కరకట్టపై చంద్రబాబు ఇంటి వరకు నీరు.. వరదపై పాలక, విపక్షాల మధ్య రాజుకున్న వివాదం

    • రచయిత, వి.శంకర్
    • హోదా, బీబీసీ కోసం

కృష్ణానది కరకట్టపై చంద్రబాబు నివాసం చుట్టూ మరో వివాదం.. ప్రకాశం బ్యారేజ్ లెక్కలేం చెబుతున్నాయ్?

ఆంధ్రప్రదేశ్ రాజధాని పరిధిలోని కృష్ణా కరకట్టపై నిర్మాణాల చుట్టూ మరోసారి వివాదం అలుముకుంది. లింగమనేని ఎస్టేట్స్‌లో నివాసం ఉంటున్న చంద్రబాబు ఇంటి చెంతకు వరద నీరు చేరడంతో పాలక, విపక్షాల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మొదలయ్యాయి.

వరద అంచనా కోసమంటూ తన ఇంటిపై డ్రోన్లు వినియోగించి, తన భద్రతను ప్రశ్నార్థకంగా మార్చేశారంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు తోడుగా, టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగడంతో ఉండవల్లి ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట కూడా చోటుచేసుకుంది.

ఇది వైసీపీ ప్రభుత్వం సృష్టించిన వరద అని.. వరద నీటి నిర్వహణ సక్రమంగా లేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వివాదానికి కారణం ఏమిటి?

కరకట్ట మీద కట్టడాలన్నీ ఆక్రమణలని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే పలువురికి నోటీసులూ జారీ చేసింది. నోటీసులందుకున్న వారిలో కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు.

ఇక గత ప్రభుత్వం నిర్మించిన ప్రజావేదిక గ్రీవెన్స్ హాల్ కూడా కరకట్టకు దిగువన ఉందంటూ వైసీపీ ప్రభుత్వం కూల్చివేసింది. ప్రజావేదికకు దిగువన నదీ తీరంలో ఉన్న లింగమనేని ఎస్టేట్స్ భవనం కూడా అక్రమ కట్టడమేనంటూ సీఆర్డీయే నోటీసులు ఇచ్చింది.

ఈ భవనంలోనే చంద్రబాబు నివాసం ఉండడంతో ఇది పెద్ద చర్చకు దారితీసింది.

కరకట్టపైకి నదీ జలాలతో మళ్లీ రాజుకున్న వివాదం

ఇంతకుముందు చివరిసారిగా 2009 అక్టోబర్‌లో కృష్ణానదికి భారీ స్థాయిలో వరదలొచ్చాయి. ఆ ఏడాది అక్టోబరు 5న గరిష్ఠంగా ప్రకాశం బ్యారేజి నుంచి 11,10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.

ఆ తర్వాత మళ్లీ ఈ ఏడాది ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలలో కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదికి వరదలొచ్చాయి.

ఇప్పటికే ఆల్మట్టి నుంచి పులిచింతల వరకు మధ్యలో శ్రీశైలం, నాగార్జునసాగర్ కూడా పదేళ్ల తర్వాత పూర్తిస్థాయి నీటిమట్టాలకు చేరుకున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజ్‌కూ వరద తాకిడి తప్పలేదు.

శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి 7,85,918 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువన పులిచింతల నుంచి విడుదల చేస్తున్న నీటిని యథాతథంగా ప్రకాశం బ్యారేజ్ గేట్లన్నీ ఎత్తి కిందకు వదులుతున్నారు.

2009 కంటే ఈ ప్రవాహం తక్కువే అయినా బ్యారేజ్‌కి కుడివైపున ఉన్న కరకట్టపైకి కొద్దిమేర వరద నీరు చేరింది.

చంద్రబాబు నివాసం మెట్లు వరకు వరద

కృష్ణా నది జలాలు పోటెత్తడంతో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నివాసం ఉండే లింగమనేని ఎస్టేట్స్‌ చుట్టూ వరద నీరు చేరింది. ఇంటిని ఆనుకుని నిర్మించిన రివర్ వ్యూ పాయింట్‌లోకి మూడు రోజుల కిందటే నీరు చేరింది. తాజాగా వరద మరింత పెరగడంతో అక్కడ ఇసుక బస్తాలతో వరదను నియంత్రించే ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు.

చేతికి గాయం కారణంగా చికిత్స కోసం చంద్రబాబు హైదరాబాద్ వెళ్లగా ఆయన నివాసం వద్ద పరిస్థితులను స్థానిక టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.

డ్రోన్ల వినియోగంపైనా అభ్యంతరం

వరద నీటి నిర్వహణ సరిగా లేదని విపక్ష నేత చంద్రబాబు, ఆయన ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపణలు చేశారు.

వరదల నేపథ్యంలో బ్యారేజ్ సమీపంలో డ్రోన్ కెమెరాల సహాయంతో లింగమనేని ఎస్టేట్స్ ప్రాంతాన్ని చిత్రీకరించిన తీరుపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

''నాపై ద్వేషంతో వరదలతో ఆటలాడతారా..? నాపై అక్కసుతో జనాన్ని వరదల్లో ముంచేస్తారా..? నీళ్లు నిల్వచేసి, అకస్మాత్తుగా విడుదల చేస్తారా..? ఇక్కడి ఇళ్లు మునిగాయని చూపేందుకు అక్కడి ఇళ్లను ముంచేస్తారా..? ముంపు బాధితులకు సహాయ చర్యలను పట్టించుకోరా..? నా నివాసాన్ని టార్గెట్ చేస్తారా..? నా భద్రతతోనే ఆటలాడతారా.. ? హై సెక్యూరిటీ జోన్‌లో డ్రోన్లు నడిపిందెవరు..? భద్రతపై కోర్టుకెళ్లాల్సిన పరిస్థితి తెచ్చారు. కోర్టు స్పష్టంగా ఆదేశాలిచ్చినా భద్రతతో చెలగాటాలా..? మాజీ సీఎం ఇంటిపై డ్రోన్లు తిప్పడం ఏమిటి..?'' అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

వరద ప్రవాహాల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

చంద్రబాబు ఇల్లు డేంజర్ జోన్‌లో ఉందని స్పష్టమైపోయింది: ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్

చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఏపీ ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.

''టీడీపీ నేతలు పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆనకట్ట మొత్తం నిండిన తర్వాత నీళ్లు వదలాలని ఒకరు అంటే.. మొత్తం నిండేవరకు ఎందుకు ఆగారంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీశైలం నింపిన తరువాత నీళ్లు వదలాలని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంటున్నారు. అదే జరిగితే 12 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చేది ఈ రోజుకి. మరికొందరు మాకు ఫ్లడ్ మేనేజ్‌మెంట్ తెలియదంటున్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో గతం కంటే ఎక్కువ నీరు ఉంది. ఎప్పటికప్పుడు రెగ్యులేట్ చేస్తూ అదనపు జలాలను దిగువకు వదులుతున్నాం.

బ్యారేజ్ గేట్లు ఎత్తినప్పుడు మొదట లక్ష క్యూసెక్కులు వచ్చింది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూ వచ్చింది. చంద్రబాబు ఇల్లు ఉంది కాబట్టి నీళ్లు వదలొద్దని కోరడం సరికాదు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా కుడి, ఎడమ గట్లు పర్యవేక్షణ కోసం డ్రోన్లు నిర్వహిస్తున్నాం. ఆ పనిని ఓ మేనేజ్‌మెంట్‌ సంస్థకి ఇచ్చాం.

చంద్రబాబు ఇంటి దగ్గర ఇసుక బస్తాలు వేసి నీరు రాకుండా ఆపుతున్న మాట వాస్తవం కాదా.. అంటే ఆయన ఇల్లు డేంజర్ జోన్‌లో ఉన్నట్టే కదా. ఇంత పెద్ద వరద వచ్చినా ప్రాణ నష్టం లేకుండా చేశాం" అని ఆయన బీబీసీతో అన్నారు.

2009 కంటే తక్కువే

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద చరిత్రను పరిశీలిస్తే గత కొన్ని దశాబ్దాలలో అత్యధిక వరద 2009 అక్టోబర్ 5న నమోదైంది.

అప్పటికి రోశయ్య ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజు ప్రకాశం బ్యారేజ్ నుంచి 11,10,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలినట్లు రికార్డులు చెబుతున్నాయి.

పెద్ద ఎత్తున నీటిని దిగువకు వదలడంతో నదీ పరివాహక ప్రాంతాలన్నీ నీటిమునిగాయి. కరకట్ట ప్రాంతమంతా జలమయమైంది.

ఆ తరువాత 2017లోనూ గేట్లు ఎత్తారు. అప్పట్లో వర్షాలు ఎక్కువగా కురవడం, పట్టిసీమ నుంచి వచ్చిన నీటితో బ్యారేజ్ నిండడంతో గేట్లు ఎత్తి సుమారుగా 40వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు.

2009 తర్వాత ప్రస్తుతం విడుదల చేస్తున్నదే అత్యధిక ప్రవాహం అని జల వనరుల శాఖ రికార్డులు చెబుతున్నాయి.

గరిష్ఠ నీటి మట్టం కన్నా బ్యారేజ్ వద్ద ఎక్కువ ఉంది..

ఇక ఈ ఏడాది ఆగస్ట్ 13న ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తారు. తొలుత 50వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం అది 7.85 లక్షల క్యూసెక్కులకు పెరిగింది.

గేట్లు ఎత్తిన సమయానికి బ్యారేజ్ వద్ద నీటి మట్టం 10 మీటర్లుగా నమోదైందని కృష్ణా జిల్లా ఇరిగేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శివ భాస్కర్ బీబీసీకి తెలిపారు.

తొలుత 12 మీటర్ల మట్టం వద్ద నీరు విడుదల చేయాలనుకున్నప్పటికీ ఎగువ నుంచి వరద జలాలు పెరగొచ్చన్న సమాచారంతో అప్రమత్తమై 10 మీటర్ల నీటిమట్టం వద్దే అన్ని గేట్లు ఎత్తి నీటిని విడుదల చేసినట్లు చెప్పారాయన.

బ్యారేజ్ వద్ద గరిష్ఠ నీటిమట్టం 12 మీటర్లు కాగా ప్రస్తుతం 17.3 మీటర్ల నీరుందని తెలిపారు.

నీట మునిగిన కృష్ణ లంక, భవానీపురం

బ్యారేజ్‌లోకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుండడంతో అనేక చోట్ల లంకలు జలదిగ్బంధంలో ఉన్నాయి. డెల్టా ప్రాంతంలోనూ నీరు చేరింది. విజయవాడ నగరంలోని కృష్ణలంక, భవానీపురం తదితర ప్రాంతాలు నీటమునిగాయి. ప్రభుత్వం 27 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)