కరోనావైరస్: భారతదేశంలో కోవిడ్ సమస్య మనం అనుకున్న దానికన్నా పెద్దది... ఎందుకంటే?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారతదేశంలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తికి తొమ్మిదో నెల మొదలైంది. ఇప్పటి వరకూ 50 లక్షలకు పైగా కేసులు నిర్ధరణ అయ్యాయి. ప్రపంచంలో కేసుల సంఖ్యలో అమెరికా తర్వాత రెండో స్థానంలో ఉంది. కోవిడ్ మరణాల సంఖ్య కూడా 80,000 దాటిపోయింది.

దేశంలో కరోనా వ్యాప్తి అంచెలంచెలుగా పెరిగిపోతోందని ప్రభుత్వ శాస్త్రవేత్త ఒకరు నాతో చెప్పారు. ఇందులో ఒకటే ఊరట ఏమిటంటే.. మరణాల రేటు. ప్రస్తుతం 1.63 శాతంగా ఉంది. అధిక సంఖ్యలో కేసులు ఉన్న చాలా దేశాలతో పోల్చినపుడు ఇది తక్కువ.

కేసుల సంఖ్య పెరగటానికి ఒక కారణం.. పరీక్షల సంఖ్య పెరగటం. కానీ వైరస్ వ్యాపిస్తున్న వేగం నిపుణులను ఆందోళనకు గురిచేస్తోంది.

ఎందుకు? దేశంలో తొలి పది లక్షల కేసులు నమోదవటానికి 170 రోజులు పట్టింది. చివరి 10 లక్షల కేసులు నమోదవటానికి కేవలం 11 రోజులు పట్టింది. ఏప్రిల్ నెలలో సగటు రోజు వారీ కేసుల సంఖ్య 62గా ఉంటే.. సెప్టెంబర్‌లో అది ఏకంగా 87,000కు దూసుకుపోయింది.

గడచిన వారంలో రోజుకు 90,000కు పైగా కేసులు, దాపు 1,000 మరణాలు చొప్పున నమోదయ్యాయి. ఏడు రాష్ట్రాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. దేశంలోని మొత్తం జనాభాలో ఈ రాష్ట్రాల వాటా 48 శాతంగా ఉంది.

అయితే.. ఒకవైపు వైరస్ వ్యాప్తి అమాంతంగా పెరుగుతున్నా కూడా దేశంలో అన్ని రంగాలనూ ప్రారంభిస్తున్నారు. దశాబ్దాల కాలంలో అత్యంత తీవ్ర మాంద్యాన్ని చవిచూస్తున్న ఆర్థికవ్యవస్థకు మరమ్మతు చేయటం కోసం.. పని ప్రదేశాలు, ప్రజా రవాణా, హోటళ్లు, జిమ్‌లు అన్నిటినీ పునఃప్రారంభిస్తున్నారు.

ప్రపంచంలో అత్యంత క్రూరమైన లాక్‌డౌన్ కారణంగా జనం ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. వ్యాపారాలు మూతపడ్డాయి. కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు నగరాల్లో ఉద్యోగాలు కోల్పోయి తమ స్వస్థలాలకు కాలినడకన, బస్సులు, రైళ్లలో వలస వెళ్లారు.

కానీ కేసులు విపరీతంగా పెరుగుతున్నా ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరిస్తున్నప్పటికీ.. దాని మీద లాక్‌డౌన్ ప్రభావం ఉందని నోమురా ఇండియా బిజినెస్ రిసంప్షన్ ఇండెక్స్ చెప్తోంది.

కేసుల సంఖ్య మరింత అధికంగా ఉండొచ్చు

ఇప్పటివరకూ 50 లక్షల మందికి పైగా భారతీయులకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో గుర్తించారు. ప్రతి రోజూ పది లక్షలకు పైగా సాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. అయినప్పటికీ.. ప్రపంచంలో పరీక్షల రేటున్న అతి తక్కువగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.

కాబట్టి దేశంలో వాస్తవంగా వైరస్ సోకుతున్న రేటు గుర్తించిన దానికన్నా చాలా ఎక్కువగా ఉందని ఎపిడమాలజిస్టులు సూచిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ప్రజలపై నిర్వహించిన నమూనా సాంపిల్ యాంటీబాడీ పరీక్షల సర్వేలో.. మే ఆరంభంలో 64 లక్షల కేసులు ఉన్నట్లు అంచనా వేశారు. కానీ అప్పటికి నమోదైన కేసుల సంఖ్య కేవలం సుమారు 52,000 మాత్రమే.

ఈ మహమ్మారి వ్యాప్తిని నిశితంగా గమనిస్తున్న యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో బయోస్టాటిస్టిక్స్ అండ్ ఎపిడమాలజీ ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ.. ప్రస్తుతం దేశంలో 10 కోట్లకు పైగా కేసులు ఉన్నట్లు తన నమూనా సూచిస్తోందని చెప్తున్నారు.

''హెర్డ్ ఇమ్యూనిటీ (సామూహిక రోగనిరోధక శక్తి) మార్గంలో భారతదేశం వేగంగా ముందుకు పోతున్నట్లు నేను భావిస్తున్నాను. మాస్కులు ధరించటం, సామాజిక దూరం పాటించటం వంటి నివారణ చర్యలను అందరూ సీరియస్‌గా పట్టించుకుంటున్నారని ఖచ్చితంగా భావించలేను'' అని ఆమె పేర్కొన్నారు.

ఒక వైరస్‌ వ్యాప్తిని నిరోధించటానికి దాని పట్ల తగినంత మంది రోగనిరోధక శక్తిని సంతరించుకున్నపుడు దానిని సామూహిక రోగనిరోధక శక్తి సాధించినట్లుగా పరిగణిస్తారు.

''వైరస్‌కు అలవాటుపడిపోవటం, దానిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించటం, విసిగిపోవటం, తిరస్కారభావం, ఏదైతే అదవుతుందనే తెగువ, ఈ భావనలన్నీ కలిసివుండటం దీనికి కారణం కావచ్చు. రోజుకు వేయి మరణాలు అనేది మామూలు విషయంగా మారిపోయినట్లు కనిపిస్తోంది'' అని భ్రమర్ ముఖర్జీ వ్యాఖ్యానించారు.

కరోనావైరస్ గురించి మీరు తెలుసుకోవాల్సింది ఏంటి?

ఇన్ఫెక్షన్లు విపరీతంగా పెరుగుతున్నంత కాలం.. ఆర్థికవ్యవస్థ పూర్తిగా కోలుకోవటం ఆలస్యమవుతూ ఉంటుంది. పెరుగుతున్న కేసులతో ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాలు నిండిపోతూ ఉంటాయి.

ప్రస్తుత కేసుల సంఖ్య పెరుగుతున్న తీరును 'తొలి కెరటం అనే దానికన్నా తొలి పోటు' అని అభివర్ణిస్తున్నారు దిల్లీ కేంద్రంగా పనిచేసే మేధో బృందం 'పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా' అధ్యక్షుడు కె.శ్రీనాథ్ రెడ్డి.

''అలలు ప్రారంభమైన ప్రాంతం నుంచి బయటివైపుకు కదులుతాయి.. అందులో భిన్నమైన సమయాలు, విస్తరణలు, ఎత్తుల్లో తేడాలు ఉంటాయి. అటువంటి అలలు కలిసి ఒక పెద్ద పోటు అవుతాయి. అంటే ఆ పోటు లక్షణాలు ఇంకా కొనసాగుతాయి'' అని ఆయన వివరించారు.

ఇంకా ఎందుకు విపరీతంగా పెరుగుతున్నాయి?

''కదలికలు పెరగటానికి తోడు.. సామాజిక దూరం పాటించటం, మాస్కులు ధరించటం, వ్యక్తిగత పరిశుభ్రత పాటించటం తగ్గిపోతుండటం వల్ల వైరస్ మళ్లీ విజృంభిస్తుంది'' అని డాక్టర్ భ్రమర్ ముఖర్జీ పేర్కొన్నారు.

ఉమ్మడి కుటుంబాల్లో నివసించే వృద్ధుల్లో అందులోనూ తీవ్రంగా జబ్బుపడిన వారిలో ఈ వైరస్ సోకిన వారి సంఖ్య విపరీతంగా పెరుగతున్నట్లు తాము గుర్తించామని రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఒక పెద్ద ఆస్పత్రిలో పనిచేసే ఒక డాక్టర్ నాతో చెప్పారు.

భారతదేశంలో ''మహమ్మారి కొండచరియ లాగా విరుచుకుపడబోతోంద''ని ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ టి.జాకబ్ జాన్ గత మార్చిలోనే హెచ్చరించారు.

లోపభూయిష్టమైన ప్రజారోగ్య వ్యవస్థ గల ఒక విస్తారమైన దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదమవటం 'అనివార్యం' అని ఆయన ప్పుడు అంటున్నారు. అయినప్పటికీ అంతటి భారీ సంఖ్యలో కేసులు రాకుండా నివారించగలిగి ఉండవచ్చునని.. అలా చేయలేకపోవటానికి లాక్‌డౌన్ విధించిన సమయమే కారణమని ఆయన తప్పుపట్టారు.

వైరస్ వ్యాప్తి ప్రారంభమైన కొన్ని నగరాల్లో పాక్షికంగా, చక్కటి పర్యవేక్షణలో లాక్‌డౌన్ విధించినట్లయితే పరిస్థితి మెరుగుగా ఉండేదని చాలా మంది నిపుణులు అంగీకరిస్తున్నారు.

''ఒక లాక్‌డౌన్ ఏం చేయకూడదో అదే చేసింది.. అందుకే విఫలమైంది'' అంటారు ప్రపంచ బ్యాంక్ మాజీ చీఫ్ ఎకానమిస్త్ కౌశిక్ బసు. ''జనం పెద్ద సంఖ్యలో తమ ఇళ్లకు వెళ్లే ప్రయత్నంలో కాలినడకన దేశమంతా తిరిగేలా చేసింది. ఎందుకంటే వారికి వేరే దారి లేదు. ఫలితంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. వైరస్ వ్యాపించటం కొనసాగింది'' అని ఆయన పేర్కొన్నారు.

కానీ లాక్‌డౌన్ ప్రజల ప్రాణాలను కాపాడగలిగిందని డాక్టర్ రెడ్డి వంటి ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు.

''లాక్‌డౌన్ విధించిన సమయం సరైనదేనా అని అది ముగిసిపోయిన తర్వాత తీర్పు చెప్పటం సులభం కాదు. బ్రిటన్‌లో సైతం లాక్‌డౌన్ విధించటంలో ఆలస్యమైందని.. ముందుగా లాక్‌డౌన్ విధించినట్లయితే మరిన్ని ప్రాణాలను కాపాడి ఉండగలిగేవారనే విమర్శలు ఉన్నాయి'' అని ఆయన ఉటంకించారు.

'ప్రతి మరణం.. ఒక ఆప్తుల ముఖమే'

లాక్‌డౌన్ ప్రభావం ఏదైనా కానీ.. వైరస్ గురించి మరింత తెలుసుకోవటానికి, మార్చి నెలకు ముందు లేనటువంటి చికిత్స చేసే విధివిధానాలను, నిఘా వ్యవస్థలను నెలకొల్పటానికి అవసరమైన సమయం దానివల్ల లభించిందని ఎపిడమాలజిస్టులు చెప్తున్నారు.

ఇప్పుడు చలికాలం రాబోతోంది. ప్రస్తుతం దేశంలో 15,000కు పైగా కోవిడ్-19 చికిత్స కేంద్రాలు ఉన్నాయి. 10 లక్షలకు పైగా ప్రత్యేక ఐసొలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయి.

మార్చిలో ఉన్నట్లుగా మాస్కులు, రక్షణ పరికరాలు, వెంటిలేటర్ల కొరత ఇప్పుడు ఉన్నట్లు వినిపించటం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆక్సిజన్ సరఫరాలో లోటుపాట్లు ఉన్నాయి.

''మన వైద్య సదుపాయాలు, కోవిడ్-19 చికిత్స సదుపాయాలను బలోపేతం చేయటం.. మరణాల రేటును తక్కువగా ఉంచటానికి దోహదపడింది'' అంటారు డాక్టర్ ముఖర్జీ.

అయినప్పటికీ.. ఇప్పటికే బలహీనంగా ఉన్న ప్రజారోగ్య వ్యవస్థను ఈ మహమ్మారి దాదాపుగా పతనం అంచుకు తీసుకెళ్లింది.

''ఈ సంక్షోభ సమయంలో మహమ్మారి విషయంలో అలుపు లేని పోరాటపటిమను అర్థం చేసుకోవాలంటే.. భారతదేశంలో ప్రజారోగ్య సిబ్బంది, రోగులు, కుటుంబాలు అంటువ్యాధులు, అధికంగా సోకే జబ్బులను పరిమిత వనరులతోనే ఉత్తమంగా ఎదుర్కొంటున్నారనే విషయాన్ని మనం గమనంలో పెట్టుకోవాల్సి ఉంటుంది'' అని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెడికల్ ఆంత్రోపాలజిస్ట్ ద్వైపాయన్ బెనర్జీ చెప్పారు.

మరో మాటలో చెప్తే.. జబ్బులు, వ్యాధులను ఎదుర్కోవటంలో అలుపులేని పోరాటపటిమ భారత ప్రజా వైద్య వ్యవస్థ విశిష్ట లక్షణం.

కానీ డాక్టర్లు, వైద్య సిబ్బంది కొన్ని నెలలుగా విరామం లేకుండా పనిచేస్తున్నారు.

''ఈ పనికి అంతూపొంతూ లేకుండా పోయింది. మేం అలసిపోయాం'' అంటారు డాక్టర్ రవి దోసి. ఇండోర్ నగరంలో 4,000 మందికి పైగా కోవిడ్-19 రోగులకు ఆయన చికిత్స చేశారు. మార్చి నుంచి రోజుకు 20 గంటలకు పైగా పని చేస్తున్నానని ఆయన చెప్తున్నారు.

ఇక ఇప్పటికే ప్రజారోగ్య వ్యవస్థలో లోతైన పగుళ్లు బహిర్గతమయ్యాయి. ఈ వైరస్ నగరాల నుంచి గ్రామాలకు పాకటం వల్ల ఇది ప్రధానంగా బయటపడింది.

అన్ని రాష్ట్రాలూ ఒక నియంత్రణ స్థాయికి వచ్చే వరకూ ఇది నెమ్మదిగా, స్థిరంగా పెరుగుతూ పోతుందని డాక్టర్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు.

''భారతదేశానికి సమన్వయంతో కూడిన దీర్ఘకాలిక సమాఖ్య వ్యూహం అవసరం.. మీడియాలో పతాక శీర్షకలను ప్రభుత్వం మేనేజ్ చేయటం కాదు'' అని ఆమె వ్యాఖ్యానించారు.

కోవిడ్ మరణాల రేటు - కోవిడ్ మరణాల సంఖ్యను వాస్తవ కోవిడ్ కేసుల సంఖ్యతో భాగించగా వచ్చే అనుపాతం - అతి తక్కువగానే ఉండాలనేది ఆమె ఏకైక ఆశ.

''అయినప్పటికీ.. కేసుల సంఖ్యలో మరణాల రేటు 0.1 శాతంగా ఉన్నా కూడా.. దేశ జనాభాలో 50 శాతం మందికి వైరస్ సోకినట్లయితే 6,70,000 మరణాలు ఉంటాయి. ప్రతి మరణమూ ఒక ఆత్మీయుల ముఖమే.. ఏదో ఒక సంఖ్య కాదు'' అంటారామె.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)