వరవరరావుకు న్యూరాలజీ విభాగంలో టెస్టులు చేస్తున్నాం.. ప్రస్తుతానికి ఆరోగ్యంగానే ఉన్నారు: జేజే హాస్పిటల్ వైద్యుడు

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు, మధ్యంతర బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

ఆరోగ్యం క్షీణించడం, కరోనా ముప్పు కారణంగా ఆయన మధ్యంతర బెయిల్ కోసం కోర్టులో పిటిషన్‌ వేశారు.

ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా బెయిల్ మంజూరు చేయాలంటూ వరవరరావు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ను జూన్‌ 26న ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

వరవరరావు తరఫున న్యాయవాది సత్యనారాయణ అయ్యర్‌ బాంబే హైకోర్టులో ఈ మేరకు రెండు పిటిషన్లు దాఖలు చేశారు.

ఎన్‌ఐఏ కోర్టు వరవరరావు బెయిల్‌ తిరస్కరణను ఒక పిటిషన్‌లో సవాల్ చేసిన ఆయన, రెండో పిటిషన్‌లో జూన్‌ 2న జేజే ఆసుపత్రి నుంచి వరవరరావు డిశ్చార్జ్‌ అయ్యాక ఆయన మెడికల్‌ రిపోర్టులను తమకు ఇచ్చేలా తలోజా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిగే అవకాశం ఉంది.

వరవరరావు ఆరోగ్యంపై ముంబయి ఆసుపత్రి వైద్యులు ఏమంటున్నారు

వరవరరావు జేజే హాస్పిటల్ న్యూరాలజీ విభాగంలో ఉన్నారని, ఆయనకు వివిధ పరీక్షలు జరపనున్నారని ఆ ఆసుపత్రి న్యూరాలజీ విభాగ డీన్ డాక్టర్ రంజిత్ మంకేశ్వర్ తెలిపారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ముఖ్యమైన అవయవాలన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయని.. పరీక్షల అనంతరం వైద్యులు తమ అభిప్రాయాన్ని చెబుతారని.. ఇందుకు రెండుమూడు రోజులు పట్టొచ్చని డాక్టర్ మంకేశ్వర్ చెప్పారు.

కుటుంబ సభ్యులేమంటున్నారు?

వరవరరావు ఆరోగ్య పరిస్థితి బాగా లేదని, వెంటనే ఆసుపత్రికి తరలించాలని ఇటీవలే ఆయన కుటుంబ సభ్యులు మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వం, మహారాష్ట్ర, తెలంగాణ ప్రభుత్వాలకు విజ్జప్తి చేశారు.

ప్రస్తుతం ఆయన్ను జేజే ఆసుపత్రికి తరలించారని, అక్కడ ఆయనకు టెస్టులు జరుగుతున్నాయని కుటుంబ సభ్యులు తెలిపారు.

"అర్ధరాత్రి వరకు వివిధ టెస్టులు జరిగాయని మాకు తెలిసింది. ఇన్‌పేషంట్‌గా చేర్చుకుంటామో లేదో చెప్పలేమని వైద్య అధికారులు అన్నారు. అయితే టెస్ట్ రిజల్ట్ రావడానికి, అబ్జర్వేషన్‌కు టైం కావాలి గనుక కనీసం రెండురోజులు ఆసుపత్రిలోనే ఉంచవచ్చు'' అని వరవరరావు బంధువు, వీక్షణం పత్రిక ఎడిటర్‌ ఎన్‌.వేణుగోపాల్ బీబీసీకి తెలిపారు.

" శుక్రవారం బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఉంది. అందుకే అధికారులు ఆయనకు చికిత్స పేరుతో హడావుడి చేస్తున్నారు. గురువారంనాటికి ఆయన ఆరోగ్యం బాగానే ఉందని చెప్పి తిరిగి జైలుకు పంపే ప్రమాదం కూడా ఉంది'' అని వేణుగోపాల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

ఆరోగ్యం సరిగా లేకపోవడంతో మే 28న వరవర రావును ముంబయిలోని జేజే ఆసుపత్రిలో చేర్చారు. కానీ అతని ఆరోగ్యం మెరుగుపడకముందే తిరిగి జైలుకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

ఆయనకు బెయిల్‌ ఇవ్వవద్దని జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ ఇప్పటికే విజ్జప్తి చేసింది.

భరధ్వాజ మౌన ప్రదర్శన

విరసం నాయకులు వరవరరావు, జేఎన్ యూ ప్రొఫెసర్ సాయిబాబాలను విడుదల చేయాలని కోరుతూ హైదరాబాద్ లో ఒంటరిగా, మౌన ప్రదర్శనలు చేస్తోన్న జర్నలిస్టు రంగావఝ్ఝుల భరధ్వాజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

నిన్న, ఇవాళ భరద్వాజ హైదరాబాద్లో ప్రదర్శన చేపట్టారు. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలను ఎక్కడా ఉల్లంఘించకుండా రోడ్డుకు ఒక వైపుగా, ఒక్కరే ఉంటూ ఒక ప్లకార్డు పట్టుకును నుంచుంటున్నారు. దానిపై ''కామ్రేడ్స్ వరవర రావు, సాయిబాబాలను వెంటనే విడుదల చేయాలి'' అని రాసి ఉంది. ఎటువంటి నినాదాలు చేయకుండా నిన్న హైదారాబాద్లోని కృష్ణా నగర్ ప్రాంతంలో ఆయన ప్రదర్శన ఇచ్చారు.

ఈరోజు మధ్యాహ్నం పంజాగుట్ట చౌరాస్తాలో ప్రదర్శన కోసం ఆయన నుంచున్నప్పుడు కొందరు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లినట్టుగా బీబీసీకి చెప్పారు భరద్వాజ.

''నేను ముందుగా చెప్పినట్టే ఒక్కడినే పంజాగుట్ట చౌరాస్తాలో ప్లకార్డు పట్టుకుని నుంచున్నాను. అప్పటికే అక్కడ ఒక 20 మంది వరకూ పోలీసులు నుంచున్నారు. వారంతా నాకోసం ఉన్నట్టు తెలియదు. నేను ప్లకార్డు పట్టుకోగానే నా దగ్గరకు వచ్చారు. నన్ను పక్కనే ఉన్న పంజాగుట్ట స్టేషన్ లోపలికి తీసుకుని వెళ్లారు. వరవరరావు, సాయిబాబా నాకు తెలిసిన వారనీ, వారికి సంఘీభావంగా ఈ ప్రదర్శన చేస్తున్నట్టు పోలీసులకు చెప్పాను. ప్రస్తుతం స్టేషన్లో ఉంచారు'' అని చెప్పారు భరద్వాజ.

''మామూలుగా ఎవరైనా రోడ్డుపైకి వచ్చి మౌనంగా, ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా, ఒక ప్లకార్డు పట్టుకుని నుంచునే పరిస్థితి కూడా లేదని ఇవాళ నాకు అర్థం అయింది. నేను ఇదే ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను'' అన్నారు భరద్వాజ.

భరద్వాజను పోలీసులు వదలిపెట్టారు.

‘‘ప్రివెంటివ్ కస్టడీకి తీసుకున్నాం. కేసు నమోదు చేయలేదు. సొంత పూచీకత్తుపై వదలిపెట్టాం’’ అని బీబీసీకి తెలిపారు పంజాగుట్ట ఎస్ హెచ్ఒ.

సాధారణంగా ఒక వ్యక్తి ఏదైనా నేరం చేస్తాడని అనుమానం ఉంటే సీఆర్పీసీ సెక్షన్ 151 కింద పోలీసులు చర్య తీసుకుంటారు. భరద్వాజ విషయంలో అదే చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.

వరవరరావుపై ఆరోపణలేంటి ?

మావోయిస్టులతో కలిసి ప్రధాని హత్యకు కుట్ర పన్నారన్న ఆరోపణలపై వరవరరావు దాదాపు ఏడాదిన్నరగా విచారణ ఖైదీగా జైల్లో ఉన్నారు.

వరవరరావుతోపాటు మరో నలుగురిని పుణె పోలీసులు 2018 ఆగస్టులో అరెస్టు చేశారు.

మహారాష్ట్రలో భీమా-కోరెగావ్‌ అల్లర్లలో పాత్ర, మావోయిస్టులతో సంబంధాలు, ప్రధాని మోదీ హత్యకు కుట్ర వంటి అభియోగాలు వీరిపై ఉన్నాయి.

వరవరరావును మొదట్లో పుణెలోని ఎరవాడ జైలులో ఉంచారు. అనంతరం అక్కడి నుంచి కొన్నాళ్ల కిందట నవీ ముంబయిలోని తలోజా జైలుకు ఆయన్ను తరలించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)