You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
బోటు వెలికితీతలో ఆటంకాలు.. తెగిన ఇనుప తాడు, వంగిన లంగరు
- రచయిత, వి.శంకర్
- హోదా, బీబీసీ కోసం
గోదావరి నదిలో మునిగిన రాయల్ వశిష్ఠ బోటు వెలికితీత పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయి. బోటును లాగేందుకు ఉపయోగించిన ఇనుప తాడు తెగిపోయింది.. ఆ తరువాత కొక్కెం వంగిపోయింది.
దీనిపై బోటు వెలికితీత పనులు చేపట్టిన బాలాజీ మెరైన్స్‌కి చెందిన ధర్మాడి సత్యం ‘‘మా ప్రయత్నాలు మేము చేయగలం అంతే’’నని ‘బీబీసీ’తో అన్నారు.
బోటు వెలికితీసేందుకు చేసిన ప్రయత్నాల్లో భాగంగా మొదటి రోజు అవసరమైన సామగ్రి తరలించారు. సోమవారం సుమారుగా 300 మీటర్ల పొడవున్న ఇనుప తాడుకి కొక్కెం అమర్చి నదిలోకి వదిలారు.
పడవ మునిగిందని భావిస్తున్న ప్రాంతంలో ఈ తాడు వేయడం, దాని కొక్కేనికి ఏదో బలమైనది తగలడంతో బోటు వెలికితీసేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయని అంతా ఆశించారు.
బోటు వెలికి తీస్తున్నామని, మంగళవారం నాటికి స్పష్టత వస్తుందని సోమవారం సాయంత్రం బీబీసీతో మాట్లాడిన ధర్మాడి సత్యం తెలిపారు.
మంగళవారం ప్రయత్నాలు విఫలం..
మంగళవారం ఉదయాన్నే ఆశాజనకంగా మొదలైన ప్రయత్నాలు కొద్దిసేపటికి విఫలమయ్యాయి. నదిలో ఉన్న ఇనుప తాడు లాగుతుండగా అది తెగిపోయింది.
దాంతో అప్పటి వరకూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న వారంతా నిరాశకు గురయ్యారు. సత్యం బృందం ఆ తరువాత మళ్లీ ప్రయత్నించినా బోటు జాడ దొరకలేదు.
నదీగర్భంలోకి వెళ్లలేం..
గోదావరిలో వడి చాలా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఉన్న బోటు వెలికితీయడం చిన్న విషయం కాదని ధర్మాడి సత్యం అన్నారు. తాజా ప్రయత్నాలు విఫలమైన తీరుపై ఆయన బీబీసీతో మాట్లాడారు.
‘‘గతంలో 100 మీటర్ల లోతులో ఉన్న బోట్లను బయటకు తెచ్చాను. కానీ, ఇప్పుడు గోదావరిలో 200 అడుగులకు పైనే లోతు ఉంది. లోపల ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంది
మేం నదిలో వేసిన ఇనుప తాడు బోటుకి తగిలిందని వేసిన అంచనా తప్పింది. రాయికి తగిలిందో, దేనికి తగిలిందో చెప్పలేం. కానీ మొదటి ప్రయత్నంలో ఇనుపతాడు తెగిపోయింది. రెండో ప్రయత్నంలో వేసిన లంగరు వంగిపోయింది.
రేపు మళ్లీ ప్రయత్నిస్తాం.. కానీ ఏమవుతుందో చెప్పలేమ’’న్నారు.
రెండు రోజుల ప్రయత్నాల తర్వాత బోటు వెలికితీయడంపై ఆశలు తగ్గుతున్నాయని దేవిపట్నం వాసి నండూరి రామారావు బీబీసీతో అన్నారు.
గతంలో జరిగిన ప్రమాదాల మాదిరిగానే ఇప్పుడు కూడా బోటు తీయడం చాలా కష్టం అనిపిస్తోందన్నారు. గోదావరి లో నీటి మట్టం తగ్గినా, 200 అడుగుల లోతున ఉన్న బోటును చేరుకోవడం కష్టమైన పనని ఆయన అభిప్రాయపడ్డారు.
రెండు రోజుల్లో స్పష్టత: ఏలూరు డీఐజీ ఏఎస్‌ఖాన్
కచ్చులూరులో బోటు వెలికితీత విషయంలో ప్రయత్నాలు ఫలించేలా ఉన్నాయని ఏలూరు రేంజ్ డీఐజీ ఏఎస్ ఖాన్ తెలిపారు.
స్థానికులు చేస్తున్న ప్రయత్నాల విషయంలో స్పష్టత రావడానికి కొంత సమయం పడుతుంది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కేంద్ర బృందాలతో మాట్లాడుతామని చెప్పారు. బోటు లోతులో ఉండడం, ఒండ్రు మట్టి కూడా చేరడంతో బోటు ఏ స్థితిలో ఉంది, ఎలా తీసుకురాగలమనే విషయంలో ప్రణాళికలు వేసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి:
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- #గ్రౌండ్‌రిపోర్ట్: ‘బోటు తలుపులు వేయడంతో ఈత వచ్చినా మునిగిపోయారు’
- ప్రెస్ రివ్యూ: గోదావరి పడవ ప్రమాదంపై యజమాని సమాధానమిదే
- కృష్ణా విషాదం: అక్కడికి రాగానే ఆగిపోతున్నారు!
- వివాదాల్లో చిక్కుకున్న అందగత్తెలు
- అణు బాంబును పేల్చింది ఇక్కడేనా?
- డెడ్‌బాడీని చంపేశారు!
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)