You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ప్రైవేట్ ట్రావెల్స్ రేట్లు పెంచితే భారీ జరిమానా - ప్రెస్‌రివ్యూ
దసరా పండగ దృష్ట్యా ప్రయాణికుల అవసరాలను క్యాష్ చేసుకునే ప్రైవేట్ ట్రావెల్స్‌కు ముకుతాడు వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని రవాణా శాఖ రంగంలోకి దిగిందని సాక్షి వెల్లడించింది.
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రవాణశాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ల రేటు పెంచినా.. నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిక జారీ చేశారు.
పండగ వేళల్లో ప్రైవేట్ ట్రావెల్స్ గతంలోనూ అధికంగా రేట్లు పెంచి ప్రయాణికుల నుంచి భారీగా దండుకున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె దృష్ట్యా హైదరాబాద్, తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులను ట్రావెల్స్ నిర్వాహకులు ఇబ్బందులు పెడతారనే సమాచారంతో రవాణా శాఖ అప్రమత్తమైంది.
టికెట్ల ధర ఎంత వసూలు చేస్తే.. అంతకు రశీదులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పండగ సీజన్‌లో పది రోజుల పాటు ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా నిరంతర తనిఖీలతో అప్రమత్తంగా ఉండాలని రవాణా శాఖ అధికారులకు ఆదేశాలందాయి.
ఎక్కడైనా ట్రావెల్స్ నిర్వాహకులు టికెట్ల ధర భారీగా వసూలు, ఒకే పర్మిట్‌తో రెండు వైపులా బస్సుల్ని తిప్పితే.. ఒకసారికి రూ.25 వేల జరిమానా, రెండోసారి పట్టుబడితే మొదటి జరిమానాకు ఐదు రెట్లు అధికంగా జరిమానా విధించేలా ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి.
ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలపై సమాచారం ఇవ్వాలంటే వాట్సాప్ నంబరు 9542800800కు ఫిర్యాదు చేయాలని అధికారులు ప్రయాణికులకు సూచించారని సాక్షి తెలిపింది.
‘నదుల అనుసంధానానికి ఆశీస్సులివ్వండి’
నదుల అనుసంధానం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను మలుపుతిప్పే గొప్ప ప్రాజెక్టు అని, దీనికి మద్దతిచ్చేలా కేంద్రంలోని సంబంధిత శాఖల మంత్రులకు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విన్నవించారని ఈనాడు తెలిపింది.
రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమానికి ఉద్దేశించిన నవరత్నాలకు చేయూతనివ్వాలని కోరారు. దిల్లీలో ప్రధాని మోదీని సీఎం శనివారం సాయంత్రం కలిశారు.
ఆయన వెంట వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్ సభాపక్ష నేత పి.మిథున్ రెడ్డి, వైసీపీ ఎంపీలు ఉన్నారు.
ప్రధానితో సమావేశం తర్వాత జగన్ నేరుగా విమానాశ్రయానికి వెళ్లి, అక్కడి నుంచి విజయవాడకు వెళ్లిపోయారు. శుక్రవారం ప్రధానిని కలిసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 22 అంశాలపై వినతి పత్రాలివ్వగా, ముఖ్యమంత్రి జగన్ 9 అంశాలపై వినతిపత్రాలు అందించారు.
ఇందులో రాష్ట్రంలో కీలక అంశంగా భావిస్తున్న ప్రత్యేకహోదాకు చిట్టచివరి ప్రాధాన్యం ఇచ్చారని ఈనాడు పేర్కొంది.
విధుల్లోకి చేరిన 160 మంది ఆర్టీసీ కార్మికులు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ఉద్యోగాలు పోతాయని సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ హెచ్చరించినా కార్మికులు లెక్క చేయలేదని ఆంధ్రజ్యోతి వెల్లడించింది.
ఆర్టీసీలో అధికారులు, ఉద్యోగులు, కండక్టర్లు, డ్రైవర్లు, మెకానిక్‌లు, శ్రామిక్‌లు.. ఇలా మొత్తం 49,733 మంది కార్మికులు పని చేస్తున్నారు. సర్కారు డెడ్‌లైన్ ముగిసే సరికి కేవలం 160 మంది మాత్రమే విధుల్లో చేరినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. వారిలో 10 మంది మాత్రమే డ్రైవర్లు, కండక్టర్లు ఉన్నారు. వారు కూడా ఆరుగురు ఖమ్మం జిల్లాలో; నలుగురు మెదక్ జిల్లాలో చేరారు.
మిగిలిన 150 మంది సూపర్‌వైజర్లు, క్లర్కులు వంటి కేడర్లకు చెందినవారే. తద్వారా, మొత్తం 49,573 మంది కార్మికులు సమ్మె బాట పట్టినట్లు అయింది. ఉద్యోగాలు పోయినా ఫర్వాలేదన్న అభిప్రాయంతో సమ్మెకే జైకొట్టారు.
రాష్ట్రంలోని 97 డిపోల్లో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు సమ్మెలో పాల్గొన్నట్లు జేఏసీ ప్రకటించింది. అయితే, ప్రతి రోజూ వీక్లీ ఆఫ్‌లు, స్పెషల్ ఆఫ్‌లు, నైట్ డ్యూటీ చేసి రిలీఫ్‌లో ఉన్నవారు 13 వేల మంది వరకు ఉంటారని, వీరంతా ఆదివారం విధుల్లో చేరాల్సి ఉంటుందని అధికారులు వివరిస్తున్నారు. వారిని సమ్మెలో పాల్గొన్నట్లు భావించబోమని చెబుతున్నారు.
కానీ.. కార్మిక సంఘాలు దీనిని కొట్టిపారేస్తున్నాయి. వీక్లీ ఆఫ్‌లు, స్పెషల్ ఆఫ్‌ల్లో ఉన్నవారు మాత్రమే కాదు.. చివరకు సెలవుల్లో ఉన్నవారు కూడా సమ్మెలో పాల్గొన్నారని, ఆదివారం కూడా వారు విధుల్లో చేరబోరని స్పష్టం చేస్తున్నాయి.
శనివారం విధుల్లో చేరారని అధికారులు చెబుతున్న 160 మంది కూడా రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నవారో, ఉద్యోగాలు పోతాయేమోనన్న భయం ఉన్నవాళ్లో అయి ఉంటారని తెలిపాయని ఆంధ్రజ్యోతి పేర్కొంది.
వేలిముద్రలతో సంక్షేమ హాస్టళ్లలో సమస్యలు
తెలంగాణలోని సంక్షేమ వసతిగృహాల్లో విద్యార్థులు, సిబ్బంది హాజరులో పారదర్శకత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన బయోమెట్రిక్ హాజరు నమోదు విధానం క్షేత్రస్థాయిలో వసతి గృహ సంక్షేమాధికారులకు తలనొప్పిగా మారిందని సాక్షి వెల్లడించింది.
ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ పద్ధతిని వినియోగిస్తున్న నేపథ్యంలో హాజరు స్వీకరణ గందరగోళంగా మారింది. ముఖ్యంగా విద్యార్థుల వేలిముద్రలు నమోదు కావడం లేదు.
దీంతో హాస్టల్‌లో ఉంటున్నప్పటికీ గైర్హాజరైనట్లే నమోదవుతోంది. ఈ పరిస్థితి హాస్టల్ డైట్ బిల్లుల రూపకల్పనలో వసతిగృహ సంక్షేమాధికారులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.
ప్రతి విద్యా సంస్థలో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వ విభాగాలు, క్రమంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తున్నాయి.
సంక్షేమ శాఖల పరిధిలోని వసతి గృహాల్లో కూడా వీటిని ఏర్పాటు చేస్తున్నారు. గిరిజన సంక్షేమ శాఖతో పాటు బీసీ సంక్షేమ శాఖ వసతిగృహాల్లో ఇప్పటికే బయోమెట్రిక్ హాజరువిధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేస్తుండగా, ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని హాస్టళ్లలో ప్రస్తుతం ప్రయోగ పద్ధతిని కొనసాగిస్తున్నారు.
ఆధార్ వివరాలను ప్రతి కార్డుదారు ఐదేళ్లకోసారి అప్‌డేట్ చేసుకోవాలి. ముఖ్యంగా వేలిముద్రల్లో వచ్చే మార్పులను అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి. పిల్లల్లో వేలిముద్రలు మారడానికి ఎక్కువ అవకాశాలుంటాయి.
కానీ, చాలావరకు కార్డు తీసుకున్న సమయంలో తప్ప వివరాలను అప్‌డేట్ చేసుకోవడం లేదు. ప్రస్తుతం సంక్షేమ హాస్టళ్లలో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానానికి విద్యార్థుల వేలిముద్రలు సరిపోలకపోవడానికి ఇదే కారణం. ఆయా విద్యార్థులు తమ వేలిముద్రలు అప్‌డేట్ చేసుకుంటే తప్ప బయోమెట్రిక్ హాజరు నమోదుకు అవకాశం లేదని సాక్షి తెలిపింది.
ఇవి కూడా చదవండి
- పునరావాస శిబిరాల్లో అత్యంత దారుణ పరిస్థితుల్లో బతుకెళ్లదీస్తున్న కశ్మీరీ పండిట్లు
- తెలంగాణ ఆర్టీసీ సమ్మె: ‘విధుల్లో చేరకుంటే ఉద్యోగాలు పోతాయి’
- బీబీసీ రహస్య పరిశోధన: మతం పేరుతో బాలికల లైంగిక దోపిడీ...మత గురువులే మధ్యవర్తులుగా ‘సుఖ వివాహాలు’
- ‘80 రూపాయలకే ఇల్లు పథకం’
- సంస్కృతం - హిందీ - తమిళం - తెలుగు... ఏది ప్రాచీన భాష? ఏ భాష మూలాలు ఏమిటి?
- హైదరాబాద్: నర్సరీ విద్యార్థులకు కూడా ర్యాంకులా?
- ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు పనిచేయదు... మరి ఎలా చేయాలి...
- మాంసం తింటే క్యాన్సర్ వస్తుందనే ప్రచారంలో నిజమెంత?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)