You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రబాబు హౌస్ అరెస్ట్: ‘చలో ఆత్మకూరు’తో ఉద్రిక్తతలు.. ఆంధ్రప్రదేశ్ అంతటా టీడీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష తెలుగుదేశం, పాలక వైఎస్సార్ కాంగ్రెస్‌లు తమతమ పార్టీల కార్యకర్తలపై దాడలు జరిగాయంటూ పోటాపోటీగా 'చలో ఆత్మకూరు'కు పిలుపునివ్వడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
ఈ క్రమంలో బుధవారం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్, ఇతర టీడీపీ నేతలు పలువురిని పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధాలు చేశారు.
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఆత్మకూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు చేసిందన్న ఆరోపణతో 'వైసీపీ బాధితుల పునరావాస శిబిరం'ను టీడీపీ ఏర్పాటు చేయడంతో మొదలైన ఈ వివాదం.. దానికి ప్రతిగా వైసీపీ కూడా అదే తరహాలో స్పందించడంతో మరింత ముదిరింది.
'చలో ఆత్మకూరు' కార్యక్రమం కోసం ఆత్మకూరు వెళ్లేందుకు ప్రయత్నించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని పోలీసులు ఇంటి నుంచి బయటకు వెళ్లనివ్వలేదు.
పలువురు ఇతర టీడీపీ నేతలనూ పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
ఉదయం 11,30 ప్రాంతంలో చంద్రబాబు మరోసారి ఆత్మకూరు బయల్దేరి వెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆయన ఇంటి బయటకు రాకుండా పోలీసులు గేట్లు మూసేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. తనను ఎప్పుడు పోలీసులు అనుమతిస్తే అప్పుడే ఆత్మకూరు వెళ్తానంటూ ప్రకటించారు చంద్రబాబు.
ఏం జరుగుతోంది?
గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని ఆత్మకూరు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కొద్దిరోజుల కిందట ఘర్షణలు జరిగాయి. దీనికి కారణం మీరంటే మీరే అని రెండు పార్టీలూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి.
వైసీపీ బాధితుల పునరావాస శిబిరం పేరుతో టీడీపీ ఒక కేంద్రం ఏర్పాటు చేసింది. ఆ శిబిరంలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్తానని చంద్రబాబు ప్రకటించి 'చలో ఆత్మకూరు'కు పిలుపునిచ్చారు.
దానికి పోటీగా తామూ టీడీపీ దాడుల బాధితులతో కలసి పల్నాడు వెళ్తామంటూ వైసీపీ కూడా 'చలో ఆత్మకూరు' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
టీడీపీ నేతలు గుంటూరు రూరల్ ఎస్పీని అనుమతులు కోరగా.. వైసీపీ నేతలు గుంటూరు ఐజీని కలసి అనుమతి అడిగారు.
దీంతో ఘర్షణలు పెరగవచ్చని భావించిన పోలీసులు టీడీపీ, వైసీపీలకు చెందిన పలువురు నాయకులను హౌస్ అరెస్టు చేశారు.
గుంటూరు జిల్లా మొత్తం 144 సెక్షన్ విధించారు. విజయవాడ నగరంలోనూ గస్తీ పెంచారు.
పల్నాడు ప్రాంతంలో రెండు పార్టీల వారినీ హౌస్ అరెస్ట్ చేశారు. పిడుగురాళ్లలో పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా పెద్దసంఖ్యలో టీడీపీ నేతల గృహనిర్బంధం
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ముఖ్య నాయకులు కొందరిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు, మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆత్మకూరు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, మాజీ మంత్రులు భూమా అఖిలప్రియ, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమామహేశ్వరరావు సహా మరికొందరు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం గృహనిర్బంధం, పోలీసుల అదుపులో ఉన్నారు.
వైసీపీ నాయకులనూ..
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డిని కూడా మాచర్ల వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో నిరసన వ్యక్తం చేస్తూ ఆయన పార్టీ కార్యాలయం ఆవరణలో బైఠాయించారు.
పలువురు ఇతర వైసీపీ నాయకులనూ పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.
తనను ఆత్మకూరు వెళ్లకుండా అడ్డుకున్న తరువాత, చంద్రబాబు అందుబాటులో ఉన్న పార్టీ నేతలతో మాట్లాడారు. పోలీసుల తీరుపై తీవ్రంగా స్పందించారు. బాధితులకు భోజనం కూడా అందనీయడం లేదని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మకూరు వెళ్లి తీరతానని తెలిపారు.
ఇంత దుర్మార్గపు, రాక్షస పాలన ఎక్కడా చూడలేదని చంద్రబాబు ఆరోపించారు.
వైసీపీ నాయకులూ అంతేస్థాయిలో విమర్శలు గుప్పించారు. తెలుగుదేశం శిబిరం పెయిడ్ ఆర్టిస్టులతో ఏర్పాటు చేశారనీ, అందులో స్థానికులు ఎవరూ లేరని మంత్రి బొత్స సత్యనారాయణ, మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి విమర్శించారు.
టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయని బొత్స చెప్పారు.
పల్నాడు ప్రశాంతంగా ఉంటే చూడలేక, పల్నాడులో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైసీసీ ఎమ్మెల్యే మహేశ్ రెడ్డి విమర్శించారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు ప్రాంతాన్ని పట్టించుకోలేదనీ, వైసీపీ ఇప్పుడు అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.
పల్నాడు ప్రాంతంలో వైసీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు ఎన్నో దాడులు చేశారని వైసీపీ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు.
పల్నాడు ప్రజలను భయపెడుతున్నారు: టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్
ప్రభుత్వం సమస్యను పెద్దది చేస్తోందని టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ 'బీబీసీ'తో అన్నారు.
'నేను కోర్టు కేసులకు వెళ్లాల్సి ఉన్నా నన్ను తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టారు. మేము ఇది ఇవాళ హఠాత్తుగా చేస్తున్నది కాదు. పది రోజుల నుంచి చెబుతున్నాం. ఆత్మకూరు నుంచి భయంతో వెళ్లిపోయినవారిని తిరిగి ఊళ్లోకి తెమ్మంటున్నాం. అలా చేస్తే సమస్యే లేదు. కానీ అధికారులు రాత్రుళ్లు శిబిరం దగ్గరకు వచ్చి, మిమ్మల్ని దించుతాం అంటున్నారు. అది సరికాదు. పైగా పది రోజుల పాటు బాధితులను వదిలేసి, వారినిప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు అనడం ద్వారా సమస్యను జఠిలం చేసి ఏకపక్షంగా వైసీపీ వారు మాత్రమే ఊళ్లలో ఉండేలా ప్రభుత్వం చేస్తోంది.
చిత్తశుద్ధి ఉండుంటే ఈ పది రోజుల్లో ఏం చేశారు? ఇప్పుడు మేం వెళ్లి వారిని (శిబిరంలో ఉన్న వారిని) ఊళ్లకు తీసుకెళ్తామంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు. ప్రతిపక్షాలు, వారికి ఓట్లేసిన వారు, ప్రతిపక్ష కార్యకర్తల హక్కులను హరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పడానికి లేకుండా చేస్తున్నారు. మా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును బయటకు రానివ్వకుండా అరెస్ట్ చేసి వాయిస్ లేకుండా చేశారు. సమస్యను జఠిలం చేసి పల్నాడు జనాల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిస్తే మంచిది. సమస్యను పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది' అన్నారు.
శాంతిభద్రతలకు భంగం కలగకుండా చంద్రబాబును అదుపులోకి తీసుకున్నాం: డీజీపీ
విపక్ష నేత చంద్రబాబు పర్యటనతో పల్నాడు ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతుండడం, శాంతిభద్రతలకు భంగం కలుగుతుండడంతో ముందస్తుగా ఆయన్ను అదుపులోకి తీసుకున్నామని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. అంతేకానీ, ప్రభుత్వ విధానాలపై ఆయన పోరాడుతున్నారన్న కారణంతో అదుపులోకి తీసుకోలేదని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెబుతున్నాయి?
- మూడో జాతీయ భద్రతా సలహాదారును మార్చేసిన ట్రంప్
- 6174: ఒక భారతీయ ఉపాధ్యాయుడు కనిపెట్టాడు.. డెబ్బై ఏళ్లుగా గణిత శాస్త్రజ్ఞులు ఆశ్చర్యపోతున్నారు
- అమరావతి నుంచి రాజధాని మారుస్తున్నారా? అక్కడేం జరుగుతోంది?
- సన్నీ లియోని ఇంటర్వ్యూ: 'రోడ్డు మీద నుంచున్న వేశ్యకు - పోర్న్ స్టార్‌కి తేడా ఏమిటి?'
- అరటి పళ్లపై జీఎస్టీ ఎంత? రెస్టారెంట్లలో తింటే దేనికి పన్ను కట్టాలి? దేనికి అక్కర్లేదు?
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- BODMAS: 8÷2(2+2) = ?.. ఈ ప్రశ్నకు మీ జవాబు ఏంటి?
- చార్లెస్ డార్విన్‌కూ అంతుచిక్కని మిస్టరీ: జీవపరిణామ సిద్ధాంతానికే ముప్పుగా పరిణమించిన 'విసుగుపుట్టించే రహస్యం'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)