కరోనావైరస్ కాలర్ ట్యూన్: ఫోన్‌లో నిత్యం జాగ్ర‌త్త‌లు చెప్పే స్వరం ఎవరిదో తెలుసా?

    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోట్లాది మంది భార‌తీయుల‌కు జ‌స్లీన్ భ‌ల్లా స్వ‌రం సుప‌రిచితం. ఆమె స్వ‌రం విన‌గానే చాలా మంది ఠ‌క్కున గుర్తుప‌ట్టేస్తారు.

భార‌త్‌లో ఎవ‌రికైనా ఫోన్‌ చేసిన‌ప్పుడు చాలాసార్లు రింగ్‌టోన్‌కు బ‌దులు మ్యూజిక్ ట్యూన్‌ లేదా మెసేజ్‌లు లాంటివి వినిపిస్తుంటాయి. వీటినే "కాల‌ర్ ట్యూన్‌లు"గా పిలుస్తారు.

గ‌త రెండున్న‌ర నెల‌లుగా మాత్రం ఫోన్‌ చేసిన ప్ర‌తి సారీ జ‌స్లీన్ భల్లా స్వ‌రం ప్ర‌జ‌ల‌ను ప‌ల‌క‌రిస్తోంది.

వాయిస్ ఓవ‌ర్ ఆర్టిస్ట్ అయిన ఆమె.. క‌రోనావైర‌స్‌ను క‌ట్ట‌డి చేసేందుకు ఎలా న‌డుచుకోవాలో కాల‌ర్‌ట్యూన్‌ల‌లో చెబుతున్నారు. ఇప్పుడామే భార‌త్ క‌రోనా వాయిస్‌గా అంద‌రికీ సుప‌రిచిత‌మ‌య్యారు.

వాయిస్ ఓవ‌ర్‌లో ఆమెకు ప‌దేళ్ల‌కుపైనే అనుభ‌వం ఉంది. ఓ ప్రైవేటు ఎయిర్‌లైన్‌, భార‌త్‌లోని అతిపెద్ద టెలికాం సంస్థ‌లు ఇలా చాలాచోట్ల ఆమె స్వ‌రం వినిపిస్తుంది. దిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ లైన్ సేవ‌ల్లో అయితే త‌ర్వాత ఏ స్టేష‌న్ వ‌స్తుంది? ఎటువైపు దిగాలి? లాంటి సూచ‌న‌ల్లో వినిపించేది ఆమె స్వ‌ర‌మే.

అయితే క‌రోనావైర‌స్ క్యాంపెయిన్‌తో ఆమె ఒక్క‌సారిగా పాపుల‌ర్ అయ్యారు.

కోవిడ్‌-19పై అవ‌గాహ‌న ట్యూన్ స్వ‌రం ఆమెదేన‌ని గ‌త‌వారం వెలుగులోకి రావ‌డంతో ఒక్క‌సారిగా ఆమె సెల‌బ్రిటీ అయ్యారు. ఆమెపై క‌థ‌నాలు భార‌త్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. ఆమె స్వ‌రాన్ని సూప‌ర్‌, అద్భుతం అంటూ నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. టిక్‌టాక్‌లో అయితే ఆమె ఆడియో క్లిప్‌తో వీడియోలు కూడా చేస్తున్నారు.

"నేను ఎప్ప‌టిలానే నా ప‌ని చేసుకునే దాన్ని. అయితే గ‌త‌ వారం టీవీలో వ‌చ్చిన నా ఇంట‌ర్‌వ్యూ వైర‌ల్ అయ్యింది. నా జీవితాన్నే అది మార్చేసింది." అని బీబీసీతో ఆమె చెప్పారు.

చాలా మంది వాయిస్ ఆర్టిస్టుల్లానే.. జ‌స్లీన్ ఎలా ఉంటారో చాలా మందికి తెలియ‌దు. ఎందుకంటే వారి స్వ‌రం మాత్ర‌మే ప్ర‌జ‌ల‌కు వినిపిస్తుంది.

"క‌రోనావైర‌స్ వ‌ల్ల నాకు గుర్తింపు వ‌చ్చింది. ఎందుకంటే కోవిడ్‌-19కు దేశంలో అంద‌రూ భ‌య‌ప‌డుతున్నారు. రోజూ అంద‌రూ ఈ స్వ‌రం వింటున్నారు"

"నాకు కూడా ఈ ప్ర‌జాద‌ర‌ణ‌, పాపులారిటీ న‌చ్చుతోంది. అయితే క‌రోనావైర‌స్ ట్యాగ్‌ను పేరు వెన‌క ఎవ‌రు త‌గిలించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు?"

మార్చి మొద‌టివారంలో భార‌త ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ మెసేజ్‌ను అత్య‌వ‌స‌రంగా రికార్డు చేయాలంటూ ఆమెకు ఫోన్ రావ‌డంతో ఈ క‌థ మొద‌లైంది.

"ఇది 30 సెక‌న్ల‌పాటు ఉండాల‌ని మా ప్రొడ్యూస‌ర్ చెప్పారు. ఆప్యాయంగా, స‌న్నిహితంగా మాట్లాడుతూనే బాధ్యతాయుతంగ‌ సూచ‌న‌లు ఇవ్వాలన్నారు. అదే స‌మ‌యంలో ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితి స్వ‌రంలో క‌నిపించాల‌ని అన్నారు."అని దిల్లీలోని ఆమె ఇంట్లో నుంచి ఫోన్‌లో నాకు చెప్పారు.

క‌రోనావైర‌స్ వ్యాప్తి మొద‌లైన తొలి రోజుల్లో జాగ్ర‌త్త‌గా ఉండేందుకు ఎలాంటి సూచ‌న‌లు పాటించాలో చాలా మందికి తెలిసేది కాదు.

న‌మ‌స్కార్‌! క‌రోనావైర‌స్ యా కోవిడ్‌-19 సే ఆజ్ పూరా దేశ్ ల‌డ్ రహా హై. (న‌మ‌స్కారం! దేశం మొత్తం క‌రోనావైర‌స్‌తో పోరాడుతోంది) అనే సందేశంతో ఆమె కాల‌ర్‌ట్యూన్ మొద‌లవుతుంది.

అంద‌రూ ఇంట్లోనే జాగ్ర‌త్త‌గా ఉండండి- అత్య‌వ‌స‌రం అయితే త‌ప్పా.. ఎవ‌రూ బ‌య‌ట‌కు వెళ్లొద్దు. ఒక‌వేళ బ‌య‌ట‌కు వెళ్లాల్సి వ‌స్తే మాస్క్ త‌ప్ప‌నిస‌రిగా వేసుకోండి. త‌ర‌చూ చేతుల‌ను స‌బ్బుతో క‌డుక్కోండి. సామాజిక దూరం పాటించండి. క‌రోనావైర‌స్ వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు ఇది త‌ప్ప‌నిస‌రి అని సందేశంలో ఆమె సూచ‌న‌లు ఇస్తారు.

"నాకు ఇంగ్లిష్‌, హిందీలో రికార్డు చేయ‌మ‌ని అడిగారు. నేను ఒక్కోదానికి నాలుగు నుంచి ఐదు టేక్‌లు తీసుకున్నాను. అది పూర్త‌య్యాక పంపించేసి.. ఆ సంగ‌తే మ‌ర‌చిపోయాను."అని ఆమె వివ‌రించారు. "అయితే కొన్ని రోజుల తర్వాత‌ ఎప్పుడు ఫోన్‌చేసినా ఈ స్వ‌ర‌మే వినిపిస్తోంద‌ని కుటుంబ స‌భ్యులు, స్నేహితులు చెప్పారు."

రికార్డు చేసేట‌ప్పుడు ఈ స్వ‌రం దేనికోసమో త‌న‌కు స‌రిగా తెలియ‌ద‌ని ఆమె అన్నారు. ఇంత మందికి త‌న స్వ‌రం చేరువ అవుతుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని వివ‌రించారు.

ప్ర‌భుత్వ ఆదేశాల‌పై టెలికాం సంస్థ‌లన్నీ కాల‌ర్ ట్యూన్‌లకు ముందు జ‌‌స్లీన్ సందేశాన్ని వినిపించ‌డంతో ఆమె స్వ‌రం భార‌త్‌లో అంద‌రికీ సుప‌రిచిత‌మైన వాయిస్‌గా మారిపోయింది. మారుతున్న‌ మార్గ‌ద‌ర్శ‌కాలు, ప‌రిస్థితుల‌కు అనుగుణంగా ఆమె ఇప్ప‌టివ‌ర‌కు మూడుసార్లు ఇలాంటి సందేశాల‌ను రికార్డ్ చేశారు.

"డాక్ట‌ర్లు, న‌ర్సులు, ఇత‌ర అత్య‌వ‌స‌ర సిబ్బందికి ప్ర‌జ‌ల వ‌ల్ల ఇబ్బందిక‌ర పరిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌ని వార్త‌లు వ‌చ్చిన‌ప్పుడు రెండో సందేశం రికార్డు చేశాం. మ‌నం పోరాడాల్సింది వ్యాధితో.. డాక్ట‌ర్లు, న‌ర్సుల‌తో కాదు అని గుర్తుపెట్టుకోవాల‌ని దానిలో సూచించాం"

"అది చాలా భావోద్వేగ‌పూరిత సందేశం. చ‌దివేట‌ప్పుడు నాకు ఒళ్లు గ‌గుర్పొడిచింది. అది నాకు బాగా న‌చ్చింది. నా భావోద్వేగాల‌ను క‌లిపి దాన్ని రికార్డు చేశా" అని ఆమె వివ‌రించారు.

సామాజిక దూరం నిబంధ‌న‌లు మారిన‌ప్పుడు మూడో మెసేజ్ రికార్డు చేశారు. ఇదివ‌ర‌కు చెప్పిన‌ట్లు ఒక మీట‌ర్‌కు బ‌దులు రెండు మీట‌ర్ల సామాజిక దూరం పాటించాల‌ని దానిలో సూచించారు.

ప‌దేప‌దే విన‌డం వ‌ల్ల ఆమె మెసేజ్ చాలా చిరాకుగా ఉంద‌ని కొంద‌రు నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డ్డారు. ఈ సందేశం విన‌కుండా ఉండాలంటే ఏం చేయాలో చెబుతూ కొంద‌రు వార్త‌లూ రాశారు.

"కొంద‌రు ఈ మెసేజ్ మ‌ళ్లీ మ‌ళ్లీ విన‌డం వ‌ల్ల దీన్ని ఎలా త‌ప్పించుకోవాలా అని ఆలోచించి ఉండొచ్చు. నేను కూడా ఫోన్ చేసిన ప్ర‌తిసారీ ఈ మెసేజ్ వినాల్సి వ‌చ్చేది."

"30 సెక‌న్ల‌పాటు అది ఉంటుంద‌ని నాకు తెలుసు. చేతులు క‌డుక్కోండి, మాస్క్ పెట్టుకోండి, హ్యాండ్ శానిటైజ‌ర్ వాడండి అని నా స్వ‌ర‌మే నాకు చెబుతుంది."

"కానీ మనం చాలా ప్ర‌మాద‌క‌ర ప‌రిస్థితుల్లో బ‌తుకుతున్నాం. కాదా? మీరే చెప్పండి."

"జాగ్ర‌త్త‌లు ఇప్పుడు అంద‌రికీ స‌ర్వ సాధార‌ణం అయిపోయాయి. ఈ స‌మ‌యంలో కొంచెం చేదుగా మ‌రికొంచెం తీయ‌గా ఉండే ఈ స్వ‌రం ఇప్పుడు చాలా అవ‌స‌రం. క‌రోనావైర‌స్ సందేశం అంద‌రికీ చేరువచేసేందుకు ఇది శ‌క్తిమంత‌మైన అస్త్రం."

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)