You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
గోదావరిలో పడవ ప్రమాదం: బోటును బయటకు తీయడంలో ఆలస్యం ఎందుకు?
- రచయిత, బళ్ల సతీశ్, నవీన్ కుమార్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధులు
15వ తేదీ మధ్యాహ్నం వశిష్ఠ పున్నమి రాయల్ అనే పేరుతో నడిచే బోటు పర్యటకులతో ప్రయాణిస్తుండగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం దగ్గర మునిగిపోయింది.
ప్రమాదం జరిగే సరికి పర్యటకులు, 8 మంది సిబ్బందీ కలిపి మొత్తం బోటులో 73 మంది ఉంటారని అధికారులు అంచనా వేశారు. ప్రయాణికుల సంఖ్యలో కొంత మార్పు ఉండవచ్చని అధికారులు చెబుతూ వస్తున్నారు. టికెట్లు తీసుకున్నవారంతా ప్రయాణించకపోవచ్చు లేదా టికెట్లు లేకుండా అప్పటికప్పుడే కొందరు రావచ్చు అనే కారణాలతో ఈ సంఖ్యలో మార్పు ఉండొచ్చని చెబుతున్నారు.
ప్రమాద స్థలానికి ముందుగా చేరుకున్న స్థానికులు చాలా మంది పర్యటకులను కాపాడారు. గాయపడ్డ వారికి రాజమండ్రి, రంపచోడవరం ఆసుపత్రుల్లో చికిత్స అందించారు.
ప్రమాదంలో మొత్తం 24 మంది మగవారూ, ఇద్దరు ఆడవారూ కలిపి 26 మంది క్షేమంగా బయటపడ్డారు. వారిలో కొందరికి గాయాలు అయ్యాయి. ఇప్పటి వరకూ (18వ తేదీ సాయంత్రం 6 గంటల వరకూ) 34 మృతదేహాలు దొరికాయి. వాటిలో 23 మగవారివి, 8 ఆడవారివి, 3 పిల్లలవి. ఇంకా 13 మంది ఆచూకీ దొరకాల్సి ఉంది. మృతదేహాల పోస్టుమార్టం పూర్తి చేసి బంధువులకు అప్పగించారు.
దీంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమ వారి కోసం ఎదురు చూసిన వారి బాధ వర్ణనాతీతం. గుర్తుపట్టలేని స్థితిలో లేదా పాడవుతున్న స్థితిలో దొరికిన మృతదేహాలు వారిని మరింత కలిచి వేస్తున్నాయి. ఇక ఆచూకీ తెలియని వారి ఆత్మీయులది మరో ఇబ్బంది.
కొనసాగుతున్న సహాయక చర్యలు
సహాయక చర్యలో ఆరు అగ్నిమాపక శాఖ బృందాలు, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 3 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, నేవీకి చెందిన ఒక డీప్ డైవర్స్ బృందం, ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్‌కు చెందిన ఒక బృందం, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అనేక శాఖలూ, విభాగాలూ, సంస్థలూ పాల్గొన్నాయి. రెవెన్యూ, పోలీస్, ఐటీడీఏ అధికారులు ఈ సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ప్రస్తుతానికి ప్రభుత్వం పాపికొండలు ప్రాంతంలో బోట్లు తిరగడాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రి జగన్ అన్ని శాఖలతో సమీక్ష జరిపి గతంలో ఇచ్చిన జీవోల అమలూ, కొత్తగా తేవాల్సిన నిబంధనల గురించి ఆదేశాలిచ్చారు. దీనిపై వివిధ శాఖల అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ ఇకపై బోటింగ్ నిబంధనలను నిర్దేశించనుంది.
బోటు వెలికితీత
బుధవారం ఉత్తరాఖండ్ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది తమ దగ్గర ఉన్న సైడ్ స్కాన్ సోనార్ మెషీన్ ద్వారా బోటు జాడ గుర్తించారు. కచ్చులూరు దగ్గర్లో ప్రమాదం జరిగిన చోట 210 అడుగుల లోతులో బోటు ఉంది. మంగళవారం సాయంత్రం వరకూ కాస్త అనుమానం ఉన్నప్పటికీ, బుధవారం నాటికి బోటు ఉన్న ప్రదేశంపై స్పష్టత ఏర్పడింది.
ప్రస్తుతం అధికారులు బోటు వెలికితీసే ప్రయత్నాల్లో ఉన్నారు. అందుకోసం కొన్ని ప్రైవేటు సంస్థల సహకారం కూడా తీసుకుంటున్నారు. కాకినాడ, ముంబైలకు చెందిన నిపుణులు, ప్రైవేటు సంస్థల వారినీ పిలిపించారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులూ, నిపుణులూ కలసి ఏ విధంగా బోటును బయటకు తీయాలి అనే విషయమై చర్చించారు. రకరకాల పద్ధతుల గురించి చర్చ జరుగుతోంది.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం, ప్రమాదం జరిగిన చోట గోదావరి నది సన్నగా ఉండి లోతు ఎక్కువగా ఉండడం, దాదాపు 210 అడుగుల లోతున విపరీతమైన ఒత్తిడి ఉండడం, బయట కురుస్తున్న భారీ వర్షాలు, ప్రమాదం జరిగిన చోట నీరు కొండను తాకి వడిగా సుడులు తిరుగుతూ ప్రవహిస్తూండడం.. ఇవన్నీ కలసి బోటు తీసే ప్రక్రియను ఆలస్యం చేస్తున్నాయి.
ఎలా తీస్తారు?
సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నిపుణులైన ఈతగాళ్లు నీటి అడుగుకు వెళ్లి ఆ పడవకు తాళ్లు కడతారు. అప్పుడు ఒడ్డు నుంచి తాళ్లను లాగి బోటును బయటకు తెస్తారు. గతంలో ఇలా చాలా సందర్భాల్లో జరిగింది.
నీటిలో దిగడం కుదరనప్పుడు, ఏదైనా బరువైన వస్తువులను లేదా యాంకర్లను కట్టిన తాళ్లను ఆ ప్రాంతానికి విసురుతారు. అవి బోటుకు ఏదో ఒక భాగంలో అతుక్కుంటాయి. అప్పుడు పైకి లాగుతారు. కానీ నీరు కదలకుండా ఉంటేనే ఇది సులువు. లేకపోతే నీటి వేగానికి విసిరిన తాళ్లు పక్కకు వెళ్లిపోతాయి. పై నుంచి బోటులో కదలకుండా ఉండి ఈ పనంతా చేయడం కూడా కష్టం.
కానీ ఇక్కడ లోతు, నీటి వేగం, ఒత్తిడి వల్ల ఆ రెండు పద్ధతులూ సాధ్య పడడం లేదు.
ఇక అధికారులు పరిశీలిస్తున్న మూడో మార్గం చాలా పొడవైన అంటే దాదాపు బోటు ఉన్న చోటుకు ఐదారు రెట్లు పొడవైన (సుమారు వెయ్యి అడుగులు) బలమైన తాళ్లను తెప్పించి బోటు ఉన్న ప్రాంతం చుట్టూ నీటిలోకి వేస్తారు. ఆ తాడు కిందకు వెళ్లి బోటును చుట్టుకునేలా వేస్తారు. అప్పుడు దాన్ని పైకి లాగుతారు.
ఈ ప్రక్రియపై గురువారం తుది నిర్ణయం తీసుకుని ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
"ఫ్లోర్ మ్యాపింగ్ సరిగ్గా తేలితే ఏ విధంగా చేయవచ్చనేది తెలుస్తుంది. కింత ఒత్తిడి ఉంది. చీకటిగా ఉంది. సరైన ఫొటోలు రావడం లేదు. దీంతో ఇది తీవ్ర సమస్యగా ఉంది" అని వివరించారు ఏలూరు డీఐజీ ఏఎస్ ఖాన్.
బోటు యజమానులపై కేసు
బోటు యజమానిపై పోలీసులు ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆయన పోలీసుల అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై ప్రభుత్వం మేజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది.
తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుంది. ఈరోజు నుంచి 60 రోజుల్లో ఆ నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే ఓడరేవుల శాఖ డైరెక్టర్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు.
మరోవైపు ప్రమాదం నుంచి ఒక బోటు డ్రైవర్ బయట పడ్డారనీ, పోలీసుల అదుపులో ఉన్నారనీ దేవీపట్నంలో పుకార్లు వచ్చాయి. దీనిపై బీబీసీ సంప్రదించినప్పుడు పోలీసులు స్పందించలేదు.
ఇవి కూడా చదవండి:
- గోదావరిలో వరుస పడవ ప్రమాదాలు... ఎందుకిలా జరుగుతోంది? ఎవరు బాధ్యులు?
- గోదావరిలో పడవ మునక: 'భర్తను, బిడ్డను పోగొట్టుకుని ఎలా బతకాలి...'
- గోదావరి బోటు ప్రమాదం: 33కి చేరిన మృతులు.. మరో 14 మంది ఆచూకీ గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు
- చెన్నైలో 20 ఏళ్ల కిందట కిడ్నాపైన బాలుడు.. అమెరికా నుంచి తిరిగొచ్చాడు. ఎలాగంటే..
- బ్యాంకు ఖాతాలో 90 లక్షలు వచ్చాయి... డ్రా చేశారు, ఖర్చుపెట్టేశారు... ఆ తర్వాత ఏం జరిగింది?
- ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన నగరం కారకస్‌లో రాత్రి జీవితం ఎలా ఉంటుంది?
- నల్లమలలో యురేనియం సర్వే వివాదం: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి... ఆ విషంతో మేం భంగమైపోతాం"
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)