You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉన్నావ్ రేప్ కేసులను దిల్లీకి బదిలీ చేయడం వల్ల సమస్యలు పెరుగుతాయా, తగ్గుతాయా?
- రచయిత, వినీత్ ఖరే
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్ ఉన్నావ్ అత్యాచారానికి సంబంధించిన కేసులను సుప్రీంకోర్టు ఆ రాష్ట్రం నుంచి బయటకు దిల్లీకి బదిలీ చేసింది.
కోర్టు తీసుకున్న ఈ నిర్ణయానికి రాజకీయ అర్థాలు కూడా వెతుకుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో యోగీ సర్కారుపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ కేసు విచారణ ప్రతి రోజూ జరగాలని, విచారణ 45 రోజుల్లో ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
రాయ్‌బరేలీ రోడ్డు ప్రమాదం దర్యాప్తును వారం రోజుల్లో ముగించాలని ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది.
రోడ్డు ప్రమాదంలో బాధితురాలి ఇద్దరు బంధువులు చనిపోయారు. ఇద్దరూ మహిళలే. తీవ్రంగా గాయపడ్డ బాధితురాలు, ఆమె వకీలు లఖ్‌నవూలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇలా ఏదైనా ఒక కేసును ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి పంపించడం ఇది మొదటిసారి కాదు.
ఇంతకు ముందు ఎప్పుడు ఏ కేసు...
ఇంతకు ముందు 2018లో జమ్ము, కశ్మీర్‌లోని కఠువాలో చిన్నారిపై అత్యాచారం, హత్య కేసు విచారణను పంజాబ్ పఠాన్‌కోట్‌లోని ఒక కోర్టుకు బదిలీ చేశారు.
2003లో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణను తమిళనాడు నుంచి బెంగళూరులోని ఒక కోర్టుకు మార్చారు.
2012లో సోహ్రాబుద్దీన్ షేఖ్ నకిలీ ఎన్‌కౌంటర్ కేసును సుప్రీంకోర్టు గుజరాత్ నుంచి ముంబై పంపింది.
అత్యున్నత న్యాయస్థానం 2004లో బెస్ట్ బేకరీ కేసును కూడా గుజరాత్ నుంచి ముంబైకి బదిలీ చేసింది. 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో జరిగిన హింసలో బెస్ట్ బేకరీలో 14 మందిని సజీవ దహనం చేశారు.
వీటితోపాటు బిల్కిస్ బానో గ్యాంగ్ రేప్ కేసును కూడా సుప్రీంకోర్టు అహ్మదాబాద్ నుంచి ముంబైకి బదిలీ చేసింది.
కేసులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించడానికి, స్వతంత్ర, న్యాయబద్ధమైన విచారణ జరగకపోవడమే కారణం అని నిపుణులు చెబుతున్నారు. న్యాయం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంపొందించేలా చేయడమే దీని వెనుక ప్రధాన ఉద్దేశం అంటున్నారు.
ఏ రాష్ట్రం నుంచి కేసులను బయటికి పంపిస్తారో, అక్కడి పాలన, న్యాయవ్యవస్థ విభాగాలపై నిందితుడికి మంచి పట్టు ఉంటుదని, కేసును ఇతర రాష్ట్రాలకు పంపించడం వల్ల ఆ పరిస్థితిలో మార్పు వస్తుందని భావిస్తున్నారు.
సుప్రీం నిర్ణయంతో సిస్టంపై సవాళ్లు
ఉన్నావ్ కేసులో సుప్రీంకోర్టు తాజా నిర్ణయంపై రకరకాల స్పందనలు వస్తున్నాయి.
సుప్రీం కోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టు సీనియర్ వకీల్ దుష్యత్ దవే 'సంచలన నిర్ణయం'గా భావిస్తున్నారు. వకీల్ కామిని జైస్వాల్ మాత్రం చాలా ఇది 'చాలా ఆలస్యంగా చేపట్టిన చర్య'గా చెబుతున్నారు.
"రాజకీయ నేతలు నిందితులుగా ఉన్న కేసుల్లో, అలా చేసినప్పుడు పెద్ద తేడా ఉండదు. ఎందుకంటే వారి ప్రభావం అన్నిచోట్లా ఉంటుంది. మన సిస్టం పూర్తి అసమర్థతతో, నిస్తేజంగా ఉంది" అని దుష్యంత్ చెప్పారు.
కానీ, వకీల్ కామినీ జైస్వాల్ ఆయనతో ఏకీభవించడం లేదు. "నితీశ్ కటారా హత్య కేసులో డీపీ యాదవ్ కొడుకు వికాస్ యాదవ్, అతడి కజిన్‌ను దోషులుగా ఖరారు చేశారు" అనే విషయాన్ని ప్రస్తావించారు.
నితీష్ కటారా హత్య కేసులో వికాస్ యాదవ్, అతడి కజిన్ విశాల్ యాదవ్ ఇద్దరికీ దిల్లీ హైకోర్టు 2015లో 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
వీరిద్దరూ తమ సోదరి భారతితో నితీష్‌కు ఉన్నట్లు చెబుతున్న బంధాన్ని వ్యతిరేకించేవారు.
"డీపీ యాదవ్ ఉత్తరప్రదేశ్‌లో చాలా బలమైన నేత. ఆయన ఎమ్మెల్యే. ఈ కేసు దిల్లీకి పంపిన తర్వాతే వారు దోషులుగా ఖరారయ్యారు. కానీ ఉన్నావ్ కేసులో చాలా ఆలస్యమైపోయింది. ఇప్పటివరకూ ప్రత్యేకంగా ఎలాంటి చర్యలూ తీసుకోలేకపోయారు. సాక్షులు కూడా చనిపోయారు అని వకీల్ కామినీ జైస్వాల్ చెప్పారు.
దిల్లీ వరకూ ఎలా రావాలి
కానీ కేసును ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పంపించడం వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయని వకీల్ దుష్యంత్ దవే చెబుతున్నారు.
"మీరే చెప్పండి. ఈ కేసులో సాక్ష్యులైన పేదలు, తమ గ్రామాల నుంచి దిల్లీ వరకూ వచ్చి ఎలా సాక్ష్యం చెప్పగలరు. బాధితురాలి కుటుంబం దిల్లీలో ఏం చేస్తుంది. ఎలా ఉంటుంది. ఆమె కుటుంబం దిల్లీలో ఎప్పటివరకూ ఉండాలి. ప్రభుత్వం వారికి ఇంటి కోసం ఎలాంటి నిబంధనలూ పెట్టలేదు. కేసును బదిలీ చేయడం సులభమే, కానీ దానివల్ల పరిణామాలు చాలా లోతుగా ఉంటాయి" అన్నారు
అలహాబాద్ కోర్టు దీనిపై విచారణ చేసుంటే బాగుండేదని దుష్యంత్ దవే అన్నారు.
"ఒక జడ్జిని నియమించి, ప్రతి రోజూ ఆ కేసు విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్‌కు చెప్పుంటే మెరుగ్గా ఉండేది. పోలీసు కుటుంబాలు, సాక్షులకు పూర్తి భద్రత కల్పించడంతోపాటు పరిహారం ఇవ్వాలి. అది ఇంకా బాగుంటుంది. చిన్న గ్రామాల్లో ఉన్న వారిని మనం బయటకు తీసుకురాలేం" అని దుష్యంత్ చెప్పారు.
గుజరాత్ కేసులను ముంబైకి పంపడాన్ని ఉన్నావ్ కేసులతో పోల్చిన దుష్యంత్ "అక్కడ నిందితుల్లో గుజరాత్ పోలీసు అధికారి, రాజకీయ నేత ఉన్నారు. కానీ ఇక్కడ(ఉత్తరప్రదేశ్)లో అలాంటి పరిస్థితి లేదు. కులదీప్ సెంగర్ కావాలంటే దీనిని రాజ్యాంగవిరుద్ధం అని అభ్యంతరం వ్యక్తం చేయచ్చు" అన్నారు.
లేఖను నిర్లక్ష్యం చేశారు
కామినీ జైస్వాల్ "బాధితురాలి కుటుంబం రాసిన లేఖలపై సుప్రీంకోర్టు నుంచి చాలా ఆలస్యంగా స్పందన వచ్చిందన్నారు.
"ఈ లేఖను కూడా జులై 17న చదివారు. లేఖలో రాసిన అంత సీరియస్ మేటర్‌పై ఎందుకు దృష్టి పెట్టలేదో నాకర్థం కావడం లేదు. ఆ లేఖపై ఇప్పుడు నమ్మకం లేదు. దానిపై పాస్ చేసిన కొత్త ఆర్డర్ అర్థరహితంగా ఉంది. ఆ లేఖ అంత పెద్దది కూడా కాదు. వీళ్లు దాన్ని నిర్లక్ష్యం చేశారు. ఈ లెటర్ 13 రోజుల వరకూ ఎవరికీ పట్టకుండా ఉంది. ఈ ప్రమాదం జరగకుంటే ఆ లేఖను కూడా చదివుండరు" అన్నారు కామిని.
మరోవైపు సుప్రీంకోర్టులో బీబీసీ అసోసియేట్ కరస్పాండెంట్ సుచిత్రా మొహంతీ "చీఫ్ జస్టిస్ ఈ లేఖను జులై 17 నుంచి జులై 30 వరకూ ఎందుకు పీఐఎల్ సెక్షన్లో ఉంచారు. అని ప్రధాన కార్యదర్శిని అడిగినపుడు ఆయన అత్యున్నత న్యాయస్థానానికి ప్రతి నెలా ఐదారు వేల ఉత్తరాలు వస్తుంటాయి" అని చెప్పారన్నారు.
కామినీ జైశ్వాల్ లెటర్ పిటిషన్ అనే ఈ ప్రక్రియను 1979-80లో ప్రారంభమైంది. చాలా కీలకమైన కేసుల్లో వకీలు దగ్గరకు వెళ్లి పిటిషన్ వేయడానికి టైం పడుతుండడంతో జనం లేఖలు పంపిస్తారు.
"ఈ కేసులో చాలా ప్రశ్నలకు సమాధానాలు రావడం మిగిలుంది. హైకోర్టు మరింత సున్నితంగా వ్యవహరించి ఇలాంటి కేసుల్లో స్వయంగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది" అన్నారు.
భారత్‌లో సాక్ష్యుల రక్షణకు ఎలాంటి నిబంధనలు లేవని కామినీ జైస్వాల్ చెబుతున్నారు. కనీసం బాధితురాలి కుటుంబ సభ్యుల భద్రత కోసమైనా వారిని ఉత్తర ప్రదేశ్ నుంచి బయటకు తీసుకురావచ్చన్నారు.
ఇవి కూడా చదవండి:
- ఉన్నావ్ రేప్: ఈ కేసులో ఎప్పుడేం జరిగింది?
- వీజీ సిద్ధార్థ: ఆ సంభాషణే కాఫీ కింగ్‌ను 'కాఫీ డే' వ్యాపారంలోకి నడిపించింది
- ట్రిపుల్ తలాక్ చట్టంతో ముస్లిం మహిళలకు మేలెంత?
- రాజధానిలోని పొనుగుపాడు గోడ వివాదం వెనక నిజాలు ఏమిటి? - గ్రౌండ్ రిపోర్ట్
- 'దీపం' పథకానికి 20 ఏళ్ళు: ఆంధ్రప్రదేశ్ ఇంకా చీకట్లో ఎందుకున్నట్లు...
- 'దీపం' పథకానికి 20 ఏళ్ళు: ఆంధ్రప్రదేశ్ ఇంకా చీకట్లో ఎందుకున్నట్లు...
- పాకిస్తాన్‌లోని వేలాది హిందూ ఆలయాలకు మోక్షం ఎప్పుడు?’
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)