You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తాజ్‌మహల్ కన్నా ఈ మురికి వాడకు వచ్చే సందర్శకులే ఎక్కువ
- రచయిత, పూజా ఛాబ్రా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"ఈ రోజు ఎంతో అద్భుతంగా గడిచింది. అక్కడ అందరూ స్నేహపూర్వకంగా ఉన్నారు. ఎవరూ బిక్షాటన చేయడంలేదు".
- ముంబయిలోని ధారావి మురికివాడను సందర్శించిన తర్వాత ఒక పర్యటకుడు చెప్పిన మాట ఇది.
ఈ మురికివాడను సందర్శించేందుకు వచ్చే వేలాది మంది విదేశీ పర్యటకుల్లో ఆయన ఒకరు. ఈ మురికివాడను చూసేందుకు దేశ విదేశాల నుంచి అనేక మంది వస్తున్నారు. దీనిని 'స్లమ్ టూరిజం' అంటున్నారు.
ఇందులో కొందరు పర్యటకులు తమ సెలవు రోజుల్లో పేదలు అధికంగా ఉండే ఇలాంటి ప్రదేశాలను సందర్శించేందుకు, అక్కడి పేదల వాస్తవిక జీవన విధానాన్ని పరిశీలించేందుకు వెళ్తుంటారు. ఈ ధోరణి ఇప్పుడు పెరుగుతోంది.
వ్యవస్థీకృత పర్యటక ప్రాంతంగా మారిన ధారావి మురికివాడ ఇటీవల భారత్‌లో అత్యంత ఆకర్షణీయమైన పర్యటక ప్రదేశంగా పేరు పొందింది. ట్రావెల్ వెబ్‌సైట్ ట్రిప్‌అడ్వైజర్ ట్రావెలర్స్ ఛాయిస్ అవార్డుల ప్రకారం, తాజ్ మహల్‌ను సందర్శించేవారి కంటే ఈ మురికివాడను చూసేవారి సంఖ్యే ఎక్కువగా ఉంటోంది.
"ఈ మురికివాడను సందర్శించేందుకు అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా నుంచి ఎక్కువ మంది వస్తుంటారు" అని ఇక్కడి రియాలిటీ టూర్స్ అండ్ ట్రావెల్ అనే సంస్థ సహ వ్యవస్థాపకుడు కృష్ణ పుజారి అన్నారు. ధారావి మురికివాడను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా సేవలను ప్రారంభించిన తొలి పర్యటక సంస్థ వారిదేనని చెబుతుంటారు.
"ఈ మురికివాడలో పర్యటక సేవలు ప్రారంభించాలని బ్రిటన్‌కు చెందిన నా స్నేహితుడు, మా సహవ్యవస్థాపకుడు సలహా ఇచ్చినప్పుడు, నాకు ఆశ్చర్యం వేసింది. ఎవరైనా ఈ మురికి వాడను చూసేందుకు ఎందుకు వస్తారు? అని అనుకున్నారు. కానీ, ఈ ప్రాంతంలోనూ చూడాల్సినవి, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయని తర్వాత అర్థమైంది" అని కృష్ణ పూజారి వివరించారు.
ముంబయి మహానగరం నడిబొడ్డున ఉంది ఈ ధారావి మురికివాడ. అగ్గిపెట్టెల్లాంటి ఇళ్లు, ఇరుకైన వీధులు, వర్క్ షాపులు, మురికి కాలువలతో నిండి ఉంటుంది. దాదాపు 10 లక్షల మంది ఇక్కడ నివసిస్తున్నారు.
పబ్లిక్ టాయిలెట్లు, నీటి కుళాయిలు ఉన్నాయి. కానీ, పరిశుభ్రత సరిగా ఉండదు. మురికి నీరంతా వీధుల్లో పారుతూ ఉంటుంది.
చాలామంది ఎంబ్రాయిడరీ వస్త్రాలు, ఎగుమతికి అనువైన- నాణ్యమైన తోలు ఉత్పత్తులు, కుండలు, ప్లాస్టిక్ వస్తువులను తయారు చేస్తుంటారు. ఇక్కడ జరిగే వ్యాపారం వార్షిక టర్నోవర్ రూ.4,600 కోట్లకు పైనే ఉంటుందని అంచనా.
చెత్త ఏరుకునేవారు, ట్యాక్సీ డ్రైవర్లు, పారిశుద్ధ్య కార్మికులు కూడా ఉంటారు. ఈరోజు పూటగడిస్తే చాలు అన్నట్లుగా రోజూ కూలీ పనులు చేసుకుంటూ బతికేవారు అనేకమంది ఉంటారు.
పర్యటకులను ఏం ఆకర్షిస్తోంది?
"విక్టోరియా మహారాణి కాలం నుంచే ఇక్కడికి సందర్శకులు వస్తున్నారు. మొదట్లో వినోదం కోసం వచ్చేవారు. తర్వాత ఇక్కడి ప్రజల జీవన విధానాన్ని చూసేందుకు, సామాజిక మార్పు కోసం వస్తున్నారు" అని 2016లో ధారావీ మురికివాడలో పర్యటించిన మెలిస్సా నిస్‌బెట్ చెప్పారు.
మామూలు పర్యటక ప్రాంతాల్లో మాదిరిగానే ఇక్కడ కూడా టూరిజం ప్యాకేజీలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. ఏసీ, నాన్ ఏసీ సదుపాయాలు ఉంటాయి. తమ స్తోమతకు తగ్గట్టుగా, ఏది కావాలంటే అది ఎంచుకోవచ్చు.
"ఇన్‌సైడ్ ముంబై" లాంటి పర్యటక సంస్థలు ఈ మురికివాడలోని ఇళ్లలో భోజనం చేసేందుకు ఏర్పాట్లు కూడా చేస్తాయి.
వాస్తవానికి, ఈ పర్యటక ధోరణిని చూస్తుంటే భారత్‌లో కొత్తగా అనిపిస్తుంటుంది. కానీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాలలో ఎంతో కాలంగా ఇలాంటి స్లమ్ టూరిజం కొనసాగుతోంది.
"మురికివాడల్లో ప్రజల జీవితం ఎలా ఉంటుందన్నది బాగా అర్థం చేసుకునేందుకు నేను ధారావీని సందర్శించాను. మిగతా పర్యటకులు కూడా అదే ఆలోచనతో వస్తుంటారని అనుకుంటున్నాను" అని మెలిస్సా నిస్‌బెట్ అన్నారు.
అక్కడి పరిస్థితులను చూసి, అక్కడి ప్రజల మాటలు విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని ఆమె చెప్పారు.
వాళ్ల సమస్యలు పట్టించుకోవట్లేదు
"మురికివాడల్లో ప్రజలు ఎదుర్కొనే సమస్యలపై ఎవరూ పెద్దగా మాట్లాడటంలేదు. పేదరికం గురించి పట్టించుకోవట్లేదు. అక్కడ పరిస్థితులు సాధారణమే అన్నట్లుగా కొందరు చూస్తారు" అని మెలిస్సా అంటున్నారు.
"అక్కడి ప్రజలతో మాట్లాడేందుకు మమ్మల్ని అనుమతించలేదు. కాబట్టి, వారి భావాలను అంచనా వేయడం చాలా కష్టం. అందరూ ఎవరి పని వారు చేసుకుంటున్నారు. మమ్మల్ని ఎవరూ పట్టించుకోవట్లేదు" అని ఆమె వివరించారు.
ఆ పర్యటన పూర్తయ్యాక, ఇతర పర్యటకుల అనుభవాలను అర్థం చేసుకునేందుకు ట్రావెల్ వెబ్‌సైట్ ట్రిప్ అడ్వైజర్‌లో పోస్ట్ చేసిన వందలాది సమీక్ష (రివ్యూ)లను ఆమె విశ్లేషించారు.
చాలా మంది సందర్శకులు ఆ మురికివాడలో పేదరికం గురించి ఆందోళనలతో పర్యటనను ప్రారంభించినట్లు ఆమె గుర్తించారు.
కానీ, తర్వాత పర్యటన ముగిసేటప్పటికి అక్కడి ప్రజలకు ఏ సమస్య లేదన్నట్లుగా అనిపించిందని చాలామంది రివ్యూలు రాశారు.
"ఆ మురికివాడను విడిచి వెళ్లేటప్పుడు సందర్శకులు అలా ఆలోచిస్తున్నారంటే, వాళ్లు ఏదో పొరపాటు చేస్తున్నారని అనిపిస్తోంది" అని ఆమె అంటున్నారు.
"తమ పర్యటన చాలా అద్భుతంగా సాగిందంటూ... మురికివాడను ఒక ఆర్థిక కేంద్రంగా అభివర్ణిస్తూ రివ్యూలు రాశారు. కానీ, వారంతా ఒక వాస్తవాన్ని విస్మరించారు. వాళ్లకు సరైన రవాణా సదుపాయాలు లేవు. విద్యుత్ సరిగా లేదు, పరిశుభ్రమైన తాగు నీరు రాదు, ఇవే కాదు వాళ్లు ఇంకా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటిని ఎవరూ గుర్తించడంలేదు" అని మెలిస్సా అన్నారు.
"ఆ మురికివాడలో సందర్శకులు ఫొటోలు తీసుకునేందుకు కొందరు టూర్ ఆపరేటర్లు అనుమతిస్తున్నారు. అది సరికాదు. అలా ఫొటోలు తీయడం అక్కడి ప్రజలకు అసౌకర్యంగా ఉంటుందని వారు గుర్తించాలి" అని ఆమె సూచిస్తున్నారు.
అనేక మంది విదేశీ పర్యటకులు తమ జీవితాలపై ఆసక్తి కనబరుస్తున్నందున, అక్కడి ప్రజల్లో ఒంటరి భావన తక్కువగా ఉంటుందని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ తరఫున ఈ మురికివాడలోని పరిస్థితులపై అధ్యయనం చేసిన అదితి రాథో అన్నారు.
ఈ టూరిజం వల్ల తాము ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నామని కొందరు స్థానికులు చెప్పారు.
తెలుసుకోవాల్సింది చాలా ఉంది
మురికివాడలోని వ్యాపార స్ఫూర్తిని, వారి జీవన విధానాన్ని పరిశీలించడం ద్వారా సందర్శకుల ఆలోచనా విధానంలో మార్పు వస్తుందని తాము నమ్ముతున్నామని టూర్ ఆపరేటర్ కృష్ణ పూజారీ అంటున్నారు.
"మేము మా పర్యటనలలో పూర్తి వాస్తవికత గురించే మాట్లాడుతాం. వేలాడుతున్న విద్యుత్ తీగల నుంచి అభివృద్ధి చెందుతున్న రీసైక్లింగ్ పరిశ్రమ వరకు ఈ మురికివాడకు సంబంధించిన ఉన్న ప్రతి విషయాన్నీ వివరిస్తాం. అయితే, మురికివాడలు అంటే కేవలం పేదరికం, ప్రమాదకరమైన పరిస్థితులు, బిక్షాటన మాత్రమే కనిపిస్తాయని అనుకునేవారి ఆలోచనను మార్చాలనుకుంటున్నాం. వాస్తవం ఏంటో సందర్శకులు పరిశీలించవచ్చు" అని పూజారీ అన్నారు.
ఈ మురికివాడలో ఫొటోలు తీయడాన్ని ఆయన సంస్థ కూడా అనుమతించడంలేదు. "కెమెరాలను వాడకూడదు అనే నిబంధనను మేము అనుసరిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
తన సంస్థ చేస్తున్నది ఒక సామాజిక వ్యాపారమని, 'రియాలిటీ గివ్స్' అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి, దాని ద్వారా మురికివాడలో విద్యార్థులకు సౌకర్యాలు కల్పించేందుకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన చెప్పారు.
ఇక్కడ జరిగే టూరిజం వ్యాపారంలో వచ్చే లాభంలో వారు కొంతవరకు సేవా కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు.
"ఇక్కడి ప్రజల్లో ఉండే పట్టుదల, వెనకడుగు వేయని లక్షణాలను పర్యటకులు గమనించవచ్చు" అని ఇన్‌సైడ్ ముంబై పేరుతో ఈ మురికివాడలో టూరిస్టు సేవలు అందిస్తున్న మహమ్మద్ అన్నారు.
"ఇక్కడి సమాజాన్ని పట్టించుకోకపోవడం, వారి ఉనికిని గుర్తించకపోవడం సరికాదు" అని ఆయన అభిప్రాయపడ్డారు.
"అత్యంత సంక్లిష్టమైన, విస్తృతమైన పేదరికం సమస్యలను ఈ ప్రయత్నాలు పరిష్కరించలేవు" అని లీసెస్టర్ విశ్వవిద్యాలయం అధ్యాపకుడు ఫాబియన్ ఫ్రెంజెల్ అభిప్రాయపడ్డారు.
"అందుకు బదులుగా, ఇటువంటి పర్యటనల సానుకూల ప్రభావం ఏమిటంటే, ఇది మురికివాడ ప్రాంతాల్లో సమస్యలను ప్రపంచం గుర్తించే అవకాశం ఉంటుంది. అలాగే, స్థానికులకు సౌకర్యాల కోసం పోరాడే అధికారం కూడా వస్తుంది" అని ఫ్రెంజెల్ అన్నారు.
"భారత్ అంతరిక్షంలోకి రాకెట్లను పంపిస్తోంది. అయినా, ఇప్పటికీ అనేక మంది ప్రజలు మౌలికమైన నివాసం, పారిశుద్ధ్యం వంటి సౌకర్యాలను పొందలేకపోతున్నారు. స్లమ్ టూరిజం దేశంలోని ఉన్నత వర్గాలకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కానీ, రాజకీయ అవకాశవాదాలను, అన్యాయాలను ఎత్తిచూపే రాజకీయ సామర్థ్యం కూడా దానికి ఉంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- సంప్రదాయాన్ని ఎదిరించి వరుడి ఇంటికే వెళ్లి పెళ్లి చేసుకున్న వధువు
- కశ్మీర్‌పై బ్రిటన్ లేబర్ పార్టీ తీర్మానం.. ‘ఓటు బ్యాంకు’ రాజకీయమన్న భారత్
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- 20 ఏళ్లుగా 200 విష సర్పాలతో కాటేయించుకుంటున్నాడు.. ఎందుకో తెలుసా
- మహాత్మా గాంధీ గురించి పాకిస్తానీలు ఏమనుకుంటుంటారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)