You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"జేఎన్‌యూ వీసీని వెంటనే తొలగించాలి": బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి
జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు తమ కేంపస్‌లో జరిగిన దాడిని నిరసిస్తూ ఆదివారం నాడు భారీ ప్రదర్శన చేపట్టారు. వీరిలో చాలామందిని దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు వారందరినీ బస్సుల్లోకి ఎక్కించారు. ఈ క్రమంలో చాలామంది విద్యార్థులకు గాయాలయ్యాయి. శాంతియుతంగా ఉండాలంటూ పోలీసులు లౌడ్ స్పీకర్లలో విజ్ఞప్తి చేయడం కూడా అక్కడ కనిపించింది. గురువారం నాడు రాష్ట్రపతి భవన్ వైపు మరో నిరసన ప్రదర్శన చేపట్టారు. దీన్ని కూడా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య కాసేపు వాగ్వాదం, తోపులాట జరిగాయి.
నిరసనలను దృష్టిలో ఉంచుకుని పోలీసులు ముందుగానే బారికేడ్లు ఏర్పాటు చేశారు. నిరసనలో పాల్గొన్న విద్యార్థులను బలవంతంగా తమ వాహనాల్లోకి ఎక్కించారు. ఆ సమయంలో విద్యార్థులు పోలీసులకు, మోదీ ప్రభుత్వానికి, యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌కు వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటేందుకు కూడా కొందరు ప్రయత్నించారు.
"ఫీజుల పెంపు అంశానికి సంబంధించి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనాలని జేఎన్‌యూకి, వీసీకి హెచ్ఆర్డీ మంత్రిత్వ శాఖ రెండుసార్లు సూచిందని నివేదికలు చెబుతున్నాయి. విద్యార్థులు, టీచర్లతో చర్చించాలని కూడా వీసీకి సూచించారు. ప్రభుత్వ ప్రతిపాదనను అమలుచేయడానికి వీసీ సిద్ధంగా లేకపోవడం ఆశ్చర్యంగా ఉంది. ఈ వైఖరి సరికాదు. నా అభిప్రాయం ప్రకారం అలాంటి వీసీని ఆ పదవిలో కొనసాగించకూడదు" అని బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషి ట్విటర్లో వ్యాఖ్యానించారు.
జేఎన్‌యూ విద్యార్థులు, పౌరసమాజం సభ్యులు, ప్రొఫెసర్లు మండీ హౌస్ నుంచి గురువారం మధ్యాహ్నం ఈ ప్రదర్శన చేపట్టారు. మానవ వనరుల శాఖ కార్యాలయానికి వెళ్లి మెమొరాండం ఇవ్వాలని వారు భావించారు. వీసీని తొలగించాలని వాళ్లు డిమాండ్ చేశారు.
ఈ సమయంలో రాష్ట్రపతి భవన్ వైపుగా ర్యాలీగా వెళ్లాలని జేఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్ నిర్ణయించుకున్నారు. ఈ ర్యాలీలో సీపీఎం నేత సీతారాం ఏచూరితో పాటు మరికొందరు లెఫ్ట్ పార్టీల నేతలు కూడా ఉన్నారు.
తమ కేంపస్‌లో జరిగిన దాడిపై వినతిపత్రం ఇవ్వడానికి జేఎన్‌యూ టీచర్స్ అసోసియేషన్ (జేఎన్‌యూటీఏ) సభ్యులు, ఏడుగురు టీచర్లు, విద్యార్థి సంఘాలకు చెందిన మరో నలుగురు ప్రతినిధులు కలిసి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులను కలిసేందుకు గురువారం నాడు వెళ్లారు.
జేఎన్‌యూలో సమస్యలు వీసీని తొలగించడంతో సమసిపోవు అని ఈ సమయంలో వారితో హెచ్‌ఆర్డీ సెక్రటరీ అమిత్ ఖరే అన్నారు.
"హెచ్ఆర్డీ ఫోకస్ అంతా అకడమిక్ అంశాలపైనే ఉంది, రాజకీయ అంశాలపై కాదు. కొత్త ఫీజులు అమలుచేయకపోవడంపై వీసీ జగదీశ్ కుమార్‌తో మంత్రిత్వశాఖ అధికారులు మరోసారి శుక్రవారం నాడు చర్చలు జరుపుతారు. వీసీతో సమావేశం తర్వాత విద్యార్థులతో కూడా హెచ్ఆర్డీ అధికారులు సమావేశమవుతారు" అని ఆయన వారికి తెలిపారు.
"గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు బాధాకరం. విద్యార్థులకు కొన్ని డిమాండ్లున్నాయి. టీచర్లకు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాం" అని అమిత్ ఖరే తెలిపారు.
జగదీశ్ కుమార్‌ను వీసీ పదవి నుంచి తొలగించకపోతే విద్యార్థులు, అధ్యాపకుల వైఖరి మారదు అని ఐషీ ఘోష్ స్పష్టం చేశారు.
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్హయ్య కుమార్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
"విద్యార్థులపై అనాగరికమైన దాడులకు వ్యతిరేకంగా విద్యార్థులు, అధ్యాపకులు చేసే నిరసన దేశంలోని చట్టాల్ని విచ్ఛిన్నం చేయడం లేదు, కానీ అధికార బీజేపీనీ విచ్ఛిన్నం చేస్తుంది" అని ఆయన వ్యాఖ్యానించారు.
హెచ్ఆర్డీ కార్యాలయం బయట గుమిగూడిన విద్యార్థులనుద్దేశించి కన్హయ్య కుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వాళ్లు మనల్ని విచ్ఛిన్నకర శక్తులు అని అంటున్నారు. నేనిక్కడే ఉన్నా, నా ముఖం ఏమీ దాచుకోలేదు. నేను చెబుతున్నా... నేను విచ్ఛిన్నకర మూకలో సభ్యుడినే. మేము దేశాన్ని విచ్ఛిన్నం చేయడం లేదు. కానీ బీజేపీని మాత్రం కచ్చితంగా చేస్తాం" అని కన్హయ్య అన్నారు.
"జేఎన్‌యూలో ఏం జరిగిందో చూశాం. చర్చించాం. అయితే, ఓ యూనివర్సిటీపై ప్రతిసారీ ఎందుకు వివాదాలు చుట్టుముడుతున్నాయో మనం అర్థం చేసుకోవాలి. విద్యార్థులకు మద్దతుగా నిలబడేవారిని దేశద్రోహులుగా ఎందుకు ముద్ర వేస్తున్నారు? దీపికా పడుకోణే ఇక్కడకు వచ్చారు. ఆమె ఏమీ మాట్లాడలేదు. ఆమె కనీసం ప్రధాని మోదీ పేరు గానీ, హోంమంత్రి అమిత్ షా పేరుగానీ ఎత్తలేదు. గాయపడినవారిని పరామర్శించి వెళ్లారంతే. కానీ, వెంటనే ఆమె సినిమాను బహిష్కరించాలని బీజేపీ మద్దతుదారులు ప్రచారం చేపట్టారు. ఆమె ఏ పార్టీ గురించి గానీ, సిద్ధాంతాల గురించి గానీ మాట్లాడనప్పుడు ఆమె సినిమాను ఎందుకు చూడరు?" అని కన్హయ్య ప్రశ్నిచారు.
"దీన్నంతటినీ చూస్తుంటే జేఎన్‌యూలో దాడి వెనక ప్రభుత్వం పాత్ర ఉందని వారే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. చదువుకోలేని విద్యార్థులను ప్రముఖులు కలవాలని వీసీ చెబుతున్నారు. ఇది వారి పని అని ఎవరో వారికి గుర్తు చెయ్యాలి. వాళ్లొచ్చి విద్యార్థులు, ఉపాధ్యాయులతో మాట్లాడాలి. దీపిక యూనివర్సిటీకి వీసీ కాదు కదా" అని అన్నారు.
"జనవరి 5 కొన్ని విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణలు జరిగాయని వీసీ అంటున్నారు. అలా అయితే దాడిలో టీచర్లను ఎందుకు కొట్టారు?" అని కన్హయ్య ప్రశ్నించారు.
"హెచ్ఆర్డీ అధికారులను కలిసిన తర్వాత అక్కడున్న విద్యార్థి నాయకుల్లో ఒకరు రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ చేయాలని అందరినీ రెచ్చగొట్టారు. దీంతో వారు సాధారణ ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. 11మందిని అదుపులోకి తీసుకుని, ఆ తర్వాత వదిలిపెట్టారు" అని డీసీపీ తెలిపారు.
ఆదివారం రాత్రి జరిగిన ఈ దాడిలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. క్రైమ్ బ్రాంచ్ దీనిపై విచారణ చేపట్టింది. అయితే ఇంతవరకూ ఎవరినీ అరెస్ట్ చెయ్యలేదు. ఈ దాడికి మీరే కారణమని ఏబీవీపీ, లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నాయి.
గత కొన్ని నెలలుగా ఫీజుల పెంపు, హాస్టల్, మెస్ చార్జీల పెంపును వ్యతిరేకిస్తూ జేఎన్‌యూ విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి.
- JNU హింస: దిల్లీ పోలీసుల పనితీరుపై ప్రశ్నల వెల్లువ
- JNU విద్యార్థులపై హింసాత్మక దాడి వెనుక... వాట్సాప్ గ్రూప్స్ సీక్రెట్ చాటింగ్
- భారతదేశంలో విద్యార్థి ఉద్యమాల చరిత్ర ఏమిటి... వాటి ప్రభావం ఎలాంటిది?
- CAA: ముస్లిం అమ్మాయిల హిజాబ్ ఓ జెండాలా మారింది, దీని అర్థమేంటి
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: నిజంగా 50 కోట్ల జంతువులు చనిపోయాయా?
- ఆస్ట్రేలియా కార్చిచ్చు: 2,000 ఇళ్లు బుగ్గి.. ఇంకా వదలని దావానలం భయం
- బ్రిటన్ రాజకుటుంబ బాధ్యతల నుంచి వైదొలగుతామన్న హ్యారీ-మేఘన్ జంట
- ఆ రెండు అమెరికా స్థావరాలపైనే ఇరాన్ క్షిపణి దాడులు ఎందుకు చేసింది?
- నిర్భయ గ్యాంగ్‌రేప్ నిందితులకు ఉరిశిక్ష: ఇంతకీ రామ్ సింగ్, ముకేశ్ సింగ్, వినయ్ శర్మ, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, మైనర్ నిందితుడు ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)