You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం కేసులో జనవరి 13 నుంచి 'సుప్రీం' విచారణ
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై దాఖలైన రివ్యూ పిటిషన్లపై 9మంది జడ్జిల సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టనుంది. దీనికి సీజేఐ ఎస్ఏ బాబ్డే నేతృత్వం వహిస్తారు.
ఈ బెంచ్‌లో జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ ఎల్ నాగేశ్వర రావు, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ మోహన్ ఎం శాంతనగౌడర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి,, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లు ఉంటారు.
మహిళల ప్రవేశానికి అనుకూలంగా తీర్పునిచ్చిన జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లు ఈ బెంచ్‌లో సభ్యులు కాదు. అలాగే వ్యతిరేకంగా తీర్పు వెల్లడించిన మహిళా జడ్జి జస్టిస్ ఇందు మల్హోత్రా కూడా కొత్తగా ఏర్పాటైన బెంచ్‌లో లేరు.
మసీదుల్లోకి మహిళల ప్రవేశం, దావూదీ బోహ్రా వర్గంలో మహిళలకు ఖత్నా చేయడం, పార్శీలు కాని పురుషులను పెళ్లి చేసుకునే పార్శీ మహిళలకు తమ ఆలయాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి ఇతర మతపరమైన అంశాలను కూడా ఈ బెంచ్ పరిశీలిస్తుంది.
తొమ్మిది మంది సభ్యుల ధర్మాసనం జనవరి 13 నుంచి ఈ కేసులో వాదనలు వింటుంది.
ఈ కేసులో ఇంతకు ముందు ఏం జరిగింది?
శబరిమల ఆలయ ప్రవేశానికి సంబంధించి గత ఏడాది ఇచ్చిన తీర్పుపై రివ్యూ కోరుతూ దాఖలైన పిటిషన్ల విచారణను విస్తృత ధర్మాసనానికి అప్పగిస్తూ సుప్రీంకోర్టు 2019 డిసెంబరులో నిర్ణయించింది.
ఈ మేరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ బాధ్యతలు చేపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. గతంలో తాము ఇచ్చిన తీర్పుపై స్టే ఏమీ లేదని స్పస్టం చేసింది.
ఆలయాల్లో మహిళల ప్రవేశంపై ఆంక్షలు ఒక్క శబరిమలకే పరిమితం కాలేదని, మసీదులు, పార్సీ ప్రార్థనా మందిరాలు కొన్నిటిలో ఇలాంటి సంప్రదాయం ఉందని అప్పట్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
2018 నాటి తీర్పులో..
2018 సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఏ వయసు మహిళలైనా వెళ్లి పూజలు చేయొచ్చని తీర్పు ఇచ్చింది. అంతకుముందు ఆ ఆలయంలో 10 నుంచి 50 ఏళ్ల లోపు మహిళల ప్రవేశంపై శతాబ్దాలుగా నిషేధం ఉంది.
బ్రహ్మచారి అయిన అయ్యప్ప ఆలయంలోకి రుతుస్రావం సమయంలో మహిళలు ప్రవేశించే అవకాశం ఉండొచ్చన్న కారణంతో 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు గల బాలికలు, మహిళలకు రానిచ్చేవారు కాదు.
దీనిపై 2006లో కొందరు మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంతో గత ఏడాది దానిపై కోర్టు తీర్పు ఇచ్చింది. అన్ని వయసులవారూ ఆ ఆలయ ప్రవేశం చేయొచ్చని తీర్పిచ్చింది.
అయితే, ఆ ఆదేశాలను వ్యతిరేకిస్తూ.. తీర్పును సమీక్షించాలంటూ సుమారు 60 దాకా పిటిషన్లు దాఖలయ్యాయి.
ఆ పిటిషన్లపై విచారించిన సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం 2019 ఫిబ్రవరి 6న తన తీర్పును రిజర్వు చేసింది.
ఈ రోజు(14.11.2019) దానిపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేరళలో ముందు జాగ్రత్తగా పెద్దఎత్తున భద్రతా చర్యలు చేపట్టారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు 10,000 మందికి పైగా పోలీసులను సన్నిధానం, శబరిమల, పంబా, నీలక్కల్ పరిసర ప్రాంతాలలో కేరళ ప్రభుత్వం మోహరించింది.
ఆ తీర్పు తరువాత ఏమైంది?
శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించొచ్చని సుప్రీం గత ఏడాది తీర్పు ఇచ్చిన తరువాత కొందరు మహిళలు ఆలయ ప్రవేశానికి ప్రయత్నిస్తే భక్తులు, ఆందోళనకారుల నుంచి ప్రతిఘటన ఎదురైంది.
ఒకటి రెండు ప్రయత్నాల తరువాత చివరకు పోలీసుల సహాయంతో తొలిసారి ఇద్దరు మహిళలు బిందు, కనకదుర్గలు 2019 జనవరి 2న ఆలయంలోకి వెళ్లగలిగారు.
వారి ప్రవేశం తరువాత ఆలయాన్ని శుద్ధి కోసం మూసివేశారు. గంటపాటు శుద్ధి కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మళ్లీ ఆలయాన్ని తెరిచారు.
ఇవి కూడా చదవండి
- బోన్సాయ్: 400 ఏళ్ల వయసున్న చెట్టు దొంగతనం
- టోక్యో ఒలింపిక్స్: పాత సామానుతో.. పతకాల తయారీ
- గుండెల్ని పిండేసే వ్యథ: జైలుకు వెళ్లేందుకు పదేపదే నేరాలు చేస్తున్న జపాన్ వృద్ధులు.. ఎందుకంటే...
- అక్కడ 18 ఏళ్లుదాటినా పెద్దవారు కాదు
- చైనా, జపాన్ల మధ్య ఆకస్మిక స్నేహబంధం
- కారును అడ్డగించి, తుపాకి గురిపెట్టి అమ్మాయికి ప్రపోజ్ చేశాడు
- నోబెల్ శాంతి పురస్కారం: అబియ్ అహ్మద్ తూర్పు ఆఫ్రికాలో శాంతిని నెలకొల్పారా?
- ఊబకాయంపై ఏడు అపోహలు... తెలుసుకోవాల్సిన వాస్తవాలు
- సిరియాలో కుర్దులపై టర్కీ 'సైనిక చర్య' ఎందుకు? దీనివల్ల జరగబోయేది ఏమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)