You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనంతపురం బీటెక్ విద్యార్థి పంజాబ్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో ఆత్మహత్య
- రచయిత, బీబీసీ పంజాబీ,
- హోదా, ప్రతిమ ధర్మరాజు, బీబీసీ కోసం
పంజాబ్ రాష్ట్రం జలంధర్‌లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సోమ వెంకట భరత్ కుమార్(20) శనివారం యూనివర్సిటీ క్యాంపస్‌లోని హాస్టల్ భవనం ఏడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వెంకట భరత్ కుమార్ ఆత్మహత్యకు సంబంధించి ఫగ్వారా పోలీస్ ఠాణా అధికారి ఓంకార్ సింగ్ వివరాలు వెల్లడించారు. ఆత్మహత్యకు ముందు భరత్ కుమార్ తాను చనిపోతున్నానంటూ ఒక లేఖ రాసి దాన్ని ఫొటో తీసి స్నేహితుడికి పంపించాడని.. అది చూడగానే ఆ స్నేహితుడు మిగతా మిత్రులను అప్రమత్తం చేసి క్యాంపస్ అంతా వెతకగా హాస్టల్ బిల్డింగ్ పక్కన రక్తపు మడుగులో కనిపించాడని చెప్పారు.
వెంటనే యూనివర్సిటీ సిబ్బంది ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే భరత్ కుమార్ మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.
భరత్ కుమార్ తన ఆత్మహత్య లేఖలో ఒంటరితనం గురించి ప్రస్తావించాడని.. తన ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని రాశాడని ఫగ్వారా పోలీసులు చెప్పారు.
ప్రస్తుతానికి మృతుడి గదికి సీల్ వేశామని.. ఆయన కుటుంబ సభ్యులు వచ్చిన తరువాత వారి సమక్షంలో తెరిచి విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
సీసీ టీవీ ఫుటేజీ, ఇతర ఆధారాలు పరిశీలించి దర్యాప్తు చేస్తామని.. పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహం అప్పగిస్తామన్నారు.
భరత్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడే ఆయన కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ అడిషనల్ డైరెక్టర్ అమన్ మిట్టల్ చెప్పారు. మృతుడి కుటుంబసభ్యులు ఆదివారం ఉదయం చేరుకోగలమని తమకు సమాచారం ఇచ్చారన్నారు.
‘ఫోన్ రాగానే వెంటనే బయల్దేరి వెళ్లారు’
భరత్ స్వస్థలం అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం గుడిపాడు. ఆ కుటుంబం ప్రస్తుతం తాడిపత్రిలో నివాసం ఉంటోంది. భరత్ తండ్రి శ్రీనివాసులు నాపరాళ్ల వ్యాపారం చేస్తుంటారు. ఆయన ముగ్గరు కుమారుల్లో భరత్ ఆఖరివాడు.
భరత్ చనిపోయాడన్న విషయాన్ని యూనివర్సిటీ సిబ్బంది శనివారం మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పారని ఆయన అమ్మమ్మ వెంకట సుబ్బమ్మ ‘బీబీసీ తెలుగు’తో చెప్పారు. విషయం తెలిసిన వెంటనే భరత్ తండ్రి, మరికొందరు జలంధర్ బయలుదేరారని ఆమె చెప్పారు.
ఇవి కూడా చూడండి:
- ఎడిటర్స్ కామెంట్: ఇంటర్మీడియట్ పిల్లల చావులకు బాధ్యులెవరు?
- ‘‘సారీ అమ్మ.. ఫీజు కట్టలేదని పరీక్ష రాయనివ్వలేదు’’
- "పొరుగింటి కోడి కూత భరించలేకున్నాం" - కోర్టుకెక్కిన జంట
- భారత దేశ మొదటి బడ్జెట్ ఎంతో తెలుసా?
- బడ్జెట్ అర్థం కావాలంటే ఈ 10 విషయాలు తెలియాల్సిందే
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- ఆర్థిక సర్వే: ఆదాయపన్ను చెల్లిస్తున్నారా... అయితే రోడ్లకు, రైళ్లకు మీ పేరు పెట్టొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)