క‌శ్మీర్: "స్వేచ్ఛ‌గా మాట్లాడితే న‌న్ను జైలులో పెడ‌తారు"

గ‌త ఏడాది ఆగ‌స్టు 5న జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని క‌ల్పించే ఆర్టిక‌ల్ 370ని కేంద్రం ర‌ద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు‌గానూ విభ‌జించింది. అప్ప‌టినుంచీ ఇక్క‌డ అసాధార‌ణ లాక్‌డౌన్ న‌డుస్తోంది. ఈ చ‌ర్య‌లు భావ ప్ర‌క‌ట‌న స్వేచ్ఛ‌కు ఎలా విఘాతం క‌లిగిస్తున్నాయో శ్రీన‌గ‌ర్ నుంచి జ‌హంగీర్ అలీ వివ‌రిస్తున్నారు.

ప్ర‌త్యేక ప్ర‌తిప‌త్తిని న‌రేంద్ర మోదీకి చెందిన అధికార భార‌తీయ పార్టీ తొల‌గించిన కొన్ని నెల‌ల త‌ర్వాత‌.. ముస్లింలు ఎక్కువగా ఉండే క‌శ్మీర్ లోయ‌లో త‌న కుమారుడి స్నేహితుడికి ఓ మ‌హిళ జాగ్ర‌త్త‌లు చెప్పారు.

"నా మీద ఒట్టు.. నువ్వు ఇంట్లోనే ఉండు"అని ఇష్ఫాక్ కావాతో ష‌మీనా బానో అన్నారు.

యాపిల్ రైతు భార్య అయిన 58 ఏళ్ల బానో చాలా భ‌య‌ప‌డుతున్నారు.

2014లో క‌ల్లోలిత షోపియాన్ జిల్లాలో త‌న‌ కొడుకు, 27ఏళ్ల‌ ఆషిక్ హుస్సేన్ ఇలానే బ‌య‌ట‌కు వెళ్లాడు. కానీ మ‌ళ్లీ తిరిగి రాలేదు.

జ‌మ్ముక‌శ్మీర్‌లో తీవ్ర‌వాదం కార్య‌కలాపాల న‌డుమ గ‌త 20ఏళ్లుగా అదృశ్య‌మ‌వుతున్న వారిలో ఆషిక్ కూడా ఒక‌రు.

భ‌ద్ర‌తా బ‌ల‌గాలు త‌మ కుమారుణ్ని తీసుకెళ్లి ఉంటాయ‌ని బానో భావిస్తున్నారు. అయితే మేం ఎవ‌రినీ తీసుకెళ్లలేద‌ని భార‌త సైన్యం చెబుతోంది.

8 ల‌క్షల మందికి నిల‌య‌మైన ముస్లిం ఆధిక్య లోయ‌లో చోటుచేసుకుంటున్న‌ క‌ల్లోలిత ఘ‌ర్ష‌ణ‌ల్లో గ‌త ఆగ‌స్టు ప‌రిణామాలు కూడా ఒక‌ట‌ని ఆమె చెబుతున్నారు.

ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేసిన వెంట‌నే లోయ‌లో స‌మాచార ప్ర‌సార సాధనాలపై ఆంక్ష‌లు విధించారు. వేల మంది రాజ‌కీయ నాయ‌కులు, వ్యాపార వేత్త‌లు, ఉద్య‌మ‌కారుల‌ను నిర్బంధించారు. నిర‌స‌న‌ల‌ను అడ్డుకున్నారు.

నిర‌స‌న‌కారుల‌ను కొట్టార‌ని, చిత్ర హింస‌లు పెట్టార‌ని వ‌చ్చిన వార్త‌ల‌ను భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తోసిపుచ్చాయి. ఇలాంటి వార్త‌లు నిరాధార‌మైన‌వ‌ని భార‌త్ ప‌దేప‌దే చెబుతూ వ‌స్తోంది.

బానో సూచ‌న‌ల‌ను కావా సీరియ‌స్‌గా తీసుకున్నారు.

ఓ ఆటోమొబైల్ సంస్థ‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్‌గా ప‌నిచేస్తున్న ఆయ‌న ఉద్యోగం ఊడిపోయింది. దీంతో ఆయ‌న క‌విత్వం రాయ‌డం మొద‌లుపెట్టారు.

తాను దాచుకున్న డ‌బ్బుల‌తోపాటు స్నేహితుల నుంచి కొంత అప్పు తీసుకుని త‌న రూమ్‌ను ఆయ‌న తాత్కాలిక రికార్డింగ్ స్టూడియోగా మార్చేశారు. త‌న క‌విత‌ల‌ను పాట‌గా మ‌ల‌చాల‌ని ఆయ‌న భావించారు.

"ఒక‌రోజు నా కోసం అంతా నువ్వు వెతుకుతావు. నీ క‌ళ్లు నా కోసం కంట త‌డిపెడ‌తాయి. నీ మ‌న‌సు నా కోసం ఎదురుచూస్తుంది. ఓ క‌ల‌లా మ‌ళ్లీ నేను వ‌స్తాను"అంటూ ఆయ‌న పాట‌ల్లో ఒక పాట సాగిపోతుంటుంది.

"ఎడ‌బాటు బాధ‌ను పాట‌తో చెప్పాల‌ని అనుకున్నాను. అది ఓ కొడుకు కోసం ఎదురుచూస్తున్న త‌ల్లి కావొచ్చు.. ప్రియురాలు, స్నేహితుల కోసం ఎదురు చూస్తున్న వారు కావొచ్చు.. లాక్‌డౌన్‌తో వేరుప‌డిన వారి బాధ‌ను పాట‌లో చూపించాను" అని కావా చెప్పారు.

నుంద్ బానీ పేరుతో మ‌రో పాట‌ను ఆయ‌న రికార్డు చేశారు. అదృశ్య‌మైన కొడుకు కోసం ఎదురుచూస్తున్న త‌ల్లి ఆవేద‌న ఆ పాట‌లో క‌నిపిస్తుంది. యూట్యూబ్‌లో ఈ పాట‌కు 1.5 మిలియ‌న్లకుపైగా వ్యూస్ వ‌చ్చాయి. 8,000కుపైగా కామెంట్లు ఉన్నాయి.

లాక్‌డౌన్ స‌మ‌యంలో కావా లాంటి చాలా మంది నెమ్మ‌దిగా త‌మ ప‌నుల‌ను ప్రారంభించారు. క‌రోనావైర‌స్ వ్యాప్తి న‌డుమ ఈ లాక్‌డౌన్‌ను ఇప్పుడు మ‌ళ్లీ పొడిగించారు. జ‌మ్మూక‌శ్మీర్‌లో 7,500కుపైగా కోవిడ్‌-19 కేసులు ఉన్నాయి. మృతుల సంఖ్య కూడా 400ను దాటిపోయింది.

క‌శ్మీర్ స్వ‌యం ప్ర‌తిప‌త్తిని ర‌ద్దు చేయ‌డానికి కొన్ని నెల‌ల ముందు శ్రీన‌గ‌ర్‌కు చెందిన కార్టూనిస్టు సుహైల్ న‌క్స్‌బందీ త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. త‌ను వేసిన కార్టూన్ల‌ను సంస్థ ప‌బ్లిష్ చేయ‌క‌పోవ‌డంతో ఆయ‌న ఉద్యోగం మానేశారు.

ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు అనంత‌రం లాక్‌డౌన్ న‌డుమ ఆయ‌న‌కు ఎలాంటి జీత‌మూ లేకుండా పోయింది.

మ‌రోవైపు స్కూల్‌కు ఎందుకు వెళ్ల‌లేక‌పోతున్నాను? ఎందుకు అంద‌రితో క‌లిసి ఆడుకోలేక‌పోతున్నాను? అని త‌న ఏడేళ్ల కొడుకు త‌న‌ను ప‌దేప‌దే అడిగేవాడు. కొన్ని నెల‌ల త‌ర్వాతే మ‌ళ్లీ ఆయ‌న‌కు కొత్త ‌ప‌ని దొరికింది.

ఆయ‌న ఇటీవ‌ల వేసిన కార్టూన్‌లో శ్రీన‌గ‌ర్‌లోని ఇళ్లు మండుతూ క‌నిపిస్తున్నాయి. క‌శ్మీరీ ప్ర‌జ‌ల హ‌క్కుల‌ను కాపాడ‌తామ‌ని తొలి ప్ర‌ధాన మంత్రి ఇచ్చిన హామీను ప్ర‌తిబింబించే అక్ష‌రాలు పొగ‌ల్లో క‌నిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సోష‌ల్ మీడియాలో చాలా మంది షేర్ చేశారు.

ఇంట్లో‌నే సుర‌క్షితంగా ఉండండి అనే నోటీసు బోర్డు త‌గిలించివున్న చెట్టుకు ఓ క‌శ్మీరీని క‌ట్టేసినట్లు మ‌రో కార్టూన్‌లో క‌నిపిస్తోంది. క‌శ్మీరీ వ‌స్త్రాల్లో ముస్తాబైన ప‌ర్య‌ట‌కుల‌కు ఫోటోలు తీస్తున్న ఫోటోగ్రాఫ‌ర్ వైపు అత‌డు చూస్తున్న‌ట్లు ఉంది.

"అణ‌చివేత బాధితుడిగా, ఓ క‌శ్మీరీగా మా బాధ‌ను వ‌ర్ణించేందుకు ఆ కార్టూన్లు సాయం చేస్తాయి. ఇలాంటివి మాట్లాడినా, రాసినా.. జైల్లో పెడ‌తార‌ని తెలుసు. కానీ రాయ‌క‌పోతే.. నేనింకా బాధ‌ప‌డ‌తాను" అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

గ‌తేడాది ఆగ‌స్టు నుంచీ త‌మ స్వేచ్ఛ‌కు సంకెళ్లు వేసిన‌ట్లు అయింద‌ని చాలా మంది క‌ళాకారులు, జ‌ర్న‌లిస్టులు చెబుతున్నారు.

ద హిందూ ప‌త్రిక‌కు చెందిన జ‌ర్న‌లిస్టు పీర్‌జాదా ఆషిక్‌పై గ‌త ఏప్రిల్‌లో పోలీసులు కేసు న‌మోదుచేశారు. స‌మాధుల నుంచి కొందరు మిలిటెంట్ల మృత‌దేహాల‌ను త‌వ్వి తీసేందుకు పోలీసులు అనుమ‌తి నిరాక‌రించిన త‌ర్వాత ప్ర‌భుత్వం అనుమ‌తించింద‌ని వార్త రాయ‌డంతో ఆయ‌న‌పై కేసు న‌మోదైంది.

నిషేధానికి గురైన ఓ వేర్పాటువాద సంస్థ ప్ర‌ట‌క‌న‌కు సంబంధించి అవుట్‌లుక్ మ్యాగ్‌జైన్ జర్న‌లిస్టు న‌జీర్ గ‌నానీని కూడా గ‌త ఫిబ్ర‌వ‌రిలో పోలీసులు ప్ర‌శ్నించారు.

మిలిటెంట్ల‌ను ప‌ట్టుకొనే క్ర‌మంలో పౌరుల‌పై దాడుల‌కు సంబంధించి ఓ యువ మ‌హిళా రిపోర్ట‌ర్ క‌థ‌నం రాయ‌డంతో ఆమెను పిలిపించి మాట్లాడారు.

"కొంచెం ప‌రిణతితో ఆలోచించి.. క‌శ్మీర్ గురించి పాజిటివ్ స్టోరీలు రాయు"అని ఆమెకు అధికారులు చెప్పి పంపించారు.

జులైలో ఒక‌రోజు ఓ పాత్రికేయురాలి బంధువును పోలీస్ చెక్‌పోస్ట్ ద‌గ్గ‌ర చిత‌క‌బాదారు. ఈ ఘ‌ట‌న‌ను ఆమె ట్విట‌ర్‌లో పోస్ట్ చేశారు.

వెంట‌నే పోలీసు పోలీసు అధికారి ఆమెకు ఫోన్ చేశారు. గంట‌లోగా ఇక్క‌డ‌కు రావాల‌ని పిలిచారు.

ఫిర్యాదు న‌మోదు చేయ‌మ‌ని పోలీస్ స్టేష‌న్‌లో ఆమెకు సూచించారు. అయితే ఆమె దానికి నిరాక‌రించారు. "అది అన‌వ‌స‌రం. మా స‌హోద్యోగుల‌ను ఏళ్లుగా ల‌క్ష్యంగా చేసుకుంటున్నారు. చాలా మంది ఫిర్యాదు చేశారు. దేనిపైనైనా చ‌ర్య‌లు తీసుకున్నారా?"

అనంత‌రం ట్వీట్‌ను మార్చిరాస్తూ వివ‌ర‌ణ పెట్టాల‌ని పోలీసు అధికారి ఆమెకు సూచించారు. దీంతో ఆమె ట్వీట్‌ను మార్చి రాయాల్సి వ‌చ్చింది. ఆమె స్టేష‌న్ నుంచి వెళ్లిపోతున్న‌ప్పుడు.. "నువ్వు రాసే వార్త‌ల‌ను నేను చూస్తుంటాను"అని అధికారి ఆమెకు చెప్పారు.

"ఆ ఘ‌ట‌న‌తో నేను మాన‌సికంగా దెబ్బ‌తిన్నాను. మాన‌సిక నిపుణుడిని కూడా సంప్ర‌దించాల్సి వ‌చ్చింది" అని ఆ జ‌ర్న‌లిస్టు చెప్పారు.

జ‌ర్న‌లిస్టులు వేధింపుల‌కు గురైన ప‌ది ఘ‌ట‌న‌ల‌తో మాన‌వ హ‌క్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంట‌ర్నేష‌న‌ల్ ఓ డాక్యుమెంట‌రీనీ త‌యారుచేసింది.

"కోవిడ్‌-19 క‌ట్ట‌డికి కృషిచేస్తున్న జ‌ర్న‌లిస్టులను క‌ఠినమైన చ‌ట్టాల కింద కేసులు మోపుతామ‌ని బెది‌రిస్తున్నారు. భ‌య‌పెడుతున్నారు. ఇది క‌శ్మీర్‌లో అణ‌చివేత, భ‌యాల‌ను పుట్టిస్తోంది"అని ఆమ్నెస్టీ వ్యాఖ్యానించింది.

"అంతా సాధార‌ణంగా ఉంద‌ని భ్ర‌మ పుట్టిస్తున్నారు. కానీ ఇక్క‌డ అన్నిచోట్లా సెన్సార్‌షిప్ జ‌రుగుతోంది" అని సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌శ్మీర్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ షేక్ షౌకాత్ వ్యాఖ్యానించారు.

క‌శ్మీరీల‌కు లాక్‌డౌన్‌లు కొత్త‌మీకాదు. 1989 నుంచి 3,000 కంటే ఎక్కువ రోజులే క‌శ్మీర్‌ లోయ లాక్‌డౌన్‌లో గ‌డిపిన‌ట్లు క‌శ్మీర్ చాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్ ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది.

అయితే, గ‌త ఆగ‌స్టు నుంచి అమ‌లుచేస్తున్న లాక్‌డౌన్‌లు చాలా క‌ఠిన‌మైన‌వి.

హైస్పీడ్ ఇంట‌ర్నెట్‌పై ఆంక్ష‌ల‌తో వ్యాపారాలు కుప్ప‌కూలాయి. ఆన్‌లైన్ క్లాస్‌లకు స‌రిగా హాజ‌రుకాలేక విద్యార్థులు స‌త‌మ‌తం అవుతున్నారు. "365 రోజుల‌పాటు డిజిట‌ల్ ఇండియాలో స్లో ఇంట‌ర్నెట్ మాత్ర‌మే ప‌నిచేస్తోందంటే ప్ర‌జ‌ల మౌలిక హ‌క్కు‌ల్లో ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంటోంద‌నే చెప్పాలి" అని లాయ‌ర్ మిషి చౌధ‌రి వ్యాఖ్యానించారు.

ప‌ర్య‌ట‌క రంగంపై ఆధార‌ప‌డిన 80 శాతం ఉద్యోగాలు గాలిలో క‌లిసి పోయాయ‌ని ద ఫోర‌మ్ ఫ‌ర్ హ్యూమ‌న్ రైట్స్ ఇన్ జ‌మ్మూ అండ్ క‌శ్మీర్ ఒక నివేదిక‌లో తెలిపింది.

కశ్మీర్ ప్ర‌జ‌ల్లో నేడు ఆశ‌, ఆకాంక్ష‌లు ఉన్నాయని చెప్ప‌లేమ‌ని యూనివ‌ర్సిటీ ఆఫ్ క‌శ్మీర్‌లో పొలిటిక‌ల్ సైన్స్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ అయాజ్ అష్రాఫ్‌ వానీ అన్నారు.

"ఇది ప్ర‌జ‌ల్లో అప‌న‌మ్మ‌కాన్ని పెంచుతుంది. ఫ‌లితంగా భార‌త్ ప్ర‌భుత్వంపై పోరాడేందుకు యువ‌త‌ తుపాకులు ప‌ట్టుకునే ప్రమాదం ఉంది. ఈ స‌మ‌స్య‌ను దిల్లీలోని ప్ర‌భుత్వాలు ఎలా ప‌రిష్క‌రిస్తాయో చూడాలి".

(జ‌హంగీర్ అలీ శ్రీనగ‌ర్‌లో స్వ‌తంత్ర జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నారు)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)