You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎస్‌పీ బాలుకు భారతరత్న ఇవ్వాలి: మోదీకి జగన్ లేఖ - ప్రెస్ రివ్యూ
వివిధ భారతీయ భాషల్లో 40,000 పాటలు పాడి, భారతీయుల గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన అమర గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి దేశ అత్యున్నత పుస్కారమైన 'భారత రత్న ఇచ్చి గౌరవించాలని సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లుగా 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఈ మేరకు సోమవారం నాడు జగన్, ప్రధాని మోదీకి రాసిన లేఖలో... "సంగీత సామ్రాజ్యంలో ఐదు దశాబ్దాల పాటు విశేష ప్రతిభ ప్రదర్శించిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వడం అత్యున్నత స్థాయి గుర్తింపునిచ్చినట్లు అవుతుంది. ఆయనకు అదే నివాళి" అని పేర్కొన్నారు.
‘‘వివిధ భాషల్లో పాటలు పాడడమే కాకుండా అత్యుత్తమ నేపథ్య గాయకుడిగా ఆరు జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. తెలుగు సినిమాల్లో అత్యుత్తమ గాయకుడిగా 25 రాష్ట్ర స్థాయి నంది అవార్డులను సాధించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్ర అవార్డులను కూడా అనేకం గెలుచుకున్నారు" అని తెలిపారు.
"బాలు ఫిలింఫేర్ అవార్డు, ఫిలింఫేర్ దక్షిణాది ఉత్తమ గాయకుడుగా ఆరు అవార్డులు పొందారు. 2016లో భారత సినీ రంగ ప్రముఖుడుగా (ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్) ఆయనకు వెండి నెమలిని ప్రదానం చేసారు. ఎస్పీ బాలుకు కేంద్ర ప్రభుత్వం 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులను ఇచ్చి గౌరవించింది" అని తెలుపుతూ బాలును దేశ అత్యున్నత పురస్కారంతో సత్కరించవలసిందిగా కోరినట్లు ఆ కథనంలో పేర్కొన్నారు.
షూటింగ్ పూర్తి చేసుకున్న అవతార్-2
కరోనా కారణంగా ఆలస్యమైన అవతార్-2 చిత్రం షూటింగ్ మొన్న జూలైలో ఊపందుకున్నట్లు 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
అవతార్ చిత్రం అంతర్జాతీయంగా భారీ విజయం సాధించిన వెంటనే ఆ చిత్రానికి సీక్వెల్‌గా అవతార్-2 తీయనున్నట్లు చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ ప్రకటించారు. కానీ కరోనావైరస్ కారణంగా ఈ సినిమా షూటింగ్ పూర్తిచెయ్యలేకపోయారని, అయితే అనేక ఇబ్బందులను అధిగమించి మొన్న జూలైలో, న్యూజీలాండ్‌లో తిరిగి షూటింగ్ ప్రారంభించారని ఈ కథనంలో తెలిపారు.
"ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు జేమ్స్ మాట్లాడుతూ 'అవతార్ 2' షూటింగ్ పూర్తయిందని వెల్లడించారు. 'అవతార్ 3' షూటింగ్ కూడా 95 శాతం పూర్తయిందని, ప్రస్తుతం టీమ్ అదే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు.
కోవిడ్ -19 కారణంగా నాలుగున్నర నెలల సమయం వృధా అయిందనీ, దీని కారణంగా వచ్చే ఏడాది డిసెంబర్ లో 'అవతార్ 2' విడుదలవుతుందని ఆయన చెప్పారు. 'అవతార్ 2'లో అండర్ వాటర్ సీన్లు ఎక్కువగా ఉంటాయనీ, ఆ సీన్లు తీయడానికి కొన్ని నెలలు యూనిట్ సభ్యులంతా బాగా కష్టపడ్డారని జేమ్స్ తెలిపినట్లు" ఆంధ్రజ్యోతి కథనంలో రాశారు.
అవతార్ సినిమాకు నాలుగు సీక్వెల్స్ తీయనున్నట్లు ఎప్పటినుంచో ప్రచారంలో ఉంది. ఈ విషయాలను ప్రస్తావిస్తూ... "అవతార్ చిత్రం ఐదు భాగాలుగా ఉంటుందని దర్శకుడు జేమ్స్ మొదటే ప్లాన్ చేశారు. రెండు భాగాల షూటింగ్ దాదాపుగా పూర్తయింది. వీఎఫెక్స్, రీరికార్డింగ్, ఇతర పనులు మాత్రం మిగిలాయి. వచ్చే ఏడాది డిసెంబర్‌లో 'అవతార్ 2' చిత్రాన్నీ, 2024 డిసెంబర్ 20న 'అవతార్ 3' చిత్రాన్నీ విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. 'అవతార్ 4'ను 2026 డిసెంబర్ 18న, 'అవతార్ 5' భాగాన్ని 2028 డిసెంబర్ 22న విడుదల చేయాలని ఆలోచన" అని ఈ కథనంలో తెలిపారు.
యువ ఆటగాళ్లకు సలహాలివ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధం: సౌరవ్ గంగూలీ
పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలు ఉల్లంఘిస్తున్నాడంటూ తనపై వచ్చిన ఆరోపణలకు సౌరవ్ గంగూలీ జవాబిచ్చారని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.
ఐపీఎల్ 2020లో పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు దిల్లి కెప్టన్ శ్రేయాస్ అయ్యర్... తన ఆట తీరు మెరుగవ్వడానికి సౌరవ్ గంగూలీ, రిక్కీ పాంటింగ్ కారణమంటూ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
దీంతో, బీసీసీఐ అధ్యక్షుడి హోదాలో ఉంటూ, ఒక జట్టులోని క్రీడాకారుడికి ప్రత్యేకమైన శిక్షణనివ్వడం లేదా సలహాలివ్వడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల నిబంధనలు ఉల్లంఘిస్తున్నట్టు అవుతుందని గంగూలీపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ విమర్శలకు సమాధానమిస్తూ.. ఒక సీనియర్ ఆటగాడిగా, యువ క్రికెటర్లకు సలహాలిస్తానని గంగూలీ తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
"గతేడాది శ్రేయాస్ అయ్యర్‌కు సాయం చేసాను. ప్రస్తుతం నేను బీసీసీఐ అధ్యక్షుడిని కావొచ్చు. కానీ భారత్ తరపున దాదాపు 500 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాను. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. సీనియర్ ఆటగాడిగా యువ క్రికెటర్లకు సహాయం చేస్తా. అది శ్రేయాస్ కావొచ్చు లేదా విరాట కోహ్లీ కావొచ్చు. వారికి నా సలహాలు కావాలంటే కచ్చితంగా ఇస్తాను" అని దాదా తెలిపినట్లు ఈనాడు కథనంలో పేర్కొన్నారు.
తెలంగాణలో భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం: మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్రంలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపే దిశలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చిందని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు వివరించినట్లు 'నవ తెలంగాణ' ఒక కథనంలో పేర్కొంది.
సోమావారం నాడు ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని రెవెన్యూ సమస్యలను సమీక్షించడానికి నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ "ప్రజల సమస్యలను పరిష్కరించేలా.. ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామ"ని తెలిపినట్లు ఈ కథనంలో పేర్కొన్నారు.
"ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదన్నారు. ఆస్తుల నమోదుకు సంబంధించి దళారులను నమ్మొద్దన్నారు. ఎవరికీ ఒక్క పైసా కూడా ఇవ్వొద్దని సూచించారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
దేవాదాయ, వక్ఫ్, పరిశ్రమలు తది తర భూముల్లో వివాదాల వల్ల యాజమాన్యపు హక్కు లేని భూముల సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం కషి చేస్తున్నదన్నారు. జీవో నంబర్ 58, 59 ద్వారా ప్రభుత్వ భూములు, ఎలాంటి వివాదాలు లేని స్థలాలను మాత్రమే క్రమబద్ధీకరణ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మిగతా సమస్యలు పరిష్కారానికి కూడా ప్రణా ళికలు రూపొందిస్తున్నామని తెలిపారు" అంటూ ఆంధ్రజ్యోతి తన కథనంలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- గ్వాదర్: ఒమన్ నుంచి ఈ ప్రాంతం పాకిస్తాన్లో ఎలా కలిసింది? భారత్ మంచి అవకాశం వదులుకుందా?
- కరోనావైరస్: వ్యాక్సీన్ ముందుగా ఎవరికి అందుతుంది? పేద దేశాలకు ఎవరు ఇస్తారు? ఎలా ఇస్తారు?
- ఐక్యరాజ్యసమితి అంటే ఏమిటి? అది ఏం చేస్తుంది?
- అండమాన్ కాలాపానీలో బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మేయో హత్య.. ‘‘ద ఫస్ట్ జిహాద్’’
- కోటీశ్వరుడైన యజమానితో పనిమనిషి పోరాటం.. ఎందుకు? ఎవరు గెలిచారు?
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- వాడి పడేసిన 3 లక్షల కండోమ్‌లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)