అనంత పద్మనాభస్వామి ఆలయంలోని ఆరో గదిని తెరుస్తారా?
కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరో నేలమాళిగను తెరుస్తారా లేదా అనే దానిపై నిర్ణయాన్ని సుప్రీంకోర్టు.. ఆలయ పరిపాలన, నిర్వహణ కమిటీకి వదిలిపెట్టింది. మరి ఇప్పుడు ఆ గదిని తెరుస్తారా, అందులో ఏముందో బయట పడుతుందా?కేరళలోని పద్మనాభస్వామి ఆలయ నిర్వహణ బాధ్యత ఎవరిదన్న విషయంలో ట్రావెన్‌కోర్ రాజకుటుంబం తన ఆధిపత్యాన్ని నిలుపుకుంది. రాజకుటుంబమే ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరిస్తుందని, నిర్వహణ బాధ్యతలను ఆ కుటుంబమే చూసుకుంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
పద్మనాభ స్వామి ఆలయానికి ఎందుకింత ప్రాధాన్యం?
ఈ ఆలయ గదుల్లో ఉన్న లక్ష కోట్లకు పైగా నిధి సుమారు 10 సంవత్సరాల కిందట బయట పడినప్పుడు ఈ ఆలయం పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఈ గుడిలో ఇప్పటికీ తెరవని ఓ గది అంటే నేల మాళిగ ఒకటి ఉంది.
అనంత పద్మనాభస్వామి ఆలయం కేరళ రాజధాని తిరువనంతపురంలో ఉంది. స్వాతంత్ర్యానికి ముందు ఇది ట్రావెన్‌కోర్ సంస్థానం అధీనంలో ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత ట్రావెన్‌కోర్, కొచ్చిన్ సంస్థానాలు విలీనం అయ్యాయి. ఆ తర్వాత అవి ఇండియన్ యూనియన్‌లో భాగమయ్యాయి.
అయితే ట్రావెన్‌కోర్ చివరి పాలకుడైన చితిరా తిరునాళ్ ఈ ఆలయం హక్కులను తన వద్దే ఉంచుకున్నారు. 1991లో ఆయన మరణించినప్పుడు, సోదరుడు ఉత్రాడం వర్మ దాని సంరక్షకుడయ్యారు.
2007లో ఈ ఆలయంలో ఉన్న నిధి తన రాజ కుటుంబానికి చెందిన ఆస్తి అని ఆయన పేర్కొన్నారు. దీనిపై చాలామంది కేసులు వేశారు.
ఆలయ గదులను తెరవడాన్ని దిగువ కోర్టు నిషేధించింది. 2011 లో ఈ ఆలయ నిర్వహణ కోసం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని కేరళ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సంవత్సరంలో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
సుప్రీంకోర్టు కింది కోర్టు నిర్ణయంపై స్టే విధించి, ఆలయ గదులలో ఉన్న వస్తువుల జాబితాను తయారు చేయాలని ఆదేశించింది. దీంతో ఈ ఆలయ గదులను తెరిచే ప్రక్రియ ప్రారంభమైంది.
ఆలయంలో చివరికి ఏం దొరికింది?
ఈ ఆలయంలో ఆరు గదులు ఉన్నాయి. వీటికి ఏ బీ సీ డీ ఈ ఎఫ్ అని పేర్లు పెట్టారు.
వీటిలో ఈ, ఎఫ్ గదులు తెరిచే ఉన్నాయి. ఆలయంలో నిత్య క్రతువులకు, సేవలకు ఉపయోగించే పాత్రలను అక్కడే ఉంచుతారు.
సీ, డీ గదుల్లో బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. వీటిని ప్రత్యేక దినాలలో పూజా కార్యక్రమాలలో ఉపయోగిస్తారు.
ఇక మిగిలిన రెండిట్లో ఒకటైన - ఏ -గదిలో సుమారు లక్ష కోట్ల నిధి ఉన్నట్లు గుర్తించారు. ఈ ఖజానాలో మూడున్నర కేజీలుండే వజ్రం, రూబీతో నిండిన మహావిష్ణువు బంగారు విగ్రహం, 18 అడుగుల పొడవైన బంగారు గొలుసు, వజ్రాల కెంపులు, విలువైన రత్నాలు బయటకు వచ్చాయి.
ఇప్పుడు 'బి' గది వంతు వచ్చింది. ఈ గదిలో మిగిలిన అన్ని గదులకంటే ఎక్కువ నిధులు ఉన్నాయని భావిస్తున్నారు. దీన్ని ఇంకా తెరవనందున ఇందులో ఏముందో ఎవరికీ తెలియదు.
'బి' గదిని ఎందుకు తెరవలేదు?
ట్రావెన్‌కోర్ రాజకుటుంబం శతాబ్దాలుగా ఈ ఆలయానికి ధర్మకర్తగా వ్యవహరించింది. 'బి' గదిని తెరవకూడదని రాజకుటుంబీకులు మొదటి నుంచి వాదిస్తున్నారు. అలా చేయడం సంప్రదాయాలు, విశ్వాసాలకు విరుద్ధమని వారు నమ్ముతారు.
ఈ ఆలయం గురించి ప్రజలలలో కూడా రకరకాల నమ్మకాలు ఉన్నాయి. ఈ గదికి నాగబంధం ఉందని, దీనిని తెరిస్తే లోకానికే అరిష్టమని చాలామంది నమ్ముతారు. ఈ గదిని తెరవవద్దని 2011లో సుప్రీంకోర్టు పేర్కొంది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.ఎస్.పి రాధాకృష్ణన్ అధ్యక్షతన ఒక సెలక్ట్ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. సీనియర్ న్యాయవాది గోపాల్ సుబ్రమణియంను కోర్టు సమన్వయకర్తగా నియమించింది.
ఆలయ నిర్వహణలో అవినీతి, అక్రమాలపై ఆయన 577 పేజీల నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆయన సిఫారసుల మేరకు 2014లో ఆలయ ఖాతాలను ప్రత్యేకంగా ఆడిట్ చేయాలంటూ కాగ్‌ను కోర్టు ఆదేశించింది.
2020 జూలై 13న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ట్రావెన్‌కోర్ రాజకుటుంబం ఈ ఆలయ ధర్మకర్తగా కొనసాగుతుంది.
ఆలయ వ్యవహారాల నిర్వహణకు పరిపాలనా కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అప్పటి వరకు ఆలయ వ్యవహారాలను కోర్టు ఏర్పాటు చేసిన కమిటీ, జిల్లా న్యాయమూర్తి పర్యవేక్షిస్తారు.
అయితే ఎక్కడా 'బి' గదిని తెరవడం గురించి న్యాయస్థానం ప్రస్తావించలేదని, 'లైవ్‌లా' వెబ్‌సైట్ పేర్కొంది. దాన్ని తెరవాలా వద్దా అన్న నిర్ణయాన్నికమిటీకే కోర్టు వదిలేసిందని తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- మాస్క్ ధరించలేదని భర్తతో గొడవ.. పుట్టింటికి పయనమైన భార్య
- సచిన్ పైలట్ ట్వీట్: ‘సత్యాన్ని ఇబ్బందులు పెట్టొచ్చు, కానీ ఓడించలేరు’
- యోగి ‘ఎన్కౌంటర్’ విధానాలతో న్యాయం జరుగుతుందా.. నేరాలు పెరుగుతున్నాయా?
- 'శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడు.. అసలైన అయోధ్య నేపాల్‌లోనే ఉంది' - నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ
- కరోనావైరస్: ధనిక దేవాలయానికి ఆర్ధిక ఇబ్బందులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)