బిహార్, ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బీభత్సం... 100 మందికి పైగా మృతి

ఉత్తర భారతాన్ని వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది.

వరదల తాకిడికి ఉత్తర్ ప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాల్లో దాదాపు 100 మంది మరణించారని అధికారులు తెలిపారు.

వరదల ప్రభావం కొన్ని ప్రాంతాల్లో చాలా తీవ్రంగా ఉంది.

రైలు, రోడ్డు మార్గాలు పూర్తిగా స్తంభించాయి. స్కూళ్లు మూతపడ్డాయి. వైద్య సేవలు ఆగిపోయాయి. రెండు రాష్ట్రాల్లోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

ఒక్క ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోనే 93 మంది ప్రజలు మరణించారని ఆ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.

బిహార్‌లో 29 మంది వరదల తాకిడికి మృత్యువాత పడ్డారని రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ వెల్లడించింది. రాజధాని పట్నా నగరంపై కూడా ఈ ప్రభావం తీవ్రంగా ఉంది.

నీటిలో మునిగిన వాహనాల మధ్యనుంచి ప్రజలు పడవల సాయంతో రాజధాని వీధుల్లో తిరుగుతున్నారు.

వరదనీటిలో చిక్కుకున్న తన రిక్షాను బయటకు తీసుకురావడానికి కష్టపడుతున్న ఓ వ్యక్తి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

శుక్రవారం నుంచి నగరం కుండపోత వర్షాలతో తడిసిముద్దయింది. నగరంలోని నివాసప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.

నగరంలో ఎంత వర్షపాతం నమోదైందో అంచనా వేయడం కష్టమని ఓ అధికారి చెప్పినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

పట్నా నగరంలో రోడ్లపై నిలిచిన వరద నీటని మళ్లించడానికి హెలీకాప్టర్లు, మెషీన్లు కావాలని రాష్ట్ర ప్రభుత్వం భారతీయ వాయుసేనను కోరింది.

ఉత్తర్ ప్రదేశ్‌లో కూడా పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది.

"పుణ్యక్షేత్రం వారణాశిలో పరిస్థితి దారుణంగా ఉంది. మురుగునీటి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. నీళ్లు కంపుకొడుతున్నాయి" అని స్థానికుడొకరు రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)