You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పౌరసత్వ సవరణ చట్టం: కాన్పూర్‌లో టియర్ గ్యాస్ ప్రయోగం.. రాంపూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు
పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. దిల్లీలో జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ బయట విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. కాన్పూర్, రాంపూర్‌లో ప్రదర్శనలు ఆందోళనకరంగా మారాయి.
కాన్పూర్‌లో పోలీసులపై రాళ్లు రువ్విన ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
ఈ ఘర్షణలు కాన్పూర్‌లోని యటీమ్ ఖానా పోలీస్ స్టేషన్ ఏరియాలో జరిగాయి.
యూపీలో మొత్తం 15 మంది మృతి
యూపీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా డిసెంబర్ 10 నుంచీ జరుగుతున్న వ్యతిరేక ప్రదర్శనల్లో మొత్తం 705 మందిని అరెస్టు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ఐజీ(లా అండ్ ఆర్డర్) ప్రవీణ్ కుమార్ చెప్పారు.
"సుమారు 4500 మందిని ముందస్తు అదుపులోకి తీసుకున్న తర్వాత వదిలేశామని చెప్పారు. ఆందోళనల్లో మొత్తం 15 మంది మృతిచెందారని, 263 మంది పోలీసులు కూడా గాయపడ్డారని, వీరిలో 57 మంది పోలీసులకు ఫైర్ ఆర్మ్స్ వల్ల గాయాలు అయ్యాయని ప్రవీణ్ చెప్పారు.
హింసకు పాల్పడితే వదలం: యూపీ సీఎం
"ఎవరూ రెచ్చగొట్టే వ్యాఖ్యల ప్రభావానికి గురికావద్దని, శాంతియుతంగా ఉండాలని, ప్రభుత్వానికి సహకరించాలని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఆందోళనకారులను కోరారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని హింసకు పాల్పడితే ఎవరినీ ఉపేక్షించమని" ఆయన హెచ్చరించినట్లు సీఎంఓ కార్యాలయం ట్వీట్ చేసింది.
ఎవరైనా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిస్తే, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వీడియో ఫుటేజి, ఇతర ధ్రువీకృత ఆధారాల ద్వారా ఆందోళనకారులను గుర్తించి వారి ఆస్తులు జప్తు చేస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు యూపీ సీఎంఓ తెలిపింది.
వదంతులను పట్టించుకోకండి. అరాచక శక్తుల రెచ్చగొడితే వాటికి గురికాకుండా శాంతి పునరుద్ధరించాలని యోగీ ప్రజలను కోరారు. పౌరసత్వ సవరణ చట్టానకి వ్యతిరేకంగా వచ్చే వదంతులను వ్యాప్తి చేస్తూ, తప్పుదోవ పట్టించే శక్తులను వెతికి గుర్తించాలని పోలీసులకు ఆదేశించారు.
ఉత్తరప్రదేశ్ రాంపూర్‌లో హింస
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో స్థానికులు పోలీసులపై రాళ్లు రువ్వారు. రెండు మోటార్ సైకిళ్లకు నిప్పుపెట్టారు.
"ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరిగాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి" అని యూపీ డీజీపీ చెప్పారు.
"ఇప్పటివరకూ మృతుల సమాచారం ఏదీ లేదు. దానిపై దర్యాప్తు చేసి మీడియాకు చెబుతాం. ఇప్పుడు పరిస్థితి అదుపులో ఉంది. పోలీసులు, ప్రజలు ధైర్యంగా, సంయమనంతో ఉండాలి" అని బరేలీ జోన్ ఏడీజీ విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం జరిగిన నిరసన ప్రదర్శనల్లో హింస తలెత్తడంతో 9 మంది మృతి చెందారని, మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని ఉత్తర్‌ప్రదేశ్ పోలీస్ డీజీపీ ఓపీ సింగ్ చెప్పారు.
"అరెస్టుల విషయానికి వస్తే లఖ్‌నవూలో ఇప్పటివరకూ 218 మందిని అరెస్టు చేశాం. ఈ వ్యతిరేకతలు రెచ్చగొట్టడంలో ఎన్జీఓలు, రాజకీయ పార్టీలు ఉండొచ్చు. మేం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. మేం ఎవరినీ వదిలిపెట్టం" అని ఓపీ సింగ్ అన్నారు.
వ్యతిరేక ప్రదర్శనల్లో 10 మంది మృతిచెందారని ఏఎన్ఐ వార్తా సంస్థ చెప్పింది.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనలతో అధికారులు శనివారం యూపీలోని అన్ని కాలేజీలు, స్కూళ్లు మూసివేయాలని ఆదేశించారు.
కాన్పూర్‌లో జరిగిన వ్యతిరేక ప్రదర్శనల్లో హింస చెలరేగింది.
కాన్పూర్‌లో సీఏఏ వ్యతిరేక ప్రదర్శనల్లో హింస చెలరేగింది. గత అర్థరాత్రి వరకూ ఇద్దరు మృతిచెందారని ధ్రువీకరించారు.
గోరఖ్‌పూర్ ఆందోళనల్లో దుండగులు
గోరఖ్‌పూర్ పోలీసులు నిరసన ప్రదర్శనల ముసుగులో హింసకు పాల్పడుతున్న దుండగుల ఫొటోలు విడుదల చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగే ఆందోళనల్లో హింసకు పాల్పడుతున్న వారి ఫొటోలు ఉన్న పోస్టర్లను గోరఖ్‌పూర్ పోలీసులు జిల్లా అంతటా అతికించారు.
సీఏఏ వెనక్కు తీసుకోవాలని మాయావతి డిమాండ్
సీఏఏ వెనక్కు తీసుకోవాలని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
"ఇప్పుడు కొత్త సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఎన్డీయేలో కూడా వ్యతిరేక గళాలు వినిపిస్తున్నాయి. అలాంటప్పుడు తన మొండిపట్టు వీడి ఈ నిర్ణయాలను వెనక్కు తీసుకోవాలని బీఎస్పీ డిమాండ్ చేస్తోంది. మీ వ్యతిరేకతలను శాంతిపూర్వకంగా వ్యక్తం చేయాలని నిరసనకారులకు విజ్ఞప్తి చేస్తున్నాను" అని మాయావతి ట్వీట్ చేశారు.
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. రాజధాని దిల్లీ చాణక్యపురిలో నలుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల సందర్భంగా దిల్లీ చాణక్యపురిలో ఉత్తర్‌ప్రదేశ్ భవన్ బయట నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.
జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ బయట శనివారం నిరసన ప్రదర్శనలు జరిగాయి.
ఇది అసమియా ఉద్యమం: భట్టాచార్య
అస్సాంలో జరుగుతున్న ఉద్యమం గురించి అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చీఫ్ అడ్వైజర్ సముజ్వల్ భట్టాచార్య ట్వీట్ చేశారు.
"మేం అసమియా ప్రాంత యోధులం. ఈ ఉద్యమం హిందువులు, ముస్లింలు లేదా బెంగాలీల కోసం కాదు. ఇది అసామియాల కోసం. మతం లేదా నమ్మకం, లేదా ఆర్థిక స్థితికి అతీతంగా అస్సాం, అసమియా గౌరవం కోసం మేం దీనిని చేస్తున్నాం" అని అస్సాం స్టూడెంట్స్ యూనియన్ చీఫ్ అడ్వైజర్ సముజ్వల్ భట్టాచార్య పీటీఐతో అన్నారు.
అస్సాం తిన్‌సుకియాలో శనివారం రాత్రి 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 5 వరకూ కర్ఫ్యూ ప్రకటించారు.
అస్సాం రాజధాని గువాహటిలోని లతసిల్ మైదానంలో మహిళలు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
తమిళనాడులో ఆందోళనలు
తమిళనాడులో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రదర్శనల సమయంలో ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
తమిళనాడులో కొత్త పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా వామపక్ష దళాలు వ్యతిరేక ప్రదర్శనలు చేశాయి. ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ బయట ఆందోళకారులు గుమిగూడారు.
కాంగ్రెస్ పాత్రపై ప్రశాంత్ కిశోర్ ప్రశ్నలు
రాజకీయ పార్టీలు ఎన్నికల వ్యూహం రూపొందించే, జేడీయూ నేత ప్రశాంత్ కిశోర్ పౌరసత్వ సవరణ చట్టంపై కాంగ్రెస్ పాత్ర గురించి ప్రశ్నలు లేవనెత్తారు.
"కాంగ్రెస్ రోడ్లపై లేదు. సీఏఏ-ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా ఆ పార్టీ అగ్ర నాయకత్వం పూర్తిగా మాయమయ్యారు. కనీసం కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులైనా దీనిని మా రాష్ట్రాల్లో అమలు చేయనివ్వం అని చెప్పచ్చు" అని ట్వీట్ చేశారు.
సీఏఏకు వ్యతిరేకంగా బిహార్ బంద్
బిహార్ ప్రధాన ప్రతిపక్షం ఆర్జేడీ పౌరసత్వ సవరణ చట్టం, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా బిహార్ బంద్‌కు పిలుపునిచ్చింది. హైవేలను దిగ్బంధించింది. ఆందోళనకారులు రైలుపట్టాలపై కూడా కూర్చున్నారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ బీహార్ బంద్‌కు నేతృత్వం వహించారు.
పట్నాలో ఆర్జేడీ నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. డాక్ బంగ్లా చౌరస్తా నుంచి కార్యకర్తలు మవ్వన్నెల జెండాతో ప్రదర్శనలు నిర్వహించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ సింగ్ బఘేల్ "ఛత్తీస్‌గఢ్‌లో ఎన్ఆర్సీని అమలు చేస్తే, ఇక్కడి సగం జనాభా తమ పౌరసత్వం నిరూపించుకోలేకపోవచ్చు" అని పీటీఐతో అన్నారు.
ఇవి కూడా చదవండి:
- CAA: కొనసాగుతున్న నిరసనలు, బిజనౌర్‌లో బుల్లెట్ తగిలి ఇద్దరు మృతి, ఫైరింగ్ చేయలేదన్న పోలీసులు
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనలు: దిల్లీ పోలీసుల లాఠీల నుంచి స్నేహితుడికి రక్షణ కవచంగా మారిన యువతులు
- విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- బండి నారాయణస్వామి 'శప్తభూమి'కి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు
- Fake news: దిల్లీ జామియా యూనివర్సిటీ ఆందోళనల్లో పోలీసులే బస్సుకు నిప్పంటించారా...
- #BBCShe విశాఖ: 'పెద్ద మనిషి' అయితే అంత ఆర్భాటం అవసరమా?
- అత్యాచారం కేసులో జర్నలిస్టుకు రూ. 21.5 లక్షల పరిహారం
- గూఢచర్యం ఆరోపణలపై విశాఖలో ఏడుగురు నౌకాదళ సిబ్బంది అరెస్ట్
- హైదరాబాద్ నిజాం సొమ్ము కేసు: పాకిస్తాన్‌కు రూ.53.7 కోట్లు జరిమానా విధించిన బ్రిటన్ కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)