You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీఏఏ: విద్యార్థుల ఆందోళనలు భారతీయుల నాడి గురించి ఏం చెబుతున్నాయి?
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
కొన్ని రోజులుగా వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు వీధుల్లో ఆందోళనలు చేపట్టారు. భారత పొరుగు దేశాలకు చెందిన ముస్లిమేతర వలసదారులకు పౌరసత్వం కల్పించడానికి ఉద్దేశించిన చట్టమిది.
ఉద్యమిస్తున్న విద్యార్థులు ఈ చట్టం (సీఏఏ) వివక్షాపూరితంగా ఉందని, ఇది హిందూ జాతీయవాద అజెండాలో భాగమని భావిస్తున్నారు. ఇది ఇతర దేశాల్లో ఏళ్ల తరబడి మతపరమైన వేధింపులను ఎదుర్కొని, ఆశ్రయం అడగడానికి భారత్ తప్ప మరో దేశం లేనివాళ్ల కోసం తెచ్చిన చట్టమని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు.
రెండు ప్రముఖ యూనివర్శిటీలైన దిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాయలం, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో విద్యార్థుల పట్ల పోలీసులు క్రూరంగా వ్యవహరించారనే ఆరోపణలతో దేశవ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు పెల్లుబికాయి.
పోలీసులు క్యాంపస్‌లలో ప్రవేశించి, గ్రంథాలయంలో, రీడింగ్ హాల్స్‌లో, మరుగుదొడ్లలో ఉన్న విద్యార్థులపైనా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ హింసాత్మక ఘటనల వీడియోలు వైరల్ అయ్యాయి. దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలను పెంచాయి.
పోలీసుల చర్యలపై విద్యార్థులు, అధ్యాపకులు విమర్శలు గుప్పించారు.
ఇది 'రాజ్య ప్రాయోజిత హింస' అంటూ భారత్‌లోని అతిపెద్ద ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో ఒకటైన అశోకా యూనివర్శిటీ తీవ్ర పదజాలంతో ఒక ప్రకటన విడుదల చేసింది.
నిరసన తెలిపే హక్కు విద్యార్థులకు ఉందంటూ హక్కుల గ్రూపు ఆమ్నెస్టీ ఇండియా ప్రభుత్వానికి గుర్తుచేసింది.
ఈ పరిణామాలపై కలత చెందిన ఓ న్యాయశాస్త్ర విద్యార్థి- "అసలు మనం బతుకుతోంది ప్రజాస్వామ్యంలోనేనా" అని ఓ వీడియోలో ఉద్వేగంగా ప్రశ్నించారు.
నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం- వ్యతిరేకతను ఎన్నడూ సహించడం లేదు. సమస్యకు విద్యార్థులు ఓ మూలమని ప్రభుత్వం భావిస్తోందనేది స్పష్టంగా కనిపిస్తోంది. జనాభాలో పాతికేళ్లలోపు వయస్కులు సగానికి పైగా ఉన్న ఈ దేశంలో ప్రజల నాడి గురించి విద్యార్థుల ఉద్యమం కొన్ని విషయాలు చెబుతోంది.
వాటిలో ఒకటి- ఈ ఆందోళనల్లో ముస్లిం విద్యార్థులతో ఇతర మతాలకు చెందిన విద్యార్థులు కలిసి పాల్గొంటున్నారు. ఈ చట్టంతో నేరుగా ప్రభావితం కానివారు వీరితో కలిశారు.
ఈ పరిణామంపై విశ్లేషకుడు అజాజ్ అష్రాష్ స్పందిస్తూ- మతంతో నిమిత్తం లేకుండా భారతీయులందరూ చట్టం ముందు సమానులేననే, అందరికీ సమాన పౌరసత్వ హక్కులు ఉన్నాయనే మహోన్నత ఆదర్శం మరోసారి పురుడు పోసుకుందని వ్యాఖ్యానించారు.
రెండో విషయమేంటంటే- కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని తొలగించడం, జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ)పై భయాందోళనలు ఏర్పడటం, తమను లక్ష్యంగా చేసుకొని దాడులు జరగడం, రాజకీయ ప్రాబల్యం తగ్గిపోతుండటం.. ఇలా వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న ముస్లింలు తమ వాణిని బలంగా వినిపించాలనుకున్నారు.
మోదీ హయాంలో చాలా విషయాల్లో ముస్లిం సమాజం ఉనికిని దాదాపు కోల్పోయిందని చాలా మంది చెబుతారు.
ముస్లింల రాజకీయ జీవితంలో విద్యార్థుల తాజా ఆందోళన ఒక మలుపు అని అజాజ్ అష్రాఫ్ అభిప్రాయపడ్డారు.
ఇలాంటి ఆందోళనల నేపథ్యంలేని క్యాంపస్‌లకూ ఈ ఆందోళనలు విస్తరించడం మరో ముఖ్యమైన పరిణామం. బిజినెస్, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో నిరసనలను ఇందుకు ఉదాహరణలుగా చెప్పొచ్చు.
దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోవడం, ఉద్యోగాలు లేకపోవడం వల్ల ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. పౌరసత్వ సవరణ చట్టంపై పెద్దయెత్తున నిరసనల్లో ఈ వ్యతిరేకత పాత్ర కూడా ఉండొచ్చు. ఒకవైపు ఆకాంక్ష, మరోవైపు నిస్పృహతో భారత యువత సతమతమవుతోంది. భారత సమాజంలో చీలిక తెచ్చే చట్టాలను తేవడంపై కంటే మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించాలని యువత భావిస్తోంది.
చాలా మంది ప్రభుత్వ సానుభూతిపరులు కూడా ఇదే భావనతో ఉన్నట్టు కనిపిస్తోంది.
మోదీకి గట్టి మద్దతుదారైన ప్రముఖ నవలాకారుడు చేతన్ భగత్, విద్యార్థుల మీద పోలీసుల చర్యపై ప్రభుత్వాన్ని ట్విటర్ వేదికగా తూర్పారబట్టారు. అన్ని విశ్వవిద్యాలయాలనూ రక్షించుకోవాలని ఆయన చెప్పారు.
"ఒక హిందూ రాజు, ఆయన తాబేదర్లతో కూడిన ఇండియా గురించి పగటికలలు కనేవారు ఓ విషయం గుర్తుంచుకోవాలి. మీ మత దురభిమానాన్ని నేను ఆమోదించను. ఒకవేళ నేను దానిని పరిగణనలోకి తీసుకున్నా, మీరు 20 కోట్ల మంది ముస్లింలను వదులుకోలేరు. అలాంటి యత్నమే చేస్తే, భారత్ దారుణంగా దెబ్బతింటుంది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కుప్పకూలుతుంది. మీ పిల్లలు సురక్షితంగా ఉండలేరు, వారికి ఉద్యోగాలు ఉండవు. పగటికలలు కనడం ఆపేయండి" అని వ్యాఖ్యానించారు.
విస్తృతమైన రాజకీయ, సామాజిక మద్దతు కొరవడటం వల్ల విద్యార్థి ఆందోళనలు క్రమంగా నీరుగారిపోయిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయి. ఈసారి కూడా అందుకు భిన్నంగా జరగకపోవచ్చు.
ఆందోళనలు చేస్తున్న విద్యార్థులు కొంత కాలానికి తిరిగి తరగతులకు వెళ్లాల్సి ఉంటుంది. పరీక్షలు రాయాల్సి ఉంటుంది. తమ భవిష్యత్తుకు ప్రణాళిక వేసుకోవాల్సి ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే, ఇప్పుడు ఇక విపక్షాలు ఆందోళనలను తమ భుజాన వేసుకోవాల్సిన అవసరముందని చాలా మంది చెబుతున్నారు.
కానీ ప్రతిపక్షాలు ఐక్యంగా లేవు. వాటిలో ఉత్సాహమూ లేదు. పాతకాలపు ఫైర్‌బ్రాండ్ ప్రాంతీయ నాయకులకు నేటి పరిస్థితులపై పట్టు లేదు.
కాంగ్రెస్ పార్టీ పోటీలో ఉండటానికి అస్తిత్వ పోరాటం చేస్తోంది. ప్రతిపక్షం యథాతథ స్థితి కోసమే పనిచేస్తున్నట్లుంది తప్ప మార్పు కోసం పాటుపడుతున్నట్లు లేదనే భావన చాలా మందిలో ఉంది.
2012 డిసెంబరులో బస్సులో 'నిర్భయ' అత్యాచారం తర్వాత దిల్లీలో భారీ నిరసనల సమయంలో కాంగ్రెస్ చేసిన పొరపాట్లనే పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనల విషయంలో బీజేపీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నాడు నిరసన చేపట్టిన యువతతో కాంగ్రెస్ మాట్లాడలేదు. నేడు కూడా వారితో బీజేపీ మాట్లాడటం లేదు.
యూనివర్శిటీల్లో, వీధుల్లో శాంతిని పునరుద్ధరించేందుకు చర్చల కోసం ప్రభుత్వం ఒక కేబినెట్ మంత్రిని పంపి ఉండాల్సింది. కానీ మోదీ.. హింసకు ముస్లింలు, పాకిస్తాన్ మూలాలున్నవారు కారణమనే అర్థంలో పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
'నిరసనకారులు చెప్పేది పట్టించుకోండి' అనే శీర్షికతో మంగళవారం ఓ పత్రికా సంపాదకీయం మోదీ ప్రభుత్వ తీరును ఎండగట్టింది. విభేదించేవారితో, ముఖ్యంగా విభేదించే విద్యార్థులతో ఎలా మాట్లాడాలో ఈ ప్రభుత్వానికి తెలియదని విమర్శించింది. నిరసనకారులను ప్రభుత్వం అవమానించడం ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ వ్యాఖ్యలతో విభేదించలేం.
ఇవి కూడా చదవండి:
- పౌరసత్వ సవరణ బిల్లు: హైదరాబాద్‌లో విద్యార్థుల నిరసన ప్రదర్శనలు
- ఈ చట్టంతో ఎవరూ పౌరసత్వం కోల్పోరు: అమిత్ షా
- ఫిన్లాండ్ ప్రధానిపై ఎస్తోనియా మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పిన ఎస్తోనియా అధ్యక్షురాలు
- భారత్‌లో అత్యాచారాలను రాజకీయ అంశంగా మార్చిన రాహుల్, మోదీ
- మగవాళ్ళకు గర్భ నిరోధక మందును కనిపెట్టిన భారత్
- ‘ఇలాంటి ఎన్కౌంటర్లు సినిమాల్లో చేస్తే చప్పట్లు కొడతాం.. నిజజీవితంలో చేస్తే ఎన్హెచ్ఆర్సీని పిలుస్తారు’ - వైఎస్ జగన్
- పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్‌కు మరణశిక్ష
- బోయింగ్: 737 మాక్స్ విమానాల ఉత్పత్తి జనవరిలో తాత్కాలికంగా నిలిపివేత
- నిర్భయ కేసు: దోషి అక్షయ్ రివ్యూ పిటిషన్ తిరస్కరించిన సుప్రీంకోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)