You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లింగమనేని గెస్ట్ హౌజ్ గురించి చంద్రబాబు, లింగమనేని రమేశ్ 2016లో ఏమన్నారు?
- రచయిత, శంకర్
- హోదా, బీబీసీ కోసం
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉంటున్న 'లింగమనేని గెస్ట్ హౌస్' ప్రభుత్వానిదేనా? ఈ భవనం గురించి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చెప్పారు? అప్పుడు వ్యాపారవేత్త లింగమనేని రమేశ్ ఏమన్నారు, ఇప్పుడేం చెబుతున్నారు? పాలకపక్షం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఏమంటోంది?
అక్రమ నిర్మాణమంటూ రాజధాని అమరావతిలోని ప్రభుత్వ నిర్మాణం 'ప్రజావేదిక'ను జూన్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు కూల్చివేసిన అధికార యంత్రాంగం తర్వాత కృష్ణా నది కరకట్ట దిగువన ఉన్న భవనాలపై దృష్టి పెట్టింది. 26 నిర్మాణాలకు సంబంధించిన యజమానులకు నోటీసులు జారీ చేసింది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని భవనం అందులో ఒకటి.
జూన్ చివరి వారంలో నోటీసులను అధికారులు ఈ భవనం గోడలకు అతికించారు. వారంలోగా సమాధానం ఇవ్వాలన్నారు. అందుకు అనుగుణంగా భవనం యజమాని లింగమనేని రమేశ్ సమాధానం ఇచ్చారు.
అన్ని అనుమతులూ ఉన్నాయన్న లింగమనేని
నోటీసులను ఆయన తప్పుబట్టారు. తన భవనం సక్రమ నిర్మాణమని, అనుమతులు కూడా ఉన్నాయని రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ(సీఆర్‌డీఏ)కు పంపిన సమాధానంలో చెప్పారు.
భవనానికి సంబంధించిన డాక్యుమెంట్లను ఆయన సీఆర్‌డీఏకు సమర్పించారు. భవనానికి అన్ని అనుమతులూ ఉన్నాయన్నారు. గతంలో రైతుల నుంచి భూమిని కొన్న తర్వాత దానిని వ్యవసాయ భూమి నుంచి కమర్షియల్ భూమిగా ల్యాండ్ కన్వర్షన్ కూడా చేయించానని చెప్పారు. ఇందుకు ఇరిగేషన్ శాఖ అనుమతి ఇచ్చిందంటూ డాక్యుమెంట్లు చూపించారు.
భవనానికి ఉండవల్లి పంచాయతీ నుంచి అనుమతులు ఉన్నాయని లింగమనేని చెప్పారు. అయితే, అనుమతులకు సంబంధించిన పత్రాలేవీ చూపించలేదు.
భవనం ముందున్న ఈతకొలనుకు నీటిపారుదల అధికారులు ఇచ్చిన అనుమతి పత్రాలను లింగమనేని చూపించారు. గత ఏడాది భవనాన్ని 'బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్(బీపీఎస్) కింద క్రమబద్ధీకరించేందుకు దరఖాస్తు చేశానన్నారు.
సీఆర్‌డీఏ తరపున లింగమనేని భవనానికి అధికారులు నోటీసులు ఇవ్వగా, మరోవైపు పాలక వైసీపీ కొత్త వాదన ముందుకు తెచ్చింది.
చంద్రబాబు ఉంటున్న భవనాన్ని 2016లోనే రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని సీఆర్‌డీఏ ఛైర్మన్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
"ఆ ఇల్లు స్వాధీనం చేసుకున్నట్టు చంద్రబాబు 2016 మార్చి 6న ప్రకటించారు. అది వాస్తవమేనని లింగమనేని రమేష్ కూడా మీడియా ముఖంగా వెల్లడించారు. ఇప్పుడు మళ్లీ మాట మార్చడం ఏంటి? అన్ని అనుమతులు ఉన్నాయని ఎలా చెబుతారు? ప్రభుత్వ భవనమని చెప్పిన చంద్రబాబు అధికారిక భవనాన్ని ఎందుకు ఖాళీ చేయలేదు? ఇప్పటికైనా ఆయన ఉంటున్న ఇంటిని నైతికబాధ్యతగా తక్షణం ఖాళీ చేయాలి. లేనిపక్షంలో అక్రమ ఇంటిని చట్ట ప్రకారం సీఆర్‌డీఏ కమిషనర్ కూలగొట్టాలని కోరుతున్నా" అని ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు.
2016లో చంద్రబాబు, లింగమనేని ఏం చెప్పారు?
లింగమనేని భవనాన్నిప్రభుత్వం స్వాధీనం చేసుకుందని 2016లో చంద్రబాబు ప్రకటించారు.
"మేం లింగమనేని రమేశ్ భూములు తీసుకోలేదు. కానీ, ఆయన నా దగ్గరకు వచ్చి తన భూములు తీసుకోవాలన్నారు. 'నేను 29 గ్రామాల వరకే చేయాలని చెప్పాను, మీ భూములు తీసుకుంటే 34 గ్రామాలు తీసుకోవాలి, అవసరం లేదు' అని ఆయనతో చెప్పాను. ఇంకా మరికొన్ని గ్రామాల నుంచి కూడా భూములు తీసుకోవాలని వచ్చారు. వద్దని చెప్పాను. లింగమనేని రమేశ్ 2003లోనే భూములు కొన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో విచారణ జరిపారు. కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. ఆ భవనం ప్రభుత్వానిది. ప్రభుత్వం ఇల్లు కాబట్టే నేను ఉన్నాను" అని ఆనాడుచంద్రబాబు చెప్పారు.
ఆ మరుసటి రోజే లింగమనేని రమేశ్ మాట్లాడుతూ- ప్రభుత్వం ఆ భవనాన్ని భూసమీకరణలో తీసుకుంది, నాది నేను ఇచ్చేశాను. ఉండవల్లి, పెనుమాక రైతులు కాదంటున్నారు గానీ నాకు సంబంధం లేదు" అన్నారు.
స్పందనకు నిరాకరించిన సీఆర్‌డీఏ అధికారులు
ప్రభుత్వ భవనమని ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ప్రకటించిన మూడేళ్ల తర్వాత లింగమనేని రమేశ్‌కు నోటీసు ఇవ్వడంపై సీఆర్‌డీఏ అధికారులను బీబీసీ స్పందన కోరగా, వారు నిరాకరించారు.
పేరు ప్రస్తావించేందుకు నిరాకరించిన కొందరు అధికారులు మాత్రం- ప్రభుత్వ ఆదేశాల మేరకే తాము అన్ని అక్రమ భవనాలతోపాటు లింగమనేని రమేశ్ భవనానికి నోటీసులు ఇచ్చినట్టు చెప్పారు. భవనం తొలగింపు విషయంలో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
- 124 డిగ్రీల ఉష్ణోగ్రతలో పనిచేయడం ఎంత కష్టమో వీరి కళ్లలోకి చూస్తే తెలుస్తుంది
- క్రికెట్ ప్రపంచ కప్ 44 ఏళ్ల చరిత్రలోని ఈ రికార్డు కొనసాగితే.. విజేత టీమిండియానే
- రిహార్సల్స్ చేయిస్తున్న ట్రైయినర్‌ను చంపేసిన సర్కస్ పులులు
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
- చర్మం తెల్లగా అవటం కోసం వాడే క్రీములు ఎంత ప్రమాదకరమో తెలుసా?
- వయసులో ఉన్న స్త్రీలు గర్భసంచులను ఎందుకు తీయించుకుంటున్నారు
- అలసిపోతున్నారా? పని చేయాలంటే విసుగొస్తోందా? ఇలా ఎందుకు జరుగుతుంది? పరిష్కారాలేమిటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)