కశ్మీర్ బీజేపీ నేత వసీంబారీ కుటుంబం హత్య కేసులో 10 మంది పోలీసుల అరెస్ట్

    • రచయిత, మాజిద్ జహంగీర్
    • హోదా, బీబీసీ హిందీ, శ్రీనగర్

కశ్మీర్‌లోని బందిపొరా జిల్లాలో మిలిటెంట్ల దాడిలో బీజేపీ నేత షేక్ వసీం బారీ, ఆయన తండ్రి, సోదరుడు హత్యకు గురైన కేసులో 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఆ 10 మంది వసీం బారీ కుటుంబానికి భద్రత కల్పిస్తున్న పోలీసులు.

పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే టెర్రరిస్ట్ సంస్థ జైష్ ఏ మహ్మద్ ఈ దాడి వెనుక ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వసీంబారీ, ఆయన తండ్రి, సోదరుడు బుధవారం తమ ఇంటికి సమీపంలోనే ఉన్న వారి దుకాణంలో ఉండగా దుండగులు కాల్పులు జరిపారు.

వసీంబారీ, ఆయన తండ్రి, సోదరుడు ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డారని.. వెంటనే ఆసుపత్రికి తరలించారని, అయినప్పటికీ ఫలితం లేకపోయిందని కశ్మీర్ జోన్ పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

బారీ కుటుంబంపై కాల్పులు జరిగినప్పుడు ఆయన గన్‌మెన్లలో ఒక్కరు కూడా అక్కడ లేరని జమ్ముకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ చెప్పారు.

జాతీయవాద గొంతులను నొక్కేందుకే...

కశ్మీర్‌లో బీజేపీ నేతలను చంపడమనేది జాతీయవాద గొంతుకలను మూగబోయేలా చేసే ప్రయత్నమేనని బీజేపీ ఆరోపిస్తోంది.

బీజేపీ కశ్మీర్ అధికార ప్రతినిధి అనిల్ గుప్తా 'బీబీసీ'తో మాట్లాడుతూ.. ఇలాంటి దాడులతో కశ్మీర్‌లో జాతీయవాదం గొంతు నులమలేరని అన్నారు.

''వసీం బందిపొర జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా మూడేళ్లు పనిచేశారు. పార్టీలో చురుగ్గా ఉండడమే కాదు సామాజిక సేవలోనూ చురుకైన నాయకుడు. దుకాణంలో కూర్చున్నవారిని టెర్రరిస్టులు చంపేశారు.

ఇది జాతీయవాద గొంతులను అణగదొక్కే ప్రయత్నమన్నది అర్థమవుతోంది. నెల కిందట కూడా ఒక ఉగ్రవాద సంస్థ బీజేపీ కార్యకర్తలను బెదిరించింది'' అన్నారు గుప్త.

ఇలాంటి హత్యలన్నీ సరిహద్దులు అవతలి నుంచి వస్తున్న సూచనల ప్రకారమే జరుగుతున్నాయంటూ పరోక్షంగా ఆయన పాకిస్తాన్‌పై ఆరోపణలు చేశారు.

వసీం బారీ త్యాగం వృథా కానివ్వం: జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దీనిపై స్పందించారు. వసీం బారీ త్యాగం వృథా కానివ్వబోమంటూ ఆయన ట్వీట్ చేశారు.

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా బుధవారం రాత్రికి ఈ ఘటనపై ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు అడిగారని.. మృతుల కుటుంబానికి సంతాపం తెలిపారని జితేంద్ర సింగ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ఈ దాడిని ఖండించారు. ప్రధాన పార్టీల నేతలు ఉగ్రవాదులకు లక్ష్యాలుగా మారడం బాధాకరమన్నారాయన.

గతంలోనూ కశ్మీర్ లోయలో చాలామంది బీజేపీ నేతలు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)