PUBG ఆడుకోవడానికి అడ్డుపడుతున్నాడని తండ్రిని చంపిన కొడుకు

    • రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
    • హోదా, బీబీసీ కోసం

కర్ణాటకలోని బెళగావి జిల్లాలో 21 ఏళ్ల యువకుడు తన తండ్రి తల నరికి హత్య చేశాడు. తండ్రి అతడిని మొబైల్లో పబ్‌జీ గేమ్ ఆడొద్దని చెప్పాడని, అందుకే యువకుడు అంత దారుణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు.

రఘువీర్ కుంభర్ అనే యువకుడికి పబ్‌జీ ఆడడం బాగా అలవాటైంది. దాని ప్రభావం అతడి చదువుపై కూడా పడింది.

"యువకుడు ఆ మొబైల్ గేమ్‌కు అడిక్ట్ అయ్యాడు. నెట్ బ్యాలెన్స్ అయిపోవడంతో ఆ గేమ్ ఆడేందుకు అతడు తండ్రిని రీచార్జ్ చేయించమని అడిగాడు.

దానిపై తండ్రీకొడుకుల మధ్య గొడవ జరిగింది. తర్వాత యువకుడు తన తల్లిని ఆ గది నుంచి బయటికి వెళ్లిపొమ్మన్నాడు. మొదట తండ్రి శేఖరప్ప రేవప్ప కుంభర్ కాలు నరికాడని, ఆ తర్వాత అతడు ఆయన తలను కూడా నరికాడని ఆరోపిస్తున్నారు" అని బెళగావి పోలీస్ కమిషనర్ బీఎస్ లోకేష్ కుమార్ బీబీసీతో చెప్పారు.

ఈ ఘటనతో నిందితుడి తల్లి అరుస్తూ ఇంట్లో నుంచి బయటికి వచ్చారు. పక్కింటి వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రఘువీర్‌ను అరెస్టు చేశారు.

గేమ్ వ్యసనం ప్రమాదకరం

రఘువీర్ తండ్రి శేఖరప్ప పోలీసు శాఖ నుంచి రిటైర్ అయ్యారు. ఆయన ఈ ఘటనకు ఒక్క రోజు ముందు కొడుకు వ్యసనం గురించి పోలీసులకు కూడా రిపోర్ట్ చేశారని చెబుతున్నారు.

పక్కింటి వాళ్లు కూడా రఘువీర్ తమ ఇళ్లపై రాళ్లు విసురుతుంటాడని, అందుకే శేఖరప్ప పోలీస్ స్టేషన్ వెళ్లాల్సి వచ్చిందని ఫిర్యాదు చేశారు.

మొబైల్ గేమ్ ఆడొద్దని వాళ్ల నాన్న గట్టిగా చెప్పినందుకు, రఘువీర్ కోపంతో తమ ఇళ్లపై రాళ్లు విసిరాడని వాళ్లు ఆరోపించారు.

దీనిని బట్టి రఘువీర్ మానసిక స్థితిని అంచనా వేయవచ్చు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (NIMHNS) అదనపు ప్రొఫెసర్ డాక్టర్ మనోజ్ కుమార్ శర్మ దీనిపై బీబీసీతో మాట్లాడుతూ "తల్లిదండ్రులు పిల్లల దగ్గర్నుంచి మొబైల్ ఫోన్ తిరిగి తీసుకున్నప్పుడు, వాళ్లను గేమ్ ఆడకుండా అడ్డుకున్నప్పుడు, అది వ్యసనంగా మారిన పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్లకు చిరాకు, కోపం వస్తుంటుంది" అన్నారు.

"గేమ్ ఆడడం వల్ల ఒకరి ప్రవర్తనలో మార్పు వస్తుంది అనే విషయంలో పక్కా ఆధారాలు లేవు. కానీ హింసాత్మక గేమ్ ఆడడం వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు చూశామని చాలా మంది చెబుతున్నారు. ఇలాంటి ప్రవర్తనకు ముఖ్యమైన కారణం వారు బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్లు ఉంటారు. వారికి అదే తమ లోకం అనిపిస్తుంది" అని డాక్టర్ శర్మ చెప్పారు.

ప్రవర్తనలో మార్పులు

కొంతమందికి తాము ఆడే గేమ్ వల్ల ప్లేయర్, స్ట్రీమర్, లేదా గేమ్ డెవలపర్ లాంటి ఉద్యోగాలు వస్తాయేమో అనుకుంటారు.

ఇలాంటి కేసులు అంతకంతకూ పెరుగుతుండడంపై మానసికవేత్తలు, మానసిక వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

"నా క్లినిక్‌కు వచ్చే 10 మందిలో 8 మంది టెక్నాలజీని అతిగా ఉపయోగించడం వల్ల వచ్చే సమస్యలతోనే వస్తున్నారు" అని డాక్టర్ శర్మ చెప్పారు.

"మా దగ్గరకు గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా మొబైల్ ఫోన్ లేదా గేమ్ అడిక్షన్ ఉన్న కేసులు మూడు, నాలుగు వచ్చాయి" అని ఉత్తర కర్ణాటకలోని హుబ్లీలో మానస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ సీనియర్ సైకియాట్రిస్ట్ డాక్టర్ వినోద్ కులకర్ణి బీబీసీతో అన్నారు.

"మేం గేమ్ ఆడద్దని రోగులకు చెబితే, వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్లు హింసాత్మకంగా మారిపోతారు. టెన్షన్ పడిపోతారు" అని కులకర్ణి చెప్పారు.

"మొబైల్ వ్యసనం ఉన్న వారిని ఒక్కసారిగా దానికి దూరం చేయడం మంచిది కాదు. అలాంటివారికి మెల్లమెల్లగా దాని నష్టాల గురించి అవగాహన కల్పించాలి. వారికి కౌన్సెలింగ్ అవసరం. టెక్నాలజీ చెడ్డది కాదు. కానీ దానిని అతిగా ఉపయోగించడం వల్ల చాలా సమస్యలు వస్తాయి" అని డాక్టర్ శర్మ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)