You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
నిర్భయ కేసు: నా కుమార్తె లాంటివారి కోసం పోరాటం కొనసాగిస్తానన్న ఆశాదేవి
నిర్భయ అత్యాచార దోషులు అక్షయ్ సింగ్, వినయ్ శర్మ, ముకేశ్ సింగ్, పవన్ గుప్తాలు నలుగురినీ తిహార్ జైలులో ఉరి తీయడంపై మిశ్రమ స్పందన కనిపిస్తోంది.
నిర్భయకు న్యాయం జరిగిందంటూ అనేక మంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తుండగా, అదే సమయంలో మరణశిక్షలకు వ్యతిరేకంగానూ మరికొందరు మాట్లాడుతున్నారు.
నిందితుల ఉరి అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి విజయ చిహ్నం చూపుతూ తన సోదరి సునీత దేవి, లాయర్ సీమా కుష్వాహాలను కౌగిలించుకుని భావోద్వేగానికి గురయ్యారు.
''మా అమ్మాయి ఇప్పుడు లేదు, తిరిగి రాదు కూడా. ఆమె మమ్మల్ని వీడి వెళ్లిన తరువాత ఈ పోరాటం మొదలుపెట్టాం. ఈ పోరాటం నా కుమార్తె కోసమే చేశాను, కానీ, ఇప్పుడు తనలాంటి ఇంకెందరో కుమార్తెల కోసం ఈ పోరాటాన్ని కొనసాగిస్తాను. నా కూతురు ఫొటోను కౌగిలించుకుని 'ఎట్టకేలకు నీకు న్యాయం జరిగిందమ్మా' అన్నాను'' అని అన్నారామె.
తిహార్ జైలు బయట పెద్దసంఖ్యలో ప్రజలు చేరారు. నిర్భయ నిందితులను ఉరి తీయడంపై మిఠాయిలు పంచుకుంటూ సంతోషం వ్యక్తంచేశారు.
ప్రధాని ఏమన్నారంటే..
‘‘చివరికి న్యాయమే గెలిచింది.. మహిళల గౌరవం, భద్రతకు పూచీ కల్పించడం అత్యంత ఆవశ్యకం’’ అన్నారు ప్రధాని మోదీ.
ఇలాంటి ఘటనల్లో తక్షణమే శిక్షలు పడాలి: కిషన్ రెడ్డి
నిర్భయ అత్యాచార కేసు దోషుల వల్ల ఐపీసీ, సీఆర్‌పీసీలోని లొసుగులు బయటపడ్డాయని.. ఇలాంటి ఘటనల్లో తక్షణమే శిక్షలు పడాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
ఐపీసీ, సీఆర్‌పీసీలో మార్పులు చేయాలని కేంద్రం భావిస్తోందని చెప్పారు.
ముందే ఉరి తీయాల్సింది: న్యాయ మంత్రి రవిశంకర్ ప్రసాద్
దారుణ నేరానికి పాల్పడినవారికి మరణ శిక్ష పడింది.. ఇంకా ముందే ఇది జరిగి ఉండాల్సింది అన్నారు కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్.
‘‘న్యాయం అమలు కావడానికి ఏడేళ్లు పట్టింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అందరం ప్రతినబూనాలి.
దోషులు ఉరి నుంచి తప్పించుకోవడానికి చివరి వరకు ఎన్ని ప్రయత్నాలు చేశారో చూశాం.. వ్యవస్థలో అనేక లోపాలున్నాయి. వ్యవస్థను మెరుగుపరచాల’’ని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
''దేశంలో మరో నాలుగు మరణాలు నమోదయ్యాయి. కానీ, ఈ మరణాల పట్ల దేశమంతా సంబరాలు చేసుకుంటోంది. చివరకు నిర్భయ నిందితులను ఉరి తీశారు. న్యాయం జరిగింది'' అంటూ హరియాణా సెక్యూరిటీ, సైబర్ క్రైమ్ ఎస్పీ పంకజ్ నయన్ ట్వీట్ చేశారు.
కరోనా మరణాలపై దేశమంతా ఆందోళన చెందుతున్న వేళ ఆయన నిర్భయ దోషుల ఉరిని దానికి లింక్ చేస్తూ ట్వీట్ చేశారు.
జాతీయ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ దీనిపై స్పందిస్తూ ఇది ముందే జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ''వాయిదా వేయించుకోగలరేమో కానీ చివరకు ఉరి తప్పదు.. ఇలాంటి పనులు చేసేవారికి శిక్ష తప్పదని ప్రజలకు అర్థమైంది'' అన్నారు.
''ఇది చరిత్రాత్మకమైన రోజు, ఏడేళ్ల తరువాత నిర్భయకు న్యాయం జరిగింది. ఇలాంటి పనిచేస్తే ఉరి తప్పదన్న బలమైన సంకేతాన్ని అత్యాచారాలు చేసేవారికి ఈ దేశం పంపించింది'' అన్నారు దిల్లీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ స్వాతి మలివాల్.
మరోవైపు సోషల్ మీడియా, ప్రసార మాధ్యమాల చర్చావేదికల్లో మానవ హక్కుల, పౌర హక్కుల సంఘాలకు చెందిన పలువురు దేశంలో మరణశిక్షల అమలుకు వ్యతిరేకంగానూ తమ గళం వినిపిస్తున్నారు.
మహిళలపై హింస నిరోధానికి మరణశిక్షలు పరిష్కారం కాదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది.
ఇవి కూడా చదవండి.
- నిర్భయ హంతకులు నలుగురికీ ఉరిశిక్ష, తీహార్ జైలులో అమలుచేసిన అధికారులు
- నిర్భయ దోషుల ఉరితీత; సుప్రీం కోర్టులో అర్ధరాత్రి విచారణలో ఏం జరిగింది
- నిర్భయ ఘటన: విషాదం, ఆగ్రహం కమ్మేసిన భారత్‌ను ఒక్కతాటి పైకి తెచ్చిన కేసు
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
- నిర్భయ ఘటనకు ఏడేళ్లు.. మహిళలపై నేరాల విషయంలో దేశం ఎంత మారింది
- రాష్ట్రపతులతో ప్రమాణ స్వీకారం చేయించే పదవి నుంచి రిటైరయ్యాక రాజ్యసభ ఎంపీగా..
- ఈ ఉన్నత విద్యావంతులు యాచకులుగా మారడానికి కారణమేంటి
- బంగ్లాదేశ్ చరిత్రలోనే అత్యంత దారుణ హత్యాకాండ
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)