You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
దిల్లీ హింస: బాధితులకు నష్టపరిహారం ఎలా అందుతోంది? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- రచయిత, సరోజ్ సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఫిబ్రవరి 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకూ యమునా విహార్‌లోని కెప్టెన్ కటోరా రెస్టారెంట్ వెలిగిపోతోంది.
వెలుగులు విరజిమ్మే లైట్లు, రంగురంగుల బెలూన్లు, పూలు, దండలతో దాన్ని అలంకరించారు. ఈవైపు నుంచి వెళ్లే ఎవరి చూపైనా ఒక్కసారైనా దీనిపై పడేలా ఈ అలంకరణ ఉంది.
భజన్‌పురా మెయిన్ రోడ్‌పై నుంచి వెళ్తున్నాసరే అంతదూరం నుంచైనా కూడా ఈ రెస్టారెంట్ కనిపిస్తుంది.
రెస్టారెంట్ ఎదుట 'జాక్ స్పారో' నిలబడి ఉన్నాడు. ఏదైనా అనుకోని సంఘటన జరిగితే రెస్టారెంట్‌ను అతడే కాపాడతాడు అన్న రీతిలో ఈ బొమ్మ ఉందక్కడ. ఆరోజు రెస్టారెంట్‌లో జరగనున్న ఒక పార్టీ కోసం చేసిన ఏర్పాట్లు ఇవి.
24వ తేదీ సాయంత్రానికల్లా అక్కడికి అల్లరిమూకలు చేరుకున్నాయి. రెస్టారెంట్‌కు చేసిన అలంకరణ అంతా నాశనమైపోయింది. సరదాగా చేసుకుంటున్న పార్టీ కాస్తా కొన్ని గంటల్లోనే సంతాప కార్యక్రమంలా మారిపోయింది. రెస్టారెంట్‌కు నిప్పంటుకుని, వస్తువులన్నీ కాలిబూడిదైపోవటాన్ని చూసిన అతిథులంతా తమ ప్రాణాలు కాపాడుకోవడానికి రెస్టారెంట్ వెనుకవైపు నుంచి బయటకు పరుగులు పెట్టారు.
దాదాపు వారం రోజుల తర్వాత ఈ రెస్టారెంట్ మార్చి 4వ తేదీ బుధవారం తిరిగి ప్రారంభమైంది. పార్టీ జరిగిన రోజు వండిన ఆహారం అక్కడే ఉంది, చద్దికంపు కొడుతోంది. ఉదయం నుంచి కస్టమర్లు ఎవ్వరూ రాలేదు. రెస్టారెంట్లో లైట్లు వేశారు. షెఫ్ ఇంకా డ్యూటీకి రాలేదు. రెస్టారెంట్ యజమాని రవి శర్మ మాత్రం అక్కడ ఉన్నారు. బీబీసీ బృందం చేరుకునేప్పటికి పనివాళ్లు రెస్టారెంట్‌ను సర్దుతున్నారు. ఎన్నో ఏళ్ల బాధనంతా ఈ వారం రోజుల్లోనే భరించినట్లు వాళ్లు కనిపించారు.
''బయటి నుంచి రెస్టారెంట్‌కు నిప్పు పెట్టారు. ఎలాగొలా షెఫ్, అతిథులు బయటపడ్డారు. తర్వాత రోజు మేం తిరిగి వచ్చి చూస్తే హోం థియేటర్, రెండు ప్లాస్మా టీవీలు, కంప్యూటర్ అన్నీ మాయమైపోయాయని తెలిసింది. బయట చేసిన డెకరేషన్ అంతా కాలిపోయింది. మేం లెక్కకట్టి చూస్తే కనీసం 17 నుంచి 18 లక్షల రూపాయల మేర నష్టం జరిగిందని అర్థమైంది'' అని రెస్టారెంట్ యజమాని రవి శర్మ చెప్పారు.
రవి తనకు జరిగిన నష్టాన్ని లెక్క కడుతున్నప్పుడే మేం అడిగాం.. నష్టపోయిన వారికి పరిహారాన్ని వీలైనంత త్వరగా చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది కదా, మీరు ఆ నష్టపరిహారం పొందేందుకు అవసరమైన ఫారాన్ని పూర్తి చేయలేదా? అని.
''ప్రభుత్వం ప్రకటన చేసిన రెండో రోజే నేను ఫారమ్ పూర్తి చేశాను. ఎస్‌డీఎం నుంచి మొదలు పెట్టి కౌన్సిలర్, ఎమ్మెల్యే వరకూ అందరి వద్దకూ కాళ్లరిగేలా తిరిగాను. కానీ, మా బాధను అర్థం చేసుకునేవాళ్లు ఎవ్వరూ లేరు'' అని రవి సమాధానం ఇచ్చారు.
ఈ ప్రాంతంలో తాను రెండు షాపుల్ని అద్దెకు తీసుకున్నానని, ఈ రెండు షాపులూ ఒకే రోడ్డుపై పక్కపక్కన ఉన్నాయని, ఒకదాన్ని పార్టీలకోసం వాడుతుంటామని, మరొకదాంట్లో రెస్టారెంట్ (డైనింగ్) నడుస్తోందని రవి తెలిపారు. ఈ రెండింటికీ కలిపి నెలకు రెండున్నర లక్షల రూపాయలు అద్దె చెల్లించాల్సి ఉంటుందని, ఈ రెండింటిలో మొత్తం 38 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. కానీ, ఇదంతా గత 8 రోజులుగా మూతపడిందని రవి శర్మ మాకు చెప్పారు.
మరి నష్టపరిహారం కోసం సర్వే చేసేవాళ్లు ఎవరో ఒకరు వచ్చే ఉంటారు కదా? అని మేం అడిగాం.
''ఇప్పటి వరకూ ఎవ్వరూ రాలేదు. మరి ఇల్లు ఎలా గడుస్తుందో మీరే చెప్పండి? అసలు ఈ రెస్టారెంట్ తిరిగి ఎప్పటికి గాడిలో పడుతుందో కూడా అర్థం కావట్లేదు'' అని రవి శర్మ చెప్పారు.
అల్లర్లు జరిగిన వెంటనే దిల్లీ ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించింది. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తికి రూ.10 లక్షలు, 18 ఏళ్లలోపు వారైతే రూ.5 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.20 వేలు ఇస్తామని ప్రకటించింది. అలాగే, ఈ అల్లర్ల కారణంగా అనాథలైన పిల్లలకు రూ.3 లక్షలు పరిహారాన్ని ప్రకటించింది.
బీబీసీ బృందం ఇక్కడి నుంచి కెప్టెన్ కటోరా రెండో దుకాణం వద్దకు బయలుదేరింది.
పక్కనే ఒక కాలిపోయిన ఇల్లు కనిపించింది. అక్కడ పెయింటింగ్ పని జరుగుతోంది. లోపలికి వెళ్లి అడిగితే తెలిసింది.. ఈ ఇంటి కిందే రెస్టారెంటు అద్దెకు నడుస్తోందని.
కెప్టెన్ కటోరా రెస్టారెంటుతో పాటు ఈ ఇంటిని కూడా అల్లరి మూకలు వదిలిపెట్టలేదు. ఇంటి యజమాని దీపక్ గార్గ్ మాతో మాట్లాడుతూ.. తాను కూడా నష్టపరిహారం కోసం ఫారమ్ పూర్తి చేశానని, అయితే ఇప్పటి వరకూ దర్యాప్తు చేసేందుకు ఎవ్వరూ రాలేదని, అకౌంట్లోకి డబ్బులు కూడా రాలేదని అన్నారు.
''మా షాపు, ఇల్లు మెయిన్‌రోడ్డులో ఉన్నాయి. ఇవి కూడా కనిపించలేదా ఏంటి? దీనికి మించిన ఆధారం మేం ఇంకేం చూపించాలి? కౌన్సిలర్, ఎమ్మెల్యే అంతా వచ్చారు. కానీ ఏమీ లభించలేదు'' అని మేం ఏమీ అడగకుండానే దీపక్ గార్గ్ కెమెరా ముందు నిలబడి ఏకధాటిగా మాట్లాడేశారు. ''ఎన్నాళ్లు మేం కార్యాలయాల చుట్టూ తిరగాలి? ఎప్పటికి మళ్లీ మేం సాధారణ స్థితికి వస్తాం?'' అని చివరగా ఆయన అన్నారు.
దీపక్ గార్గ్ ఫ్లాట్ యమునా విహార్ మెయిన్ రోడ్డుపై ఉంది. 200 గజాల్లో నిర్మించిన ఈ భవనంలో కింది అంతస్థును ఆయన కెప్టెన్ కటోరాకు అద్దెకు ఇచ్చారు. 24వ తేదీన అల్లరి మూకలు వచ్చి నిప్పు పెట్టడంతో చాలా కష్టమ్మీద పక్కింటిపైకి ఎక్కి ఆయన తనతోపాటు తన కుటుంబ సభ్యుల ప్రాణాలను కాపాడుకోగలిగారు. తర్వాత ఇంటికి వచ్చి చూస్తే ముందుభాగం పూర్తిగా కాలి బూడిదైపోయింది.
నష్టపరిహారం ఇప్పటికీ అందకపోవడానికి కారణాలను ఆయన కెమెరా ముందు కొన్నింటిని, కెమెరా లేకుండా కొన్ని వివరించారు.
బీబీసీ కెమెరా ముందుకొచ్చి ఆయన స్పష్టంగా చెప్పిందేంటంటే.. కాలిపోయిన ఇళ్లకు ప్రకటించిన పరిహారం 25-30 గజాల ఇళ్లకు మాత్రమే, 200 గజాల ఇళ్లకు ఎలాంటి పరిహారాన్ని ప్రకటించలేదు. కెమెరా లేకుండా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ పార్టీల మధ్య ఉన్న వైరాన్ని చెప్పుకొచ్చారు.
పరిహారం అందటంలో మరొక సమస్య కూడా ఉంది. దీపక్ ఇంటి వద్ద ఆ రోజు రెండు వాహనాలు కూడా ఉన్నాయి, నాలుగు చక్రాల వాహనం ఒకటి, ద్విచక్ర వాహనం మరొకటి. రెండూ కాలిబూడిదైపోయాయి. ఈ కాలిపోయిన వాహనాల విడిభాగాలను పోలీసులు దర్యాప్తు నిమిత్తం తీసుకెళ్లారని దీపక్ చెబుతున్నారు.
ఇన్సూరెన్స్ కంపెనీల వాళ్లేమో ఆ కాలిపోయిన వాహనాలను చూపించమని అడుగుతున్నారు. అవి లేకుండా దీపక్ చేసిన క్లెయిమ్‌కు ఆమోదం లభించదు. మేం రెండు విధాలా నష్టపోతున్నాం అని దీపక్ వాపోతున్నారు. ఇటు కార్లకు చేసిన బీమా పరిహారం అందట్లేదు.. అటు ప్రభుత్వం ప్రకటించిన పరిహారం కూడా రావట్లేదు.
దిల్లీ ప్రభుత్వం జారీ చేసిన గణాంకాల ప్రకారం చూస్తే.. మార్చి 3వ తేదీ వరకు అల్లర్లలో ప్రభావితమైన వారికి రూ.38.75 లక్షలు నష్టపరిహారం కింద ఇచ్చారు. మొత్తం 79 ఇళ్లు పూర్తిగా కాలిపోయాయి, 168 ఇళ్లు సగం కాలిపోయాయి, 327 షాపులు పూర్తిగా కాలి బూడిదైపోయాయి.
దిల్లీ ప్రభుత్వం ముస్తఫాబాద్ ప్రాంతంలో ఒక సహాయ శిబిరాన్ని ఏర్పాటు చేసి నష్టపరిహారాన్ని ప్రజలకు అందించే ఏర్పాట్లు చేసింది. ఈ శిబిరం వల్ల బాధిత ప్రజలు తలదాచుకునేందుకు చోటు దొరుకుతుంది. అలాగే నష్టపరిహారం ఫారాలు కూడా అక్కడే నింపి ఇవ్వొచ్చు.
బీబీసీ బృందం ఈద్గా వద్ద ఉన్న ఈ క్యాంపును సందర్శించింది.
అప్పుడు అక్కడంతా గందరగోళంగా ఉంది. సుమారు 300-400 మంది ప్రజలు ఈ క్యాంపులో కనిపించారు. నిత్యావసర సామాన్లు కూడా అక్కడ ఉన్నాయి. చాపలు, మంచినీళ్లు, బట్టలు, ఆహారం అందిస్తున్నారు. నష్టపరిహారం పొందేందుకు అవసరమైన ఫారాలు నింపేందుకు కొందరు వలంటీర్లు సహాయం చేస్తున్నారు.
వలంటీర్లు ఉన్న చోట టెంటుపై ఇలా రాసి ఉంది.. 'న్యాయ సహాయ, సలహా కేంద్రం'.
మీకు ఎంత నష్టం జరిగింది? అంటూ నాలుగైదు కుర్చీల్లో కూర్చున్న యువ వలంటీర్లు బాధిత ప్రజల్ని అడుగుతున్నారు.
ఎలా తెలుస్తుంది? అని ఈ ఫారాలు పూర్తి చేస్తున్నవాళ్లు అడిగారు.
టీవీ, ఫ్రిజ్, మంచం.. ఇలా ఇంట్లో ఏఏ వస్తువులకు నష్టం జరిగింది? వాటి విలువ ఎంత ఉంటుంది? అవన్నీ చెప్పండి, వాటినే ఇక్కడ నింపాలి.. అని వలంటీర్లు చెప్పారు.
మొత్తం కలిపి రూ.50 వేలు.. అని బాధితుల్లో ఒకరు చెప్పారు.
దీంతో ఫారమ్‌లో రూ.50 వేలు అని వలంటీర్ రాశారు.
ఇలా ఫారాలు నింపే సమయంలో ఎలాంటి వెరిఫికేషన్ జరగడం లేదు. "అలాంటి ఈ ఫారాలను ఏం చేస్తారు?" అని మాకనిపించింది.
చాలాసేపు వెతికిన తర్వాత మాకు దిల్లీ వక్ఫ్ బోర్డు నియమించిన కమిటీ సభ్యుడు చౌధరీ జహీన్ అబ్బాస్ కనిపించారు. మీడియాతో మాట్లాడేందుకు ఈద్గా సహాయ కేంద్రం నియమించిన వ్యక్తి ఆయన. రోజుకోసారి ఎస్‌డీఎం వచ్చి ఈ ఫారాలను తీసుకెళ్తారని ఆయన చెప్పారు.
అల్లర్ల బాధితుల కోసం దిల్లీ ప్రభుత్వం మొత్తం 11 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. వాటిలో 9 నైట్ షెల్టర్లు కాగా, ఒకటి శ్రీరామ్ కాలనీ కేంద్రం, మరొకటి ఈద్గా సహాయ శిబిరం.
మేం అక్కడున్న బాధితుల్ని కూడా నష్టపరిహారం గురించి అడిగాం. అందులో ఎవరికీ కూడా ఎటువంటి పరిహారం లభించలేదు. అయినప్పటికీ అక్కడున్న వారంతా ఫారాలను తప్పక భర్తీ చేశారు.
అక్కడి నుంచి మేం అల్-హింద్ ఆసుపత్రికి వెళ్లాం. ఈ ఆసుపత్రి ఈద్గా శిబిరానికి సమీపంలోనే ఉంది. అల్లర్లలో గాయపడ్డ వారికి ఈ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించేందుకు కోర్టు అర్థరాత్రి విచారణ జరిపింది.
అక్కడ మేం డానిష్ తల్లి ఇష్రత్‌ను కలిశాం. అల్లర్లు జరిగిన రోజు తన కుమారుడికి బుల్లెట్ తగిలిందని ఇష్రత్ చెప్పారు. జీటీబీ ఆసుపత్రిలో సరైన వైద్య సహాయం అందట్లేదని అల్-హింద్ ఆసుపత్రికి వచ్చామని ఆమె తెలిపారు. ఈద్గా శిబిరాన్ని ఏర్పాటు చేసిన మొదటి రోజు అక్కడికి వెళ్లి ఫారమ్ పూర్తి చేశానని, అయినా ఎలాంటి పరిహారం రాలేదని, ఇప్పటికీ తాను పరిహారం కోసం ఎదురుచూస్తున్నానని ఆమె చెప్పారు.
అక్కడి నుంచి బీబీసీ బృందం వెనుదిరుగుతున్నప్పుడు ఇష్రత్ ఇలా అన్నారు.. ''మా వద్దకు మీలాంటి మీడియా రిపోర్టర్లే వస్తున్నారు. ముఖ్యమంత్రి కానీ, రాజకీయ నాయకులు కానీ, రాజకీయ నాయకుల ప్రతినిధులు కానీ ఎవ్వరూ రావట్లేదు.''
ఈశాన్య దిల్లీలో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనలు జరిగాయి. ఫిబ్రవరి 23వ తేదీ అర్థరాత్రి (తెల్లారితే 24వ తేదీ) నుంచి సీఏఏ అనుకూల ప్రదర్శనలు చేస్తున్నవాళ్లు తమ ప్రత్యర్థులపై ఆగ్రహించారు. 24వ తేదీ నుంచి పరిస్థితి మరింత దిగజారింది. ఈశాన్య దిల్లీలో మూడు రోజులపాటు జరిగిన ఈ అల్లర్లు, హింసలో 50 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.
ఇవి కూడా చదవండి:
- దిల్లీ హింస: వదంతులు ఎంత భయంకరమైనవంటే...
- దిల్లీ హింస: అల్లర్లలో మరణించినవారి వ్యధలివీ..
- 'నా బిడ్డను చంపేశారని ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాను' -అంకిత్ శర్మ తల్లి
- దిల్లీ హింస: ఈ ఫొటోలోని వ్యక్తి ఎవరు... ఇప్పుడు ఆయన ఎలా ఉన్నారు?
- దిల్లీ హింస: అల్లరిమూకలను శర్మ, సైఫీ కలిసి ఎలా అడ్డుకున్నారంటే
- దిల్లీ హింస: సరిహద్దులు దాటి.. అల్లరి మూకను ఎదిరించి.. ఎన్నో ప్రాణాలు కాపాడిన పోలీస్ హీరో నీరజ్ జాదౌన్
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనా వైరస్: పిల్లలపై ప్రభావం చూపలేకపోతున్న వైరస్.. కారణాలు చెప్పలేకపోతున్న వైద్య నిపుణులు
- కరోనావైరస్: శశిథరూర్ మెడలోని ఈ గాడ్జెట్ వైరస్‌లను అడ్డుకుంటుందా
- దిల్లీ హింస: 'ప్రేమికుల దినోత్సవం రోజు పెళ్ళి చేసుకున్నాడు... 11 రోజులకే అల్లర్లలో చనిపోయాడు"
- కరోనా వైరస్: 'తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది.. దగ్గు, జ్వరంతో మొదలై అవయవాలు పనిచేయకుండా చేస్తుంది'
- ఆల్కహాల్ తాగిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుంది? హ్యాంగోవర్ దిగాలంటే ఏం చేయాలి
- కరోనావైరస్: జంతువుల నుంచి మనుషులకు సోకింది ఇలాగేనా? శాస్త్రవేత్తల ‘డిటెక్టివ్ కథ’
- దిల్లీలో అలర్లు చేయించేందుకు ముస్లింలకు డబ్బులు పంచారా? : Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)