You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పీఎంసీ బ్యాంకు కుంభకోణం: ''డబ్బూ పోయింది.. కొడుకునూ కోల్పోయాం''
భారత్‌లోని పంజాబ్, మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంక్ (పీఎంసీ) కుంభకోణం జరిగి ఏడాది దాటింది. అయితే, తాము దాచుకున్న డబ్బు ఎప్పుడు వస్తుందోనని లక్షల మంది ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. వారి గాథలపై బీబీసీ ప్రతినిధి నిధి రాయ్ అందిస్తున్న కథనం.
2019, సెప్టెంబరు 20న రౌనాక్ మోదీ.. తన దగ్గరున్న డబ్బుతోపాటు ఇంట్లో వారి దగ్గర ఉన్నడబ్బునూ పీఎంసీ బ్యాంకులోని తమ ఖాతాలో జమ చేశారు.
డబ్బులు పొదుపు చేసేందుకు ఎక్కువ మంది ఆశ్రయించే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఆ బ్యాంకు ఎక్కువ వడ్డీ ఇచ్చేది.
దీంతో ముంబయిలోని ఇంటిని అమ్మితే వచ్చిన డబ్బును కూడా రౌనక్.. బ్యాంకులోనే జమ చేశారు. తన భార్య, పిల్లలకు మంచి జీవితాన్ని అందించేందుకు ఆ డబ్బులతో ఓ బిజినెస్ పెట్టాలని ఆయన అనుకున్నారు.
అయితే, మూడు రోజుల తర్వాత ఆయన జీవితం తలకిందులైంది. పీఎంసీ ఖాతాలను భారత రిజర్వు బ్యాంక్ స్తంభింపజేసినట్లు టీవీలో వార్తవిని ఆయన విస్మయానికి గురయ్యారు. 650 కోట్ల రూపాయల నిరర్ధక రుణాలను దాచిపెట్టినట్లు బ్యాంకుపై ఆరోపణలు వచ్చాయి.
దీంతో పీఎంసీలోని డబ్బులను వెనక్కి తీసుకునేందుకు దేశ వ్యాప్తంగా బ్యాంకు బ్రాంచీల్లో గుమిగూడిన వారితో రౌనక్ కూడా కలిశారు. అయితే ఏడాది గడుస్తున్నా తొమ్మిది లక్షల కంటే ఎక్కువ మందే తమ డబ్బుల కోసం ఇంకా ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
అలా ఎదురుచూసిన వారిలో 24ఏళ్ల రౌనక్ కూడా ఒకరు. అయితే ఇటీవల ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.
''ఆయన అంతర్మథనం నాకు తెలియలేదు''
''రోజూ మంచి జరుగుతుందని తను ఆశించేవాడు. వ్యవస్థపై తనకు అపారమైన నమ్మకముంది''అని రౌనక్ తండ్రి రాజేంద్ర మోదీ తెలిపారు.
అయితే, నెలలు గడిచేకొద్దీ అతడిలో నమ్మకం ఆవిరైందని రాజేంద్ర తెలిపారు. కరోనావైరస్ నడుమ ఏప్రిల్‌లో రౌనక్ ఉద్యోగం పోయింది. ఆ తర్వాత భార్య కూడా అతణ్ని వదిలేసి పోయారు. అయినప్పటికీ డబ్బులు వస్తాయేమోనని అతడు బ్యాంకు చుట్టూ తిరిగేవాడు.
బ్యాంకుకు సంబంధించిన సమాచారాన్ని షేర్‌చేసే మూడు వాట్సాప్ గ్రూప్‌లలో అతడు సభ్యుడిగా ఉన్నాడు.
ఆ గ్రూప్‌లోని వారితోపాటు మరికొందరు ఖాతాదారులు నిరసనలు చేపట్టారు. కోర్టులో పిటిషన్లు వేశారు. అధికారులు, రాజకీయ నాయకులకు లేఖలు రాశారు.
వారిలో కొందరికి రౌనక్ వయసుంటే.. మరికొందరికి 60ఏళ్లపైనే ఉంటాయి. పదవీ విరమణ కోసం తాము దాచుకున్న డబ్బులు ఇకపై అందబోవని తెలిసిన వృద్ధులైతే తీవ్ర ఆందోళన చెందారు. కొందరైతే 80ల వయసులో ఉన్నవారూ ఉన్నారు. వారికి ప్రత్యామ్నాయం ఆలోచించడానికి శక్తి కూడా లేదు.
''డబ్బుల విషయంలో రౌనక్ నిస్సహాయంగా, ఆందోళనతో ఉండేవాడు. అయితే ఆ ఒత్తిడి ఎంత ఉంది అనేది మేం గుర్తించలేకపోయాం''అని రౌనక్ కుటుంబం చెబుతోంది.
''మేం దాచుకున్నది మొత్తం పోయింది. ఇప్పుడు కొడుకునూ పోగొట్టుకున్నాం''అని రాజేంద్ర వివరించారు.
చాలా మంది డబ్బులు పోగొట్టుకున్నవారు ఇలానే సతమతం అవుతున్నారు.
64ఏళ్ల కుల్‌దీప్ కౌర్ విగ్‌కు అయితే.. వార్త వినగానే గుండె పోటు వచ్చింది. గుండె శస్త్రచికిత్సకు కుటుంబం డబ్బులు సమకూర్చలేకపోవడంతో 83ఏళ్ల మురళీధర్ ధర్రా మరణించారు. వైద్యానికి డబ్బులు లేకపోవడంతో 74ఏళ్ల ఆండ్ర్యూ లోబో కన్నుమూశారు. నవంబరులో ఇతర ఖాతాదారులతోపాటు నిరసన తెలిపిన అనంతరం 51ఏళ్ల సంజయ్ గులాటీ గుండె పోటుతో మరణించారు.
పీఎంసీకి ఏమైంది?
1984లో ఈ బ్యాంకును స్థాపించారు. దేశ వ్యాప్తంగా 100కుపైనే ఈ బ్యాంకు బ్రాంచీలు ఉండేవి. దేశంలోని 1540పైచిలుకు కో-ఆపరేటివ్ బ్యాంకులలో ఇది కూడా ఒకటి. ఈ కో-ఆపరేటివ్ బ్యాంకుల్లో మొత్తం బ్యాంకు డిపాజిట్లలో 11 శాతం ఉన్నాయి. తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడంతో ఈ బ్యాంకులు ప్రాచుర్యం పొందాయి. కొన్నిసార్లు ఇవి నగదుపై ఇతర బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి.
అయితే, పీఎంసీ బ్యాంకు కుంభకోణంతో అసలు నిజాలు బయటపడ్డాయి. సరైన నియంత్రణ లేకపోవడంతో నిబంధనలను ఈ బ్యాంకు ఎలా తుంగలోకి తొక్కిందో వెలుగులోకి వచ్చింది.
చనిపోయిన వారి పేర్లతో డమ్మీ ఖాతాల ద్వారా రియల్ ఎస్టేట్ కంపెనీ హౌసింగ్ డెవలప్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (హెచ్‌డీఐఎల్)కు బ్యాంకు రుణాలు ఇచ్చింది. ఆ సంస్థ చెల్లింపులు ఆపేయడంతో దాన్ని కప్పి పుచ్చేందుకు బ్యాంకు యాజమాన్యం ప్రయత్నించింది.
పీఎంసీ రుణాల్లో 75 శాతం హెచ్‌డీఐఎల్ తీసుకున్నవే ఉన్నాయి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఒక గ్రూపు ఒక బ్యాంకు నుంచి 15 శాతం కంటే ఎక్కువ రుణం తీసుకోకూడదు.
అయితే, రుణం మరింత పెరగడంతో ఈ విషయాన్ని ఆర్‌బీఐకి పీఎంసీ బ్యాంకు తెలియజేయాల్సి వచ్చింది. రుణాలకు ఎలాంటి పూచికత్తు లేకపోవడంతో పీఎంసీ బ్యాంకు ఖాతాల నుంచి నగదు ఉపసంహరణలను ఆర్‌బీఐ నియంత్రించింది. ఒక వ్యక్తి 13 డాలర్ల కంటే ఎక్కువ తీసుకోకుండా నిబంధనలు తీసుకొచ్చింది. ఈ మొత్తాన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది. ప్రస్తుతం ఇది 1,350 డాలర్లుగా ఉంది.
ఈ వివాదానికి సంబంధించి మోసం, అక్రమ నగదు చెలామణి, దొంగ సంతకాలు తదితర ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపడుతోంది. మరోవైపు మోసపూరిత కుట్ర ఆరోపణలపై ఆర్‌బీఐ కూడా కేసు వేసింది.
చాలా ఆలస్యం
ప్రస్తుతం కో-ఆపరేటివ్ బ్యాంకులపై ఆర్‌బీఐ నియంత్రణను పెంచింది. అయితే ఇప్పటికే చాలా ఆలస్యమైందని డిపాజిటర్లు అంటున్నారు.
''మా ఇల్లు గడిపేందుకు సన్నిహితులు, కుటుంబ సభ్యులు, మిత్రుల నుంచి డబ్బు తీసుకుంటున్నాం. మేం ఉంటున్న ఇంటికి ఆరు నెలలుగా నిర్వహణ బిల్లులు కూడా కట్టలేదు''అని 60ఏళ్ల అనిత లోహియ చెప్పారు.
ఆమెతోపాటు ఆమె భర్త కూడా ఉద్యోగాల నుంచి పదవీ విరమణ పొందారు. ముంబయిలోని పీఎంసీలోని ఓ బ్రాంచ్‌లో వీరికి నాలుగు ఖాతాలు ఉన్నాయి.
''మేం మోసపోయాం. పైగా వృద్ధులం. మందులు కొనుక్కోవాలి. చెకప్‌లకు వెళ్లాలి. ఈ ఖర్చులన్నీ ఎలా భరించాలి?''
అధికారులను కలిసేందుకు తాము ప్రయత్నించామని, కానీ ఎలాంటి ప్రయోజనమూ లభించలేదని ఆమె అన్నారు.
''మేం అడుక్కునే వాళ్లం కాదు. అది మా డబ్బే. కానీ బ్యాంకులో ఇరుక్కుపోయింది''
కొందరు డిపాజిటర్లు గందరగోళంలోనే ఉండిపోయారు. ''ప్రమాదకరమైన విధానాలు అవలంబించేలా బ్యాంకును ఎందుకు అనుమతించారు? అసలు ఆర్‌బీఐ ఏం చేస్తోంది''అని 60ఏళ్ల కల్యాణి షేక్ ప్రశ్నించారు.
నిరర్ధక రుణాలను గుర్తించి, తెలియజేసేందుకు భారత్ 2016లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ బ్యాంకుల సంక్షోభం కొనసాగుతూనే ఉంది. ఈ ఒక్క ఏడాదిలోనే 44 కో-ఆపరేటివ్ బ్యాంకులు ఆర్థిక అవకతవకలకు పాల్పడటంతో నగదు ఉపసంహరణపై ఆర్‌బీఐ నియంత్రణలు విధించింది.
పీఎంసీ బ్యాంకు మునుపటి స్థితికి వచ్చేసరికి చాలా సమయం పడుతుందని ఆర్‌బీఐ తెలిపింది. ఇలాంటి సమయంలో బ్యాంకును ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రావడంలేదు.
కరోనావైరస్ వ్యాప్తి నడుమ అప్పులు ఎగవేసే అవకాశమున్న వారికి కో-ఆపరేటివ్ బ్యాంకులు ఎక్కువగా రుణాలు ఇస్తున్నాయని, దీంతో ముప్పు మరింత పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు.
అయితే, పీఎంసీ సంక్షోభానికి మరో కారణం కూడా ఉందని బిజినెస్ జర్నలిస్టు సుచేతా దలాల్ అభిప్రాయపడ్డారు.
''పీఎంసీ డిపాజిటర్లు సరైన వారిని సంప్రదించడం లేదు. బ్యాంకును గట్టెక్కించే ఓ సంస్థ సాయంతో ఆర్‌బీఐ ఈ సమస్య పరిష్కరించగలదు. కానీ రాజకీయ సంకల్పం కొరవడింది''
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)