కరోనావైరస్ బాధితులకు కావలసినంత ఆక్సిజన్ భారత ఆస్పత్రులు అందించగలవా?

    • రచయిత, సౌతిక్ బిశ్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

మహారాష్ట్రలోని నాగపూర్‌కు 50 మైళ్ళ దూరంలో ఉన్న సేవాగ్రాంలో 934 పడకలున్న కస్తూర్బా హాస్పిటల్లో కరోనావైరస్ రోగుల కోసం 200 పడకలను ఏర్పాటు చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఆదేశాలు అందాయి. ఈ స్వచ్చంద సేవా హాస్పిటల్‌కు ప్రతి సంవత్సరం 10 లక్షల మంది రోగులు చికిత్స కోసం వస్తుంటారు.

కోవిడ్ రోగుల క్రిటికల్ కేర్ కోసం ఏర్పాటు చేసిన 30 పడకలకు కూడా పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేయవలసిన అవసరం ఉంది. రాగి పైపులను ఉపయోగించి ఆక్సిజన్ సరఫరా చేసేందుకు హాస్పిటల్ సుమారు 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది.

అదొక పెద్ద సవాలుగా మారిందని, హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్‌పీ కలాంత్రీ చెప్పారు.

"అదనంగా ఆక్సిజన్ సరఫరాతో కూడిన పడకలు ఏర్పాటు చేయడానికి చాలా ముందు నుంచే పటిష్టంగా ప్రణాళిక చేయవలసి ఉంటుంది. కరోనావైరస్ రోగులు కోలుకోవడానికి ఆక్సిజన్ చాలా కీలకం" అని ఆయన అన్నారు.

కోవిడ్ సోకిన 15 శాతం మంది రోగులలో ఊపిరితిత్తులు దెబ్బతిని శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. కొంత మంది రోగుల్లో శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తకపోయినప్పటికీ , ఆక్సిజన్ స్థాయి మాత్రం ప్రమాదకర స్థాయికి పడిపోతోంది. దీనినే సైలెంట్ హైపోక్సియా అంటారు. కోవిడ్ కి తీవ్రంగా గురైన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే వెంటిలేటర్ అవసరం ఉంటుంది.

"ఈ మహమ్మారి వ్యాప్తి తర్వాత ఆక్సిజన్‌కు చాలా డిమాండ్ ఏర్పడిందని డాక్టర్ ముజఫల్ లకడావాలా అన్నారు.

ముంబయిలో రాక్ సంగీత కార్యక్రమాల కేంద్రాన్ని ఆయన ఆక్సిజన్ తో కూడిన 600 పడకల కోవిడ్ ఆస్పత్రిగా మార్చారు.

ప్రపంచ వ్యాప్తంగా వారానికి 10 లక్షల కొత్త కోవిడ్ కేసులు నమోదవుతున్న ప్రస్తుత సందర్భంలో మొత్తంగా రోజుకు 6,20,000 క్యూబిక్ మీటర్ల ఆక్సిజన్ అవసరం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసింది. అంటే 88,000 పెద్ద ఆక్సిజన్ సిలిండర్లు కావాలి. అయితే, ఆక్సిజన్ సిలిండర్ల ఉత్పత్తిలో 80 శాతం నాలుగైదు కంపెనీలే అందిస్తున్నాయి. దాంతో, ఉత్పత్తితో పోల్చితే డిమాండ్ పెరుగుతోంది. ఇది చాలా దేశాల్లో ఆక్సిజన్ కొరతకు దారి తీసే ప్రమాదం ఉంది.

భారత్‌లో కూడా 8 లక్షలు దాటిన కోవిడ్ కేసులతో ఆక్సిజన్‌కు డిమాండ్ బాగా పెరుగుతోంది. హాస్పిటళ్లు, కేర్ సెంటర్లు రోజుకు 1,300 టన్నుల ఆక్సిజన్ వినియోగిస్తున్నాయి. కరోనా రాక మునుపు రోజు వరకు 900 టన్నుల ఆక్సిజన్ వాడేవారు.

దేశవ్యాప్తంగా గాలి లోంచి ఆక్సిజన్ తీసి శుద్ధి చేసి సరఫరా చేసే కర్మాగారాలు 500 ఉన్నాయి. మొత్తం సరఫరాలో 15 శాతం వైద్య అవసరాల కోసం వాడతారు. మిగిలింది స్టీల్, ఆటోమొబైల్ పరిశ్రమల్లో బ్లాస్ట్ ఫర్నేస్లు నడిపేందుకు, వెల్డింగ్ చేయడం లాంటి పారిశ్రామిక అవసరాల కోసం వాడతారు.

ఈ కంపెనీలు ఆక్సిజన్‌ను ద్రవ రూపంలో ట్యాంకర్ల ద్వారా హాస్పిటళ్ళకు సరఫరా చేస్తాయి. దీనిని పైపుల ద్వారా హాస్పిటల్లోని పడకలకు సరఫరా చేస్తారు. ఆక్సిజన్ ని స్టీల్, అల్యూమినియం సిలిండర్ల ద్వారా కూడా సరఫరా చేస్తారు. కాన్సన్ట్రేటర్స్ గా పిలిచే పోర్టబుల్ మెషిన్లు కూడా గాలిలోంచి ఆక్సిజన్ ని ఫిల్టర్ చేస్తాయి. వీటినన్నిటిని కోవిడ్ రోగులకు చికిత్స చేసేందుకు వాడుతున్నారు.

జనవరిలో ఇండియాలో తొలి కేసు నమోదైనప్పటి నుంచి, ఏప్రిల్ నాటికి కేసులు పెరిగే సమయం వరకు కూడా ఆక్సిజన్ సరఫరా గురించిన సమాచారం అందుబాటులో లేదు.

“సిలిండర్లు, ట్యాంకుల ద్వారా ఎంత ఆక్సిజన్ సరఫరా చేస్తారో తెలియదు. మా దగ్గర ఎన్ని సిలిండర్లు ఉన్నాయో కూడా మాకు తెలియదు”, అని అఖిల భారత పారిశ్రామిక గ్యాస్ ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు సాకేత్ టిక్కూ చెప్పారు.

ఏప్రిల్ నెల మొదటి భాగంలో అధికారులు గ్యాస్ కంపెనీ అధికారులతో సమావేశమయ్యారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలో ఒక్క ద్రవ ఆక్సిజన్ ఫ్యాక్టరీ కూడా లేదని తెలిసింది. అలాగే, అండమాన్ దీవుల్లో ఆక్సిజన్ తయారు చేసేవారెవరూ లేరు. ఇక్కడికి ప్రధాన భూభాగం నుంచే సిలిండర్లు సరఫరా అవుతాయి. మారుమూల ఈశాన్య రాష్ట్రాలలో సరఫరాలు అంతంత మాత్రం.

పారిశ్రామిక అవసరాల కోసం వాడే గ్యాస్ ని వైద్య అవసరాల కోసం వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండిటి మధ్య చాలా స్వల్ప తేడాలుంటాయి. కానీ, వైద్య అవసరాల కోసం వాడే ఆక్సిజన్ స్వచ్ఛంగా ఉండి , కఠినమైన నియంత్రణలతో, ఒక నిర్ణీత పద్దతిలో సరఫరా చేస్తారు. హాస్పిటళ్ళ నుంచి వచ్చే ఫోన్ కాల్స్ తీసుకుని, గ్యాస్ ని సకాలంలో సరఫరా చేసేందుకు గ్యాస్ ఉత్పత్తిదారులు కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేసారు. కానీ, అంతటితో సమస్యలు తీరలేదు.

ఆక్సిజన్‌ను పెద్ద మొత్తంలో కొనుక్కునే ప్రభుత్వ ఆసుపత్రులు చెల్లింపులు సరిగ్గా చేయవని చిన్న గ్యాస్ కంపెనీలు వారు ఫిర్యాదు చేస్తున్నారు.

ఉదాహరణకు, ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో గత సంవత్సర కాలంగా ప్రభుత్వం గ్యాస్ కంపెనీలకు ఎటువంటి చెల్లింపులు చేయలేదని, టిక్కూ చెప్పారు.

వైద్య అవసరాల కోసం ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీ, డబ్బులు లేక కరెంట్ బిల్ కట్టలేకపోవడంతో ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తొలగించారు.

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఆగష్టు 2017 లో ఆక్సిజన్ సమయానికి అందక 30 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతున్నాయి. సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో ఆక్సిజన్ సరఫరాదారుడు ఈ హాస్పిటల్ కి ఆక్సిజన్ సరఫరా నిలిపివేశారు.

“ఒక వైపు ప్రభుత్వం మమ్మల్ని ఆక్సిజన్ తగినంతగా ఉండేటట్లు చూసుకోవాలని చెబుతుంది. మరో వైపు, ఆక్సిజన్ సరఫరా దారులకు సమయానికి చెల్లింపులు చేయదు" అని టిక్కు అన్నారు.

ప్రస్తుతం భారత దేశంలో ఏర్పాటు చేసిన 3,000 కోవిడ్ హాస్పిటళ్ళలో, కేర్ యూనిట్లలో మొత్తం 1,30,000 ఆక్సిజన్ సరఫరాతో కూడిన పడకలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. ఇంకా, 50,000 వెంటిలేటర్లను కూడా సరఫరా చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

అయితే, వీటిలో ఎన్నిటిలో రోగులకు పైపుల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసే సౌకర్యం ఉందో తెలియదు. దేశంలోని ప్రధాన నగరాలలో ఉన్న చాలా ప్రభుత్వ హాస్పిటళ్లలో తగినన్ని ఆక్సిజన్ పైపులతో కూడిన పడకలు అందుబాటులో లేవు. చాలా హాస్పిటళ్లు సిలిండర్ల మీదే ఆధార పడతాయి.

ఈ మహమ్మారి చిన్న పట్టణాలకు, గ్రామాలకు వ్యాప్తి చెందుతున్న దశలో, పైపులతో కూడిన ఆక్సిజన్ లేకపోవడం వలన కొన్ని మరణాలు చోటు చేసుకోవచ్చని డాక్టర్లు భయపడుతున్నారు. "నిజానికి మనకి ఎక్కువ వెంటిలేటర్ల అవసరం లేదు. గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువ ఆక్సిజన్ అవసరం ఉంటుంది” అని బీహార్ లో 20 పడకల ఆసుపత్రి నడుపుతున్న డాక్టర్ అతుల్ వర్మ అన్నారు.

భారతదేశంలో వైద్య అవసరాల కోసం ఏర్పాటు చేసిన ఆక్సిజన్ నిల్వలు ప్రస్తుతం ఉన్న డిమాండ్ కన్నా అయిదు రెట్లు ఎక్కువగానే ఉన్నాయి. దీని వలన ఆక్సిజన్ కొరత గురించి విచారం లేదు. ప్రైవేట్ హాస్పిటళ్ళ నుంచి తగ్గిన డిమాండ్ వలన ఈ పరిస్థితి ఏర్పడటానికి ఒక కారణంగా చెప్పవచ్చు. చాలా మంది రోగులు కోవిడ్ 19 సోకుతుందనే భయంతో హాస్పిటళ్ళకు వెళ్ళటం లేదు. మరి కొంత మంది కొన్ని శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకుంటున్నారు.

ప్రైవేట్ హాస్పిటళ్లలో చేరే రోగుల సంఖ్య తగ్గడంతో వైద్యం కోసం సరఫరా చేసే ఆక్సిజన్ సరఫరాలు 20 శాతం తగ్గిపోయాయని , దేశంలో ప్రముఖ గ్యాస్ కంపెనీ లిండే ఇండియా సేల్స్ అధికారి అనిర్బన్ సేన్ చెప్పారు.

రానున్న రోజుల్లో దేశంలో హై ఫ్లో ఆక్సిజన్ తో కూడిన పడకల ను ఏర్పాటు చేయడం ఒక పెద్ద సవాలుగా కనిపిస్తోంది. దేశంలోని చిన్న పట్టణాలకు, గ్రామాలకు ఆక్సిజన్ సరఫరా చేయడం సవాలుగా మారనున్నది. “తగినన్ని ఆక్సిజన్ సిలిండర్లు గాని, పైపులతో కూడిన ఆక్సిజన్ సౌకర్యాలు కానీ, ద్రవ ఆక్సిజన్ తయారు చేసేవారు కానీ లేరని”, సేన్ అన్నారు. “ఇది చాలా సంక్లిష్టంగా ఉండబోతోంది. దీనికి మనం సంసిద్ధం అవ్వాలి.”

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)