అతడు బతికే ఉన్నాడని స్పష్టమైంది.

ఆయన్ను వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రాణాలతో పోరాడి శుక్రవారం ఆయన మరణించారు.

''తీసుకొచ్చేటప్పుడు ఆయన చాలా మత్తుగా ఉన్నారు. ఆయన్ను వెంటనే కాపాడగలిగాం. అయితే ఊపిరితిత్తుల సమస్యతో ఆయన కన్నుమూశారు''అని సేలంలోని ప్రభుత్వ ఆసుపత్రి డీన్ డాక్టర్ బాలాజీ నాథన్ చెప్పారు.

అయితే, ఎన్నిగంటలపాటు సుబ్రహ్మణ్యం ఫ్రీజర్‌లో గడిపారో తనకు తెలియదని బీబీసీ తమిళ్‌కు ఆయన వివరించారు.

సోమవారం ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు.. బాలసుబ్రహ్మణ్యం మరణించాడని ధ్రువీకరించారు. దీంతో అతణ్ని కుటుంబం ఇంటికి తీసుకెళ్లింది. ఫ్రీజర్ బాక్స్ కోసం వారు ఓ స్థానిక వ్యాపారిని సంప్రదించారు.

మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తామని బంధువులందరికీ వారు చెప్పారు.

మరోవైపు బాలసుబ్రహ్మణ్యం మరణానికి సంబంధించిన ధ్రువపత్రం తన దగ్గర ఉందని ఆయన సోదరుడు అంత్యక్రియలు నిర్వహించే వారికి తెలిపారు.

అయితే, వారి దగ్గర మరణ ధ్రువీకరణ పత్రం ఏమీలేదని సేలం పోలీస్ విభాగం అధిపతి సెంథిల్ కుమార్ తెలిపారు.

మరణ ముప్పు కలిగించడం, విపరీత ప్రవర్తన కింద కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదుచేశారు.

బాలసుబ్రహ్మణ్యానికి నాడీ సంబంధిత సమస్యలున్నాయని అతడి కుటుంబం పోలీసులకు తెలిపింది.

అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

అతడు గడ్డకట్టే ఉష్ణోగ్రతల నడుమ ఎలా బతికాడో తెలియడం లేదు. మరోవైపు అతడు మరణించాడని ఆ ప్రైవేటు ఆసుపత్రి ధ్రువీకరించిందో లేదో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు.

ఆ ప్రైవేటు ఆసుపత్రిని బీబీసీ సంప్రదించింది. అయితే వారు మాట్లాడేందుకు నిరాకరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)